Wednesday, September 18, 2024

కాళేశ్వరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు కేంద్రం బ్రేక్

  • సుప్రీంలో కేసు ఉపసంహరించుకుంటే గోదావరిపైన కొత్త ట్రైబ్యూనల్
  • రెండు రాష్ట్రాలూ నిధులు సమకూర్చితే టెలిమెట్రీ యంత్రాలు
  • కొత్త ప్రాజెక్టులన్నటికీ ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం
  • కేసీఆర్  కు షెఖావత్ శ్రీముఖం

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూడో టీఎంసీ నీరు తరలించేందుకు చేపడుతున్న పనులతో సహా గోదావరి ప్రాజెక్టుపైన నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టుల వివరాలతో కూడిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ – డీపీఆర్) లేకుండా ముందుకు వెళ్లవద్దంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెఖావత్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)కి లేఖ రాశారు. సీతారామ, దేవాదుల-3, తుపాకులగూడెం, దిగువ పెన్ గంగ, రామప్ప-పాకాల ప్రాజెక్టులు ఈ పరిధిలోకి వస్తాయి. తెలంగాణ ఫిర్యాదుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు నిర్మాణం సైతం చేపట్టకూడదని అదే లేఖలో స్పష్టం చేశారు. 6 అక్టోబర్ 2020 న జరిగిన అపెక్స్ సమావేశంలో చర్చించిన అంశాల ప్రాతిపదికగా షెఖావత్ ఈ లేఖ రాశారు.

పరస్పరం ఫిర్యాదులపై షెఖావత్ స్పష్టీకరణ

పోయినవారం దిల్లీ పర్యటన సందర్భంగా కేసీఆర్ షెఖావత్ ను కలుసుకున్నారు. డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం షెఖావత్ ను  కలుసుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కానీ జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పోతిరెడ్డిపాడు విస్తరణ నిర్మాణంపైన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీతో చర్చలలో కూడా ఈ అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు. వినతిపత్రాలు ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను నిలుపుదల చేయవలసిందిగా షెఖావత్ తన లేఖలో కోరారు. కిందటి వారమే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిల్లీలో షెఖావత్ ను కలుసుకున్నారు. కాళేశ్వరం మూడో టీఎంసీ ప్రాజెక్టుతో పాటు ఇతర అయిదు ప్రాజెక్టుల నిర్మాణంపైన కూడా ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందించారు.

ఇది చదవండి :పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రితో బుగ్గన, అనిల్ చర్చలు

కొత్త ట్రైబ్యూనల్ ఏర్పాటుకు షరతు

గోదావరి జలాలపైన కొత్త ట్రిబ్యూనల్ వేయాలంటూ రెండు రాష్ట్రాలు లేఖలు ఇస్తే పరిశీలిస్తామనీ, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవలసి ఉంటుందనీ షెఖావత్ తన లేఖలో అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లోని ‘సెక్షన్ 80’ ప్రకారం కృష్ణా జల వివాదాల ట్రైబ్యూనల్ (కేడబ్ల్యూడీటీ)ని ఏర్పాటు చేశారు. అయితే, జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ – 3 ప్రకారం కొత్త ట్రిబ్యూనల్ ను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందనీ, అక్టోబర్ 6న జరిగిన అపెక్స్  కౌన్సిల్  సమావేశంలో కూడా అదే విషయం పునరుద్ఘాటించామనీ తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.  2010లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ వెల్లడించిన తీర్పుపైన ఉమ్మడి  రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ తీర్పుపైన సుప్రీంకోర్టు స్టే మంజూరు చేసింది. జలవివాదాల చట్టం సెక్షన్ -3 ప్రకారం కొత్త ట్రైబ్యూనల్ ను నియమించినట్లయితే సుప్రీంకోర్టులోని కేసును ఉపసంహరించుకుంటానని తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించింది. ఈ కేసు ఉపసంహరణ గురించి షెఖావత్ తన లేఖలో గుర్తు చేశారు. కేసు ఉపసంహరించుకున్న మీదట కొత్త ట్రైబ్యూనల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ఇది చదవండి :మోదీతో కేసీఆర్ భేటీ, అభ్యర్థనల వెల్లువ

పోతిరెడ్డిపాడు విషయంలోనూ షరా మామూలే

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను సైతం నిలిపివేయాలని షెఖావత్ స్పష్టం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న ప్రాజెక్టులు మినహా తక్కిన ప్రాజెక్టులు అన్నిటినీ కొత్త ప్రాజెక్టులుగానే భావించవలసి ఉంటుందనీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం అక్రమం అవుతుందనీ కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఈ విషయంపైన తాను 7 ఆగస్టు 2020న ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకూ లేఖ రాసిన విషయం షెఖావత్ ప్రస్తావించారు.

బోర్డు వర్కింగ్ మాన్యువల్ సిద్ధమైన తర్వాతే నిర్ణయాలు

శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం అనుమతికి మించి నీటిని తరలించడం, శ్రీశైలం ఎడమ జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యత్ ఉత్పత్తి ద్వారా ఎక్కువ నీటిని సాగర్  లోకి విడుదల చేయడం గురించి ప్రస్తావిస్తూ శ్రీశైలం జలాశయం నిర్వహణ బాధ్యత తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం లోగడ కోరింది. బోర్డు వర్కింగ్ మాన్యువల్ తయారైన తర్వాత ఇటువంటి అంశాలపైన నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి అన్నారు. 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్న నీటిని కొలిచేందుకు టెలిమెట్రీ యాంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇందుకు రెండు రాష్ట్రాలూ నిధులు అందజేయకపోవడంతో టెలిమెట్రీ యంత్రాల కొనుగోలు వ్యవహారం పెండింగ్ లో పడింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles