Tuesday, September 10, 2024

చెలరేగుతున్న సరిహద్దు వివాదం

  • కర్నాటక, మహారాష్ట్ర నువ్వా-నేనా?
  • భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో మతలబు

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు వివాదం ముదిరి పాకాన పడుతోంది. రెండు రాష్ట్రాల ఉద్యమకారులు పట్టువీడడం లేదు. ఈ ప్రభావం సరిహద్దు ప్రాంతాలపైన పెద్దఎత్తున పడుతోంది. మంగళవారం నాడు బెళగావిలో ఆందోళనలు శృతి మించాయి. మహారాష్ట్రకు చెందిన వాహనాలను ఆపేశారు. వాహనాలపై రాళ్లు రువ్వి అద్దాలను పగలగొట్టేశారు. ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని వుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమన్వయ మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్ తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. అరవై ఏళ్ళ పై నుంచి ఈ కాష్టం కాలుతోంది. భాషా ఆధారిత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సరిహద్దు గ్రామాలు మారిపోయాయి. మరాఠీ మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకలో కలిపేశారని మహారాష్ట్రీయుల వాదన. తమకు చెందిన కొన్ని గ్రామాలను మహారాష్ట్రలో కలిపేసుకున్నారని కన్నడీయుల ఆవేదన. ఎవరి వాదన వారిది. ఈ వాదనలను బలపరిచే సంఘాలు రెండు రాష్ట్రాల్లోనూ ఏర్పడ్డాయి. ఇటీవల కూడా కర్ణాటకవాసులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. దీనితో వివాదం మరింత రాజకుంది. వీటన్నిటికి బెళగావి కేంద్రబిందువుగా మారింది. ఆ ప్రాంతంలో మహారాష్ట్ర కంటే కన్నడ జెండాలే పెద్దఎత్తున రెపరెపలాడుతున్నాయి. పోలీసులు, అధికారులు రంగంలోకి దిగినా ఉద్యమకారులు ససేమిరా అంటున్నారు. అయితే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కోర్టుల్లో ఈ సమస్య ఎన్నడు తీరేను అనే అసహనం ఇరువర్గాల్లో వ్యక్తమవుతోంది.

Karnataka-Maharashtra Border Dispute LIVE Updates: Bommai, Shinde Hold  'Positive Talks' Over Phone; Fadnavis to Discuss Issue with Shah
కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మయ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే

రెండు రాష్ట్రాలలోనూ ఒకే పార్టీ పాలన

నిన్న మొన్నటి వరకూ ఆ రెండు రాష్ట్రాల్లో వేరు వేరు ప్రభుత్వాలు ఉండేవి. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటకలో బిజెపి, మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడం కీలకమని భావిస్తున్న బిజెపికి ఈ అంశం తలనొప్పిగా మారింది. వివాదాస్పద ప్రాంతంలో ఓట్ల సంఖ్య ఎలా ఉన్నప్పటికీ, ప్రజల్లో భావోద్వేగాలను కలిగించే అంశాల పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు అన్ని వ్యవస్థలకు ఉంది. సరే! రాజకీయాలు ఎలాగూ ఉంటాయి. రాజకీయాలు,భావోద్వేగాల మధ్య సామాజిక శాంతిని పరిరక్షించడం కత్తి మీద సాము వంటిది. కర్ణాటకలో కన్నడ ప్రధానమైన భాష అయినప్పటికీ మరాఠీ, కొంకణి, తుళు, తమిళం, తెలుగు, సంస్కృతం మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు వివాదం రగులుతున్న బెళగావి ప్రాంతం బ్రిటిష్ పాలనా కాలంలో బాంబే ప్రెసిడెన్సీలో ఉండేది. ఆ సమయంలో 64శాతంమందికి పైగా కన్నడీయులు ఉండేవారు. మరాఠీ మాట్లాడేవారు 26 శాతం ఉండేవారు. స్వాతంత్ర్యానంతర కాలం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన కాలంలో ఇరు భాషీయుల సంఖ్యలు మారుతూ వచ్చాయి.

Also read: వర్థిల్లుతున్న జర్ననీ – భారత్ సంబంధాలు

తక్షణ పరిష్కారం పరమావధి

చారిత్రకంగా, బెళగావి మొదటి నుంచీ  కన్నడ రాజ్యానికి చెందినదే. మరాఠా రాజ్యం ప్రబలిన తర్వాత కూడా అనేక మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యం నుంచి ప్రస్తుతానికి వస్తే కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఈ ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 2 వేల కోట్లతో నీటి పారుదల ప్రాజెక్టులను ప్రకటించింది. కానీ, అక్కడ ప్రజలు ఆ ప్రాజెక్టుపై తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు. ఈ అంశాలు రెండు ప్రభుత్వాల మధ్య అగాధం సృష్టించాయి. ఇలా ప్రజలు, ప్రభుత్వాల మధ్య విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి. సత్వరమే ముగింపు పలకడమే తరుణోపాయం.

Also read: భారత సారథ్యంలో జీ-20 ప్రయాణం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles