Thursday, April 25, 2024

ఎంఎల్ఏలతో పోలీసుల కుమ్మక్కు ప్రమాదకరమైన ధోరణి

హైదరాబాద్ : మంథని సమీపంలో లాయర్ దంపతుల హత్య సమాజంలో నెలకొన్న ఒకానొక ప్రమాదభూయిష్టమైన ధోరణిని బట్టబయలు చేసింది. హంతకులు ఎవరో పోలీసులు తెలుసుకుంటారు. పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా కారులో వచ్చి కొడవళ్ళతో నరికి చంపివేయడం తెలంగాణలో చాలా అరుదైన ఘటన. హైకోర్టు కూడా సూమోటూగా లాయర్ దంపతుల హత్య ఉదంతాన్ని తీసుకున్నది కనుక హంతకులను పట్టుకుంటారనీ, సరైన విధంగా శిక్షిస్తారనీ విశ్వసించవచ్చు.

ఏ  కేసులోనైనా  హంతకులను పట్టుకోవడం ముఖ్యమే. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏమంటే ఇటువంటి వాతావరణం ఎందుకు ఏర్పడిందో అధ్యయనం చేయడం. రాజకీయ నాయకులతో కుమ్మక్కయినారంటూ పోలీసులపైన ఆరోపణలు ఎందుకు వచ్చాయో పరిశీలించడం.

ఇదివరకు ఎంఎల్ ఏ లకు సివిల్ పనులు దొరికేవి. కొద్దోగొప్పో సంపాదన ఉండేది. రోడ్లు వేయడమో, రోడ్లు మరమ్మతు చేయడమో, స్కూలు భవనాలు నిర్మించడమో ఇదివరకు జరిగేవి. ఇప్పుడు కేవలం పెద్ద ప్రాజెక్టులను పెద్ద కాంట్రాక్టర్లు నిర్మిస్తున్నారు. పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద రాజకీయ నాయకులతో సంపర్కంలో ఉంటున్నారు. చిన్న నాయకులను పట్టించుకోవడం లేదు. చిన్న ప్రాజెక్టులకు నిధులు లేవు. ఎంఎల్ఏలకు వచ్చే జీతం ఖర్చులకు చాలదు. ఎన్నికలలో ఖర్చు చేయడమే కాకుండా ఎంఎల్ఏలు నిత్యం కొంతమందిని పోషించాలి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎల్ఏలు కొన్ని మాసాలపాటు నిధుల విషయంలో విలవిలలాడారు. తర్వాత వారికి దిశానిర్దేశం లభించింది.

ఎంఎల్ఏ పరిధిలో పోలీసుల నియామకాలు ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు జరుగుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) మౌఖికంగా ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసుల బదిలీలు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఎస్ పీ మినహా డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు రాజకీయ నాయకుల చెప్పుచేతలలోకి వచ్చారు. హోదాని బట్టి పోలీసు అధికారుల బదిలీ కావాలంటే పాతిక నుంచి యాభై లక్షలు రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు. హత్యలూ, దాడులు మాత్రమే కాదు భూకబ్జాలు రాజకీయ నాయకులూ, పోలీసు అధికారుల మిలాఖత్ కారణంగా విచ్చలవిడిగా జరుగుతున్నాయి.

అధికారపార్టీ ఎంఎల్ఏలకు పోలీసు వ్యవస్థపైన పూర్తి పట్టు ఉన్నది. టీఆర్ఎస్ ఎంఎల్ఏ లేనిచోట ఓడిపోయిన టీఆర్ఎస్ ఎంఎల్ఏ అభ్యర్థి మాటకు విలువ ఉంటుంది. ఉదాహరణకు మంథనిలో కాంగ్రెస్ ఎంఎల్ఏ శ్రీధర్ బాబు మాట చెల్లుబాటు కాదు. ఓడిపోయిన అభ్యర్థి, ప్రస్తుతం జిల్లాపరిషత్తు అధ్యక్షుడు పుట్ట మధుకుమార్ మాటకు పోలీసులు విలువ ఇస్తారు. రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి.

ఇదీ చదవండి: లాయర్ దంపతుల హత్యలో పుట్టమధు మేనల్లుడి ప్రమేయం

నిజానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా మహేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిందితులను పోలీసులు కొట్టడం తగ్గింది. లాకప్ మరణాలు కూడా ఇదివరకటంతగా లేవు. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో జరిగిన లాకప్ మరణం కూడా అరుదైనదే. నిందితులపై చేయి చేసుకోరాదనీ, వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలనీ మహేందర్ రెడ్డి పోలీసు అధికారులకు నచ్చచెబుతున్న కారణంగా పోలీసుల అత్యాచారాలు బాగా తగ్గిపోయాయి.

రెండు దశాబ్దాల కిందటి వరకూ పోలీసులలో ఎక్కువగా ముస్లింలూ, రెడ్లూ, వెలమలూ, మున్నూరు కాపులూ ఉండేవారు. దాష్టీకం నడిచేది.  ఆ తర్వాత ఇతర బీసీ కులాలవారూ, దళితులూ, గిరిజనులూ పోలీసు అధికారులుగా నియుక్తులు కావడంతో సామాజిక కోణం వెలుగులోకి వచ్చింది. ప్రజలపైన పోలీసులు దాడి చేయడం, నిష్కారణంగా కొట్టడం తగ్గింది. ఈ చారిత్రక పరిణామాల వల్ల పోలీసు అధికారులలో సామాజికస్పృహ పెరిగింది. వారు ఇదివరకటి కంటే ఎక్కువ సౌమ్యంగా ఉంటున్నారు. మర్యాదగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పరిణామమైతే పోలీసులూ, ప్రజాప్రతినిధులూ కుమ్మక్కు కావటం అన్నది ప్రమాదకరమైన పరిణామం.

ఇదీ చదవండి: సూమోటోగా లాయర్ల హత్య కేసు, నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఎంఎల్ఏలకు ఇష్టమైన పోలీసు అధికారులనే వారి ప్రాంతాలలో నియమించడం, ఎంఎల్ఏ దయాదాక్షిణ్యాలపైనే పోలీసు అధికారుల భవితవ్యం ఆధారపడి ఉండటం అన్నది దుష్పరిణామాలకు దారి తీస్తున్నది. ఎంఎల్ఏ చెప్పిన అధికారులను నియమించడం మంచిది కాదంటే వారిని వ్యతిరేకించే పోలీసు అధికారులను నియమించాలని అర్థం కాదు. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలి. పోలీసు అధికారుల నియామకాలూ, బదిలీలూ, ప్రమోషన్లూ అన్నీ ఉన్నతాధికారుల ఇష్టాయిష్టాలపైన ఆధారపడి జరగాలే కానీ రాజకీయ నాయకుల సిఫార్సులపైన ఆధారపడి జరగరాదు. రాజకీయ నాయకులూ, పోలీసు అధికారులూ ఒకటైపోవడంతో అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

పోలీసులూ, ప్రజాప్రతినిధులూ కలసి భూములను కబ్జా చేయడం ఒక వ్యాపకంగా పెట్టుకున్నారు. ఇసుక మాఫియాలు తయారైనాయి. ఎంఎల్ఏలు గనులను స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కలప స్మగ్లింగ్ పెరిగింది.  కడుపుకట్టుకొని పరిపాలిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చెబుతున్నారు కానీ ఎంఎల్ఏలు వారి దారిలో వారు సంపాదిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. దీనికి ప్రధాన కారణం ఎన్నికలు డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావడం. ఇందుకు అన్ని పార్టీలూ బాధ్యత వహించవలసేందే.

దిగువ స్థాయిలో రాజకీయ నాయకులూ, పోలీసు అధికారులూ కలసి చేస్తున్న అక్రమాలూ, అరాచకాలూ ముఖ్యమంత్రికి తెలియవని అనుకోజాలము. ఎంఎల్ఏలు ఎన్నికలలో ఖర్చు పెట్టి గెలిచారు కనుక వారికి కూడా సంపాదించుకునే వెసులుబాటు ఉండాలని ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అనుకంటే చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇది వెంటనే అరికట్టవలసిన ప్రమాదకరమైన ధోరణి. 

ఇదీ చదవండి: న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులు ముగ్గురు అరెస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles