Thursday, April 25, 2024

బెంగాల్ లో కేంద్రం పక్షపాత వైఖరి

గవర్నర్ జగదీశ్ ధన్ కడ్, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఆట ముగిసింది కానీ, రాజకీయ రణక్షేత్రం రగులుతూనే వుంది. ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత ఎంత గందరగోళం జరిగిందో, ఇప్పుడూ అదే జరుగుతోంది. అల్లర్లు ఇప్పుడప్పుడే ఆగకపోగా, ఇంకా పెరిగేట్లు ఉన్నాయి. రాష్ట్రంలో నేడు కనిపిస్తున్న దృశ్యాలు వాటికి అద్దంపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మంత్రులు, నేతలను సీబిఐ అరెస్టు చేసింది. దీనితో ఆగ్రహోదగ్రురాలైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబిఐ కార్యాలయంలో హల్ చల్ చేశారు. తృణమూల్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ” ఈ పరిణామాలపై పర్యవసానాలు తెలుసుకదా? ”  అంటూ గవర్నర్ ధన్ ఖడ్ ముఖ్యమంత్రిని హెచ్చరించారు.

Also read: కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స ఎప్పుడు?

మమతకు గవర్నర్ హెచ్చరిక

మమతను గవర్నర్ హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. అదను దొరికినప్పుడల్లా హెచ్చరిస్తూనే వున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన అల్లర్లలో కొందరు మరణించారు. ఈ విషయంలోనూ గవర్నర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బిజెపి అగ్రనేతలు రాష్ట్రాన్ని సందర్శించి మమతపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో జరిగిన కాల్పుల సందర్భంగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై బిజెపి -తృణమూల్ ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. అన్ని అల్లర్లకు, మరణాలకు మీరే కారణం అంటూ పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ దూషణలు, ఆరోపణల పర్వం పూర్తికాకముందే ‘నారదా స్కామ్ వివాదం ‘ మళ్ళీ తెరపైకి వచ్చింది. తెరపైకి రావడమే కాక, తృణమూల్ ముఖ్యనేతల అరెస్టు దాకా వెళ్ళింది. ఈ అరెస్టుల పర్వం వీరితో ఆగేట్టు లేదు. తృణమూల్ లోని మిగిలిన ముఖ్య నేతలు కూడా అరెస్టులతో పాటు కేంద్ర ఏజెన్సీల నుంచి పలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

Also read: తాత్పర్యం లేని టీకాలు

అలజడి సృష్టించడమే అభిమతం

ఏదో విధంగా పశ్చిమ బెంగాల్ లో అల్లర్లు, అలజడులు, గందరగోళాలు సృష్టించి, రాజ్యంగ సంక్షోభం వచ్చిందని  చూపించి, రాష్ట్రపతి పాలన పెట్టే దిశగా దిల్లీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని మమతా బెనర్జీ ఎన్నోరోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా గవర్నర్ చేసిన హెచ్చరికలు ఈ అనుమానాన్ని మరోసారి బలపరుస్తున్నాయని తృణమూల్ శ్రేణులు మండిపడుతున్నారు. మమతా బెనర్జీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని పదిరోజులు కాకముందే, సీబీఐ అరెస్టుల పర్వమేంటని దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు అరెస్టులకు కారణమైన ‘నారదా స్కామ్ ‘ ఇప్పటిది కాదు. ఏడేళ్ల నాటిది. 2014లో నారదా న్యూస్ పోర్టల్ ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఒక డమ్మీ కంపెనీకి ప్రయోజనాలు చేకూర్చడం కోసం తృణమూల్  నేతలకు లంచం ఎరవేసింది. లంచం తీసుకుంటూ వారందరూ కెమెరాకు చిక్కారు.

Also read: పాకిస్తాన్ కొత్త పాచిక?

లంచం స్వీకరిస్తూ కెమెరాకు చిక్కిన నేతలు

వారందరూ మంత్రులు, పార్టీలో కీలకనేతలు. వారితో పాటు ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు. ఫిర్షద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, మదన్ మిత్రా, సోవెన్ ఛటర్జీ మొదలైనవారు తృణమూల్ నేతలు. ఐపీఎస్ అధికారి పేరు ఎస్ ఎం హెచ్ మీర్జా. 2016లో అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా ఈ వార్తలు ప్రసారమయ్యాయి. న్యాయస్థానాల సూచనలతో 2017 ఏప్రిల్ లో సీబీఐ వీరిపై కేసులు నమోదు చేసింది. వీరితో పాటు మరో 13మందిపైనా సీబిఐ కేసు పెట్టింది. నేడు ఈ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చారు. సోమవారం నాడు ఇద్దరు మంత్రులు ఫిర్షాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అరెస్టు చేసింది. వీరితో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Also read: స్టాలిన్ కు శుభాకాంక్షలు

మమత హల్ చల్

అరెస్టు చేసిన విధానం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, నన్ను కూడా అరెస్టు చేయండంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయం దగ్గర చాలాసేపు భైటాయించారు. తృణమూల్ నేతలు, మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కోల్ కతా లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తన అనుమతి లేకుండా మంత్రులను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పశ్చిమ బెంగాల్ స్పీకర్ అభ్యంతరాన్ని లేవనెత్తారు. గవర్నర్ అనుమతితో ఈ అరెస్టులు జరగడం కూడా నేడు చర్చనీయాంశమైంది. మంత్రులపై విచారణకు గవర్నర్ ఆదేశించవచ్చంటూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నెల 7వ తేదీ నాడు గవర్నర్ జగదీప్ ధన్ కడ్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Also read: భారత్-బ్రిటన్ మధ్య గాఢమైన మైత్రి

సువేందుకు ఎందుకు అరెస్టు చేయలేదు?

లంచం తీసుకుంటూ దొరికిపోయినవారిపై కేసులు పెట్టడం,అరెస్టు చేయడంపై ఎవరూ అభ్యంతరం పెట్టరు. కాకపోతే,ఇదే కేసులో నిందితులుగా ఉన్న సువేందు అధికారి, ముకుల్ రాయ్ ని కూడా ఎందుకు అరెస్టు చేయలేదంటూ తృణమూల్ నేతలు వాదిస్తున్నారు. వీరిద్దరూ ఇటీవలే బిజెపిలో చేరి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సువేందు అధికారి బిజెపి తరపున పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, నందిగ్రామ్ లో మమతా బెనర్జీపై గెలిచిన వ్యక్తి కావడం గమనార్హం. మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆమెపై అవినీతి ముద్రలేకపోయినా, తృణమూల్ నేతలపై ఆరోపణలు గట్టిగానే వున్నాయి. నారదా న్యూస్ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ప్రబుద్ధులను ఎవ్వరూ సమ్మతించరు, మద్దతు పలుకరు. స్కామ్ లో నిందితులుగా ఉన్న అందరికీ ఒకే న్యాయం అమలుకాకపోవడంపైనే అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also read: పాలకపక్షాలకే మళ్ళీ పల్లకీ

బీజేపీకి ఒక న్యాయం, తృణమూల్ కి ఒక న్యాయమా?

బిజెపి నేతలకు ఒక న్యాయం – తృణమూల్ నేతలకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. నారదా స్కామ్ లో నిజానిజాలు న్యాయస్థానాల్లోనే తేలుతాయి. అవి తేలేసరికి ఏళ్లూపూళ్లూ పట్టవచ్చు. అది వేరే విషయం. స్పీకర్ అనుమతి లేకుండా, గవర్నర్ అనుమతితో రాష్ట్ర మంత్రులపై చర్యలు తీసుకోవచ్చా, అనే అంశాన్ని న్యాయమూర్తులే తేల్చాలి. పశ్చిమ బెంగాల్ లో అవినీతి, అక్రమాలు, అల్లర్లు ఎలా ఉన్నా, ప్రస్తుత పరిణామాలు బిజెపి – తృణమూల్ మధ్య మొదలైన మరో రాజకీయ యుద్ధంగానే పరిశీలకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో,ఈ యుద్ధం రాష్ట్రపతి పాలన దాకా వెళ్లినా ఆశ్చర్య పడనవసరంలేదు. మమతా బెనర్జీ – నరేంద్రమోదీ మధ్య సాగుతున్న ఈ పోరు ఎటు తీసుకెళ్తుందో వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి తేలిపోతుంది.

Also read: అంతా ఆరంభశూరత్వమేనా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles