Friday, September 29, 2023

కోవిద్ ‘టీకా’తాత్పర్యం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ను నిలువరించే వ్యాక్సినేషన్ సందడి ఆరంభమైంది. యురోపియన్ యూనియన్ నుండి ఆంధ్రప్రదేశ్ వరకూ హంగామా మొదలైంది. యురోపియన్ యూనియన్ లోని 27దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం నాడు ఆరంభమైంది. మొత్తంగా 4.5కోట్లమందికి తొలిగా టీకా ఇవ్వనున్నారు. అదే విధంగా, అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ ప్రారంభమైంది. గుజరాత్, పంజాబ్, అసోం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు శుభారంభం పలుకుతున్నాయి. కొత్త రకం కరోనాలు వచ్చాయంటూ జనం కంగారు పడుతున్న ఈ వేళల్లో  ఉత్సాహాన్ని నింపే ఈ కార్యక్రమం మంచి శకునంగా భావిద్దాం.

డమ్మీ వ్యాక్సిన్లు

డ్రైరన్ అంటే డమ్మీ వ్యాక్సినేషన్. ఈ డ్రైరన్ పలు దశల్లో సాగనుంది. జిల్లాలవారీగా జరిగే ఈ ప్రక్రియలో 100 మందికి సరిపడా అవసరమైన డమ్మీ వ్యాక్సిన్లను డిపో నుంచి వ్యాక్సినేషన్ కేంద్రానికి తరలిస్తారు. వ్యాక్సిన్ ఇవ్వాలనుకున్న వ్యక్తికి మెసేజ్ పంపిస్తారు. అందులో టీకా ఇచ్చే అధికారి పేరు, సమయం మొదలైన వివరాలు ఉంటాయి. టీకా వేసిన తర్వాత అరగంట సేపు అక్కడ కూర్చోవాలి. దుష్ప్రభావాలు ఏమైనా వచ్చాయా, అని తెలుసుకోడానికి ఈ ఏర్పాటుచేశారు. లోపాలను గుర్తించడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది.

వచ్చే ఏడాది పొడవునా రకరకాల టీకాలు

జనవరి -ఫిబ్రవరి నుంచి వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని ఈ పరిణామాలు చెబుతున్నాయి. 2021సంవత్సరం ఆద్యంతం కొత్త కొత్త వ్యాక్సిన్లు వస్తూనే ఉంటాయని అర్ధమవుతోంది. వైరస్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా, సమర్ధతల ఆధారంగా వ్యాక్సిన్లు మరి కొన్నేళ్లపాటు తయారవుతూనే ఉంటాయని భావించవచ్చు. బహుశా 2022నుండి మాస్కులు ధరించకుండా, ఒకప్పటి సాధారణ జీవన విధానంలోకి  ప్రపంచం వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమవుతున్న ఈ దశలో మొట్టమొదటిగా అత్యవసర సేవా సిబ్బందికే ఇవ్వాలన్నది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది.

ముందుగా టీకాలు వేయించుకోబోతున్న దేశాధిపతులు

అదే సమయంలో, వ్యాక్సిన్లపై ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి ఆయా దేశాల అధిపతులు, రాజకీయ నేతలు, ప్రముఖులు ముందుగా టీకాలు వేయించుకుంటున్నారు.ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చర్యలు అభినందనీయం.జనవరి తొలివారంలో ఆక్సఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని సమాచారం. మొదటగా ఇది యూకె (బ్రిటన్ ) లో వెలుగు చూడనుంది. గతంలో వచ్చిన నివేదికల ప్రకారం దీనికి 70శాతంకు పైగా సమర్ధత ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ భారత్ లో ఇప్పటికే మొదలయ్యాయి. దీనికి సంబంధించిన విశ్లేషణ వచ్చిన తర్వాత బ్రిటన్ నియంత్రణ సంస్థలు తీసుకునే నిర్ణయం కోసం భారత నియంత్రణ సంస్థలు ఎదురుచూస్తున్నాయి.

బ్రిటన్ లో  ఏమి చేస్తే అదే భారత్ లో చేస్తారు

బ్రిటన్ లో పచ్చజెండా ఇస్తే, ఇక్కడ కూడా అత్యవసర వినియోగానికి ద్వారాలు తెరుచుకుంటాయి. జనవరిలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవడానికి మనదేశంలో ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సరియైన దాన్ని ఎంపిక చెయ్యడం కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసింది. మొట్టమొదటగా, ఆక్సఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కే మన దేశంలో తొలి అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఈ శుభపరిణామాలన్నీ ఇలా ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) అధిపతి టెడ్రోస్ అధనామ్ కొత్త భయాలు సృష్టిస్తున్నారు. కరోనా వైరస్ చివరి మహమ్మారి కాదని,భవిష్యత్తులో  ఇటువంటివి మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి శల్యసారథ్యం

ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం ఇదే మొదటిసారి కాదు. ఇతను తొలి నుంచి శల్యసారథ్యమే చేస్తున్నారు. చైనా అధినేత చేతిలో కీలుబొమ్మగా ఈయన పేరు తెచ్చుకున్నాడు. కరోనా వైరస్ చైనా ప్రయోగశాలల్లో పుడితే, ఇటువంటి భయానకమైన వ్యాఖ్యలు ఈయన నోటి నుంచి పుట్టుకోస్తాయనే విమర్శలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఇతని మాటలను పక్కన పెడితే, ప్రపంచ దేశాలు భవిష్యత్తు ప్రమాదాల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వాతావరణాన్ని కాలుష్య రహితంగా ఉంచడం మొదటి అవసరం. పశు సంరక్షణ కూడా అంతే ప్రధానం.

ప్రకృతిని కాపాడుకోవడం పరమావధి

అంటు వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. ఇన్ని కోట్ల జీవరాసులు -మనిషి -ప్రకృతి మధ్య సహజీవనంలో సమతుల్యత సాధించడం ఎంతో అవసరమని పర్యావరణ శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ళ నుండి గగ్గోలు పెడుతున్నారు. వారి మాటలను పెడచెవిన పెట్టడం వల్లనే, నేటి మానవాళికి కరోనా వైరస్ రూపంలో ఇంత పెద్ద కష్టం వచ్చింది. ఇప్పటికైనా, గురుతెరిగి మెలిగితే మంచిది.

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles