Monday, April 22, 2024

భారత్ ఇప్పుడు పాక్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయగలుగుతుందా?

  • ఉగ్రనేరాన్ని ఒప్పుకునివెంటనే మాట మార్చిన పాకిస్తాన్

భారత్ కు భయపడి పాకిస్తాన్ అభినందన్ ను అప్పగించింది. భారత్ కు భయపడి పాకిస్తాన్. పుల్వామా హంతక దాడి తనదే అని చెప్పింది. ఆ తరువాత మళ్లీ భయపడింది. ఎందుకు? ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది? పాక్ దుర్మార్గాన్ని అంగీకరించడాన్ని రాజకీయంగా అంతర్జాతీయ స్థాయిలో వాడుకునే దౌత్య శక్తి భారత్ కు ఉందా? మనదేశం తక్షణ కర్తవ్యం ఏమిటి?

పాకిస్తాన్ పొరబాటున నిజం చెప్పి ఇన్నాళ్లూ అబద్దం చెప్పినట్టు అంగీకరించింది. అదీ వారో వీరో కాదు, అక్కడా ఇక్కడా కాదు. స్వయానా పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌధరీ. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు సన్నిహితుడు. సాధికారికంగా పాకిస్తాన్ పార్లమెంటు నేషనల్ అసెంబ్లీలో ప్రకటించారు. 2019లో జమ్ము కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్ పి ఎఫ్ దళాలు ప్రయాణిస్తుండగా భారీగా ఐ. ఇ. డి. ప్రేలుడు పదార్థాలు అమర్చిన ఒక వాహనంతో ఒక ఆత్మాహుతి ఇస్తామీ జిహాదీ వరుస వాహనాలు ఢీకొని నలభైమంది నిండు ప్రాణాలు బలి చేసిన వీరులం మేమే అని ప్రకటించాడు. భారత్ భూబాగంలోకి చొచ్చుకుని పోయి వారి ఇంట వారిని మట్టుబెట్టడంలో విజయం సాధించింది పాకిస్తాన్ అని అదో గొప్ప విజయంగా ప్రకటించుకున్నాడా మంత్రి గారు. అంతేకాదు అందుకు తాజాగా మరోసారి ఇమ్రాన్ ఖాన్ అద్భుతమైన నాయకత్వాన్ని ఆయన చెప్పుచేతల్లో పనిచేసిన దళ సభ్యులను అభినందించాడా మంత్రి. దీని అర్థం ఏమిటి. ఇమ్రాన్ ఖాన్ టెర్రరిస్టుల నాయకుడని అంగీకరించినట్టే కదా?

పార్లమెంట్ లో చేసిన ఈ నేరాంగీకారం పాక్ భారత దేశాల్లో సంచలనం కలిగించింది. ఎప్పుడూ అబద్ధాలు ఆడే పాకిస్తాన్ ఒక్కసారి నిజం చెప్పగానే ప్రపంచం నిర్ఘాంత పోయింది. భారత్ ఆశ్చర్యపోయింది. మానవ జాతినే హననం చేసే జాతి హనన ఘోరం ఇంగ్లీష్ లో జినోసైడ్ కు పాల్పడిన పాకిస్తాన్ అందుకు ఒప్పుకోవడం, అది దశాబ్దాలనుంచి అబద్దాలు చెబుతూ వచ్చిన తరువాత నిజం చెప్పడం వల్ల ఇన్నాళ్లూ అబద్దాలు చెప్పుతూ ప్రపంచాన్ని మోసం చేస్తున్నదని తేలిపోయింది.

సర్జికల్ స్ట్రయిక్స్ జరగనే లేదని బుకాయింపు

2019లో ఎన్నికల ముందు భారత్ లో సంచలనం కలిగించిందీ సంఘటన. పుల్వామాదాడికి ప్రతీకారంగా భారత వైమానిక సేనానాయకులు పాకిస్తాన్ లోని బాలకోట్ మీద సర్జికల్ స్ట్రయిక్ చేసింది. ఈ దాడులే జరగలేదని తమకే నష్టమూ సంభవించలేదని పాకిస్తాన్ అబద్దపు ప్రచారంతో ప్రపంచాన్నే మోసం చేసే ప్రయత్నం చేసింది. అదే క్రమంలో పాకిస్తాన్ వైమానిక దళం వారు భారత ఫైటర్ జెట్ లను ధ్వంస చేసే ప్రయత్నంలో ఒక భారత్ జెట్ ను కూల్చేసింది. అందులో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఉన్నాడు. పారాచూట్ తో తాను పొరబాటున పాక్ భూభాగంలో దిగి యుద్ధ ఖైదీగా వారికి దొరికి పోయాడు. కాని భారత్ రాయబార సమరం సాగించింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడికి కాళ్లు వణికాయి. చెమట పట్టింది. భారత్ తో యుద్ధమంటే సర్వనాశనం అని అర్థమయింది. రాత్రి తొమ్మిదిగంటలకు భారత్ దాడిచేస్తుందని భయపడింది. వెంటనే అభినందన్ ను విడుదల చేసింది. లేకపోతే యుద్ధం జరిగేదేమో చెప్పలేము.

సత్యాలు వెల్లడించిన ఆయాద్ సాదిఖ్

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష పాకిస్తాన్ ముస్లింలీగ్ నవాజ్ (పిఎం ఎల్ ఎన్) నాయకుడు, ఎంపీ, ఆయాజ్ సాదిఖ్ ఆనాటి సత్యాలు వెల్లడించారు. అప్పడి విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వణికిపోయారనీ, వెంటనే అభినందన్ ని విడుదల చేయాలని చాలా తొందర పడ్డారని వెల్లడించి సంచలనం సృష్టించారు. తన ప్రసంగంలో ఆయాజ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాడు. ఫుల్వామా తదనంతర పరిణామాలలో పాక్ దుర్బలత్వాన్ని దుయ్యబట్టాడు.

కుల్ భూషణ్ విషయంలో సరైన చర్యలు తీసుకోలేకపోయింది. ఆర్డినెన్స్ తేలేక పోయింది. ఒక అభినందన్ గురించి ఏం చెప్పాలి. ఆనాటి మంత్ర ఖురేషీ తోపాటు సైన్యాధ్యక్షుడు గజగజ వణికిపోయారు. చెమటలు పట్టాయి. ‘ఖుదాకేవాస్తే అభినందన్ కో ఛోడ్ దో’ అని బతిమాలారు. భారత్ 9 గంటలకు దాడిచేస్తుందని తొందర పెట్టారు. ఆ సమావేశానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాలేదు అని చెప్పాడు.

నిజానికి ఇండియా దాడికి రావడం లేదు. పాకిస్తాన్ మాత్రం భయపడిపోయి మోకాళ్లమీద కూలబడిపోయింది. ఖురేషీ కాళ్లు వణుకుతున్నాయి. అందరినీ భయపెట్టాడు. నిజానికి అసలు సమర వాతావరణమే లేదు. అయినా సరే భయపడిపోయారు.

ఆయాజ్ పై ఇమ్రాన్ ఆరోపణ

ఎవరీ ఎంపీ ఆయాజ్ సాదిఖ్? అతనో సాధారాణ నాయకుడు కాదు. ఈనాటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు దీటైన ప్రత్యర్థి. 2013లొ ఇమ్రాన్ నే ఓడించిన నేత. ఆయాజ్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశాడని ఇమ్రాన్ ఆరోపించాడు.
కాని కోర్టులో రుజువు చేయలేకపోయాడు. నిజానికి వీరిద్దరూ ఒకే స్కూల్ లో చదువుకున్నారు. 2013లొ నేషనల్ అసెంబ్లీ లో ప్రసంగాలు చేసిన వారు. మాజీ అధ్యక్షుడు పిఎంఎల్ ఎన్ నాయకుడు నవాజ్ షరీఫ్ కు ఈయన చాలా సన్నిహితుడు. ఆయాజ్ ఇమ్రాన్ ప్రభుత్వ భారత భయాన్ని వెల్లడించాడు. అసలు యుద్ధం వస్తుందా రాదా అనే అంచనా లేకుండా నిజమా పుకారా అనే విచారణ లేకుండా భయపడిపోయారని విమర్శించారు.

ప్రతిపక్ష నాయకుడు విధంగా తమ పరువుదీసిన తరువాత పాకిస్తాన్ మంత్రి ఇమ్రాన్ సన్నిహితుడు, సైన్స్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరీ రెచ్చిపోయారు. పుల్వామా తమ ఘన విజయమని చెప్పుకున్నారు. ఇన్నాళ్లూ అబద్దాలతో కాలం గడిపిన పాకిస్తాన్ మంత్రి అక్టోబర్ 28న ప్రకటన చేస్తూ ఫిబ్రవరి 15, 2019న ఫుల్వామా దాడి చేసి 40మందిని చంపిన ఘనకార్యం గురించి జబ్బలు చరుచుకున్నారు.

‘హం హిందుస్తాన్ కో ఘుస్ కర్ మారా (భారత్ లో ప్రవేశించి వారి సీమలో వారిని దెబ్బ తీశాం). ఇది ఇమ్రాన్ నాయకత్వంలో ఈ జాతి దిగ్విజయం అన్నాడు. పాక్ పార్లమెంట్ లో పాక్ మంత్రి చేసిన నేరాంగీకారం ఇది.

పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు

ఆయాజ్ ల మాటలు పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించాయి. అయితే వాస్తవం ఏమంటే పాకిస్తాన్ కు భారత్ నుంచి యుద్ధ హెచ్చరికను తోసి పుచ్చడానికి వీల్లేని విషయం. బాలాకోట్ దానికి ఒక మచ్చుతునక. అందుకే భయపడింది. పాక్ భయం నిజం, భయానికి కారణం భారత్ అనేది కూడా నిజం. ఇదే విషయం భారతవైమానిక దళ ముఖ్యుడు ఎయిర్ ఛీఫ్ మార్షల్ బిఎష్ ధనోవా పాకిస్తాన్ నేరాంగీకారానికి ప్రతిస్పందిస్తూ అప్పుడు భారత వైమానిక దళం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పోస్ట్ లన్నింటిని ధ్వంసం చేయడానికి సర్వసన్నధ్దంగా ఉండింది అన్నారు.

పుల్వామా ఉగ్రదాడి తామే చేసినట్లు ప్రకటించి ఈ దుశ్చర్యను తమకు గర్వకారణమని కూడా అభివర్ణించిన పాకిస్తాన్ బండారం బయటపడిన తరువాత, ఇప్పుడు అదేమీ లేదని ప్రచారం మొదలు పెట్టింది. పాక్ మంత్రి ఫవార్ చౌధురి తన మాటలు తాను అనలేదని యూటర్న్ తీసుకున్నాడు. ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదనీ, తన వ్యాఖ్యలను వక్రీకరించారనీ పాక్‌ మంత్రి ఫవాద్‌ చౌధురి మాటమార్చి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది. పాక్ కుటిల నీతి మరోసారి ప్రపంచానికి తేటతెల్లమయ్యింది. అభినందన్‌ను అప్పగించడమే వైఫల్యం అంటూ ప్రతిపక్షాలు ఇమ్రాన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ విమర్శలకు బదులిచ్చే బదులు పాక్ మంత్రి ఫవాద్ విపక్షాల విమర్శల ఉచ్చులోపడి పాక్ అధినేతలు పుల్వామా విషయంలో సాగించిన కుట్రలను స్వయంగా అంగీకరిస్తూ పార్లమెంటులో బయటపెట్టడం అందరికీ అర్థమైంది. తన వ్యాఖ్యలను వక్రీకరించారనీ తప్పుడు అన్వయం చేసారని భారత పత్రికలపైన ఆరోపణలు చేస్తే సరిపోతుందనుకుని మళ్లీ అబద్దాలు చెప్పారు.

చంపడాన్ని మేం నమ్మం అంటున్న మంత్రి

‘ఇండియా టుడే’ తో మాట్లాడుతూ ‘‘మేం మరొకరి సీమలో చొరబడి మనుషులను చంపడాన్ని నమ్మం. ఇదంతా ఇండియన్ మీడియా కల్పన. మా ప్రకటనలను వక్రీకరించారు. ఇది హాస్యాస్పదం. ఇది భారత మీడియా పనిచేసే తీరు. నేను ఫిబ్రవరి 26, 2019నాటి సంఘటనలను ప్రస్తావించాను అంతే’’ అన్నాడాయన. భారత్ తో తాను సత్సంబంధాలను కోరుకుంటున్నానని తమకు భారత్ పైన ద్వేషం లేశమాత్రం కూడా లేదని, భారతీయ జనతా పార్టీ మాత్రం పాకిస్తాన్ వ్యతిరేక సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నదని వాదించాడు.
ఇది కేవలం ఓ చిన్న ప్రకటన అయితే వక్రికరించారాలేదా అని ఆలోచించవచ్చు. కాని చాలా వివరంగా ఆయన ప్రసంగించారు. ఇది ప్రకటన కాదు పెద్ద ప్రసంగం. పుల్వామాలో ఇది మా విజయం అన్నాడు. జాతీయ ఘనత అన్నాడు, ఇమ్రాన్ గొప్పనాయకత్వం వల్ల జరిగిందన్నాడు. మీరు మేము అంతా ఈ విజయంలో భాగస్వాములం అన్నాడు.

ఇండియన్ మీడియా వక్రీకరించారనే అనుకుందాం. అయితే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఎందుకు గొడవ జరిగింది. వారి సభ్యులే ఎందుకు విమర్శించారు? మళ్లీ ఫవాద్ చౌదరీ మాట మార్చాడు. ఫుల్వామా సంఘటన తరువాత మేం భారత్ ను గట్టిగా దెబ్బతీసాం. ‘ఫుల్వామాకే వాకియే కే బాద్ జబ్ హమ్నే ఇండియో కు ఘుస్ కే మారా’ అని వివరించాడు. మొదటిది పార్లమెంట్ ప్రసంగం. రెండోది ట్వీట్ సవరణ. మా విమానాలు భారత్ లోని పోరాట క్షేత్రాలను దెబ్బతీసినప్పడు…. మేం అమాయకులను చంపడంలో మా సాహసం చూపబోం. మేము టెర్రరిజాన్ని ఖండిస్తున్నాం అని సవరించుకునే ప్రయత్నం చేసారు.

పాక్ ను బ్లాక్ లిస్ట్ చేయాలి : వికె సింగ్ ప్రకటన

మాజీ సైన్యాధ్యక్షుడు మాజీ మంత్రి వికె సింగ్ ‘‘మంచిది. నేరాన్ని ఇప్పడికైనా అంగీకరించింది పాకిస్తాన్. ఇక ఇప్పుడు ఎఫ్. ఎ. టి. ఎఫ్. ఫైనాన్సియల్ ఆక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ ను బ్లాక్ లిస్ట్ చేయాలి. అన్నారు.
ఆ సంఘటనలు జరిగినప్పుడు అన్ని అనుమానాలు పాకిస్తాన్ పైనే కనిపించాయి. ఇప్పుడు వారు ఒప్పుకున్నారు. మంచిది. ఈ ప్రకటనను భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలి. పాకిస్తాన్ ను నిషేధించడానికి ప్రయత్నించాలి.

పాక్‌ బుద్ధి అందరికీ తెలుసు

ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడంలో పాక్‌ బుద్ధి గురించి తెలియందెవరికి? యావత్‌ ప్రపంచానికీ తెలుసని భారత్‌విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ విమర్శించారు. పుల్వామా ఘటన ఇమ్రాన్‌ సర్కారు సాధించిన ఘన విజయమన్న పాక్‌ మంత్రి ఫవాద్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఐరాస గుర్తించిన ఉగ్రవాదుల్లో అత్యధికులకు పాకిస్థాన్‌ ఆశ్రయమిచ్చిందని భారత్ ఎదురు దాడి చేసింది.

ఫ్రాన్స్ లో టెర్రరిస్టు దాడి

ఫ్రాన్స్ లో ఇస్లామిక్ టెర్రరిజం పడగెత్తింది. అక్టోబర్ 16న ఒక స్కూల్ టీచర్ ను చంపేశారు. సామ్యూల్ పాటీ అనే ఉపాధ్యాయుడు విమర్శ వ్యంగ్యం గురించి పాఠం చెబుతూ ప్రాఫెట్ మహ్మద్ పైన కార్టూన్ ను ఉదాహరణగా చెప్పినాడు. ఛార్లీ హెబ్డో అనే పత్రికలో కొన్నేళ్లకిందట ఈ కార్టూన్ అచ్చయింది. నైస్ అనే నగరంలో చర్చిలో ఇద్దరినీ ఈ టీచర్ ను కత్తితో తలలు తెగకోసి ఘోరంగా చంపారు ఇస్టాం ఉగ్రవాదులు. ఈ పిచ్చి ఉగ్రవాదాన్ని సహించబోమని ఫ్రాన్స్ ప్రసిడెంట్ ఎమ్మాన్యుల్ మాక్రన్ హెచ్చరించారు.

ప్రపంచంలో ఉన్న ముస్లిందేశాలు ఎందుకు ఈ టెర్రరిస్టు చర్యలను ఖండించడం లేదు అని ప్రాన్స్ ప్రజలు విమర్శిస్తున్నారు. భారత్ ఫ్రాన్స్ కు సానుభూతితో పాటు టెర్రరిస్టులమీద పోరాటానికి తన అండదండలు ప్రకటించింది. చిల్లర వ్యాపార రాజకీయాలు ఓటు పోటీలు పక్కకు పెట్టి పాకిస్తాన్ నిజం నేరాంగీకారం ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో ఏకాకిని చేయగలుగుతుందా? లేక అభినందన్ వర్ధమాన్ ను రప్పించాం, ఎన్నికల్లో గెలిచాం, ఇప్పడికి ఇది చాలు అని చతికిల పడుతుందా?

పాకిస్తాన్ ను ప్రపంచమంతా ఖండించే విధంగా రాయబార వ్యూహాలను భారత్ రచించాలి. చైనా తోసహా ఏదేశం కూడా టెర్రరిస్టుపనులు చేసే పాకిస్తాన్ కు సహాయపడకుండా చూడాలి. వారికిచ్చే సాయం ఉగ్రవాదానికి ఉపకరించకుండా చూడాలి. భారత్ ప్రస్తుత కర్తవ్యం అదే.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles