Monday, May 27, 2024

బ్రాహ్మణ కార్పొరేషన్ల రాజ్యాంగ ఉల్లంఘన

దక్షిణాది రాష్ట్రాలలో బ్రాహ్మణుల అభివృద్దికోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ గురించి ఇండియన్ ఎక్స్ ప్రెస్ (ముంబయ్ ఎడిషన్) సెప్టెంబర్ 8 నాటి సంచికలో ఆ పత్రిక కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ ప్రతాప్ భాను మెహతా రాసిన వ్యాసం చర్చించదగినది. అందులోని ముఖ్యాంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ప్రతాప్ భాను మెహతా ఇటీవలి వరకూ దిల్లీలోని అశోకా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేశారు. ప్రభుత్వం నుంచీ, పాలకపక్షం నుంచీ ఒత్తిళ్ళ కారణంగా ఆ బాధ్యత నుంచి విరమించుకున్నారు. అంతకు క్రితం అశోకా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ గా పని చేశారు. ఆయన వ్యాసం సారాంశం ఇది:

లౌకికవాదం, సామాజిక న్యాయం అనేవి చిత్రమైన, పసలేని సిద్ధాంతాలు. ఈ విషయం స్పష్టంగా తెలుసుకోవాలంటే ఇందుకు తాజా ఉదాహరణలుగా నిలిచే బ్రాహ్మణ సంక్షేమ పథకాలను పరిశీలించాలి. ఈ పథకాలు దక్షిణాది రాష్ట్రాలలో అమలు జరుగుతున్నాయి. బ్రాహ్మణుల సంక్షేమం కోసం వెలసిన సంస్థలను బలపరిచే తెలంగాణ బ్రాహ్మిణ్ సంక్షేమ పరిషత్ లేదా ఆంధ్రాబ్రాహ్మిణ్.ap.govt.in లేదా కర్ణాటక స్టేట్ బ్రాహ్మిణ్ డెవలప్ మెంట్ బోర్డ్ వెబ్ సైట్లు కొత్త కథ చెబుతున్నాయి. ఈ మూడు వెబ్ సైట్లలో ఒకే రకమైన టెంప్లేట్ (నమూనా) ఉంది. స్కాలర్ షిప్స్, విదేశీ విద్యకు మద్దతు, ఏవైనా సంస్థలు నెలకొల్పుకోవడానికి ఆర్థిక సహాయం, బ్రాహ్మణుల స్వయంసహాయక బృందాలకు సహాయం, కోచింగ్ కోసం డబ్బు, మరి కొన్ని ప్రయోజనాలూ ఉంటాయి.

కర్ణాటకలో పేద అర్చకులను పెళ్ళి చేసుకున్న యువతులకు చెరి మూడు లక్షల రూపాయల ప్రభుత్వ సహాయం అందిస్తారు

పేదలందరికీ రాజ్యం సహాయం అందాలి

అన్ని సామాజికవర్గాలలోని పేదలకు రాజ్యం సహాయం చేయవలసిందే. కానీ ఈ పథకాల రూపకల్పనలో రాజ్యాంగ విలువలకు సమాధి కట్టారు. కులానికి పట్టం కట్టారు. కులానికి సంబంధించిన అత్యంత హేయమైన అంశాలు ఇందులో ఉన్నాయి. వేదవిద్యకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వేదవ్యాస పథకాన్ని ప్రవేశపెట్టింది. వేదవిద్యను రాజ్యం బలపరచడం లౌకికవిధానానికి అనుగుణమా కాదా అనే ప్రశ్నను పక్కన పెడదాం. ఈ విద్య పొందే అర్హత ఎవరికి ఉంది? విద్యార్థుల పుట్టుకతో బ్రాహ్మణ కులానికి చెందినవారై ఉండాలి. ఈ పథకాలకు అర్హత సంపాదించాలంటే కుల సర్టిఫికేట్లు సమర్పించాలని తెలంగాణ, కర్ణాటకలోని బ్రాహ్మణ సంక్షేమ సంస్థలు కూడా అంటున్నాయి. పుట్టుక ప్రాతిపదికగా అర్హత ప్రసాదించే వృత్తిని 21వ శతాబ్దంలో రాజ్యం బలపరచడం అన్నది ఊహించుకోగలమా? వేదవిద్య అంత మంచిదైతే అన్ని కులాలవారిని కొన్ని నియమాలకు లోబడి అర్హులను ఎందుకు చేయకూడదు? ఈ విద్యను రాజ్యం వివక్షాపూరితంగా బ్రాహ్మణకులంలో పుట్టినవారికే పరిమితం ఎట్లా చేస్తుంది? రాజ్యాంగ పరీక్షకు ఇది నిలబడజాలదు. దీని అన్వయం మరింత అధ్వానంగా ఉంది. బ్రాహ్మిణ్ పరిషద్. తెలంగాణ. గవ్.ఇన్ ఈ విధంగా ప్రకటించింది: బ్రాహ్మిణ్ అంటే “Broad and Brilliant in Thinking, Righteous and Religious in Livelihood, Adroit and Adventurous in Personality, Honesty and Humanity in Quality, Modesty and Morality in Character, Innovation and Industry in Performance and Nobility and Novelty in Approach.” తెలంగాణలో కుల సర్టిఫికేటులో గోత్రం వివరాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం హరిద్వారలో పండితుడి పాత్ర పోషిస్తున్నదని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పథకానికి వేదవ్యాసుడి పేరు పెట్టడంలో కొండంత అజ్ఞానం ఉంది. ఈ పథకం కింద వేదవ్యాసుడిని బ్రాహ్మణుడిగా పరిగణించడానికి వీలులేదు. నడవడిక వల్ల కాకుండా పుట్టుకవల్ల బ్రాహ్మణుడిగా నిర్ణయించే పద్ధతిని మహాభారతం కూడా ఒప్పుకోదు. ఇక్కడ ఒక ఆధునిక, లౌకిక రాజ్యం కులంపునాదిపైన నిర్ణయాలు తీసుకుంటున్నది.

బ్రాహ్మణులలో కొందరు పేదరికంలో మగ్గుతున్న మాట నిజం

కొంతమంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గుతున్నారు. వారికి సహాయం అవసరం. ఈ వాస్తవాన్ని ఎవ్వరూ కాదనరు. కానీ కులం ప్రాతిపదికగా పథకాలు పెట్టడం ఎందుకు? ఉదాహరణకు బెస్ట్ (BEST-Brahmin Entrepreneurship for Telangana) పథకం ఉన్నదనుకోండి. ఏడాదికి రెండు లక్షల రూపాయలకంటే తక్కువ ఆదాయం ఉన్న ఔత్సాహికుడికి సహాయం చేయడం అన్నది ఆచరించదగిన లక్ష్యం. అయితే, రెండు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఎవరైనా ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులై ఉండాలని రాజ్యాంగంలోని 14వ అధికరణ నిర్దేశిస్తుంది. ఐఎఎస్ కోచింగ్ కి నిధుల ఇవ్వడం ఎందుకు? స్వయంసహాయక బృందాలను ఏర్పరచుకోవడానికి నిధులు ఎందుకు ఇవ్వడం? విదేశీ విద్యకు నిధులు ఎందుకు ఇవ్వాలి? బ్రాహ్మిణ్ కనుక ఈ సదుపాయాలు కల్పించాలా? బ్రాహ్మిణ్ వరుడికి వధువు దొరికితే ప్రోత్సాహకాలను కర్ణాటక ప్రభుత్వం ఇస్తోంది. అంటే పెళ్ళి చేసుకోవాలని కోరుకునే బ్రాహ్మణ యువకులకు పిల్లలు దొరకడం లేదన్నమాట. ఇది వేదం విలువలనూ, రాజ్యాంగ విలువలనూ వక్రీకరించడం కాదా?

దళితులు వేరు, వెనుకబడిన కులాలవారు వేరు

దళితుడిని అర్హుడిగా పరిగణించడానికి కులం ఆధారమైనప్పుడు బ్రాహ్మణుడికి ఎందుకు కాకూడదనే వాదన వస్తుంది. ఇది సామాజిక న్యాయ సూత్రాల వక్రీకరణ. మండల్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత సామాజిక న్యాయ వాదనలో వచ్చిన మార్పు ఇది. చారిత్రక వివక్ష వేరు వెనుకబాటుతనం, పేదరికం వేరు అనే స్పృహ లేని కారణంగా ఈ వాదన తెస్తున్నారు. భారత దేశంలో కులం అనేది పాతుకపోయిందనే వాస్తవాన్ని ఎవ్వరూ కాదనరు. అంతమాత్రాన, దళితులనూ, అటువంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నవారినీ మినహాయించి, వెనుకబడినతనాన్ని తొలగించాలంటే కులాన్ని ప్రస్తావించడం తప్పని సరి అనుకోకూడదు. కుల ప్రస్తావన లేకుండా ఈ పథకాల ద్వారా చేయదలచుకున్న ప్రయోజనాలు – స్కాలర్ షిప్పులూ, విద్యాసంస్థలలో ప్రవేశాలలో ప్రాధాన్యత, ఆదాయాలు పెంచడానికి ప్రోత్సాహకాలూ, గృహవసతి, విద్య, ఆరోగ్యం, రుణాలూ- అన్నీ సమకూర్చవచ్చు.

రాజకీయాలలో ఇది చూపించే ప్రతీప విధానం, వెనకడుగువేసే పద్ధతి గురించి ఆలోచించండి. వివక్షను అధిగమించేందుకు కులాన్ని కొలబద్దగా పెట్టుకోవడం ఒక పద్ధతి. కానీ కులమే ప్రధానమైన, అనివార్యమైన గుర్తింపుగా చేయడం వేరే విషయం. కులధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని రాజ్యం అడగడం సామాజికన్యాయాన్ని తలకిందులుగా నిలపెట్టడమే. జాతి ఆధారంగా జనాలను సమీకరించేందుకు రాజకీయాలనూ, ప్రభుత్వ విధానాలనూ విపరీతమైన వక్రీకరణతో అడ్డగోలుగా ఉపయోగిస్తున్నారు. దళితులు కులం కారణంగా పేదవారు కనుక వారిని ఆ విధంగా గుర్తించాలి. ఇప్పుడు పేదవారందరినీ వారికులం పేరుతో రాజముద్ర వేసి శాశ్వతంగా గుర్తించాలని ప్రభుత్వం పట్టుదలతో ప్రయత్నిస్తోంది. మీకు రెండు లక్షలకంటే తక్కువ వార్షికాదాయం ఉన్నదా? అయితే మా పథకం కింద ప్రయోజనం పొందడానికి బ్రాహ్మణ కుల సర్టిఫికేటు సంపాదించండి. పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదా? మీరు బ్రాహ్మణులైతే మేము సహాయం చేయగలం. భారత దేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలలో దళితుల సంక్షేమానికీ, ప్రజాసంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నారు. కానీ అన్ని రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు తమను తాము పాత హిందూ చక్రవర్తులం అనుకుంటున్నారు. కులవ్యవస్థపైప పెత్తనం చేస్తూ కులాల ప్రాతిపదికగా ప్రయోజనాలు సమకూర్చడమే తమ విధానమని అనుకుంటున్నారు. కులాన్ని అధిగమించే కులవిమోచన దృక్పథం లేనేలేదు. కులాన్ని అధిగమించాలంటే కులాలను గుర్తించాలనే లోహియా ఆలోచన సామాజికంగా ఊహాజనితమైనదిగానే కనిపిస్తోంది.

భ్రష్టు పడుతున్న లౌకిక విధానం

లౌకిక విధానం గురించి కూడా ఆలోచించండి. హాజ్ యాత్రికులకు సబ్సిడీలను ఉపసంహరించుకున్నట్టే లౌకికవిధానంపైన కూడా దెబ్బపడింది. లౌకికవాదం గురించి భారతదేశంలో ఆలోచిస్తున్న విధానంలో సవరించుకోవలసిన లోపాలు అనేకం ఉన్నాయి. ముందు వాటిని అర్థం చేసుకోవాలి. సూడో సెక్యులరిజం గురించి అతిగా మాట్లాడేవారికి సెక్యులరిజంపట్ల విశ్వాసం లేదు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని వారిపట్ల వివక్ష భావన కలిగించేందుకు సాకుగా వారు సెక్యులరిజం గురించి మాట్లాడుతారు. ఈ లోగా సెక్యులరిజం భ్రష్టుపట్టడం నిరాఘాటంగా సాగిపోతోంది.

కులం ప్రాతిపదికగా ప్రయోజనాలు కల్పించే పద్ధతిని కొనసాగించడం, స్థానికులకే విద్యాసంస్థలలో, ఉద్యోగాలలో ప్రాధాన్యం ఇవ్వాలని వాదించడం ఆర్థిక వ్యవస్థ పట్ల నిరాశానిస్పృహలను సూచిస్తున్నాయి. క్రమంగా తగ్గుతూ వస్తున్న ఉద్యోగాలనూ, వనరులనూ కులాల ప్రాతిపదికగా పంచడానికి చేసే ప్రయత్నంలో చాలా గందరగోళం చోటు చేసుకుంటుంది. కానీ ఉద్యోగాలు కానీ వనరులు కానీ పెరగవలసినంత పెరగడం లేదనే విషయం ఎవ్వరూ పట్టించుకుంటున్న దాఖలా లేదు. బ్రాహ్మణులకు ప్రయోజనాలు సమకూర్చడం అన్నది మన రాజకీయాలలో అపభ్రంశాన్ని నిరూపించే హాస్యాస్పద విధానంగా మారవచ్చు. కానీ దాని వెనుక పెద్ద విషాదం ఉంది. దేశంలో అందరి అవకాశాలూ సన్నగిల్లుతున్నాయి. దీనివల్ల ప్రతి ఒక్కరూ తన అస్థిత్వాన్ని సామాజికన్యాయం పేరిట సంకుచితమైన దృక్పథంలో నిర్వచించుకునే దుస్థితి దాపురిస్తోంది.    

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles