Sunday, September 15, 2024

ఉభయ తెలుగు రాష్ట్రాలలో భూసర్వేలు ప్రశంసార్హం

  • భూమి తప్పుడు రికార్డుల సవరణకు సమగ్ర భూ సర్వే, టైటిల్ గ్యారెంటీ చట్టం మంచి పరిష్కారం
  • జనవరి 1 నుండి ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూ సర్వే
  • రెవెన్యూ చట్టాల సంస్కరణల లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాలు

బండారు రామ్మోహనరావు

రెవిన్యూ చట్టాల సంస్కరణల ద్వారా సమగ్ర భూ సర్వే చేయడానికి పూనుకొని, టైటిల్ గ్యారెంటీ చట్టం  తెచ్చే దిశగా పయనిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దానిలో భాగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రికార్డుల నమోదుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆహ్వానించదగ్గవే. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం చాలా మంచిది. కానీ ఇంతటితో చాలదు. సమగ్ర భూ సర్వే  చేసి తప్పుడు రికార్డులను తొలగించి  కొత్తగా సవరించిన  రికార్డులతో  యాజమాన్య హక్కులతో కూడిన పాసుబుక్కులు పంపిణీ చేసినప్పుడు మాత్రమే రైతులకు సరైన న్యాయం చేసినట్లవుతుంది. అక్కడితో ఆగకుండా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నట్లు “టైటిల్ గ్యారెంటీ ఆక్ట్’’ తీసుకువచ్చి భూమి రికార్డులకు చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది.

సమగ్ర భూ సర్వే- ఆంధ్రప్రదేశ్ ఆదర్శం

*ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేయడానికి అంగీకరించింది. దానికి కావలసిన నిధులను కూడా మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ సర్వే కోసం వెయ్యి కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసింది. 2021 జనవరి 1 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర భూసర్వే మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. ఇది భూముల చిక్కుముడులు విప్పడానికి ఒక మంచి ప్రయత్నం గా చెప్పవచ్చును. ఈ విషయంలో కొన్ని  అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న భూమి రికార్డులను బట్టి  వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న భూమి రికార్డుల కంటే 10 శాతం భూమి  రెవెన్యూ రికార్డుల లో ఎక్కువగా నమోదైందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న భూమి కంటే సుమారు  ముప్పై లక్షల ఎకరాలు రెవెన్యూ రికార్డుల  లో ఎక్కువగా నమోదై ఉందని ప్రభుత్వ అంచనా. భూమి పెరిగే ఆస్తి కాదు,ఉన్నంతనే ఉంటుంది. కానీ రికార్డుల లో ఎక్కువగా నమోదు చేశారు. ప్రస్తుతం భూమి సమగ్ర సర్వే తో ఈ అక్రమ రికార్డులు సవరించుతారు. అత్యాధునిక శాస్త్ర విజ్ఞానం తో ఈ భూమి సర్వే చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా సర్వే నెంబర్లు హద్దు రాళ్ళు కూడా  ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ హద్దు రాళ్లను తొలగిస్తే మళ్లీ నిమిషాలలో వాటిని తిరిగి పున:ప్రతిష్ట చేయవచ్చు. దీంతో  ఇతరులు ఎవరైనా భూమిని ఆక్రమించినపుడు వెంటనే కనుక్కోవడానికి వీలవుతుంది. గట్టు పంచాయతీలు, గెట్టు తగాదాలు తగ్గుతాయి. వ్యవసాయేతర ఆస్తులు కూడా ఇలాంటి చట్టబద్ధత కల్పించాలనీ, ఆ దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేయాలనీ  ప్రజలు కోరుకుంటున్నారు.*

తప్పుల తడకగా రెవెన్యూ రికార్డులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 లోనే వ్యవసాయ భూములకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. ఆ పాస్ బుక్ పుస్తకాలలో  ముప్పై శాతం వరకు  తప్పుల తడకగా ఉన్నాయి. ఉన్న విస్తీర్ణం కంటే తక్కువ, లేకపోతే ఎక్కువ విస్తీర్ణం నమోదయ్యింది.  అంతకు ముందే ఉన్న రికార్డులను మాత్రమే అందులో నమోదు చేశారు. దానివల్ల ఇదివరకే అమ్ముకున్న భూములు అమ్ముకున్న వారి పేరుమీద ఉండి పోయాయి. డబ్బులు పెట్టి భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్  చేయించుకున్నా కూడా తమ పేరు మీద  ముటేషన్ చేయించుకోలేదు. అలాంటి వారికి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. అలాగే చాలా గ్రామాలలో ఒక సర్వే నెంబర్లో వారు కబ్జా కలిగివుండి రెవెన్యూ రికార్డుల్లో మరో సర్వే నెంబర్ లో తమ పేరు నమోదై ఉంది. ఇలాంటి అవకతవకలను సమగ్ర సర్వే చేసి అసలైన భూ యజమానులను గుర్తించి వారి పేరు మీద ఆయా సర్వే నెంబర్లు సవరించవలసి ఉంటుంది. కానీ  అది జరగలేదు. ప్రస్తుతం ‘ధరణి’ వెబ్ సైట్ లో కూడా అవే పాత తప్పుడు రికార్డులు మాత్రమే నమోదై ఉన్నాయి,

వ్యవసాయేతర ఆస్తులంటే ఇళ్లు మాత్రమేనా?

*ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి’ వెబ్ సైట్ ద్వారా వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేసింది. కానీ ఇది సమగ్రంగా జరగలేదు. ఆస్తుల వివరాల సేకరణ లో ఇప్పటికి జరిగింది కొంత శాతం మాత్రమే. వ్యవసాయేతర ఆస్తులు మొత్తం నమోదు చేస్తామని  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ప్రకటించారు. కానీ వాస్తవానికి జరిగింది వేరుగా ఉంది. ఆయా పంచాయతీలు పట్టణాలు నగరాలలో ఇల్లిల్లు తిరిగి అధికారులు  వారికి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇచ్చిన సూచనల మేరకు కేవలం ఇంటి నెంబర్లు కలిగిన ఇళ్ల ను మాత్రమే వ్యవసాయేతర భూముల పేరిట నమోదు చేశారు. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు నగర పాలక సంస్థల వద్ద ఇప్పటికే రికార్డు “జియో ట్యాగింగ్” తో సహా సిద్ధంగా ఉన్నాయి. ఈ కొత్త పని వల్ల అదనంగా ఒరిగింది ఏమీ లేదు.  వ్యవసాయేతర ఆస్తులు అంటే కేవలం ఇంటి నెంబర్లు ఉన్న ఇళ్లు మాత్రమే కావు. గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో ఉన్న ఖాళీ ప్లాట్లు కానీ ఇతర అవసరాలకు వాడుతున్న ఖాళీ స్థలాలను కానీ ఇందులో చేర్చలేదు. ప్రతి అంగుళం భూమి విడవకుండా ‘ధరణి’  వెబ్సైట్లో నమోదు చేసి కొత్తగా “మెరూన్ “రంగు కల పాసుబుక్కులు పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ ప్రకటించారు .అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి  వదలకుండా  సర్వే చేస్తామని ఆయన అన్నారు. ఇప్పటికైనా వ్యవసాయేతర ఆస్తులు అనే పేరు మీద ఒక సమగ్ర చట్టం తీసుకువచ్చి వాటిని నమోదు చేయాలి. చట్టంలో లోపాలు ఉండడం వల్ల, అవసరమైన మరికొన్ని చట్టాలు చేయకపోవడం వల్ల ధరణి వెబ్సైట్ మీద కానీ ఇతర ఆస్తుల నమోదు విషయంలో కానీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. న్యాయపరంగా చిక్కులు రాకుండా ఈ చట్టాలను మరింత పకడ్బందీగా చేయవలసి ఉంది. ఈ ఆస్తుల నమోదుకు ఆర్ ఓ ఆర్ చట్టాన్ని సవరించి ధరణి చట్టం తీసుకువచ్చిన విధంగానే వ్యవసాయేతర ఆస్తులను  నమోదు చేయడానికి కూడా ఒక మంచి చట్టం తీసుకురావాలి.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టును తప్పుదారి పట్టించిన అక్రమ ఆస్తిపరులు

ధరణి వెబ్సైట్ కానీ వ్యవసాయ ఇతర  ఆస్తులు నమోదుకాని సరైంది కాదని తమ సొంత ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి తెలిపేది లేదని కొందరు కోర్టుకెక్కారు. ఇది సరైంది కాదు. భూమండలం మీద తమకు ఎంత ఆస్తి ఉందో ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిందే. లేకపోతే వాటిని అక్రమ ఆస్తులు గా పరిగణించాలి. ఆస్తులు కలిగి ఉండటం నేరం కాదు. కానీ బినామీ పేర్ల మీద అక్రమ ఆస్తులు కలిగి ఉండడం తప్పకుండా నేరం అవుతుంది. ఆస్తుల అమ్మకానికీ, కొనుగోళ్ళ వ్యవహారాలు అన్నిటికీ ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి. గోప్యత పేరుమీద కొందరు దొంగలు తాము సంపాదించిన అక్రమ ఆస్తులను  నమోదు చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. దీన్ని ఆసరా చేసుకుని తమ హక్కులకు భంగం కలుగుతుందని మరి కొందరు కోర్టుకెక్కారు. ఇది గమనించకుండా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ పట్టాదారు పాసు బుక్కు లకు ఆధార్ కార్డు అనుసంధానం చేశారు. అలా అనుసంధానం చేసిన కొత్తలో చాలా మంది అక్రమ ఆస్తిపరులు తమ అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందో అని కొందరు అక్రమ సంపాదన చేసిన అధికారులు, రాజకీయ నాయకులు తమ భూములను అమ్ముకుని దాన్ని బంగారం గాను లేక నగదుగా మార్చుకున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికీ తమ వ్యవసాయ భూములకు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోని వారి సంఖ్య 20 నుండి 30 శాతం వరకు ఉంది.

చట్టుబండలైన ప్రభుత్వ ఉద్యోగుల, ప్రజా ప్రతినిధుల ఆస్తుల వెల్లడి చట్టం

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తాము కొత్తగా ఆస్తులు కొన్నా వాటి గురించి ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వివరాలు  ఇవ్వాలనే చట్టం ఉండనే ఉంది. అలాగే చట్టసభలలో రాజకీయ నాయకులు వారి ఆస్తిపాస్తుల వివరాలను ప్రతి సంవత్సరం పార్లమెంటు అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించాల్సిందే. కానీ చాలామంది చట్టసభల సభ్యులు ఆస్తుల వెల్లడి చట్టాన్ని  పాటించడంలేదు. ఉన్న చట్టాలను అతిక్రమించడమే కాకుండా మా ఇష్టం వచ్చినంత సంపాదించుకుంటే ఎవరు అడగవలసిన అవసరం లేదని వీరు కోర్టుల ముందు వాదిస్తున్నారు. ఈ నగ్న సత్యాన్ని కోర్టులు గమనించాలి. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుమీద సమాజంలో దోచుకుని సంపాదించుకునే వారికి ఈ చట్టాలు ఒక వరం కాకూడదు. ఎవరు భూమి కొన్నా అమ్మినా వారి ఆధార్ కార్డు ద్వారా న మోదు చేసి తీరవలసిందే. లేకపోతే ఇప్పుడున్న అవ్యవస్థ అలాగే కొనసాగుతుంది. ఆధార్ కార్డు వాడకాన్ని రిజిస్ట్రేషన్లకు మాత్రమే పరిమితం చేయకుండా ఓటర్ జాబితాలో పేర్లకు కూడా అనుసంధానించాలి .అప్పుడే ఓటరు జాబితాలో తప్పులను అరికట్టడానికి వీలవుతుంది. అలాగే బ్యాంకు అకౌంట్ తెరవడానికి, అన్ని వ్యాపార లావాదేవీలకు కూడా ఆధార్  కార్డును అనుసంధానించాలి.

ఆధార్ కార్డు చట్టబద్ధం చేయాలి

ఆధార్ కార్డు చట్టబద్ధత గురించి మౌలికంగా ప్రశ్నిస్తున్న వారు ఒక విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్ ఫోన్ కంటే మన వ్యక్తిగత జీవిత రహస్యానికి భంగం కలిగించే సాధనం, ఆయుధం మరొకటి లేదు. మన సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఒక బావిలో పడవేసినా మన “లొకేషన్” ఇవాళ ఆధునిక విజ్ఞానం గుర్తుపట్ట కలుగుతుంది. మరి ఆధార్ కార్డు పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసే వారు తమ సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా విడిచి పెడతారా అని ప్రశ్నించుకోవాలి. సెల్ ఫోన్ కంటే ఆధార్ కార్డు ప్రమాదం కాదు. వ్యక్తిగత భద్రత గోప్యత పేరుమీద అక్రమార్కులను రక్షించే బదులు కోర్టులు కూడా దీనిలోని విధివిధానాలు పకడ్బందీగా రూపొందించే సలహాలు సూచనలు ప్రభుత్వాలకు ఇవ్వాలి. కానీ గోప్యత పేరుతో అక్రమార్కులకు కోర్టులు కొమ్ము కాయకూడదు. ఇప్పటికే ఆధార్ కార్డు చట్టబద్ధతను ప్రశ్నించిన కోర్టులు చాలా విషయాలలో ఆధార్ కార్డును ఉపయోగించకూడదని తీర్పు ఇచ్చింది. కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలని కోర్టు అంది. దీని వల్ల దేశ వ్యాప్తంగా  ప్రజాపంపిణీ వ్యవస్థలో అనేక సంక్షేమ పథకాలలో  వేల కోట్ల రూపాయలు ఆదా అయినాయి. మనిషికి గుర్తింపు కోసం ఆధార్ కార్డు తప్పనిసరి చేసి అక్రమ చొరబాటుదారులు  తీవ్రవాదుల  భరతం పట్టాలి. ఆధార్ కార్డు చట్టబద్ధం చేయాలి. దీనిమీద కోర్టులలో సవరణ దరఖాస్తు చేసి దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు వాడడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆటంకాలు తొలగించాలి. లేకపోతే అక్రమ ఆస్తిపరులు తమ అక్రమ ఆస్తులను రక్షించుకోవడానికి కోర్టు తీర్పులు ఒక వరంగా మారతాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో భూముల సమగ్ర సర్వే చేసి రికార్డులను పకడ్బందీగా తయారు చేయాలి. టైటిల్ గ్యారెంటీ యాక్ట్ చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలి.

సెల్ నెంబర్: 98660 74027

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles