Thursday, March 28, 2024

దళితుల చారిత్రక సత్య దర్శనం ‘ది దళిత్‌ ట్రూత్‌’

 ‘సింహాలు తమ చరిత్రను చెప్పే చరిత్రకారులను కలిగివుండనంతకాలం వేటగాడు చెప్పే కట్టుకథలూ, పిట్టకథలూ ఎల్లవేళలా వేటగాడినే కీర్తిస్తూ అదే చరిత్రగా చెలామణీ అయిపోతుంది.’ ఇది ఆఫ్రికన్‌ సామెత.

భారతదేశంలో దైవ సమ్మతితోనే  కర్మసిద్ధాంతం, వర్ణవ్యవస్థలు ఏర్పడినట్టు శాస్త్రాలు, అధికారాలు, శిక్షాస్మృతులు పుట్టించినప్పటి నుండీ ఈ దేశంలో మెజారిటీ శూద్ర ప్రజలకు బానిసత్యం అనేది ‘సేవకులు’ అనే పర్యాయపదంతో బలవంతంగా రుద్దబడిరది. అప్పటినుండీ వారి శ్రమకు, సేవలకు చరిత్రలో న్యాయమైన స్థానం కాదు కదా కనీస స్థానం లేకుండా పోయింది. మరోవైపు నిచ్చెనమెట్ల అసమానతల వర్ణవ్యవస్థను పరిరక్షించే రాజుల రాజ్య వ్యూహాలు, యుద్దతంత్రాలు, మంత్రుల కుటిలనీతి పన్నాగాలు ఈ దేశంలో పురాణగాధలుగా, ఇతిహాసాలుగా, చరిత్రలుగా జనబాహుళ్యంలోకి చొప్పించబడ్డాయి.

తమ చరిత్రను తామే వెలికితీసే ప్రయత్నం

వర్ణవ్యవస్థ కులవ్యవస్థగా, ఊరు `వాడల విభజనగా రూపాంతరం చెందాక అతిశూద్రులుగా, అస్పృశ్యులుగా మారిన నేటి దళితుల శ్రమ,త్యాగాలూ అయితే నాటి నుంచి నేటివరకూ యధేచ్ఛగా ‘బహిష్కరణ’ జాబితాలనే కొనసాగుతున్నాయి. ఈ చారిత్రక అన్యాయ నేపథ్యంలో నుంచి దళితులనుంచి ఎదిగివస్తున్న  ఉద్యమ నాయకత్వం, మేధావివర్గం తమ చరిత్రను తామే వెలికితీసే కర్తవ్యానికి పూనుకుంటున్నారు. గతంలోను, వర్తమానంలోను దళితుల చరిత్ర, సంస్కృతి, జీవనవిధానం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను కేంద్రీకరించి అధ్యయనం చేస్తున్నారు. సత్యదర్శనంతో తగిన ఆధారాలతో సాధికారంగా ప్రపంచంముందు ఆవిష్కరిస్తున్నారు. అంతేకాదు, జాతీయ భావనలతో, దేశభక్తితో భారతదేశ నిర్మాణంలో  క్రియాశీల భాగస్వామ్యం వహించిన దళితనేతలు సవర్ణుల భావనలో ఇప్పటికీ వారు జాతీయనేతలుగా కాకుండా దళితనేతలుగానే పరిగణించబడుతున్న వివక్షాపూరిత స్వభావ వైనాన్నీ విశ్లేషిస్తున్నారు. ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే సవాళ్ళు, రాజ్యాంగ లక్ష్యాలకు ఎదురయ్యే అడ్డంకులను సమీక్షిస్తూ రాజ్యాంగ రక్షణకు, దేశ సమైఖ్యతకు మార్గ నిర్దేశం చేసే మేధోకృషిని అంకితభావంతో నెరవేరుస్తున్నారు. ఈ పరంపర నుంచి మరో గొప్ప ముందడుగుగా వస్తున్నదే ‘ది దళిత్‌ ట్రూత్‌’ పుస్తకం.

‘ది దళిత్‌ ట్రూత్‌’ లోపలి అంశాలకు వెళ్ళేముందు ఈ సంకలనం నేపథ్యాన్ని తెలుసుకోవాలి. 75 ఏళ్ళ భారత స్వాతంత్య్ర ప్రస్థానం వెలుగునీడలు, భారతరాజ్యాంగం లక్ష్యాల వెలుగులో నేడు దేశం ఆలోచించాల్సిన కీలక అంశాలపై మేధోమధనం చేయాలని, భవిష్యత్తులో భారత రాజ్యాంగానికి, దాని లక్ష్యాలకు ఎదురయ్యే సవాళ్ళను అధికమించేందుకు మార్గనిర్దేశం చేసే విధానాలను, కార్యాచరణలను కొన్ని సంకనాల రూపంలో ముద్రించాలని  ‘సమ్రుద్ద భారత్‌ ఫౌండేషన్‌ సంస్థ’ భావించింది. ఈ ఆలోచనలో  భాగంగా  ‘పెంగ్విన్‌ రేండమ్‌ హౌస్‌ ఇండియా’తో కలిసి ‘ విజన్‌ ఫర్‌ ఎ నేషన్‌ `‘రీ ధింకింగ్‌ ఇండియా’ పేరుతో కొన్ని కీలక అంశాలపై దేశంలోని అనేక మంది గుర్తింపు పొందిన ప్రముఖ మేధావుల భాగస్వామ్యంతో ,రచనలతో ఇంగ్లీషులో 14 పుస్తకాలను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కృషిలో ఇప్పటికే ఏడు పుస్తకాలు ప్రచురణ పూర్తయి పాఠకుల ముందుకు వచ్చాయి. ఎనిమిదవ సంకలనంగా ‘ది దళిత్‌ ట్రూత్‌’ వస్తోంది.

‘ది దళిత్‌ ట్రూత్‌’ సంకలనాన్ని ఎడిట్‌ చేసే బాధ్యత మాజీ ఐ.ఎ.ఎస్‌ అధికారి, బహుజన మేధావి, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనార్టీ విభాగాల కో ఆర్డినేటర్‌ కొప్పుల రాజుకి దక్కింది.

తెలుగుసమాజంతోపాటు దేశం గర్వించదగిన ప్రపంచస్థాయి మానవీయ కవులు, పద్మభూషణులు, కళాప్రపూర్ణ బిరుదాంకితులు గుఱ్ఱం జాషువా మరియు బోయిభీమన్నలకు ఈ ఇంగ్లీషు సంకాలనాన్ని  అంకితమివ్వడం ఎంతో సముచితంగావుంది.

13మంది దళిత మేధావుల రచనలు

దళిత సమాజ హితంకోసం అంకితభావంతో పనిచేస్తున్న 13 మంది ప్రముఖ దళిత మేధావుల,  ఉద్యమ నేతల, పరిశోధకుల వ్యాసాలు ఇందులో ఉన్నాయి. 1)యు.జి.సి.మాజీ చైర్మన్‌,ఆర్దికవేత్త,పద్మశ్రీ, ప్రొ.సుఖదేవ్‌ ధొరాట్‌, 2) ఐ.ఎ.ఎస్‌.అధికారి,‘అంబేద్కర్‌,గాంధీ అండ్‌ పటేల్‌: దిమేకింగ్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎలక్టోరల్‌ సిస్టమ్‌’ పుస్తక రచయిత రాజశేఖర్‌ ఉండ్రు, 3) సుప్రీంకోర్టు న్యాయవాది, మానవహక్కులనేత కిరూబా మునుసామి, 4) ‘కాస్ట్‌ మేటర్స్‌’ (బెస్ట్‌సెల్లర్‌)పుస్తక రచయిత, సూరజ్‌ యంగ్డే, 5)ఆర్‌.ఎస్‌.ఎస్‌.పూర్వ కార్యకర్త, పాత్రికేయుడు, ‘ఐ కుడ్‌ నాట్‌ బి హిందూ’ పుస్తక రచయిత భన్వర్‌ మేఘవంశీ, 6) జి.బి.పంత్‌ సోషల్‌ సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌,అలహాబాద్‌, ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ హిందూత్య’ పుస్తక రచయిత బద్రి నారాయన్‌, 7) గుజరాత్‌ దళిత ఉద్యమనేత, న్యాయవాది, ఎమ్మెల్యే జిగ్నేష్‌మేవాని, 8) ‘దళిత్‌ ఎసర్షన్‌ అండ్‌ ది అన్‌ఫినిష్డ్‌ డెమోక్రటిక్‌ రివల్యూషన్‌’ పుస్తక రచయిత ప్రొ.సుధాపాయ్‌, 9) ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత పా.రంజిత్‌, 10) మాజీ ఐ.పి.ఎస్‌.అధికారి, బిఎస్పీ తెలంగాణ నాయకుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, 11) కర్నాటక కాంగ్రెస్‌నేత,మాజీమంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే, 12) ఎస్‌.ఓ.ఏ.ఎస్‌, యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌లో పరిశోధకుడు నీరజ్‌ షెట్యే,.13).సీనియర్‌ ఐ.ఎ.ఎస్‌.అధికారి, హార్వర్డ్‌ యూనివర్శిటీలో పరిశోధకుడు బుడితి రాజశేఖర్‌.ల వ్యాసాలు ఈ సంకలనంలో చోటుచేసుకున్నాయి.

ఈ సంకలనంలోని ప్రతివ్యాసం ఒక పరిశోధనాగ్రంధంగా పరిగణించవచ్చు. రచయితలు పేర్కొన్న ప్రతి అభిప్రాయానికీ తగిన ఆధారాలను, రిఫరెన్స్‌లను ఇవ్వడం మూలంగా ఈ పుస్తకానికి  ‘ది దళిత్‌ ట్రూత్‌’ శీర్షిక వందకు వందశాతం సరైనది మాత్రమేకాదు సాధికారికమైనదికూడా. ఈ సంకలనం నేటి చరిత్ర పరిశోధకులకు, దేశభవిష్యత్‌ విధాన నిర్ణేతలకు, రాజకీయపార్టీలకు దళితుల దృష్టికోణంపై స్పష్టమైన మార్గనిర్దేశంగా నిలుస్తుందనడంలో సందేహంలేదు.

ఈ పుస్తకానికి కె.రాజు రాసిన పరిచయవ్యాసం దళితుల అన్యాయాలకు సంబంధించి  భాదాతప్త భావోద్వేగ ప్రవాహ దృశ్యచిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు దేశనిర్మాణంలో దళితుల భాగస్వామ్యం సత్యదర్శనమై ఉద్వేగంతో పిడికిలి బిగించి ‘సత్యమేవజయతే’ అని నినదించేలా చేస్తుంది. కె.రాజు వ్యాసంలోని  కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను.

ఝాన్సీబాయి సరే జల్కరీబాయి సంగతేమిటి?

తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామంగా భావించే 1857  సిపాయిల తిరుగుబాటులో సమరయోధుడు మంగల్‌పాండే గురించి లిఖితమైన చరిత్ర నాడు పాండేకు స్పూర్తినిచ్చిన దళితుడైన మతాదిన్‌ భాంగీ గురించి  ఎక్కడా ప్రస్తావన లేదు ఎందుకని ? తొలిస్వాతంత్య్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రాణత్యాగం చేసిన దళిత దంపతులు ఉదాదేవి, మక్కా పాశీల గురించి చరిత్ర రచనల్లో ఒకవాక్యంకూడా చోటుదక్కకపోవడానికి కారణం ఏమిటి ? అలాగే 1857 పోరాటంలో బ్రిటిష్‌వారితో పోరాడిన జాన్షీ లక్ష్మీభాయి గురించి సుపరిచితమైన చరిత్ర, జాన్షీ రాజ్యంలో మహిళా సైనిక దళ నేతగా ఎదిగి యుధ్ద నైపుణ్యాలు నేర్చుకుని  కీలకసమయంలో లక్ష్మీభాయి స్థానంలో తానే బ్రిటిష్‌వారితో యుద్దంచేసి అమరత్వం పొందిన యోధురాలు దళిత మహిళ జల్కరీబాయికి చరిత్రలో దక్కిన స్థానం ఎంత?  ఇలా స్వాతంత్య్ర పోరాట సంగ్రామంలో దళితుల భాగస్వామ్య చరిత్రలు మరెన్నో ఇప్పుడిప్పుడే వెలికి వస్తున్నాయని కె.రాజు ప్రస్తావించారు. అలాగే స్వాతంత్రానంతరం దేశానికి సేవలందించిన కొందరు ముఖ్య దళితనేతల సేవలనూ గుర్తుచేసారు.

రాజ్యాంగ నిర్మాణ సభలో 15 మంది దళిత మహిళలు

 భారత రాజ్యాంగ నిర్మాణ సభకు ఎంపికైన 15 మంది మహిళల్లో దేశంలోనే తొలి దళిత మహిళా గ్రాడ్యుయేట్‌ అయిన దాక్షాయని వెలుయుధాన్‌ ఒకరు. గాంధేయవాదిగా ఉంటూనే దళితుల,మహిళల  సమస్యల ప్రస్తావన వచ్చినప్పుడు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌కి అండగా నిలిచిన దాక్షాయని సేవలు ఆధునిక భారత నిర్మాణంలో భాగమయ్యాయి.కానీ మహిళానేతల జాబితాలో దాక్షాయనికి స్థానం కనిపించదు.

డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సేవల గురించి, త్యాగం గురించీ చెప్పనక్కర్లేదు. ఆధునిక భారత చరిత్రలో దళితులు,ఆదివాసులు, బలహీనవర్గాలు,మహిళల హక్కులకోసం రాజీలేని పోరాటం చేసిన యోధుడు. రాజ్యాంగ రచనంలో అగ్రగామి పాత్ర పోషించిన మహామేధావి. ప్రజాస్వామిక మేధావిగా దేశంలోనేకాదు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్న మహాదార్శినికుడు. సామాజికన్యాయానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా మారిన ఆరాధ్యుడు. దేశం గర్వించదగిన అనేకమంది గొప్ప అగ్రనేతల్లో అంబేద్కర్‌ స్థానం ప్రత్యేకమైనది.

కీలకనేత బాబూజగజ్జీవన్ రామ్

అదేవిధంగా బాబూజగజ్జీవన్‌రామ్‌ దేశ అగ్రనేతల్లో మరో కీలకనేత. బీహార్‌నుంచి వచ్చి దేశరాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఎదిగిన దళిత నేత. సమర్ధ పరిపాలనాదక్షుడు. దేశంలో ఆహార సంక్షోభం తలెత్తినప్పుడు వ్యవసాయమంత్రిగా వ్యవసాయవిప్లవ చర్యలు చేపట్టి దేశాన్ని అన్నపూర్ణగా మార్చిన మార్తదర్శి. పాకిస్తాన్‌, ఇండియా యుద్ద సమయంలో (1971) రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నెరవేర్చి దేశాన్ని గెలిపించిన ధీశాలి. దేశానికి నిస్వార్దమైన సేవలందించిన వారిలో జగజ్జీవన్‌రామ్‌స్థానం విస్మరించరానిది.

దేశంలోనే దళితవర్గం నుంచి తొలి ముఖ్యమంత్రి గా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టిన దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయితీ పరుడిగా చరిత్రలో నిలిచాడు. జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేసి పేదలకు సంక్షేమాన్ని అందించే అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మార్గదర్శి. వృద్ధులకు పించను పథకాన్ని ప్రవేశపెట్టిన మానవతావాది. మండల్‌ కమిషన్‌ రాకముందే బలహీనవర్గాలకు విద్యా,ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలుచేసిన గొప్ప సామాజిక సంస్కరణవాది. ఇలా స్వాతంత్య్ర పోరాటంలోనూ, రాజ్యాంగ నిర్మాణంలోను, స్వాతంత్య్రానంతర దేశ పురోభివృద్ధిలోను జాతీయ భావాలతో సేవలందించిన మహోన్నతులైన దళితనేతలు,మేధావులు అనేకమంది వున్నారనేది దాచేస్తే దాగని సత్యం. దేశంలో ఏమూలకువెళ్ళినా దళిత నివాశాలు ఉన్నచోట డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాలు నేడు కనిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని చేతపట్టి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తున్న చూపుడువేలుతో కనిసించే అంబేద్కర్‌ విగ్రహాలను దళితులు ప్రతిష్టించుకోవడంలో వారు అంబేద్కర్‌తోపాటు రాజ్యాంగాన్ని సొంతం చేసుకుంటున్న సత్యం స్పష్టమౌతుంది. రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ రాజ్యాంగంగా దళితులు భావిస్తున్నారు. దేశానికి ప్రగతిశీల రాజ్యాంగం రూపొండటంలో డా.బి.ఆర్‌.అంబేద్కర్‌కు వెన్నుదన్నుగా కాంగ్రెస్‌పార్టీ నిలిచిందనే చారిత్రక వాస్తవాన్ని గ్రహించిన దళితులు అనేక దశాబ్దాలు కాంగ్రెస్‌పార్టీకి ప్రధాన మద్దతుదార్లుగా నిలిచారు. అలాగే కాంగ్రెస్‌ కూడా దళితులకు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, కీలకమైన కేంద్ర,రాష్ట్ర మంత్రులుగా, గవర్నర్‌లుగా, కీలకస్థానాల్లో ఉన్నత ఉద్యోగులుగా అనేక అవకాశాలను అందించింది.  కానీ నేడు హిందూత్య రాజకీయ వాదుల అబద్దాల వలలో చిక్కుకుంటూ కొన్ని రాష్ట్రాల్లో దళితులు కాంగ్రెస్‌కు దూరం జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రగతిశీల రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకమైన శక్తులవైపు కొందరు దళితులు మొగ్గుతున్న వైన ఆందోళన కలిగిస్తోంది. అయినా రాజ్యాంగ పరిరక్షణకోసమేకాదు దళితుల నిజమైన అభివృద్ధి, విముక్తి  కాంగ్రెస్‌పార్టీ ద్వారానే సాధ్యమౌతుందని నమ్ముతున్నట్లు కె.రాజు తన అభిప్రాయాన్ని వెల్లడిరచారు. కె.రాజు పరిచయవ్యాసంలో ఇంకా అనేక కీలక అంశాలు వున్నాయి.

నేను ముందే ప్రస్తావించినట్టు పుస్తకంలోని వ్యాసాలు ఒక్కొక్కటీ ఒక పరిశోధనాగ్రంధం. సామాజిక,ఆర్ధిక,రాజకీయ రంగాల్లో దళితులపై నేటికీ సాగుతున్న వివక్షతని ఆధారాలతో పట్టిచూపడమేకాదు. నిర్దిష్టమైన పరిష్కార మార్గాలను సూచించాయి. ప్రగతిశీల ప్రజాస్వామిక చరిత్రకారులు,మేధావులు ముఖ్యంగా విద్యావంతులైన దళితుల చేతిలో వుండాల్సిన  సత్య దర్శనం, అక్షర ఆయుధం ‘ది దళిత్‌ ట్రూత్‌’ సంకలనం.

Janga Goutham
Janga Goutham
జంగా గౌతమ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు. సామాజిక న్యాయ ఉద్యమ కార్యకర్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles