Wednesday, February 1, 2023

రామపట్టాభిషేకంపై వృద్ధనరపతి నిర్ణయం

రామాయణమ్18

అయోధ్యా నగర ప్రజలందరికీ పెద్దపండుగ. తమ ఇంట్లో తమ కుమారుడికే  పెళ్ళి అయ్యిందన్న ఆనందంలో మునిగితేలారు వారు. అవును! రాముడు ప్రతి ఇంటికీ పెద్దకుమారుడే! ప్రతి ఇల్లాలు ఆయనను తన కొడుకుగానే చూసుకొని మురిసిపోతున్నది.అయోధ్యా నగరపు ప్రతి ఆడుబిడ్డ ఆయనను తమ తోడబుట్టిన వాడుగానే భావిస్తున్నది. ప్రతిపౌరుడు తమ యువరాజుని తమ స్నేహితునిగానే భావిస్తున్నాడు.

Also read: పరశురాముడి గర్వభంగం

ఆ పురంలోని పశుపక్ష్యాదులకు కూడా రాముడంటే ప్రేమ! ఇంతెందుకు అయోధ్యలోని జీవరాశుల ప్రాణాలన్నిటినీ ఒకచోట కుప్పగా పోస్తే అది దాల్చే రూపం “రామయ్య”.

(ఒక మనిషి ఇంతమంది అభిమానాన్ని చూరగొనాలంటే ఆతని ప్రవర్తన, నడవడిక. మాట, మనస్సు ఎంత ఉన్నతమైనవిగా ఉండాలి!  మహర్షి వాల్మీకి మాటల్లోనే రాముని గుణగణాలు).

రాముడు సర్వలోక మనోహరుడు

అసూయ లేనివాడు,

ఎల్లప్పుడూ ప్రశాంత చిత్తుడు (తొణకడు బెణకడు)

ఎవరైనా పరుషంగా తనతో మాట్లాడితే దానికి ప్రత్యుత్తరం చెప్పడు (non reactive behaviour).

ఎవరైనా చిన్న ఉపకారం చేసినా సంతోషపడిపోయి అది ఆ జన్మాంతము గుర్తుంచుకుంటాడు. ఎవరైనా అపకారం తలపెడితే దానిని స్మరించడు!

శీలవృద్ధులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, సత్పురుషుల వద్దకు తానుగా వెళ్ళి మాట్లాడుతుంటాడు.

Also read: సీతారామ కళ్యాణం

(ఈనాటి సమాజం వృద్ధుల అవసరమే లేనట్లుగా ప్రవర్తిస్తున్నది. వృద్ధులకోసం ఆశ్రమాలు కట్టించి వారిని సమాజస్రవంతినుండి దూరం చేస్తున్నాం….మనకు తెలివితేటలు జ్ఞానం అధికంగా కలగాలంటే వృద్ధులను సేవించడమొక్కటే మార్గం! ఆర్యచాణుక్యుడు ఇలా చెపుతారు, జ్ఞానమ్ వృద్ధోపి సేవనమ్! అని).

ఆయన పరాక్రమవంతుడు. ముల్లోకాలలో ఆయనను ఎదురొడ్డి నిలువగలవాడు లేడు.  పైగా రాజపుత్రుడు.  కాబోయే సమ్రాట్టు! అయినా …తనకు కనపడినవాడిని అతనికంటే తానేముందు మధురంగా, మృదుమధురంగా పలకరిస్తాడు. బుద్ధిమంతుడు!

బుద్ధి మాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియంవదః

వీర్యవాన్న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః

(ఎంత అద్భుతమైన పదప్రయోగమో! మధురభాషీ..మధురంగా మాట్లాడతాడట,… పూర్వభాషీ..ముందుగానే మాట్లాడతాడట. ప్రియంవదః =  ప్రియంగా పలుకుతాడట!)

Also read: శివధనుర్భంగం: బాలరాముడు కళ్యాణరాముడైన వేళ

అసత్య మాడి ఎరుగడు. పెద్దలను సగౌరవంగా ఎదురేగి పూజిస్తాడు.

పనికిరాని,  శ్రేయస్కరం కాని విషయాలను, కార్యాలను పట్టించుకొనడు!

ఏ సమయంలో, ఏదేశంలో ఏపని చేయాలో చాలా చక్కగా తెలిసినవాడు.

లోపలున్నభావాలను ఏమాత్రమూ బయటకు తెలియనిచ్చేవాడుకాదు! ఆలోచనలను రహస్యంగా ఉంచుకుంటాడు(మంచి Administrator కి అత్యంత అవసరమైన లక్షణం).

మొండిపట్టుదల లేనివాడు  ( highly flexible)

ఇతరులలోని దోషాలనే కాదు! తనలోని దోషాలను కూడా గుర్తించగలవాడు.

Also read: విశ్వామిత్రుడిని ‘బ్రహ్మర్షీ’ అని సంబోధించిన వశిష్ట మహర్షి

..

(ఈ జ్ఞానం మనకెప్పటికైనా కలుగుతుందా అని ప్రశ్న వేసుకుంటే కలుగుతుంది అని సమాధానం వస్తుంది!  కానీ ఎప్పుడు?  ధర్మశాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనని మనం బయటివ్యక్తిగా భావించి మనలోకి మనం తొంగిచూసినప్పుడు! మన ప్రతి అడుగును శాస్త్రానికి అణుగుణంగా ఉన్నదో లేదో కొలుచుకోగలిగి నప్పుడు! అప్పుడు!)…

ఇన్ని సద్గుణాల ప్రోవు రామచంద్రుడు!

దశరథ మహారాజు మనస్సులో అంతర్మథనం జరుగుతున్నది. తాను జీవించిఉండగా సకలగుణాభిరాముడు శ్రీరాముడు పట్టాభిషిక్తుడవటం కన్నులారా చూడగలడా!

తనకేమో వయసు మీదపడుతున్నది.  ఊరుపోమ్మంటున్నది కాడురమ్మంటున్నది! ఎన్నో వేల ఏండ్లు రాజ్యం చేశాడు తాను. ఇక ఈ రాజ్యాన్ని రాముని చేతిలో నిర్విఘ్నంగా పెట్టగలడో లేడో!

 ఉవ్వెత్తున అంతరంగతరంగాలు లేచిపడుతున్నాయి దశరథుని హృదయంలో!

ఆ రోజున అశ్వపతికి మాట ఇవ్వకపోయినా బాగుండేది!

Also read: బొందితో కైలాసం, త్రిశంకు స్వర్గం

 అశ్వపతి కైక తండ్రి! పిల్లలు లేకపోవడం చేత కైకను పెళ్ళి చేసుకోవాలని తాను ఎందుకు సంకల్పించుకోవాలి?

సరే అనుకున్నాను.  మరి ఆవిడను పెండ్లిచేసుకోవటానికి అశ్వపతికి మాట ఏల ఇవ్వవలే కైకకు పుట్టినవాడికే రాజ్యాధికారం అప్పగిస్తానని!

.

ఇప్పుడు తాను ఆ మాట నిలబెట్టుకోగలడా?

రాముడిని పట్టాభిషిక్తుడిని చేస్తే అనృతదోషం అంటుకుంటుంది తనకు.

చేయక పోతే?

వాడు!…. రాముడు! జ్యేష్ఠుడు. సర్వశ్రేష్ఠుడు. ప్రజాభీష్టుడు!

 అట్లాంటివాడున్నప్పుడు వానికి తప్ప నిజానికి ఎవరికైనా పట్టాభిషేకం చేయడం సమంజసమా? అది న్యాయమా? జ్యేష్ఠుడిదేగదా రాజ్యాధికారం! ధర్మం తప్పి తాను వర్తించగలడా?

అటు చూస్తే అసత్యదోషం ఇటు చూస్తే ధర్మగ్లాని!

 ఆయనకు ఏమీ పాలుపోవడంలేదు.

Also read: వశిష్ట, విశ్వామిత్రుల సంఘర్షణ

చాలా దీర్ఘంగా ఆలోచించాడు ! మనసు రాముని వైపే మొగ్గుచూపుతున్నది!

 ఇదే సరయిన సమయం భరతుడుకూడా నగరంలో లేడు!

సింహాసనం అధిష్టించిన రాముని కనులార కాంచవలే!

అదే తన కోరిక!

ఒక నిశ్చయానికి వచ్చిన వాడై మంత్రి, సామంత, పురోహితులనందరినీ పిలిచి సభ ఏర్పాటు చేసి ప్రకటించాడు!

రామునికి రేపు పట్టాభిషేకమహోత్సవమని!

అయితే జనకుడికి, అశ్వపతికి మాత్రము కబురంపలేదు! పట్టభిషేకమయినతరువాత తెలుపవచ్చని ఆయన ఆలోచన!

ఆ మాట వినీవినడంతోనే ప్రజలందరిలో ఆనందం మిన్నుముట్టింది! ఒక్కసారిగా సభలో పండుగ వాతావరణం నెలకొన్నది.

ఆహా! మా రాముడే వసుంధరావల్లభుడు!

ఎవరికి వారే తామే రాజైనంత ఆనందంగా నర్తించారు!.

వసిష్ఠులవారు వెంటనే సంభారములు సమకూర్చడానికి తగినవారందరినీ నియమించారు,

దశరధుడు సుమంత్రుని పంపి రాముని తన వద్దకు రప్పించాడు!

రూపములో, గుణములో, వీరములో సర్వశ్రేష్ఠుడయిన తన జ్యేష్ఠ కుమారుడిని అలాగే తనివితీరా  చూస్తూ ఉండిపోయాడా వృద్ధనరపతి!

Also read: అహల్య శాపవిమోచనం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles