Tuesday, September 10, 2024

కొత్త సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించిన కేసీఆర్

నిర్మాణ సంస్థ ఉద్యోగులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న కేసీఆర్

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారికి సూచించారు. మంగళవారం ముఖ్యమంత్రి నూతన సచివాలయ నిర్మాణ ప్రదేశానికి వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును కూలంకషంగా, నిశితంగా పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం, పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తలుపుల నాణ్యతను పరిశీలిస్తున్న కేసీఆర్

పిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లను, వాటి నాణ్యతను సీఎం పరిశీలించారు. మంత్రుల ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను కలియదిరిగి చూశారు. వీటిలోకి వెంటిలేషన్ బాగానే వస్తున్నదని సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు. లిఫ్టులు, వాటి సంఖ్య, కెపాసిటీ గురించి ఆరా తీశారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ స్టోన్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించి, స్టోన్ సప్లయ్ గురించి వివరాలు తెలుసుకున్నారు. స్టోన్ నిర్మాణంలో ప్రత్యేక డిజైన్లు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లర్ల డిజైన్లకు మార్పులు సూచించారు. కాంపౌండ్ గ్రిల్ మోడల్స్ పరిశీలించి అందంగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు. సెక్యూరిటీ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్ అవసరాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెక్రటేరియట్ భవన పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫిల్లింగ్ పనులను సమాంతరంగా జరిపించాలని, లాన్, ఫౌంటేన్స్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. బిల్డింగ్ డిజైన్స్, కలర్స్, ఇంటీరియర్ సహా ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. సెక్రటేరియట్ నిర్మాణపనులు జరుగుతున్న తీరుపై మంత్రిని, అధికారులను అభినందించారు.

నిర్మాణ వ్యవస్థ సిబ్బందికి సూచనలు చేస్తున్న కేసీఆర్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట, ఆర్ అండ్ బీ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సీఎంఓ అధికారులు స్మితా సభర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, ప్రియాంక వర్గీస్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles