- వందేళ్ల తరువాత ఏపీలో భూసర్వే
- తక్కెళ్లపాడులో సర్వేరాయి పాతిన సీఎం జగన్
- సర్వేతో సరిహద్దు వివాదాలకు ముగింపు
ఆంధ్రప్రదేశ్ లో వినూత్న కార్యక్రమాలతో ముందుకెళుతున్న వైసీపీ సర్కార్ భూసర్వేతో ఇవాల్టి నుంచి మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. సుమారు వందేళ్ల తరువాత తొలిసారి సమగ్ర భూ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద సర్వేగా చరిత్రకెక్కనుంది. కృష్ణాజిల్లా తక్కెళ్లపాడులో ముఖ్యమంత్రి జగన్ సర్వేరాయి పాతి లాంఛనంగా ప్రారంభించారు.
భారీ ఏర్పాట్లు
తక్కెళ్లపాడు, జగ్గయ్యపేటల్లో సీఎం కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ మొదట తక్కెళ్లపాడుకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకున్నారు. అక్కడ సర్వేను పరిశీలించి పైలట్ ప్రాజెక్టు కింద సర్వే పూర్తికావడంతో ముఖ్యమంత్రి స్వయంగా సర్వే రాళ్లు పాతారు. అనంతరం క్యూఆర్ కోడ్ తో కూడిన స్థిరాస్తి హక్కు పత్రాలు, భూమి హక్కు పత్రాలను యజమానికి సీఎం అందించారు. అనంతరం జగ్గయ్యపేటలో సర్వేఆఫ్ ఇండియా, ఏపీ సర్వే శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ లు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శనకు బయలుదేరి వెళ్ళారు.గతంలో భూమిని కొలిచేందుకు వాడిన గొలుసు దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న డ్రోన్ వ్యవస్థ వరకు అన్నింటినీ ప్రదర్శనలో తిలకించనున్నారు.
భూసర్వే వివరాలు
దీనికోసం 70 బేస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్స్ విధానంలో జీపీఎస్ అనుసంధానంతో ఈ సర్వే చేయనున్నారు. సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా భూ సర్వే నిర్వహిస్తున్నాయి. సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ పద్దతిలో సర్వే చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 461 వేల గ్రామాలలోని 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములలో సర్వే నిర్వహిస్తారు. 13371 గ్రామకంఠాల్లోని 85 లక్షల ప్రభుత్వ, ప్రవేటు ఆస్తులు 110 పట్టణ ప్రాంతాల్లోని 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో భూసర్వే నిర్వహించనున్నారు. 14 వేల మంది సర్వేయర్లు సమగ్ర భూసర్వేలో పాల్గొననున్నారు.
సర్వే ప్రయోజనాలపై అవగాహన
సీఎం జగన్ ఆదేశాలమేరకు సర్వే పై కలగనున్న ప్రయోజనాలను గ్రామ వాలంటీర్ల సహయంతో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి, సర్వేయర్లతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తాయి. దళారీ వ్యవస్థకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి తావు లేకుండా భూ లావాదేవీలు జరగడం ప్రతి భూభాగానికి క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య కూడా లభించనుంది. దీంతో భవిష్యత్ లో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. ముఖ్యంగా సరిహద్దు వివాదాలకు తెరపడనుంది. దీంతో ఇకపై ఆస్తుల క్రయ విక్రయాలు, తనఖా, దాన, వారసత్వ లావాదేవీలు వివాద రహితం కానున్నాయి. ఒక సారి సర్వే పూర్తయిన తరువాత క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు సంబంధిత గ్రామంలోనే జరగనున్నాయి.