Tuesday, April 16, 2024

కాంగ్రెస్ కి రాహుల్-ప్రియాంక సారథ్యం

  • అనధికారికంగా పిల్లలకు పగ్గాలు అప్పజెప్పిన సోనియా
  • విధేయత, విజయావకాశాలు ప్రధానం
  • పాతతరం నాయకుల పట్ల వైముఖ్యం
  • బయటి నుంచి వచ్చినవైనా గెలుపు గుర్రాలకు పట్టం

కాంగ్రెస్ లో సోనియాగాంధీ శకం దాదాపుగా ముగిసింది. ఆమె తన కుటుంబ సంస్థ కాంగ్రెస్ పార్టీని పిల్లల చేతుల్లో పెట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు కాంగ్రెస్ ను ఇప్పుడు నడుపుతున్నారు. సోనియాగాంధీ అహ్మద్ పటేల్ సహకారంతో కాంగ్రెస్ లో సీనియర్ నాయకులను ఆదిరిస్తూ, వారిని సంప్రదిస్తూ, వారిని బుజ్జగిస్తూ, సమన్వయం చేస్తూ 1998 నుంచి పార్టీనకి సారథ్యం వహించారు. అదే వైఖరిలో ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ అలయెన్స్ (యూపీఏ)ను కూర్చి, పదేళ్ళపాటు నడిపించారు.  కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో సోనియాగాంధీ ఉన్నంతకాలం ఇంతకు పూర్వం ఎవ్వరూ లేరు. ఇటలీలో పుట్టి, ఇండియాలో మెట్టిన సోనియాకు ఇటువంటి అవకాశం రావడం రాజీవ్ గాంధీ సతీమణి కావడం వల్లనే.

Also read: రేవంత్ బాటలోనే సిద్ధూ నియామకం

రాహుల్ గాంధీ 2007లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థాగత ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పాలని ప్రయత్నించారు. కొంతకాలం ఆ దిశగా పని చేసి సహచరులు సహకరించకపోవడంతో విరమించుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ లో ఎన్నికల సంస్కారం అడుగంటి నామినేషన్ సంస్కృతి తిష్ఠవేసింది. 2013లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐదారేళ్ళలో యాభైమంది నాయకులను దేశవ్యాప్తంగా తయారు చేయాలనీ, ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే సామర్థ్యం కలిగిన నాయకులు కనీసం ఐదారుగురైనా తయారు కావాలని అనేవారు. అవన్నీ పగటి కలలుగానే మిగిలిపోయాయి. ఆశయాలే కానీ ఆచరణకు నోచుకోలేదు. 2014లో పార్టీ ఓడిపోయింది. 2019లోనూ చిత్తుగా ఓడిపోయింది. 52 మంది ఎంపీలు మాత్రమే కాంగ్రెస్ టిక్కెట్టు మీద గెలుపొందారు. పార్టీ దారుణంగా పరాజయం చెందినందుకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. తిరిగి తల్లి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారే కానీ కొత్తవారిని ఎవ్వరినీ అధ్యక్ష స్థానంలో నియమించలేదు.

నెహ్రూ-గాంధీ పరివారం

వరుస పరాజయాలతో విసిగి వేసారిన అనుభవజ్ఞులైన నాయకులు కదిలారు. పార్టీని సమర్థంగా, పారదర్శకంగా నడిపించాలంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు 23 మంది సోనియాగాంధీకి లేఖ రాసిన తర్వాత సమర్థ నాయకత్వం కానీ పారదర్శకత్వం కానీ పెరగలేదు కానీ గాంధీ కుటుంబంలో సమీకరణలు మారిపోయాయి. అహ్మద్ పటేల్ మరణంతో సోనియాగాంధీకి తగిన సలహాలు ఇస్తూ, తనకూ, సీనియర్ నాయకులకూ మధ్య వారిధిగా ఉండే నాయకులు ఎవ్వరూ లేకపోయారు. సీనియర్లు దూరం కావడం, అహ్మద్ పటేల్ మృతి చెందడంతో కాంగ్రెస్ లో ఏకాకినైనాననే భావన సోనియాగాంధీని విపరీతంగా కుంగదీసింది. ఆమె వయస్సు పెరుగుతోంది. ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. పిల్లల వైఖరి తన వైఖరికి భిన్నంగా ఉంది. అందుకని నిర్ణయాలన్నీ వారిద్దరికే వదిలేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం అంటే రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ.

Also read: పంజాబ్ కథ మళ్ళీ మొదటికి

అన్నాచెల్లెలే అధిష్ఠానం

అన్నాచెల్లెల జమానా వచ్చింది. వీరికి సీనియర్ నాయకుల మీద నమ్మకం లేదు. వారంటే గౌరవం ఉన్నా వారి సామర్థ్యం పట్ల విశ్వాసం లేదు. వారు ప్రతిబంధకంగా కనిపిస్తున్నారు. రెండు ఎన్నికలలో పార్టీ ఓటమిపాలు కావడానికి వారే ప్రధాన కారణమనే అభిప్రాయం అన్నాచెల్లెలికి ఉంది. అందుకని కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. బయటినుంచి కొత్త ప్రతిభావంతులను తెచ్చుకొని వారికి రాష్ట్రాలలో నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పుతున్నారు. ఆ విధంగా వచ్చినవారే మహారాష్ట్రలో నానా పటోలే, తెలంగాణలో రేవంత్ రెడ్డి, పంజాబ్ లో నవజోత్ సిద్ధూ. సీనియర్లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టే కార్యక్రమానికి అన్నాచెల్లెలూ శ్రీకారం చుట్టారు. పార్టీ భావజాలానికి విధేయులుగా ఉన్నాం కనుక తమకు పార్టీలో గౌరవప్రదమైన స్థానం ఉంటుందని సీనియర్ నాయకులు భావిస్తే వారు తప్పులో కాలేస్తున్నట్టే. మారుతున్న సమీకరణాలనూ, పరిస్థితులనూ గమనించకపోతే దెబ్బతింటారు.

పంజాబ్ ఉదాహరణ

తాజా పరిణామాలు పంజాబ్ లో సంభవించాయి కనుక పంజాబ్ లో పరిస్థితులను గమనిద్దాం. కెప్టెన్ అమరేందర్ సింగ్, రాజీవ్ గాంధీ డెహ్రాడూన్ స్కూల్ లో సహాధ్యాయులు. రాజీవ్ కి కెప్టెన్ బాగా సన్నిహితుడు. ఆయనకూ, సిద్ధూకూ మధ్య ఒక తరం అంతరం ఉంది. సిద్ధూకి 57 ఏళ్ళయితే అమరేందర్ కు 79. పంజాబ్ లో ప్రతిపక్షాల పరిస్థితి ఏమంత సంతోషకరంగా లేదు. బీజేపీ అంతంతమాత్రమే. బీజేపీకీ, అకాలీ దళ్ కూ మధ్య అంతరం పెరిగింది. రైతుల ఉద్యమం కారణంగా రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. బీజేపీ కంటే అకాలీ దళ్ పంజాబ్ లో ఎన్నో రెట్లు శక్తిమంతమైనది. అమరేందర్, సిద్ధూలు విభేదాలను అధిగమించి, కలసి పని చేస్తే కాంగ్రెస్ పార్టీకి 2022 ఎన్నికలలో తిరుగు ఉండదు. ఒక వేళ అమరేందర్ సింగ్ అలిగి పార్టీని చీలిస్తే రాహుల్, ప్రియాంకలు సిద్ధూ పక్షాన నిలబడి అతడి నాయకత్వంలో పార్టీని గెలిపించేందుకు ప్రయత్నిస్తారు. సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిని చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కనుక పంజాబ్ లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవి వేరొకరికి ఇవ్వడానికి అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించకపోవచ్చుననే అనుమానం పీడిస్తున్న కారణంగానే సిద్ధూ కాంగ్రెస్ ను పట్టుకొని వెళ్ళాడారు. తనకు అనుకూలమైన ఫలితం సాధించారు. సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా చేయడంలో రాహుల్, ప్రియాంకలు ప్రమాదపుటంచుల్లో విన్యాసం చేశారు. అమరేందర్ సింగ్ పార్టీని చీలిస్తే ఆమ్ ఆద్మీపార్టీకి విజయావకాశాలు ఉండవచ్చు. లేదా నాలుగు పార్టీల మధ్య అసంబ్లీ స్థానాలు చీలిపోయి ఏ పార్టీకి మెజారిటీ రాని స్థితి రావచ్చు. కాంగ్రెస్ ఖాయంగా గెలిచే అవకాశం ఉన్న పంజాబ్ కాంగ్రెస్ హస్తం నుంచి జారిపోవచ్చు. అయినా సరే, తమ పంతం నెగ్గడం కోసం, తమ నూతన విధానాన్ని చాటడం కోసం పంజాబ్ ను త్యాగం చేయడానికైనా అన్నాచెల్లెలు సిద్ధంగా ఉన్నారు.

సిద్ధూ, అమరేందర్ సింగ్

సిద్ధూ ఆవేశపరుడు

పైగా అమరేందర్ సింగ్ తో పోల్చితే ప్రాబల్యం లో కానీ, వ్యూహరచనలో కానీ అనుభవంలో కానీ సిద్ధూ సరితూగలేరు. 2017లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకోవద్దనీ, పార్టీని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటాననీ అమరేందర్ సింగ్ రాహుల్ గాంధీని ఒప్పించారు. అన్నట్టుగానే ఎన్నికలలో గెలిచారు. అప్పటి నుంచి తనకు తోచిన విధంగా పరిపాలన సాగిస్తూ వచ్చారు. అధిఫ్ఠానవర్గం ఆదేశించడం, పంజాబ్ ముఖ్యమంత్రి శిరసావహించడం అనేది ఏమీ లేదు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహరించినట్టే 2017లో అమరేందర్ సింగ్ చేశారు. 2009లో టిక్కెట్ల పంపిణీ విషయంలో దిల్లీలో అధిష్ఠానం సమక్షంలో చర్చ జరిగినప్పుడు ఆ విషయం తనకు వదిలి వేయాలనీ, జోక్యం చేసుకుంటానని అధిష్టానం పట్టుబడితే తాను నిష్క్రమిస్తాననీ వైఎస్ స్పష్టంగా చెప్పారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే సమస్యలేదని కూడా తేల్చి చెప్పారు. ఒక ముఖ్యమంత్రి అధిష్ఠానంతో ఇంత నిర్మొగమాటంగా మాట్లాడటం సహజంగానే సోనియాగాంధీకి నచ్చలేదు. ఎన్నికలలో అసెంబ్లీలో మెజారిటీ (బొటాబొటిగానైనా) సాధించి, లోక్ సభలో 33 స్థానాలు అప్పగించిన వైఎస్ అంటే సోనియాకు అగ్రహంగానే ఉండేది. విజయం సాధించిన అనంతరం దిల్లీ వెడితే వీరుడికి తగిన స్వాగతం లభిస్తుందని ఊహించిన వైఎస్ సోనియాగాంధీని కలవటానికి నిరీక్షించవలసి వచ్చింది. స్థానిక నాయకులు స్థిరబడి బలబడటం ఇష్టం ఉండదు కనుకనే అమరేందర్ సింగ్ మాట ఈ సారి రాహుల్ గాంధీ వినదలచుకోలేదు. ఆ క్రమంలో పంజాబ్ లో ఓడిపోయినా పర్వాలేదు కానీ సామంతులను ఎదగనిచ్చే సమస్య లేదు. ఈ విషయంలో నాయనమ్మ ఇందిరాగాంధీ పంథాని రాహుల్, ప్రియాంక ఎంచుకున్నారని అనుకోవాలి. ‘జో హుకుం’ అని విధేయత ప్రకటించినవారికే పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

సిద్ధూ గతాన్ని చూస్తే ఎన్నికలయ్యే వరకూ కాంగ్రెస్ అధిష్ఠానవర్గం మాట తు.చ. తప్పకుండా వింటాడు. ఒక వేళ గెలిచి రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు చేతిలోకి వచ్చిన తర్వాత అంత విధేయుడుగా ఉంటాడా అన్నది అనుమానమే. కెప్టెన్ కు ఉన్నంత అనుభవం సిద్ధూకు లేదు. అమరేందర్ లాగానే తాను జాట్ సిక్కును కనుక ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ముఠాలతో గందరగోళంగా  ఉండే పంజాబ్ కాంగ్రెస్ ను సంబాళించడం అంటే మాటలు కాదు. ఎంతో సహనం ఉండాలి. సిద్ధూకు ఓపిక తక్కువ. ఉద్రేకం ఎక్కువ. ఆచితూచ మాట్లాడే స్వభావం కాదు. ఆగకుండా మాట్లాడుతూ ఉండటం అలవాటు. క్రీడా మైదానంలో, టీవీ షోలలో, ఎన్నికల ప్రచార సభలలో ఈ మనస్తత్వం సరిపోతుంది కానీ ముఖ్యమంత్రిగా అందరినీ కలుపుకొని పోవాల్సిన వ్యక్తికి సరిపోదు. వచ్చే ఎన్నికలలో అమరేందర్ సింగ్ సహకరించకపోతే, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఓట్లు చీలితే శిరోమణి అకాలీ దళ్ గెలుపొందినా ఆశ్చర్యం లేదు. ఎన్నో పరాజయాలను చవిచూసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి మరో ఓటమి కలిగించే నష్టం ఏమీ లేదు. అందుకే పని గట్టుకొని పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం సృష్టించారు. తమ పంతం గెలవటం ప్రధానం. తమ ఆధిక్యాన్ని చాటడం ముఖ్యం.

Also read: కాంగ్రెస్ లో చేరనున్న ఎన్నికల మాంత్రికుడు పీకే?

బీజేపీ పోకడలు

పాతవారిని తోసిరాజని, కొత్తవారికి పట్టం కట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో బీజేపీ లక్షణాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న అధిష్ఠానం సంస్కృతి బీజేపీలో పెరుగుతోంది. ఎట్లాగో చూద్దాం. గుజరాత్ లో బయటి నుంచి వచ్చిన పటేల్ రిజర్వేషన్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ ను చేరదీశారు. 2019 ఎన్నికలలో అతడు పోటీ చేయకపోయినా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశాడు. 11 జులై 2020 న హార్దిక్ పటేల్ ను గుజరాత్ పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా సోనియాగాంధీ నియమించారు.  ఇప్పుడు అతడి మీద గురి తగ్గింది కానీ కాంగ్రెస్ లోని సీనియర్లను కాదని అతడికి ఉన్నత పదవి ఇవ్వడాన్ని నిరసించేవారు చాలామంది ఉన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ లో వరిష్ఠ నాయకులు అనేకమంది ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఆరోగ్యంగా ఉన్నారు. ముఖ్యమంత్రులు కాదగినవారూ ఉన్నారు. వాందరినీ వదిలేసి నానా పటోలే అనే వివాదాస్పదుడిని తెచ్చి నెత్తికెక్కించుకున్నారు. పటోలే 2018 వరకూ బీజేపీ నాయకుడు. రెండేళ్ళ కిందట పార్టీ ఫిరాయించి తమ పార్టీలో చేరిన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించారు. మొదటి నుంచీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు నిరుత్సాహానికి లోనుకావడం సహజం. కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పక్కన పెట్టి శివకుమార్ కు ప్రాధాన్యం ఇచ్చారు. 72 ఏళ్ళ సిద్ధరామయ్య ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడు. పలుకుబడి కలిగిన వ్యక్తి.  59 ఏళ్ళ శివకుమార్ దేశంలో సంపన్న రాజకీయ నాయకులలో ఒకరు. అహ్మద్ పటేల్ కు దగ్గర. అహ్మద్ పటేల్ రాజ్యసభకు పోటీ చేసినప్పడు గుజరాత్ కు చెందిన 42మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలను బెంగళూరులో విడిది చేయించి వారిని బీజేపీకి అందకుండా కాపాడిన వ్యక్తి శివకుమార్. సిద్ధరామయ్యకు సోనియాతో పరిచయం, అవగాహన ఉన్నాయి కానీ రాహుల్ తో అంత సాన్నిహిత్యం లేదు.  శివకుమార్ రాహుల్ కి దగ్గర. శివకుమార్ నీ, సిద్ధరామయ్యనీ సమైక్యంగా పార్టీ కోసం పని చేయమని చెప్పానని కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడూ, ఏసీసీ ప్రవక్త రణదీప్ సింగ్ సూర్జీవాల్ అన్నారు. కానీ అది జరిగే పని కాదు.

Also read: నదీజలాల నిర్వహణ కేంద్రం చేతుల్లోకి

రేవంత్ రెడ్డి నియామకం నేపథ్యం

తెలంగాణలో చాలామంది సీనియర్  కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మొదటి నుంచీ కాంగ్రెస్ లోనే అంకితభావంతో పని చేస్తున్నభట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వంటి నాయకులు కొందరున్నారు. రెండు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన జానారెడ్డి, జీవన్ రెడ్డి వంటి నాయకులు ఉన్నారు. వీరందరినీ కాదని రేవంత్ రెడ్డికి పీసీసీ పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీ నాయకుడు. ఆర్ఎస్ఎస్ శాఖలకు హాజరైన వ్యక్తి.  ఆ తర్వాత టీడీపీలో ముఖ్యనాయకుడు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయకుడికి అత్యంత సన్నిహితుడు. శాసనమండలి ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడంకోసం టీఆర్ఎస్ ఎంఎల్ఏకి నగదు చెల్లిస్తూ కెమెరాకి దొరికిపోయిన వ్యక్తి. న్యాయస్థానంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడు. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా నాయుడితో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. ధైర్యవంతుడు. చైతన్యశీలి. వ్యూహకర్త. కార్యసాధకుడు. తక్కిన నాయకులకంటే బలమైన నాయకత్వాన్ని అందించే సామర్థ్యం ఉన్న నేత. గెలుపు గుర్రాలపైనే పందెం కాయాలన్న రాహుల్-ప్రియాంక ద్వయం ధోరణికి తగిన నాయకుడు రేవంత్. అదే విధంగా కేరళలో ఊమన్ చాందీ, రమేశ్ చన్నితలా మధ్య విభేదాలు ఉంటే ఇద్దరినీ పక్కన పెట్టి మూడో వ్యక్తి కె సుధాకరణ్ కి పట్టం కట్టారు. ఇవన్నీ సోనియా నిర్ణయాలు కావు. రాహుల్, ప్రియాంకలవే. సోనియా అధ్యక్ష  పదవిలో ఉన్నారు కనుక ఆమె సంతకం చేస్తున్నారు. అంతే.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలటె తె రాహుల్ గాంధీ

ఇతర సీనియర్లదీ అమరేందర్ గతే

అమరేందర్ సింగ్ బాటలోనే అశోక్ గెల్హాట్ ప్రయాణం ఉంటుంది. ఈ సారి ముఖ్యమంత్రి పదవి సచిన్ పైలట్ కే నని ఇటీవల తిరుగుబాటు చేసినప్పుడే అతడికి సోదరీసోదరులు మాట ఇచ్చారు. వయస్సు మీరిన అశోక్ గెల్హాట్ ఈ టరమ్ తో సంతృప్తి చెంది పీసీసీ పగ్గాలు ఎన్నికల వేళ సచిన్ కి అప్పగించాల్సిందే. హరియాణాలో భూపిందర్ సింగ్ హుడా కానీ, మధ్య ప్రదేశ్ లో దిగ్వజయ్ సింగ్ కానీ, జమ్మూ-కశ్మీర్ లో గులాంనబీ ఆజాద్ కానీ, దిల్లీలో కపిల్ శిబ్బల్ కానీ విరామం తీసుకోవడం గురించి ఆలోచించవలసిందే. రాహుల్-ప్రియాంక కాంగ్రెస్ లో వారికి భవిష్యత్తు లేదు.       అవసరమైతే బయటి నుంచి వచ్చినవారికి పట్టం కడతారు కానీ కాంగ్రెస్ లోనే ఉంటూ నాయకులుగా చలామణి అయ్యేవారికి అవకాశాలు ఉండవు. అరవై ఏళ్ళలోపు వారు కొత్త నాయకత్వంతో వ్యవహారం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. వి. హనుమంతరావు (వీహెచ్) వంటి వయసు మీరిన నాయకులు, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీలతో వ్యవహారం చేసినవారు ఇక విరమించుకోవడం ఉత్తమం. వారి మాటకు విలువ లేదు.

బీజేపీలో అధిష్ఠానం

కాంగ్రెస్ పరిణామాలు ఈ విధంగా ఉంటే బీజేపీలో సమష్టి నాయకత్వం స్థానంలో ఇద్దరు నాయకులతో కూడిన అధిష్ఠానం 2014లోనే  ఏర్పడింది. మోదీ, అమిత్ షాలు పార్టీనీ, ప్రభుత్వాన్నీ సంయుక్తంగా  నడుపుతున్నారు. జెపీ నడ్డా మాటవరుసకే పార్టీ అధ్యక్షుడు. అధికారం యావత్తూ ఇద్దరు అధినాయకులదే. వారి మధ్య దాదాపు అన్ని విషయాలలోనూ ఏకాభిప్రాయం ఉంది. ముఖ్యమంత్రులను నియమిస్తున్నారు. నియంత్రిస్తున్నారు. కర్ణాటకలో ఎన్నికల సమయానికి యడ్యూరప్ప స్థానంలో మరో నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చినా ఆశ్చర్యం లేదు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను దిల్లీకి పిలిపించుకొని హితవచనాలు చెప్పి పంపించారు. అస్సాంలో ముఖ్యమంత్రిని సోనోవాలా స్థానంలో హిమంత్ బిశ్వాస్ శర్మను నియమించారు. శాసనసభా పార్టీ సమావేశం కావడం దిగిపోయే ముఖ్యమంత్రి గద్దెనెక్కబోయే ముఖ్యమంత్రి పేరు ప్రతిపాదించడం అంతా కాంగ్రెస్ ఫక్కీలోనే జరిగింది. ఆరు నెలలు సావాసం చేయకపోయినా బీజేపీ సంస్కృతి కాంగ్రెస్ కీ, కాంగ్రెస్ పద్ధతులు బీజేపీ అలవడుతున్నాయి.

Also read: ఆఫ్ఘానిస్థాన్ లో మళ్ళీ తాలిబాన్ పాలనకు రంగం సిద్ధం!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles