Tuesday, September 17, 2024

దరిశి చెంచయ్యగారి భావజాల మిత్రుడు, మహా మార్క్సిస్టు మేధావి డా. కె. బి. కృష్ణ

“ప్రొఫెసర్ కందాడై శేషాద్రి చెప్పినట్లు, ‘మన దేశస్తులకు ఒక బలహీనత,ఆత్మన్యూనతా (Inferiority Complex) భావం, మౌలికత కొరత(Lack of Originality), తాముగానే స్వతంత్రించి ఆలోచించటం తక్కువ. భావ పిరికితనం, ఈ రోగం కమ్యూ నిస్టులలో కూడా ఉండేది. (కమ్యూనిస్టు ఉద్యమం, ప్రజాహిత ప్రచురణలు, వరంగల్, 1998, పేజి 14). ఈ కారణాల వల్ల కమ్యూనిస్టు ఉద్యమం డా. కె. బి. కృష్ణ లాంటి స్వతంత్ర మార్క్సిస్టు యోచనా పరుణ్ణి కోల్పోయింది. వీటితో పాటు మరొక కమ్యూనిస్టు సిద్ధాంత వేత్త మేహిత్సేన్ తన స్వీయచరిత్రలో పేర్కొన్నట్లు, “ముఠాతత్వం”(Factionalism) కూడా కమ్యూ నిస్టు ఉద్యమం తాత్వికంగా, స్వతంత్రంగా ఎదగక పోవడానికి కారణం కావచ్చు. భావ పిరికితనం కమ్యూనిస్టు ఉద్యమాన్ని తొలి నుంచి పట్టి పీడిస్తున్నదని చెప్పడానికి డా. కె. బి. కృష్ణ జీవితం, రచనలే తార్కాణం. అందువల్లే డా. కె. బి. కృష్ణ లాంటి మార్క్సిస్టు భాష్యకారుడ్ని ఈ దేశం కోల్పోవాల్సి వచ్చింది…ఒక మానవతా మహొద్యమం (కమ్యూనిస్టు ఉద్యమం) తొలి నుండి ఇటువంటి తప్పట డుగులు వేస్తూ, నానాటికీ తన పరిధిని సంకుచితం చేసుకుంటూ వెళ్తుందో ఇప్పటికైనా నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ఆరాధన, అసూయ లాంటి సంకుచిత భావాలు భారత కమ్యూనిస్టులను తాత్వికరంగాన ఎదగకుండా చేస్తున్నాయి. స్వామి వివేకానంద భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో అసూయను ఒక ప్రధాన రుగ్మతగా భావించారు. అసూయ అనేది భారత దేశానికి ఒక “శాపం” లాంటిదిగా ఆయన విశ్లేషిం చారు. తాత్విక దారిద్ర్యమే అన్ని రకాల దారిద్ర్యాలకు నిలయంగా మారింది.”

Also read: ఎగిరే ధిక్కార పతాక – కలేకూరి ప్రసాద్!

పదేళ్ళ క్రితం మహామేధావి, మార్క్సిస్టు భాష్యకారుడు డాక్టర్ కె. బి. కృష్ణ అనే చిన్న పుస్తకాన్ని దరిశి చెంచయ్య గారి విలువయిన అభిప్రాయాలతో మిళింద ప్రచురణల తరపున ప్రచురిస్తూ, దానికి “మరుగున పడిన స్వాతంత్ర్య సమర యోధుడు డా. కె. బి. కృష్ణ” అనే మున్నుడి పరిచయం రాస్తూ, టి. రవిచంద్ గారు రిఫరెన్స్ & నోట్స్ లో పైన  రాసిన వాక్యాలతో  ముగించారు. ఈ రోజు పరిస్థితుల రీత్యా ఎందుకనో అత్యవసరంగా అనిపించి ఆ పొత్తంతో పాటు కె. బి. కృష్ణ గార్ని గురించి ఇలా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. “ఈ దేశంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఫాసిస్డు శక్తుల ప్రమాదాన్ని గుర్తించిన ఎం. ఎన్. రాయ్, డా. అంబేద్కర్ ల సరసన నిలుస్తారు ఆయన (కె. బి. కృష్ణ) అన్న రవిచంద్, ” ఆయన మేధాస్థాయిని ఎవరూ అందుకోలేకపోయారు. ఒక విధంగా వావిలాల మాటల్లో చెప్పాలంటే ‘రెండోరకం మేధావుల’ మధ్య ఆ మహామేధావి ఒంటరి వాడైపోయాడు” అంటారు. అంతేకాదు,

“1942లో  డా. కృష్ణ జైలు నుండి విడుదల అయ్యారు. తర్వాత ఆయన కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. వృత్తి కోసం ప్రవృత్తిని తాకట్టు పెట్టే స్వభావం లేని ఆ అసాధారణ మేధావి ఎక్కడా ఇమడలేక పోయారు. కొంతకాలం బెల్గాం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేసినా ఆయన తన స్వతంత్ర భావాల వల్ల దానినీ వదులుకోవలసి వచ్చింది. అన్నిటికంటే తన ఆశయాలు ముఖ్యమని నమ్మిన ఆ మేధావి బ్రతక నేర్చిన తన తోటి సహచరులకు అర్ధం కాలేదు. ఆయనను ఎగతాళి చేశారు. పిచ్చివాడే మోనని భ్రమ పడ్డారు! నిజమే! నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ ఎరుగని నిరంతర పోరాటం చేసి దేశ స్వాతంత్ర్యం కోసం, సమ సమాజ నిర్మాణం కోసం కలలుగన్న ఆయన నిజంగా పిచ్చివాడే! అత్యున్నత ఆశయాల్ని కూడా తమ స్వీయ స్వార్ధం కోసం ఉపయోగించుకునే ఘనులు నేడే కాదు, నాడూ ఉన్నారు. కాబట్టే, అత్యంత ప్రతిభా వంతుడు, నిబద్దత కలిగిన ఆ సామ్రాజ్యవాద వ్యతిరేకి, సృజ నాత్మక మార్క్సిస్టు మేధావి,  ఆత్మగౌరవాన్ని చంపుకుని ఎవర్నీ ఏదీ దేహీ అని అడక్కుండా కేవలం టీ మాత్రంతాగుతూ ఎన్నో రోజులు గడిపారు. ఆయన తన ఆశయాలకు విరుద్ధంగా ఏ సంస్థ లోనూ పనిచేయలేకపోయారు. అటువంటి మేధావి వృత్తి కోసం తన ఆశయాల్నిఅమ్ముకోలేక శారీరక, మానసిక వ్యాధు లకు గురయ్యీ 1948 సంవ త్సరం డిసెంబరు 18న నిడుబ్రోలులో మరణించారు” అంటారు.

Also read: వీరోచిత ఉపదేశం – నేనూ, నా దేశం!

బహుశా అందుకనే, “నా అనుభవంలో కృష్ణ కంటే ఎక్కువ మేధావిని, శాస్త్రజ్ఞుడిని, పండితుడిని, పరిశోధకుడిని నేను చూచి యుండలేదు. అందువల్ల నాకు ఆయన యందు గౌరవము అధికమగు చుండెను. చివరకు మేము స్నేహితులమైతిమి.” అన్న దరిశి చెంచయ్య గారు, “ఆయన ఒక తపస్విలాగున ఏకాంతంగా ఉంటూ ఎల్లప్పుడూ చదువుతూ, ఆలోచించుతూ, వ్రాయుచూ ఉండేవాడు. కాని ఏమాత్రం తన కాలాన్ని వృధాపుచ్చే వారు కాదు. ఆయన రాసిన గ్రంథాలు అచ్చు కాలేదనే విచారం కూడ ఆయనకు ఉండేది కాదు. మర్క్సు తరువాత వచ్చిన గొప్ప రచయితల మీద మార్క్సు ప్రభావముండినందుచేత వారి రచనలలో ఆ సిద్ధాంతాలు వ్యక్తమవు చుండేవి. అదే రీతిగ, కృష్ణ గారి మీద కూడా ఆ ప్రభావం విపరీతంగా ఉండెను. నేను తెలుసు కున్నంత వరకు ఆయన ఒక ఋషి వంటి వాడు. ఎవరి తోనూ స్నేహం చేయుటకు ప్రయత్నించడు. ఎవరి తెలివి తేటలు ఆయనకు నచ్చవు. ఆయన ఎన్నో సంవత్సరాలు చదివి జీర్ణం చేసుకొన్న మార్క్సు తత్వ శాస్త్రానికీ, భావాలకూ, సిద్ధాంతాలకూ ఇతరులవి సాటి కావు అనే విషయాన్ని సులభంగా గ్రహించేవాడు.” అంటారు. అంతేకాదు, “ఇండియా లోని ఏ రాజకీయ పార్టీలోనూ ఆయన చేరలేదు. ఏ వ్యక్తి తోనూ స్నేహం చేసుకొనుటకు ప్రయత్నించ లేదు. భావ ప్రపంచంలో ఉంటూ ఉండిరి. ఆయన ఒక స్వతంత్ర ఆలోచనా పరుడు. మహా పండితుడు. గొప్పమార్క్సిస్టు రచయిత. ఎక్కువ విజ్ఞాని అయినకొద్దీ, ఎక్కువ యోచనాపరుడిగా పెంపొదిన కొద్దీ చెవుడు ఎక్కువయి, ఇతరులతో సంబంధం త్రెంచి వేసుకుంటూ, స్వీయ భావ ప్రపంచంలోనే కాలము గడుపుచుండిరి. వారు ఏ న్యూయార్క్, వాషింగ్టన్ లండన్ పబ్లిక్ లైబ్రరీ లలోనో పరిశోధనలు సల్పుతూ, విద్యాధికులకు బోధించుతూ కాలం గడిపేందుకు అవకాశాలు లేక ఆయన జీవితం వృధా అయిపోయెను. ఆంధ్రులము సాటిలేని ఆయన ప్రతిభను, పాండిత్యాన్ని ఆయన గ్రంథాలను ముద్రించుట ద్వారా అయినా ప్రయోజన ము పొందెదము గాక!” అంటూ ముగిస్తారు చెంచయ్య.” (నా దివ్య స్మృతులు – దరిశి చెంచయ్య, ప్రచురణ : ఆదర్శ గ్రంథ మండలి, విజయవాడ, 1961, పేజీలు103, 115)”

Also read: మద్యమా? మానవ మనుగడా?

దరిశి చెంచయ్య గారు ఆశించిన ఆ ప్రయోజనాన్ని డా. కె. బి. కృష్ణ రచనలు ;1.స్టడీస్ ఇన్ హిందూ మెటీరియలిజం (1994), 2. భగవద్గీతలో భౌతికవాద అంశాలు (1995, 2000), 3. తెలుగు వెలుగు డా. కె. బి. కృష్ణ : సంక్షిప్త జీవితచిత్రణ (1995) 4. భారత ప్రజాతంత్ర విప్లవ సమస్యలు : దళిత ఉద్యమ నేపథ్యంలో డా. కె. బి. కృష్ణ ప్రాముఖ్యాన్ని గురించి చర్చించిన రచన (1996) 5. పొలిటికల్ అండ్ సోషల్ థాట్ ఆఫ్ బుద్దిస్ట్ రైటర్స్ (1999)వంటి విలువైన గ్రంధాలు మేధో జీవుల్లోనూ, ఆలోచనాపరుల లోనూ మహామేధావి డా. కె. బి. కృష్ణ గారిని గురించిన చర్చకు ఎంతోకొంత తోడ్పాటు ను కల్పించేలా ప్రచురించిన మిళింద ప్రచురణల కృషి ఎంతైనా ముదావహం. ఆ బృహత్తర లక్ష్యానికి కొన సాగింపే ఈ పుస్తకం.ఈ పొత్తంలోని మరో విశేషం ఏమిటంటే, కె. బి. కృష్ణ, చెంచయ్యలతో ప్రత్యక్ష పరిచయం గల జస్టిస్ పి. ఏ. చౌదరి గారు వారి జ్ఞాపకాలను లేఖ రూపంలో రాస్తూ, “కృష్ణ గారిని గూర్చి మాట్లాడిన ప్పుడల్లా దరిశి చెంచయ్య గారి ని గూర్చి చెప్పాల్సి వస్తుంది. భారతదేశ స్వాతంత్ర్యము సముపార్జిం చాలంటే ఆయుధ యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నమ్మి కారాగార శిక్ష అనుభవించిన వారు గదర్ వీరులు. వారిలో చెంచయ్య గారు ఒకరు. నిరాడంబరుడు. సౌమ్యశీలుడు. వితంతు వివాహమాడిన సంఘ సంస్కర్త. వారు రాజమన్నార్ పార్కు వద్ద మాంబళంలో ఉండేవారు. కృష్ణ గారిని అపారంగా గౌరవించిన, ప్రేమించిన వారు. ఎం. ఎన్. రాయ్ తో జరిగిన వివాదంలో తను గదర్ పార్టీ సభ్యుడ్నీ అని గుర్తు చేసాడట. అన్యాయాన్ని చూసి సహించలేని వీరు తమ ఆశయ సిద్ధికి సర్వం అర్పించ గల త్యాగమూర్తులు. వారి సంస్మరణ ఎప్పుడూ నాకు ధైర్యాన్ని యిస్తుంది.” అంటారు.

ఇందులో చౌదరి గారు ప్రస్తావించిన ఒక  ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే దరిశి చెంచయ్య గారికీ ఎమ్మెన్ రాయికీ పరిచయం ఉండటమే కాకుండా వారిరువురికీ ఏదో విషయంలో వివాదం కూడా జరిగిందనేది. ఈ అంశం గురించి ఔత్సాహికులెవరైనా పూనుకుని మరిన్ని వివరాలు సేకరిస్తే తెలుగులో భావోద్యమ వికాసానికి దోహదం చేసే ఆరోగ్యకర సంవాదానికి తోడ్పడిన వారౌతారని నా అభిప్రాయం. అందుకనే ఎప్పటి నుంచో పరిచయం చేద్దామని అనుకుంటున్న ఈ విలువైన పొత్తం పై ఇన్నళ్ళకి ఇలా ఈ చిన్న రైటప్.

Also read: ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి, చింతన

–  గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles