Thursday, March 28, 2024

యూపీలో మైనారిటీల ఇళ్ళు కూల్చివేతను ఆపుచేయండి,సుప్రీంకు మాజీ న్యాయమూర్తుల విజ్ఞప్తి

జస్టిస్ సుదర్శనరెడ్డి, జస్టిస్ గంగూలీ, జస్టిస్ షా, జస్టిస్ చంద్రుడు, ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్ లేఖ

ఉత్తరప్రదేశ్ లో పౌరులపైన ప్రభుత్వాధికారులు అణచివేత, దౌర్జన్య చర్యలను సూమోటూగా పరిగణనలోకి తీసుకొని విచారించవలసిందిగా కొందరు సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, సినియర్ అడ్వకేట్లూ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు.

ప్రయాగరాజ్ లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు జావెద్ మహమ్మద్ ఇంటిని బుల్డోజర్లు నేలమట్టం చేసిన తర్వాత పన్నెండుమంది ప్రముఖులు సంతకాలు చేసిన లేఖ ద్వారా ఈ విజ్ఞప్తి చేశారు.ఇస్లాంపైన భారతీయ జనతాపార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జరిగిన ప్రదర్శనల వెనుక జావెద్ ఉన్నాడనే ఆరోపణపైన ఇంటిని కూల్చివేశారు. ఈ నిరసన ప్రదర్శనలు 10 జూన్ 2022న దేశవ్యాప్తంగా జరిగాయి. నిరసన ప్రదర్శనలు జరిగిన తర్వాత కీలకమైన కుట్రదారుల పేర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. దరిమిలా కాన్పూర్, షహరాన్ పూర్, ప్రయాగ్ రాజ్ లలో నిందితులు అక్రమ నివాసాలలో ఉంటున్నారని ఆరోపిస్తూ వారి ఇళ్ళు కూల్చడం ప్రారంభించారు. నిజానికి ప్రయాగరాజ్ లో కూల్చిన ఇల్లు జావెద్ మహమ్మద్ భార్య పేరు మీద ఉన్నది. నోటీసు జావెద్ కు ఇచ్చారు. నోటీసు ఇవ్వడానికీ, ఇల్లు కూల్చడానికి మధ్య వ్యవధి లేనేలేదు.

నిరసన ప్రదర్శనకారులు చెప్పేది వినకుండా, ప్రశాంతంగా నిరసన ప్రదర్శన జరిపినవారిపైన యూపీ ప్రభుత్వం ప్రోత్సాహంతో అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం అన్యాయమని లేఖపైన సంతకాలు చేసిన న్యాయప్రవీణుల అన్నారు.

ఈ లేఖపైన సంతకాలు చేసినవారిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ బి. సుదర్శనరెడ్డి, జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ ఏకే గంగూలీ, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత లా కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఏపీ షా, మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్, తదితరులు ఉన్నారు.

నేరం చేసినవారిపైన గట్టి చర్యలు తీసుకోవాలనీ, వారిపై తీసుకున్న చర్యలు చూసి ఎవ్వరూ నేరం చేయకుండా ఉండేవిధంగా కఠినంగా వ్యవహరించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారులకు ఉద్బోధించారనీ, ఈ కారణంగానే అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనీ లేఖ పేర్కొన్నది. చట్టవ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసేవారిపైన జాతీయ భద్రతాచట్టం 1986నూ, ఉత్తరప్రదేశ్ గాంగ్ స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిస్ట్ (ప్రివెంన్షన్)యాక్ట్ 1986నూ ప్రయోగించాలని కూడా ఆదిత్యనాథ్ చెప్పారు. ఈ ప్రోద్బలంతోనే పోలీసు అధికారులు నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నవారిని చిత్రహింసలకు గురి చేశారనీ, క్రూరంగా హింసించారనీ లేఖలో న్యాయమూర్తులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు.

నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు 300 మందిని అరెస్టు చేసి వారిపైన ఎఫ్ ఐఆర్ బనాయించారని లేఖ తెలియజేసింది. నిరసనలో పాల్గొన్న యువకులను లాఠీలతో కొట్టడం, వారి ఇళ్ళు కూల్చివేయడం, ముస్లిం మైనారిటీలకు చెందిన యువకులను వెంటబడి తరమటం, వారిని పశువులను కొట్టినట్టు కొట్టడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయనీ, ఇవి జాతి హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయనీ లేఖ వివరించింది. ఇటువంటి క్రూరమైన పోలీసు చర్యలు చట్టపాలనను అతిక్రమించడమే అవుతుందనీ, పౌరుల హక్కులను ఉల్లంఘించడం అవుతుందనీ న్యాయప్రవీణులు వ్యాఖ్యానించారు. ఈ వైఖరి రాజ్యాంగాన్నీ, రాజ్యం ఇచ్చిన ప్రాథమిక హక్కులనూ అపహాస్యం చేస్తున్నదని వారు అన్నారు.

చట్టాన్ని అమలు చేసే అధికారులూ, ఇతర అధికారుల చర్యలలో నిగూఢమైన లక్ష్యం కనిపిస్తున్నదని లేఖ ప్రస్తావించింది. ఇళ్ళు కూలగొట్టడం అనేది పోలీసు అధికారులూ, సివిలియన్ అధికారులూ కూడబలుక్కొని చేసినట్టుగా కనిపిస్తున్నదనీ, ఇది చట్టానికి అతీతంగా శిక్ష విధించడం కిందికి వస్తుందనీ, దాన్ని ప్రభుత్వ విధానంగా చెప్పడం చట్టవ్యతిరేకమనీ అన్నారు.

ఇటీవలికాలంతో సహా చాలా సందర్భాలలో న్యాయవ్యవస్థ ఇటువంటి సవాళ్ళను ఎదుర్కొని ప్రజల హక్కుల రక్షణకు కట్టుబడిన వ్యవస్థగా నిరూపించుకున్నదనీ అంటూ 2020లో కోవిడ్ సందర్భంగా విధించిన నిర్బంధాల కారణంగా సంచారకార్మికుల వెతలకు సంబంధించి, పెగాసెస్ అంశానికి సంబంధించి న్యాయస్థానం సూమోటూగా విచారించిన సందర్భాలను లేఖ ప్రస్తావించింది. ఇదే స్ఫూర్తితో  ఈ  విషయాన్ని సైతం సూమోటూగా స్వీకరించి ఉత్తర ప్రదేశ్ లో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని కాపాడవలసిందిగా లేఖ కోరింది. ముఖ్యంగా పోలీసుల ఆధిక్య ప్రదర్శననూ, పౌరుల ప్రాథమిక హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాయడాన్నీ నివారించాలని విజ్ఞప్తి చేసింది. ఈ విపత్కర పరిస్థితులలో సుప్రీంకోర్టు బాధ్యతగా వ్యవహరిస్తుందనీ, రాజ్యాంగాన్నీ, ప్రజలను పరిరక్షిస్తుందనే ఆశాభావాన్ని లేఖకులు వెలిబుచ్చారు.

విధివిధానాలు పాటించకుండా ఉత్తర ప్రదేశ్ లో ఇళ్ళు కూల్చివేయడాన్ని ఆపుచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో జమాయిత్ ఉలామా-ఇ-హింద్ అనే సంస్థ రెండు కొత్త  పిటిషన్లను దాఖలు చేసింది. వాటిని విచారణకు స్వీకరించిందీ, లేనిదీ తెలియదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles