Friday, April 19, 2024

తుకారామ్ గేట్ పోలీసుల చిత్రహింసలవల్లే చిరంజీవి మరణించాడు – న్యాయ విచారణ జరిపించాలి: హెచ్ ఆర్ఎఫ్

ఫొటో రైటప్: గాంధీ ఆస్పత్రి దగ్గర ఆందోళన చేస్తున్న చిరంజీవి బంధువులు, మృతుడు చిరంజీవి

మానవ హక్కుల వేదిక తరఫున వెళ్ళిన నిజనార్ధారణ సంఘం నివేదిక కింది విధంగా ఉన్నది:

ఈ నెల 25వ తేదీన, తుకారాo గేట్ పోలీస్ స్టేషన్, నేర విభాగానికి చెందిన పోలీసులు, సెల్ ఫోన్  చోరీ కేసులో ఆమూరి చిరంజీవి అనే యువకుడిని అనుమానితుడుగా అదుపులోకి తీసుకొని, విచారణలో ఆ యువకుడిపై తీవ్ర చిత్రహింసలకు పాల్పడడం తో మరణించాడు. ఈ సంఘటనపై విషయ సేకరణ చేయడానికి మానవ హక్కుల వేదిక సంస్థకు చెందిన నలుగురు సభ్యుల బృందం పోలీస్ స్టేషన్ కు వెళ్ళి సంబంధిత అధికార్లను, ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న ఎల్.బి. నగర్ దగ్గరలోని భూపేశ్ నగర్ కు వెళ్ళి కుటుంబ సభ్యులను, ఆయన స్నేహితులను కలిసి మాట్లాడి వివరాలు సేకరించింది.

మృతుడి తల్లి, భార్య మంజుల బుధవారం నాడు ఇద్దరు పోలీసులు భూపేశ్ నగర్ లోని తమ ఇంటికి వచ్చి “చిరంజీవితో ఒక విషయం మాట్లాడాలి. ఆయనను తుకారాంగేట్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి మాట్లాడి పంపిస్తం” అని అన్నారని కమిటీకి తెలిపారు. ఆటో నడుపుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్న తన కొడుకును ఎందుకు తీసుకెళ్ళుతున్నారని, తల్లి గట్టిగా వాదిస్తే, విషయం తర్వాత మీకే తెలుస్తుంది అని పోలీసులు ఎద్దేవా చేశారని ఆమె చెప్పింది.

 రాత్రి సుమారు 11.30 గంటలకు, నలుగురు పోలీసులు వచ్చి చిరంజీవి తల్లిని వాళ్ళ డిసిపి సార్ తీసుకురమ్మన్నాడని తీసుకుపోయి, తన కోడలు మంజులకు ఫోన్ చేసి ఆమెను కూడా రప్పించారని తెలిపింది.

తన కొడుకు చిరంజీవితో విచారణలో భాగంగా మాట్లాడుతుంటే, ఫిట్స్ వచ్చి పడిపోయాడని, ఆయనను గాంధీ హాస్పిటల్లో చేర్పిస్తే అక్కడ మరణించాడని డీసీపీ చెప్పాడని మా కమిటీకి వాళ్ళు తెలిపారు. ఈ లోపు ఆ వార్త తెలిసి బంధువులంతా డిసిపి ఆఫీసుకు చేరుకొని ఆందోళన చేస్తుంటే వాళ్ళందరిని వ్యానుల్లో ఎక్కించి గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్ళి, శవపరీక్ష గది బయట కూర్చోబెట్టారనీ, అక్కడ ఎవరితోనూ మాట్లాడనివ్వలేదనీ, చుట్టూ పోలీసులు చుట్టూ నిలబడి అసలే కదలనివ్వలేదనీ, తెల్లవారి పత్రికల వాళ్ళు వస్తే వాళ్ళతో అసలే మాట్లాడనివ్వలేదనీ తెలిపారు. దాదాపు నలభై మంది బంధువులు అక్కడ కూర్చుని చిరంజీవిని పోలీసులే కొట్టి చంపారనీ, విచారణ చేసి తమకు న్యాయం చేయాలనీ నిరసన తెలిపారట. మృతుడి వదిన హసీనా 9 గంటలకు లా పరీక్ష రాయవలసి ఉండె. ఆమెను కూడా నిర్బంధించి, పరీక్షకు పోవడానికి అనుమతించడం లేదని తెలిసి, మా సంస్థ బాధ్యులు, ఈ విషయం సిటీ కమీషనర్ కు తెలిపారు. ఆయన జోక్యంతో ఆ అమ్మాయి పరీక్ష రాయడానికి వెళ్ళింది. మార్చురీలో శవాన్ని చూసిన మృతుడి తల్లి, భార్య మంజుల, వదినె హసీనా, ఇంకా ఆయన స్నేహితులు, మృతుడి తలకింద రక్తం గడ్డ కట్టి, పేరుకుందని, ముక్కులోంచి, చెవ్వులోంచి రక్తం కారడం గమనించామని, ఒక చేయి మెలిపెట్టినట్టుగా వుందని, కాళ్ళపై కట్టెలతో కొట్టినట్టు నల్లగా చర్మం కనపండిదని, చేతుల వెనక భాగం కూడా నల్లగా మారిందని చెప్పారు. వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో తమ వాడికి ఫిట్స్ రోగం లేదని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నవాడిని పోలీసులే కొట్టి చంపారని మాకు చెప్పారు.

ఆయన ధృడంగా ఉంటాడనీ, మంచి వాలీబాల్ ఆటగాడు అనీ ఆయన స్నేహితులు మాకు తెలిపారు.

ముందుగా సమాచారం ఇచ్చి తుకారంగేట్ పోలీసు స్టేషన్ కు వెళ్ళిన మా బృందానికి పోలీసులు అసలే సహకరించలేదు. సంబంధిత అధికారులు స్టేషన్లో లేరు. ఎస్.హెచ్.ఓ గారైన ఆర్. ఎల్లప్పకు ఫోన్ చేస్తే, కొద్ది సేపట్లో వస్తానని, అది లాకప్ మరణం కాదు, మీరు ఏ విచారణ చేస్తారు అని మమ్మల్నే ప్రశ్నించి,

 క్రైమ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులుతో మాట్లాడమన్నారు. ఆయనకు ఫోన్ చేస్తే, చాలా ముఖ్యమైన పనిలో ఉన్నానని చెప్పాడు. మేము జనరల్ డైరీని చూడాలని అడిగితే మాపై అధికారులు ఎవరితోనూ మాట్లాడొద్దన్నారని, పోలీస్ స్టేషన్లో ఏ రికార్డులు ఎవరికి చూపొద్దని అన్నారని మాకు తెలిపాడు. పోలీసులు శవపరీక్షకు హాస్పిటల్ అధికార్లకు అభ్యర్థన చేయకుండా, తల్లి, భార్య ఫిర్యాదు ఇవ్వబోతే తీసుకోకుండా, రాష్ట్ర స్థాయి వడ్డెర సంఘం నాయకులను పిలిపించుకొని వాళ్ళతో సంప్రదింపులు చేస్తూ కూర్చున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు బాధిత కుటుంబానికి ఇవ్వడానికి సంప్రదింపులు వాళ్ళ నాయకులతో జరిపారని మాకు తెలిసింది. ఒప్పుకున్న డబ్బులో కొంత అడ్వాన్సుగా పోలీసులు మధ్య వర్తులకు అందజేసారని మాకు తెలిసింది. ఒక పత్రికా విలేఖరి ద్వారా పోస్ట్ మార్టంకు పోలీసులే అడ్డుపడుతున్నారని, మా సంస్థకు తెలియడంతో ,మా సంస్థ బాధ్యులు సిటీ కమీషనర్ కు విషయం తెలిపి జోక్యం చేసుకొమ్మని కోరడం జరిగింది. కమీషనర్ ఆదేశాలతో రాత్రి 10 గంటల తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి చిరంజీవి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ మొత్తం వ్యవహారంలో  పోలీసుల ప్రవ ర్తి చిన తీరు, విషయాన్ని వాస్తవాలను దాచడానికి చేసిన ప్రయత్నం గమనిస్తే పోలీసుల చిత్రహింసలవల్లనే చిరంజీవి మరణించాడని, వాళ్ల తప్పు కప్పిపుచ్చుకోవడానికే కుల సంఘం నాయకులను పోలీసులు రంగంలోకి దించారని మా కమిటీ భావిస్తోంది. పోలీసు దెబ్బల వల్ల అపస్మారక స్థితికి చేరిన చిరంజీవిని, అడ్డగుట్టలోని ఒక ఆర్.ఎం.పి డాక్టర్ దగ్గరకు తీసుకపోవడం, ఆయన పరిస్థితి విషమించింది అని తాను ఏమీ చేయలేనని చెప్పడంతో, గాంధీ ఆసుపత్రికి కొనప్రాణంతో ఉన్న ఆయనను పోలీసులు తీసుకెళ్ళిన కథనాన్ని పత్రికలు వివరంగా రాసాయి.

ఇటువంటి సంఘటనలలో రాష్ట్రం లో పోలీసులు చట్ట ప్రకారంగా నడుచుకోకుండా, తమ చేతులకు అంటిన రక్తాన్ని తుడుచుకోవడానికి  పెద్ద మొత్తంలో డబ్బులు ఆశచూపి సెటిల్మెంట్లు చేయడం ఒక పద్ధతిగా ఎంచుకున్నారు. తెలంగాణలో గత రెండు సంవత్సరాలలో జరిగిన నాలుగు “లాకప్ మరణాల” సంఘటనలలో పోలీసులు సెటిల్మెంటు పద్ధతులతో విచారణ జరపకుండా నిలువరించారు. పై అధికార్లకు ఈ విషయం తెలిసినా లాకప్ మరణాల సంఘటనల వల్ల తమ శాఖ ప్రతిష్ట దెబ్బ తింటుందని, తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.

ఈ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణకు ఉపక్రమించడం మంచి పరిణామం. లాకప్ మరణాల కేసుల్ని సి.ఆర్.పి.సి. సెక్షన్ 176 యుఎ ప్రకారం జ్యూడీషియల్, మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్లు విచారణ చేయాలి. కాని మన రాష్ట్రం లో అట్లా జరగడం లేదు. తూ తూ మంత్రంగా ఎక్జిక్యూటివ్(R.D.O) తో విచారణ జరిపిస్తున్నారు.

డిమాండ్లు:

1) మరణించిన కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల నష్ట పరిహారం అందజేయాలి.

2) S.H.O, Crime శాఖ సిబ్బందిని సస్పెండ్ చేసి తగురీతిన విచారించి, దోషులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.

3) మృతుడి భార్యకు ఉద్యోగం కల్పించి, పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మీషన్ ఇవ్వాలి.

4) పోలీస్ కంప్లెంట్ అథారిటీ (పి.సి.ఎ)ని వెంటనే ఏర్పాటు చేయాలి.

కమిటీ సభ్యులు

ఎస్. జీవన్ కుమార్, రోహిత్, కె. బాలయ్య, జి. రామాంజీ, బాపట్ల కృష్ణమోహన్

ఎస్. జీవన్ కుమార్

ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు

Related Articles

1 COMMENT

  1. తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ (ఆరోపణ) కేసు HRF విశ్లేషణ ను “సకలం” పత్రిక ప్రజల దృష్టికి తీసుకరావడం 👍

    బాపట్ల కృష్ణమోహన్
    @Praja_Snklpm (ట్విట్టర్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles