Tuesday, March 19, 2024

దాసరి నారాయణరావు దార్శనికత

తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 13వ భాగం

ఒకప‌క్క వాణిజ్య సూత్రాలున్న చిత్రాల‌ను అగ్ర క‌థానాయ‌కుల‌తో రూపొందిస్తూ, మ‌రోప‌క్క అభ్యుద‌య భావాలున్న చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల అభిమానం పొందిన ద‌ర్శ‌కులు కొద్దిమంది ఉన్నారు!

వారిలో ప్ర‌ముఖంగా ముందుగా చెప్పుకోవ‌ల‌సిన ద‌ర్శ‌కుడు డా. దాస‌రి నారాయ‌ణ‌రావు! చిత్ర ర‌చ‌యిత‌గానూ, ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో అనుభ‌వ‌మూ సంపాదించి, క్ర‌మంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకున్న డా. దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్ర‌గ‌తిభావ‌న చిత్రాల‌ను ప‌రిశీలిస్తే కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుస్తాయి!

Also read: టి. కృష్ణ బాటలో నడిచిన ధవళసత్యం, వేజెళ్ళ

విజయశాంతి ప్రధానపాత్ర

ఓసేవ్ రాములమ్మలో విప్లవ నాయికగా విజయశాంతి

అగ్ర క‌థానాయ‌కుల‌తోపాటు అగ్ర ద‌ర్శ‌కుడుగా డా. దాస‌రి నారాయ‌ణ‌రావు పేరు తెచ్చుకున్నా, అభ్యుద‌య భావాల ప‌ట్ల ఉన్న ఆస‌క్తితో, ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒసేయ్ రాముల‌మ్మ‌, లంచావ‌తారం, బ‌లిపీఠం, ఓ మ‌నిషీ తిరిగి చూడు మొద‌లైన  చిత్రాల‌ను ప్ర‌స్తావించుకోవాలి.

ప్ర‌ముఖ హీరోల‌తో, క‌థానాయిక‌గా న‌టిస్తూ విజ‌య‌వంత‌మైన చిత్రాల నాయిక‌గా పేరుతెచ్చుకున్న విజ‌య‌శాంతి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన “ఒసేయ్ రాముల‌మ్మ‌“ చిత్రం డా. దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుని విజ‌యం సాధించ‌డం విశేషం!

తెలంగాణ ప్ర‌జా ఉద్య‌మాలు, అణ‌చివేత‌కు గురికాబ‌డిన వ్య‌వ‌స్ధ‌ల ప‌రిస్ధితులు, “ఒసేయ్ రాముల‌మ్మ‌“ చిత్ర క‌థావ‌స్తువు! అటువంటి వాతావ‌ర‌ణంలో తెగువ‌, తెగింపు, ధైర్యం, ఆత్మ‌స్థైర్యం ఉన్న ఓ యువ‌తి ఏవిధంగా నాటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్న‌ది, ఆ ప్ర‌య‌త్నంలో ఆ పోరాటంలో, ఆ సంఘ‌ర్ష‌ణ‌లో ఎన్నివిధాలుగా, మాన‌సికంగా, శారీర‌కంగా, సాంఘికంగా త‌న ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి, గ‌మ్యాన్ని చేరుకోవ‌డానికి, బాధ‌ప‌డిందో, హింస‌ప‌డిందో, ప్ర‌తి సంఘ‌ట‌న‌లోనూ తెలియ‌చెప్పిన చిత్రం ఒసేయ్ రాముల‌మ్మ‌!

Also read: అప్రతిహతంగా సాగిన ‘ప్రతిఘటన’

ఆ పాత్ర ఆ వాతావ‌ర‌ణంలో బ‌త‌క‌లేక బ‌తుకుతున్న మ‌హిళ‌ల‌కు ఓ ప్ర‌తీక‌! వారితో పాటు అన్నిర‌కాలుగా దోపిడీకి గుర‌వుతున్న అమాయ‌క ప్ర‌జ‌ల ప్ర‌తిబింబం! ఒక వ‌ర్గ పోరాటాన్ని, స‌మ‌కాలీన స‌మాజంలో జ‌రిగే అవినీతిని, అన్యాయాల‌ని, పెద్ద‌ల దౌర్జ‌న్యాన్ని, ధీరోదాత్తంగా ప్ర‌శ్నించిన క‌థానాయిక రాముల‌మ్మ! ఆ పాత్ర‌లోని భావోద్వేగాల‌ను, న్యాయం కోసం ప్ర‌తిక్ష‌ణం త‌పించే త‌ప‌న‌ను, మ‌హిళ‌ల‌కే కాక‌, అంద‌రికీ స్ఫూర్తి ర‌గిల్చే పాత్ర‌గా ద‌ర్శ‌కుడు డా. దాస‌రి నారాయ‌ణ‌రావు తీర్చిదిద్దిన తీరు ప్ర‌శంస‌నీయం!

జరుగుబాటు లేకనే తిరుగుబాటు

జ‌రుగుబాటు లేన‌ప్పుడే తిరుగుబాటు వ‌స్తుంది అన్న దానితోపాటు జ‌రుగుతున్న అక్ర‌మాల‌ని అణ‌చ‌డానికి కూడా ధైర్యం నిండిన తిరుగుబాటు వ‌స్తుంది! రావాలి! అని ఒసేయ్ రాముల‌మ్మ‌ చిత్రం తెలియ‌చేస్తుంది. అది ప్ర‌గ‌తి ధ్యేయాన్ని సూచిస్తుంది. అభ్యుద‌య దిశ‌ను నిర్దేశిస్తుంది! అదే ఒసేయ్ రాముల‌మ్మ‌ ఇతివృత్తంలోని ఆత్మ‌! ప్రేక్ష‌కులు అర్ధం చేసుకున్నారు! అభినందించారు! అందుకే ఒసేయ్ రాముల‌మ్మ‌ ప్ర‌గ‌తి చిత్రాల జాబితాలో స్ధానం సంపాదించుకుంది!

Also read: పీపుల్స్ స్టార్ ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి

‘ఓ మనిషీ తిరిగిచూడు’ చిత్రంలో ఒక దృశ్యం

ర చిఇక డా. దాస‌రి నారాయ‌ణ‌రావు విమ‌ర్శ‌నాత్మ‌కంగా, సంఘంలో అంటువ్యాధిలా వేళ్ళూనుకున్న లంచం మీద‌, త‌న‌దైన బాణీలో రూపొందించిన చిత్రం లంచావ‌తారం. ఈ చిత్రం పేరులోనే కావ‌ల‌సినంత వ్యంగ్యం ఉంది! అంద‌రికీ తెలిసిన ద‌శావ‌తారాల‌ క్ర‌మంలో ఈ లంచం అన్న‌ది కూడా ఒక అవ‌తార విశేషంగా చెప్ప‌డం!

ఇవాళ అంటే స‌మ‌కాలీన స‌మాజంలో లంచం మ‌న‌కు ఎన్నో సంద‌ర్భాల‌లో ఎన్నో రూపాల‌లో ద‌ర్శ‌న‌మిస్తోంది అన్న‌ది నిర్వివాదాంశం! ఇటు ప్రైవేటు రంగం అయినా, అటు ప‌బ్లిక్ రంగ వ్య‌వ‌స్థ‌ల‌లో అయినా లంచం అనేది చేతికి అంద‌క‌పోతే, ఏ ప‌నీ జ‌ర‌గ‌దు! జ‌ర‌గ‌డం లేదు అనేది వ్యంగ్య సంభాష‌ణ‌లు, హాస్య స‌న్నివేశాల‌తో, సంద‌ర్భోచితంగా ఆహ్లాద‌ప‌రిచే సంఘ‌ట‌న‌ల‌తో లంచావ‌తారం చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌డంలో ద‌ర్శ‌కుడు డా. దాస‌రి నారాయ‌ణ‌రావు స‌ఫ‌లీకృతుడ‌య్యాడు.

Also read: మాదాల రంగారావు ప్రగతిశీల చిత్రాల ప్రస్థానం

లంచావతారం చిత్రంలో లంచం వ‌ల్ల వ్య‌క్తిగ‌తంగానూ, సంఘ‌ప‌రంగానూ ఎంత న‌ష్టం, క‌ష్టం క‌లుగుతుందో, అందువ‌ల్ల అన్ని వ్య‌వ‌స్ధ‌లు ఎంత‌గా ప‌త‌నం  అవుతున్నాయో తెలియ‌చెప్పుతూ లంచం అనేది స‌మాజ ప్ర‌గ‌తికి ఎంత‌టి అన‌ర్ధ‌దాయ‌క‌మో ద‌ర్శ‌కుడు  డా. దాస‌రి నారాయ‌ణ‌రావు వెండితెర మీద ఆవిష్క‌రించిన తీరు అభినంద‌నీయం!

ఈ చిత్రంలోని కొన్ని స‌న్నివేశాలు ముఖ్యంగా లంచం ఇస్తేనే కొన్ని కార్యాల‌యాల్లో కావ‌ల‌సిన ప‌ని జ‌రుగుతుంది అన్న‌ది వివాదం, విమ‌ర్శ‌ల‌కు తావు లేకుండా చూపిన విధానం, అత్యంత స‌హ‌జంగా ఉండ‌టం ద‌ర్శ‌కుని ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం!

భావిత‌రాల‌కు ప్ర‌గ‌తి బాట‌ను చూప‌వ‌ల‌సిన స‌మాజం లంచం అనే రాచ‌పుండుతో కుళ్ళిపోవ‌డం వ‌ల్ల ఎటువంటి అన‌ర్ధానికి దారితీస్తుందో ర‌స‌భ‌రితంగా చెప్పిన చిత్రం లంచావ‌తారం!

Also read: అభ్యుదయ భావాలకు ప్రతిరూపం మాభూమి

వ్యక్తుల బలహీనతే వ్యవస్థల పతనానికి హేతువు

వ్య‌క్తుల‌లోని బ‌ల‌హీన‌తే వ్య‌వ‌స్థ‌లు ప‌త‌నావ‌స్థ‌కి చేర‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. ఇది ఎన్నో సంద‌ర్భాల‌లో నిరూపిత‌మైన నిజం! అలా వ్య‌వ‌స్థ‌ల‌ను, అస్థిరం చేసే లంచం ప్ర‌ధాన చిత్ర క‌థావ‌స్తువుగా డా. దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో   వ‌చ్చిన లంచావతారం ప్ర‌భోదాత్మ‌క‌మే కాదు – ప్ర‌యోజ‌నాత్మ‌క‌మైన ప్ర‌గ‌తి భావ క‌థావ‌స్తువున్న చిత్రంగా పేర్కొనాలి!

ఈ చిత్రంలోని పాత్ర‌లు, వాటి ప్ర‌వ‌ర్త‌న‌, సంభాష‌ణ‌లు, ప‌రిశీలించిన‌ప్పుడు అంద‌రూ మ‌న‌కు తెలిసిన‌ట్టుగా ఉంటారు. అంటే పాత్ర‌ల‌ను అంత స‌హ‌జంగా మ‌ల‌చిన ద‌ర్శ‌కుని ప్ర‌తిభ అని చెప్పుకోవాలి. అస‌లు ఏ క‌థ లేక పాత్ర అయినా పాఠ‌కుల‌కు లేదా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతుందో అది నిర్వివాదంగా అభిమానం పొందుతుంది. అందుకే కొన్ని చిత్రాల్లోని పాత్ర‌లు ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు గుర్తున్నాయి! ఇది ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుల వివేచ‌న‌కు కొల‌బ‌ద్ద‌లుగా నిలుస్తాయి!

Also read: ప్రతి ప్రయత్నం ఒక వియత్నాం

క‌థ‌ల్లో వాస్త‌వ జీవితం ఉంటుందా లేక‌పోతే జీవితంలోంచే వాస్త‌వాన్ని క‌లుపుకున్న క‌థ‌లుంటాయా అన్న‌ది ఆలోచ‌న రేకెత్తించే ప్ర‌శ్న‌!

అయితే ఇక్క‌డో విష‌యం చెప్పుకోవాలి! ఏ క‌థ అయినా క‌ళ అయినా, వాస్త‌వంలోని దుర్నీతిని, దుర్మార్గాన్ని, అన్యాయాన్ని, అక్ర‌మాల‌ని ప్ర‌శ్నిస్తూ, వాటిని నిర్మూలించే మార్గాన్ని చూపిన‌ప్పుడు, అది నిస్సందేహంగా ప్ర‌గ‌తి భావాత్మ‌క‌మైన రూపం పొందుతుంది అన‌డంలో ఎవ‌రికీ ఆక్షేప‌ణ ఉండ‌న‌వ‌స‌రంలేదు!

మనం వేసుకోవలసిన ప్రశ్న

‘లంచావతారం’గా దాసరి నారాయణరావు

కానీ ఇక్క‌డ స‌మాజంలోని వ్య‌క్తులుగా, కొన్ని సంస్థ‌ల ప్ర‌తినిధులుగా, మ‌న‌ల్ని మ‌నం ఒక ప్ర‌శ్న వేసుకోవాలి! సంఘంలో ఏ రూపంలో దోపిడీ జ‌రిగినా దానికి కేవ‌లం ఒక్క‌వైపు ఉన్న వారినే నిందించ‌డం స‌రికాదు. ఇచ్చి పుచ్చుకోవ‌డాలు ఉన్న లంచం విష‌య‌మే తీసుకుంటే ఇరువైపుల వారిని దోషులుగా పేర్కొనాల్సిందే! ఒక‌రిది ఆశ అయితే మ‌రొక‌రిది అవ‌స‌రం! ఈ రెండూ క‌లిసిన‌ప్పుడే త‌ప్పు జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంది! అందుకే అలాంటి దోషం జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా చేస్తే దాన్ని నిరోధించ‌వ‌చ్చు? అస‌లు అలాంటి దానికి అవ‌కాశ‌మే ఇవ్వ‌ని ప‌రిస్ధితి ఏర్ప‌రిస్తే ఎలా ఉంటుంది? దానికి ఎవ‌రు ముందుకు రావాలి? అటువంటి చైత‌న్యం స‌మాజంలో ఎలా క‌లిగించాలి?

ఇలా ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు ఉన్నాయి. స‌మ‌స్య ఉన్న‌ప్పుడు స‌మాధానం ఉంటుంది. అలాగే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైన‌ప్పుడు అందుకు త‌గిన జ‌వాబు కూడా ఉంటుంది. అస‌లు ప‌రిష్కారం చేయ‌లేని స‌మ‌స్య అనేది ఉండ‌దు! అందుకు విజ్ఞ‌త‌తో ఆలోచించాలి! అప్పుడు పైన వేసుకున్న ప్ర‌శ్న‌ల‌న్నిటికీ చ‌క్క‌ని జ‌వాబులు దొరుకుతాయి. ఆ స‌మాధానాలు దొరికిన రోజున స‌మాజంలో స‌రిస‌మాన‌త ఏర్ప‌డుతుంది. వ‌క్ర రేఖ‌లు పోయి స‌ర‌ళ‌త రావ‌డానికి ఆస్కారం క‌లుగుతుంది! అలాంటిది ఎలా ఉంటుందో ఈ చిత్రంలో కాస్త నాట‌కీయ‌త జోడించి చెప్ప‌డం జ‌రిగింది!

Also read: రాజకీయ కుతంత్రాలపైన శరసంధానం

విశ్వశాంతి విశ్వేశ్వరరావు

విశ్వశాంతి విశ్వేశ్వరరావు

సాంకేతికంగా ప్ర‌మాణాలు లేక‌పోయినా, ఉత్త‌మ ఆశ‌యంతో నిండిన  చిత్ర ఇతివృత్తాలు సామాజిక స్పృహ‌ను క‌లిగిస్తాయి! ఓ మంచి చిత్రానికి అంత‌కంటే ప్ర‌యోజ‌నం ఏం కావాలి? అటువంటి చిత్రాలు మ‌రికొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మార్గ‌సూచిక‌లుగా నిల‌బ‌డ‌తాయి! అలా గ‌తంలో కొన్నిచిత్రాలు ఆద‌ర్శ‌వంతంగా నిల‌బ‌డ‌టం వ‌ల్లనే ఇప్ప‌టికీ కొంత‌మంది నిర్మాత‌, ద‌ర్శ‌కులు అలాంటి సామాజిక స్పృహ ఉన్న చిత్రాల నిర్మాణానికి ముందుకొస్తున్నారు. ఇది హ‌ర్ష‌ణీయం! ఆచ‌ర‌ణీయం!

అగ్ర న‌టుడు ఎన్టీఆర్‌తో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు విశ్వ‌శాంతి విశ్వేశ్వ‌ర‌రావు! చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న‌దొక ప్ర‌త్యేక స్ధానం!

అనుభ‌వ‌జ్ఞుడైన నిర్మాత‌గా ప‌లు వాణిజ్య చిత్రాల‌ను నిర్మించి, విజ‌యం పొందినా సినిమా అనేది ఓ శ‌క్తివంత‌మైన మాధ్య‌మం అని తెలిసిన నిర్మాత విశ్వ‌శాంతి విశ్వేశ్వ‌ర‌రావు!

వాణిజ్య చిత్రాల‌లో చెప్ప‌డానికి, అవ‌కాశం లేని సాంఘిక స‌మ‌స్య‌ల‌ను, సామాజిక స్పృహ క‌లిగిన అంశాల‌ను అభ్యుద‌య ధోర‌ణుల‌ను ప్ర‌తిబింబించే  చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత విశ్వ‌శాంతి విశ్వేశ్వ‌ర‌రావు!

ఆయ‌న నిర్మించిన మార్పు, తీర్పు మొద‌లైన చిత్రాల‌ను ప‌రిశీలించిన‌ప్పుడు వ‌ర్త‌మాన స‌మాజంలోని సామాజిక స‌మ‌స్య‌ల‌కు ఎలా చిత్ర క‌థాంశాలుగా చూప‌వ‌చ్చో తెలుస్తుంది! చిత్ర నిర్మాత‌ల‌కు సామాజిక స్పృహ‌తో పాటు సామాజిక బాధ్య‌త కూడా ఉండాలి అని అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచిన నిర్మాత‌ల‌లో విశ్వ‌శాంతి విశ్వేశ్వ‌ర‌రావుని విస్మ‌రించ‌లేము!

Also read: రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’

విశ్వశాంతి విశ్వేశ్వరరావు నిర్మించిన తీర్పు

వ‌ర్త‌మాన స‌మాజంలో కొంద‌రు కుబేరులు, సాంఘిక సంక్షేమం కోసం ప‌లు స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం, అందుకోసం భారీగా భూరి విరాళాలు ఇవ్వ‌డం మ‌నం చూస్తున్నాం. అలాగే లాభాపేక్ష లేకుండా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే చిత్రాల నిర్మాణం చేప‌ట్ట‌డం కొంద‌రు నిర్మాత‌ల‌కే ఆ గౌర‌వం ద‌క్కింది అని చెప్పాలి! అటువంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల వ‌ల్ల ఆర్ధిక లాభం ఉండ‌ద‌ని తెలిసినా ఆత్మ‌తృప్తి కోసం త‌న‌ను పెంచి పెద్ద‌చేసిన స‌మాజం, ఆ స‌మాజాభివృద్ధి కోసం త‌న‌వంతు బాధ్య‌త‌గా ఆ చిత్రాల‌ను నిర్మించే నిర్మాత‌ల‌ను అభినందించ‌డం మ‌న బాధ్య‌త‌గా భావించాలి! అలా కొంద‌రు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, సంస్కార‌యుతంగా, ప్ర‌గ‌తిభావ‌న చిత్రాలు నిర్మించ‌డం, ఇప్ప‌టికీ న‌డుస్తున్న (సినిమా) చ‌రిత్ర‌!

సెల్యులాయిడ్ మీద కాల్ప‌నిక క‌థ‌లు కాసేపు కాల‌క్షేపాన్ని, క‌ల‌గ‌చేస్తే, ప్ర‌గ‌తి భావ‌న చిత్రాలు ప్రేక్ష‌కుల‌లో ఆలోచ‌న‌లు రేకెత్తిస్తాయి!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన సంస్థ‌ల‌లో ప‌లు ప‌ద‌వుల‌ను కూడా స‌మ‌ర్ధంగా, నిర్వ‌హించిన విశ్వ‌శాంతి విశ్వేశ్వ‌ర‌రావు వాణిజ్య చిత్రాలు నిర్మించే నిర్మాత‌లు కూడా ప్ర‌గ‌తి భావ‌జాలంతో అభ్యుద‌య ఇతివృత్తాల‌తో చిత్రాలు నిర్మించ‌గ‌ల‌ర‌ని నిరూపించిన నిర్మాత‌!

స‌మాజ పోక‌డ‌లు కాల‌క్ర‌మేణా మారిపోతుండ‌టం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాము. అది కాల స్వ‌భావం! అందువ‌ల్లే స‌మాజంలోని ప‌రిస్ధితులు కూడా ప‌రివ‌ర్త‌న చెందుతాయి. అది స‌మాజ ల‌క్ష‌ణం! మారుతున్న స‌మాజంలో ఏది మంచి, ఏది చెడు, దేనిని ప్రోత్స‌హించాలి, దేనిని ఖండించాలి, దండించాల‌ని వివేచ‌న చేయ‌వ‌ల‌సిన వారు ఎవ‌రు అంటే స‌మాజ హితం కోరే వారు, భావి స‌మాజం అన్ని విధాలా శ్రేయోదాయ‌కంగా ఉండాల‌ని భావించే వారు!

ఇటువంటి వారు సృజ‌నాత్మ‌క క‌ళారంగంలో ఉంటే వారు వారు కోరే స‌మ స‌మాజానికి మార్గ‌ద‌ర్శ‌కుల‌వుతారు! అయితే క్ర‌మంగా విస్త‌రిస్తున్న ఆర్ధిక అస‌మాన‌త‌లు ఒక్కోసారి, అటువంటి వారి ఆలోచ‌న‌ల‌కు, ఆశ‌యాల‌కు ప్ర‌తిబంధ‌కాల‌వుతాయి! అలా అవ‌డం మ‌న‌కు తెలిసిందే!

Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు

Yadavalli
Yadavalli
Yadavalli is a versatile writer in Telugu. He has been writing lyrics, script, screenplay for South Indian films and also directed a few of them.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles