Saturday, June 15, 2024

శాస్త్ర పరిశోధనలో నోబెల్ పురస్కార గ్రహీత సి.వి.రామన్

విజ్ఞాన ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ రావడం గగన సదృశం. సర్ సివి రామన్ ఆ ఘనత సాధించారు. అప్పటి వరకూ విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియా వాసిగానూ ఖ్యాతి గడించారు.

సైన్సులో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా చేసి చూపించి, విశ్వ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెప లాడించిన మహా జ్ఞాని చంద్రశేఖర్ వెంకటరామన్ (సి వి రామన్). వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్‌ను శక్తివంతంగా చూపి, అబ్బుర పరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సివి రామన్. వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ అందుకున్న భారతీయ విజ్ఞాన ఖని. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారిన మహోన్నతుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప జేసిన వ్యక్తుల్లో సర్ సీవి రామన్ మొదటివారు.

తండ్రి విశాఖలో అధ్యాపకుడు

సీవీ రామన్ నవంబర్ 7, 1888 తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్ గా పని చేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం అక్కడే జరిగింది. అనంతరం మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి 19 ఏళ్లకు ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఆ సమయం లోనే పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నారు.

శాస్త్రాన్వేష‌ణ‌లో దార్శ‌నికుడు

పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్లడమేమిటి? విదేశీయులే పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రామన్. రామన్ ముందు వరకూ సైన్స్ లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవి. కానీ, రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని, తలమానికమైన పరిశోధన చేసి సైన్సులో దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్ కు నోబెల్ సాధించి పెట్టారు. ‘నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా..’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణ లోనే గడిపిన దార్శనికుడు.

“విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగ శాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి” అంటూ ఆయన చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ‘‘ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. అందుకే విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం’’ అని రామన్ ఎప్పుడూ చెబుతుండే వారు.

రామ‌న్ ఎఫెక్ట్‌ మైలురాయి

మెర్క్యూరీ ల్యాంప్ నుండి ఏకవర్ణ కాంతి తరంగాలను ఒక పారదర్శక యానకం గుండా ప్రసరింపజేస్తే, యానక ధర్మాలపై ఆధారపడి ఆ కాంతిలో కొంత భాగం వివర్తనం చెంది, తక్కువ తరంగ ధైర్ఘ్యం గల కాంతిగా బహిర్గత మౌతుంది. సముద్ర జలంపై ఇదే ప్రక్రియతో నీలి రంగు కాంతి బహిర్గతమవుతుంది. దీనినే ‘రామన్ ఫలితం’ (రామన్ ఎఫెక్ట్) అంటారు. రామన్ జీవితంలో మైలురాయి రామన్ ఎఫెక్ట్  సిద్దాంతం. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని, దాని వల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రుజువు చేశారు రామన్. అప్పటికున్న అరకొర సదుపాయాలతోనే మన దేశ విజ్ఞాన కిరణాలను నలుదిశలా ప్రసరింప జేశారు. సూర్యుని నుంచి వెలువడే తెలుపు వర్ణపు కాంతి వాయువులోని అణువులపై పడి, వాటి ప్రయాణ దిశను మార్చు కుంటాయని తన పరిశోధనల ద్వారా తెలుసుకున్న సి.వి. రామన్ ఓ సిద్ధాంతాన్ని సూత్రీకరించాడు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరావర్తనం చెందుతుందని 1928 సంవత్సరం, ఫిబ్రవరి 28న రామన్ మొట్ట మొదటిసారి ప్రకటించారు.

నైట్‌హుడ్ బిరుదుతో బ్రిట‌న్ సత్కారం

పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింప చేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చు కుంటుంది. ఈ విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు. అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న “రామన్ ఎఫెక్టు” ఆవిష్కరించడం జరిగింది. ఈ పరిశోధనను అభినందిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం 1929 లో “నైట్ హుడ్” బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్య మైనదని, అందులో 200 రూపాయలు కూడా ధర చేయని పరికరాలతో ఆ విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్ ను అభినందించారు.

ఇంగ్లండ్ రాయ‌ల్ సొసైటీలో స‌భ్య‌త్వం

అఖండ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్ కు ఎన్నో గౌరవ డాక్టరేట్లు లభించాయి. 1924 లో ఇంగ్లండ్ “రాయల్ సొసైటీ” సభ్యుడయ్యాడు. 1928 లో రామన్ కు “సర్” బిరుదు దక్కింది. 1947 లో ప్రతిష్ఠాత్మకమైన “ఫ్రాంక్లిన్ మెడల్” లభించింది. తన అనన్య సామాన్య పరిశోధనా సామర్ధ్యంతో ఫిజిక్స్ రంగంలో రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28 నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపు కొంటున్నాం. 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది. రామన్ నూటికి నూరుపాళ్ళూ భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని, పరిశోధనలు జరిపి సైన్సులో శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్ కు నోబెల్ సాధించి పెట్టారాయన.

భారతర‌త్నను చేసిన స్పెక్టోస్కోపీ ప‌రిశోధ‌న

1913 లో సాహిత్యంలో మనదేశం నుండి నోబెల్ బహుమతి పొందిన విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ అనంతరం సైన్సు రంగంలో విజయ ఢంకా మ్రోగించిన అఖండ ప్రజ్ఞాశాలి రామన్ కావడం దేశానికి గర్వకారణం. రామన్ పరిశోధనలు సైన్సులో, పారిశ్రామిక రంగంలోనూ క్రొత్తపుంతలు త్రొక్కడానికి దారితీశాయి. శాస్త్ర రంగంలో రామన్ స్పెక్టో స్కోపీ ఆవిర్భావానికి “భారతరత్న”, 1957 లో “లెనిన్ శాంతి బహుమతి” లభించాయి. కాంతి ప్రసరణపై జరిపిన పరిశోధనలకు “నోబెల్ బహుమతి” లభించింది.  స్వాతంత్య్రం రాగానే రామన్ కు మొట్టమొదటి నేషనల్ ప్రొఫెసర్ గా ప్రభుత్వం నియమించి గౌరవించింది. 1948 లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ గా రిటైరయ్యారు. దృష్టి, కాంతి, ధ్వని, వర్ణాలు, ద్రవాల తలతన్యత, ఖనిజాలు, డైమండ్, క్రిస్టల్ తదితర అంశాలపై పరిశోధనలు జరిపిన సి.వి. రామన్ సుమారు 465 పరిశోధన పత్రాలను వెలువరించాడు. వాటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు వారు సేకరించి భద్రపరిచారు. 1949 లో బెంగుళూరులో రామన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ స్థాపించి, 1970 నవంబరు 27 న ఆయన మరణించే వరకూ, ఆ సంస్థలో పరిశోధనలు జరిపి, మన దేశంలో సైన్సు అభివృద్ధికి మార్గదర్శకు లయ్యారు. 1971 నవంబర్ 21 న సీ.వీ. రామన్ పోస్టేజి స్టాంపును భారత ప్రభుత్వం వెలువరించి ఆ మహా శాస్త్రజ్ఞుడిని గౌరవించింది.

(నవంబర్ 7 … సి.వి.రామన్ జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles