Wednesday, September 18, 2024

జనచైనాలో ఆగ్రహజ్వాల

  • జిన్ పింగ్ అధికారానికి పెను సవాలు
  • కఠిన లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తున్న ప్రజలు

చైనా అధిపతి జిన్ పింగ్ అప్రతిహతంగా వెలిగిపోతున్నారు. ఇటు ప్రభుత్వంలోనూ -అటు పార్టీలోనూ అమేయశక్తిగా అన్నీ తానై రెచ్చిపోతున్నారు. ఆయనను దింపేస్తారంటూ ఆ మధ్య వరుస కథనాలు వెల్లువెత్తాయి. అదంతా ఉత్తుత్తి ప్రచారమే అన్నట్లుగా తర్వాత ఫలితాలు చెప్పాయి. తిరుగులేని నేతగా చెలరేగిపోతున్న జిన్ పింగ్ పాలనలో ప్రజలంతా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నారని అనుకుంటే… అది పొరపాటే అవుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆయనను నియంతగానే ఎక్కువ దేశాలు భావిస్తున్నాయి. అక్కడి ప్రజలు చేసిది లేక భయంతో మౌనవేదనను అనుభవిస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కరోనాకు పుట్టినిల్లుగా భావించే ఆ దేశంలో ఆ వైరస్ కట్టడి కాకపోగా విలయతాండవం చేస్తోంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో జీవచ్ఛవాలుగా మారిపోయారు. తప్పు ఎవరు చేసినా, ఆ పాపం ఎవరిదైనా ప్రపంచ ప్రజలందరూ అష్టకష్టాలు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. కోవిడ్ మూల కేంద్రమైన చైనా ఇంకా ఎక్కువ కష్టాలు పడుతోంది. ఆ దేశ ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. బతుకుదెరువు – బతుకు మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.  వీటన్నిటినీ కట్టడి చేయడంలో చైనా ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది.

Also read: ఎలక్షన్ కమిషనర్ నియామక తంతుపై సుప్రీంకోర్టు ఆక్షేపణ

మేకపోతు గాంభీర్యం

తప్పులు తన వైపు ఉన్నా వాటిని మేకపోతు గాంభీర్యంతో కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను అత్యంత కఠినంగా అమలుపరుస్తోంది. ఈ తీరుకు ప్రజలు తీవ్రంగా తిరుగుబాటు చేస్తున్నారు. ‘జీరో కోవిడ్’ ప్రభుత్వ విధానానికి అడుగడుగునా ఆందోళనలు ఎదురవుతున్నాయి. విద్యాలయాల నుంచి వేలాదిమంది ఉద్యమానికి రంగంలోకి దిగారు. విశ్వ విద్యా లయాల  ప్రాంగణాలు జిన్ పింగ్, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగి పోతున్నాయి. మొన్న ఉర్ముచీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ప్రజల్లో, విద్యార్థుల్లోనూ ఆగ్రహం అగ్గిగా రగిలిపోతోంది. లాక్ డౌన్ పేరుతో బందీలను చేయడం వల్లనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో కమ్యూనిస్ట్ దేశంలో ఈ స్థాయి ప్రజాగ్రహం పెల్లుబుకడం ఇదే ప్రథమం. మొన్న ఆదివారం ఒక్కరోజులోనే 39,500 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. చైనాలో సంభవిస్తున్న ఈ పరిణామాల పట్ల అక్కడి మీడియా మౌనం పాటిస్తోంది. జిన్ పింగ్ పై ఉన్న అధిక భయంతోనే ఇలా జరుగుతోందని ప్రపంచ మీడియా భావిస్తోంది. ఈ ఆందోళనలను పశ్చిమ దేశాల మీడియా విస్తృతంగా కవర్ చేస్తోంది.

Also read: శాంతించు రష్యా!

విదేశాలలోనూ సంఘీభావ ప్రదర్శనలు

 చైనా పరిస్థితులపై ఆ దేశంలోనే కాక పారిస్, ఆమ్ స్టర్ డామ్, డబ్లిన్, టొరంటో,  శ్రాన్ ఫ్రాన్సిస్కో మొదలైన చోట్ల చైనా ప్రజలకు మద్దతుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. సరే, వాటి వెనకాల అంతర్జాతీయ రాజకీయాలు ఉండి ఉండవచ్చు. చైనాలో వార్తలు కవర్ చేస్తున్న విదేశీ జర్నలిస్టులను అక్కడి పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. కఠిన లాక్ డౌన్ లో భాగంగా ఇళ్లకు గొలుసులతో తాళాలు వేస్తున్నారు. లాక్ డౌన్ చాలా రోజుల నుంచి కఠినంగానే అమలు జరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశంగా ఎంత పేరు గడించినా, అగ్రరాజ్య స్థానం కోసం అమెరికాతో పోటీ పడుతున్నా… ముందు ఇంట గెలవాలి. రచ్చ గెలవడం సంగతి అటుంచుదాం.. ఇంట్లో జరుగుతున్న ఆ రచ్చ ఎప్పుడు ఆగుతుందో. ఈ మచ్చ ఎన్నడు పోతుందో.

Also read: సత్యసాయి జయంతి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles