Friday, October 4, 2024

అమెరికాను మించనున్న చైనా

“చాపకింద నీరులా పాకడం” అనే నానుడికి చైనా తీరు అక్షరాలా సరిపోతుంది. సరిహద్దులను దురాక్రమించడంలోనే కాదు, ప్రపంచ ఆర్ధికసామ్రాజ్యాన్ని కబళిoచడంలోనూ అందెవేసిన చెయ్యిలా చైనా కనిపిస్తోంది. మనకంటే కాస్త ముందే ఆర్ధిక సంస్కరణల ప్రయాణం ప్రారంభించినా మనల్ని ఎప్పుడో  దాటిపోయింది. అమెరికాకు ఆమడదూరంగా ఉండే స్థాయి నుండి, రానున్న ఒక దశాబ్దంలోపే ఆ అగ్రరాజ్యాన్ని కూడా  అధిగమించే జాడలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ అధ్యయనాలు కూడా అవే చెబుతున్నాయి. గతంలో వేసిన ఒక అంచనా మేరకు, 2033కు ఆ ఆశయం సిద్ధిస్తుందని అనుకున్నారు.

అమెరికాను అధిగమించనున్న చైనా?

ఇప్పటి తీరును గమనిస్తే, ఇంకో ఐదేళ్లు ముందే, అంటే 2028కే ఈ విజయాన్ని చైనా దక్కించుకుంటుందని ఆర్ధికరంగ నిపుణులు జోస్యం చెబుతున్నారు. ఈ ఎదుగుదల వెనకాల, భారతదేశం వంటి దేశాలను నమ్మించి సొమ్ముచేసుకోవడం మొదలైన కారణాలేకాక, కరోనా వైరస్ కూడా కలిసాచ్చిందని అంటున్నారు. ప్రపంచదేశాలను తొక్కేయ్యడానికి, మరీ ముఖ్యంగా అమెరికా ఆర్ధిక మూలలను దెబ్బతీయడానికి, ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ గా పేరొందుతున్న  భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని, “కరోనా వైరస్” ను తమ ప్రయోగశాలల్లో సృష్టించి, ప్రపంచంపైకి చైనా వదిలిందనే మాటలను కొట్టి పారేయలేమని ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా ఎప్పటి నుంచో అంటున్నారు.

అస్తవ్యస్తంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ

అంటున్నట్లుగానే అమెరికా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కోలుకోడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలోవున్న భారతదేశ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మనకున్న అవసరాల దృష్ట్యా, చైనాతో కొన్ని ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఒప్పందాలు మెల్లగా అనేక రంగాలకు పాకాయి. ఔషధాల తయారీ నుంచి, డిజిటల్ వినియోగం వరకూ భారత్ చైనాపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ ఒప్పందాల వల్ల మనదేశం నుండి చైనా బాగా లాభపడింది. దీనితో పోల్చుకుంటే మనకు ఒరిగిన ప్రయోజనాలు తక్కువేనని చెప్పాలి.

చైనా ప్రగతిలో భారత్ వాటా

చైనా ఆర్ధిక ప్రగతిలో భారత్ కు వాటా ఉన్నట్లేనని భావించాలి.సరిహద్దుల్లో యుద్ధాలు పెరుగుతున్న నేపథ్యంలో, మన దేశం చైనాతో చేసుకున్న ఒక్కొక్క ఒడంబడికను రద్దు చేసుకుంటూ వస్తున్నాం. దేశీయంగా స్వయం సమృద్ధిని సాధించేంత వరకూ మన ప్రయాణ వేగం తక్కువగానే ఉంటుంది. ఈ లోపే చైనా ఎదుగుదల వేగం మరింత పెరుగుతుంది. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో  కరోనా సంక్షోభం తర్వాత బలమైన ఆర్ధికశక్తిగా అవతరించడానికి అన్ని అవకాశాలూ చైనాకే ఉన్నాయని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, ఈ పరుగు పందెంలో అమెరికా అడుగులు వెనకకు పడతాయని ఈ అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో అన్ని దేశాల కంటే ముందుగానే లాక్ డౌన్ విధించడం, దీర్ఘకాలిక అభివృద్ధిని అంచనా వేయడంలో ఎంతో ముందుండడం చైనాకున్న ప్రత్యేకతలుగా పరిశీలకులు చెబుతున్నారు. 

ఆర్థికరంగంలో అసాధారణమైన అభివృద్ధి

ఆర్ధిక వృద్ధిలో, 2021-25 మధ్య  5.7శాతం, 2026-30 మధ్య 4.5శాతం నమోదు చేసుకునే అవకాశాలు చైనాకు ఉన్నట్లు ఈ అధ్యయనాల వల్ల తెలుస్తోంది. అదే సమయంలో, అమెరికా ఆర్ధిక వృద్ధి 1.6 – 1.9 శాతానికే పరిమితం కానుందని చెబుతున్నారు. చైనా, అమెరికా తర్వాత మూడవ స్థానంలో జపాన్ కొనసాగుతుందని అంటున్నారు. ఈ రేసులో జర్మనీకి నాల్గవ స్థానం దక్కేట్టుగా ఉంది. బ్రిటన్ భవిష్యత్తు కూడా ఆశాజనకంగానే ఉంది. పెరుగుతున్న డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ బ్రిటన్ కు బాగా కలిసొచ్చేట్టుగా  ఉంది. చైనా దుర్మార్గాలు ఇప్పటికే బాగా పెరిగాయి.

చైనా కట్టడికి కూటమి అనివార్యం

ఇక అగ్రరాజ్యంగా అవతరించిందంటే  చైనా చేపట్టబోయే చర్యలు ఇంకా దారుణంగా ఉంటాయి. చైనాను నిలువరించడంలో, అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్, భారత్ ఏకమయ్యే అవకాశాలు ఉండవచ్చునని కొందరు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే “క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్” వేదికగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా దగ్గరయ్యాయి. చైనాను ఆర్ధికంగా దెబ్బతీయడమే వీరందరి ఉమ్మడి లక్ష్యం. 2007లో ఇది లాంఛనంగా ఆరంభమైనా ఈ మధ్య దూకుడు పెరిగింది.

చైనాకు భారత్, అమెరికా దూరం

ఈమధ్య కాలంలో, భారత్ -చైనా మధ్య, చైనా -అమెరికా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ముందు ముందు కూడా అదే వైఖరి కొనసాగే శకునాలే కనిపిస్తున్నాయి. అమెరికా – చైనా మధ్య సాగుతున్న ఆధిపత్య  పోరులో బలికాకుండా, జాగ్రత్తగా వ్యవహరిస్తూ,అమెరికాతో సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవడం భారత్ కు ఎంతో అవసరం. జనవరి 2021నుండి అమెరికాలో జో బైడెన్, కమలా హ్యారిస్ ద్వయం అధికారం చేపట్టానున్నారు.

మేకిన్ ఇండియా వేగం పెరగాలి

వారి స్వార్ధాలు ఎట్లా ఉన్నా, ఈ కాలంలో,భారత్ తో బంధాలు మరింత పెరుగుతాయి. వీటన్నిటిని భారత్ సద్వినియోగం చేసుకొని తీరాలి. అదే సమయంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పం చేసుకున్నట్లు “మేక్ ఇన్ ఇండియా” భావన ఆచరణలో జోరందుకోవాలి. భారత్ స్వయం సమృద్ధిగా ఎదిగితే, ప్రపంచంలో నడుస్తున్న ఈ ఆర్ధిక పరుగుపందెంలో గౌరవనీయమైన స్థానంలో నిలబడుతుంది.

భారత్ మరింత అప్రమత్తం

చైనా విషయంలో, భారత్ మరింత అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. చైనా ఇంత త్వరితగతిన ఎదగడానికి ఏమేమి అంశాలు దోహద పడ్డాయో, అధ్యయనం చేసి మనం కూడా వాటిని  అవలంబించాలి. వారి వలె చెడ్డదారులు తొక్కకపోయినా,మన బలాలు, బలహీనతలు ఎరిగి మెలగాలి. వారి నుండి, ఏకీకృతంగా లక్ష్యం వైపు కష్టపడే శ్రమైకజీవన సౌందర్యాన్ని  మనం మరింతగా సొంతం చేసుకోవాలి. ఇవ్వన్నీ పాటిస్తే, ఉందిలే… మంచికాలం ముందు ముందునా.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles