Wednesday, November 6, 2024

రామదర్శనంతో దశరథుడికి యవ్వనం

11వ పాశురంలో తిరుప్పావై కథలు

దశరథుడికి చాలా వయసు మీద పడేదాకా వారసులే లేరు. సంతానం కోసం ముగ్గురు భార్యలను వివాహం చేసుకుంటాడు. అయినా వార్థక్యం వచ్చింది కాని పుత్రసంతానం కలగలేదనే ఆయన బాధ.  64వేలసంవత్సరాల వయసు వచ్చిందంటారు. 64 వేల వయసని నమ్మినా నమ్మకపోయినా  చాలా వృద్ధుడన్నది నిస్సందేహం. పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత గాని ఆయన పుత్రవంతుడు కాలేదు. ముదిమి వయసులో తనకు నలుగురు పుత్రులు కలిగిందుకు దశరథుని సంతోషం అంతా ఇంతా కాదు.  గంభీరగమనుడైన తన పుత్రుడు రాముని చూచినప్పుడల్లా దశరథుడు తనకు మళ్లీ యవ్వనవంతుడిగా మారుతున్నట్టు భావించేవాడు. చెప్పుకున్నాడు కూడా.  ‘‘భవామి దృష్ట్వా చ పునర్యువేవ’’అన్నాడు.  ముక్తపురుషులు పరమాత్మానుభవము చేత భగవంతుడి స్పర్శచేత నిత్యమూ 25 సంవత్సరాల వయసు మాత్రమే కలిగి ఉంటారు. శ్రీరాముడు అరణ్యానికి వెళ్లడానికి తగిన అలంకారాలు చేసుకుని తనను సమీపించినపుడు కూడా దశరథుడు ఆనందము ననుభవించి మరల యవ్వనము పొందినట్లు ఉత్సాహం అందుకున్నాడట. రావణుడిపై దండెత్తినపుడు రాముడి వయస్సు సరిగ్గా పాతిక సంవత్సరాలు. సీతాదేవి అరణ్యవాసములో అనసూయకు తన కథ చెప్పే సమయంలో తనకు 18 ఏళ్లనీ, భర్తకు పాతిక సంవత్సరాలనీ పేర్కొన్నట్టు రామాయణంలో ఉంది.

Also read: శివుడు ప్రత్యక్షమైతే సూదిలో దారం ఎక్కించమన్న భక్తుడు

భగవంతుడిని దర్శనమే యవ్వనమిస్తే, స్పర్శనము ఏదైనా ఇవ్వగలదు కదా? ద్వాపరంలో గోవులను గోలోకమైన బృందావనాన్ని తన స్పర్శతో,భగవద్దర్శనముతో గోపికలూ ఉత్తేజితులను చేసిన వాడు.  మురళీఅవి దూడలే అయినా శ్రీకృష్ణుని కరస్పర్శచేత అవి పొదుగులనుంచి పాల ధారలను కార్చగల పశువులవుతున్నాయి. భగవంతుని స్పర్శమాత్రం చేతనే నిరంతర పైలా పచ్చీసు (మొదటి 25 ఏళ్ల వయసు) నిత్యయవ్వనంతో ప్రకాశించేవారే నిత్యసూరులు.

రావణుడి పరాజయం

రాముడు అడవంతా నడిచి, కొండలు కోనలు ఎక్కి, సముద్రం మీద వంతెన నిర్మించి, సముద్రం మధ్యంలో ఉన్న రావణుడి లంకలో ప్రవేశించి, కోట బయట సైన్యంతో విడిది చేసి దుర్బేధ్యమయిన కోటనుంచి రావణుడిని బయటకు రప్పించి యుధ్దంలో తనపై ప్రయోగించిన ఆయుధాలన్నీ ఖండించిన తరువాత రాముడు రావణుడిని చంపి ఉండవచ్చు. కాని గచ్చానుజానామి రణార్థితస్త్వమ్, ‘‘అలసిపోయిన ఓ రావణా ఇంటికి వెళ్లు మళ్లీ ఆయుధాలను సమకూర్చుకుని రేపు రా’’ అని పంపిస్తాడు రాముడు.  ఈ ప్రక్రియలో అనేక సందేశాలున్నాయి. రావణుడు సారథి, రథమూ లేకుండా, కవచమూ, కిరీటమూ లేకుండా, ఆయుధాలేవీ లేకుండా, వెంట పరివారమేదీ లేకుండా, ఒంటరిగా యుధ్ధ భూమినుంచి కోటలోకి నడుస్తూ, ఇంకా ప్రధాన రహదారుల గుండా వంటినిండా గాయలతో రక్తసిక్తదేహంతో నడుస్తూ నడుస్తూ అంతః పురం చేరుకుంటాడు. మొత్తం నగరం ఆయన పరాజయ పరాభవ యాత్రను కళ్లారా చూస్తుంది. తలదించుకునే ఉంటాడు. నిజానికి రావణుడు ఆరోజే మరణించాడు. అహంకారం పూర్తిగా విధ్వంసమైపోతుంది.  కనీసం అప్పుడైనా సీతను అప్పగించి శరణు వేడుకుంటాడా బతికిపోయే వాడు. కాని ఆ పని చేయడు. శరణనకుండా మరునాడు మరణానికి సిద్ధమై రణానికి వస్తాడు.  రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు. తన వైభవం అంతా అంతరించింది. అనుయాయులెవరూ లేరు. రాజభవనంలో కూచుని చర్చించేవారు సలహాలుఇచ్చే వారు ఎవరూ లేరు. అంతా యుద్ధంలో సమసి పోయారు. కొడుకులు సేనాధిపతులు ఎవ్వరూ లేరు. భర్తలను కోల్పోయిన భార్యలు, తండ్రులు లేని పసిపాపలు తప్ప లంకా నగరంలో మిగిలిందెవరూ లేరు.  దశరథుడు రథ కుంజర వాజిమాన్ అని వాల్మీకి వర్ణిస్తాడు. అంటే అనేకానేక రథాలు ఏనుగులు గుర్రాలు కలిగిన వాడు. కాని రాముడు కాలినడకన, చేతిలో ధనుర్బాణాలు తప్ప మరేమీ లేని వాడు. అయోధ్యనుంచి సైన్యాన్ని రప్పించుకోలేదు. సుగ్రీవుడి వానరసైన్యమే తన సైన్యం. వారికి కూడా రథ గజ తురగాలు లేవు. రామలక్ష్మణ సోదరులే మానవులు.  భల్లూక వానరులు తప్పమరెవరూ లేరు. శత్రువు ఉన్న చోటుకువెళ్లి అతన్ని ససైన్యంగా సకుటుంబంగా ధ్వంసం చేయడం రాముని పరాక్రమం, మరో రోజు సమయం ఇవ్వడం పరమ దయ.

సుదర్శన చక్రం ప్రయోగిస్తున్న, శంఖం పూరిస్తున్న కృష్ణడు

శ్రీకృష్ణుడి శత్రువులెవరు?

శ్రీకృష్ణుని ఓర్వలేని వారు యాదవుల శత్రువులు. భాగవతులను బాధించే వారు శ్రీకృష్ణుడికి శత్రువులు. అంతేగాని శ్రీ కృష్ణుడికి వేరే శత్రువులు ఉండరు. పాండవుల పక్షాన రాయబారానికి వెళ్లినపుడు దుర్యోధనుడు విందు ఏర్పాటుచేసి తమ భవనానికి ఆహ్వానిస్తాడు. కాని శ్రీకృష్ణుడు దుర్యోధను ఇంటగానీ, భీష్మద్రోణుల ఇంటగానీ విందును స్వీకరించకుండా విదురుని ఇంటికి విందుకు వెళతాడు. చక్రవర్తిని తనను కాదని, జ్ఞాన వృద్ధుడైన భీష్ముడిని కాదని, విద్యాధికుడైన ద్రోణుడిని వదిలి, విదురునింట విందు చేస్తావా అని అధిక్షేపిస్తాడు దుర్యోధనుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘‘ద్విషదన్నం నభోక్తవ్యం, ద్విషంతం నైవ భోజయేత్’’ = శత్రువుపెట్టిన అన్నం తినకూడదు, శత్రువుకు అన్నం పెట్టకూడదు, కనుక నీ ఇంట నేను విందు స్వీకరించడం సాధ్యం కాదు. అపుడు దుర్యోధనుడు ‘‘నేను నీకెప్పుడు శత్రువునైనాను’’ అని ఆశ్చర్య పోతాడు. పాండవులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. వారు నా బహిఃప్రాణములు. వారిని నీవు ద్వేషిస్తున్నావు. కనుక నీవు నాకు కూడా శత్రువువే. అంటాడు. తన భక్తుల శత్రువులను తన శత్రువులుగా భావించే ఉత్తముడు శ్రీకృష్ణుడు. అదేవిధంగా కంసుడుకూడా శ్రీకృష్ణుడికి ప్రత్యక్ష శత్రువు కాదు. గోపాలురందరినీ పీడించే శత్రువు కనుక తనకు శత్రువైనాడు. రాముడు శత్రుస్థానమైన లంకకు వెళ్లి యుద్ధంచేసినట్టు, శ్రీకృష్ణుడు కూడా కౌమార దశలోనే మథురానగరానికి వెళ్లి కంసుడి కోటలో కంసుడిని వధిస్తాడు.

Also read: అహంకార, కామ క్రోధాలే రాక్షసులు

అంతటి వీరుల కులంలో పుట్టిన ఆ గోపిక తమపై ప్రతాపం చూపుతుందేమోనని భయపడి బయటనున్ని గోపికలు అమ్మా మేము మీ శత్రువులం కాము ఆశ్రయించి వచ్చిన వారిమి అని చెప్పుకున్నారని ప్రవచన పితామహుడు కీ. శే. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు చాలా హృద్యంగా వ్యాఖ్యానించారు.

వైకుంఠనాథుడైన ఆ రాముడు పరిపూర్ణావతారమే. ద్వాపరంలోనూ విష్ణువే శ్రీకృష్ణుడు. విష్ణువు సంపూర్ణావతారం. ఏ లోటూలేని పరాక్రమం ఆయనది. గోదాదేవి చేసిన పరాక్రమ ప్రస్తావన వెనుక ఇంత కథ ఉంది.

Also read: నవరత్నభవనం అంటే నవద్వార శరీరమే

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles