Wednesday, April 24, 2024

గంటకో మలుపు తిరుగుతున్న బోయిన్ పల్లి కిడ్నాప్ ఉదంతం

  • భార్గవ్ రామ్ కోసం బెంగళూరులో గాలిస్తున్న పోలీసులు
  • చంచల్ గూడా మహిళా జైలులో అఖిలప్రియ
  • సుబ్బారెడ్డిని విచారించి వదిలేసిన పోలీసులు
  • (సకలం ప్రత్యేక ప్రతినిధి)

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలలు బెంగళూరు పయనమై వెళ్ళాయి. మంగళవారం రాత్రి భార్గవ్ బెంగళూరుకు పారిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. అతడు బెంగళూరులోనే ఉన్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది.

అఖిలప్రియ చంచల్ గూడా జైలులో

తెలంగాణ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేసిన భూమా అఖిలప్రియను గాంధీ ఆస్పత్రికి తరలించి, వైద్యులకు చూపించారు. ఆస్పత్రిలో కొంతసేపు స్పృహతప్పి మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత సికిందరాబాద్ జడ్జి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ కు పంపించారు. ప్రస్తుతం ఆమె చంచల్ గూడా జైలులో ఉన్నారు.

సుబ్బారెడ్డి విడుదల

ప్రవీణ్ రావు తండ్రి కిషన్ రావుకు సుబ్బారెడ్డి, భూమానాగిరెడ్డిలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కిషన్ రావు వకీలు. తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉన్నారు. హఫీజ్ ఎస్టేట్ లో ఏవీ ఎస్టేట్ అని కొన్ని భూములు ఉండేవి. ఏవీ సుబ్బారెడ్డి కొన్ని భూములు ఆక్రమించుకొని తన పేర బోర్డు పెట్టారు. తర్వాత అది కేపీ ఎస్టేట్ గా మారింది. కిషన్ రావు చనిపోతూ తన పేరు మీద ఉన్న పాతిక ఎకరాలనూ ప్రవీణ్ రావు పేరుకు బదలాయించినట్టు చెబుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డి పాత్రపైన అనేక సందేహాలు ఉన్నాయి. సుబ్బారెడ్డిని విచారించిన తర్వాత పోలీసులు ఆయనను విడిచిపెట్టారు.

ఇది చదవండి: రాష్ట్రపతి పాలనకు తెలుగుదేశం డిమాండ్

కిడ్నాప్ కేసులో ఏ1గా సుబ్బారెడ్డి, ఏ2 గా అఖిలప్రియ ఉన్నారు. సుబ్బారెడ్డిని బుధవారం ప్రశ్నించారు. 2020లో ప్రవీణ్ రావు ఏవీ సుబ్బారెడ్డిపైన ఫిర్యాదు చేయగా మియాపూర్  పోలీసు స్టేషన్ లో ఒక కేసు బుక్ చేశారు. 2016లో ప్రవీణ్ రావు తన ఆరుగురు సోదరులలో మరొకరితో కలిసి హఫీజ్ పేటలో 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దానిపై వివాదం తలఎత్తింది. భూమా నాగిరెడ్డి, సుబ్బారెడ్డి కలిసి ఈ వివాదాన్ని పరిష్కరిస్తామంటూ ముందుకు వచ్చారు. సుబ్బారెడ్డితో ప్రవీణ్ కుమార్ ఒక అంగీకారం కుదుర్చుకున్నాడు. కానీ సుబ్బారెడ్డి భూమానాగిరెడ్డికి చేయవలసిన పనులు చేయలేదు. మోసం చేశాడు. భూమానాగిరెడ్డి మరణం తర్వాత అతని కుమార్తె అఖిలప్రియ ప్రవీణ్ రావు దగ్గరికి వచ్చి తన వాటా తనకు ఇవ్వాలని అడిగారు. ఆ విషయం సుబ్బారెడ్డితో అఖిలప్రియ తేల్చుకోవాలని ప్రవీణ్ రావు స్పష్టం చేశారు. సుబ్బారెడ్డికి తాను ఎంత డబ్బు చెల్లించిందీ అన్ని వివరాలు చెప్పారు. సుబ్బారెడ్డితో మాట్లాడుకోవడానికి బదులు అఖిలప్రియ ప్రవీణ్ రావును బెదిరించడం ప్రారంభించారు. వ్యవహారం చాలా దూరం పోతుందనీ, చాలా మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనీ అఖిలప్రియ ప్రవీణ్ రావును బెదించినట్టు పోలీసులు అంటున్నారు.

కిడ్నాప్ వ్యవహారం

బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కిడ్నాపర్లు బొయినపల్లి బ్రదర్స్ ప్రవీణ్ రావునూ, సునీల్ రావునూ, నవీన్ రావునూ కిడ్నాపర్లు వదిలిపెట్టి వారి సెల్ పోన్లు వారికి ఇచ్చివేసి పరారైనారు. సోదరులు వారి మొబైల్స్ ఆన్ చేయగానే వారు ఎక్కడ ఉన్నదీ పోలీసులు గుర్తించి వారిని సురక్షితంగా తీసుకొని వచ్చి ఇంటికి చేర్చారు. అదే రాత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ బెంగళూరుకు పారిపోయినట్టు పోలీసులకు సమాచారం అందింది.

ప్రవీణ్ రావు కుటుంబసభ్యులు అందజేసిన సమాచారం ప్రకారం మంగళవారం సాయంత్రం గం.7.20 ప్రాంతంలో 10 మంది వ్యక్తులు సివిల్ డ్రెస్ లో వచ్చి తాము ఆదాయంపన్ను శాఖనుంచి తనిఖీలకోసం వచ్చామని చెప్పారు. సెర్చె వారెంట్లు కూడా చూపించారు. ఇల్లు అంతా గాలించారు. ఇంటిలోని వారందరినీ ఒక గదిలో బంధించారు. ముగ్గురు సోదరులను మాత్రం కిడ్నాప్ చేశారు. ఆ సంగతి తెలుసుకున్న కుటుంబసభ్యులు బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాత్రం గం. 11.20లకు అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసి బోయినపల్లి పోలీసు స్టేషన్ కు తీసుకొని వచ్చారు.

ఇది చదవండి: భూమా అఖిలప్రియ అరెస్టు

అంజనీ కుమార్ వెల్లడించిన వివరాలు

బుధవారం మధ్యాహ్నం పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మీడియా గోష్ఠిలో కేసు వివరాలు తెలియజేశారు. బోయిన్ పల్లి సోదరులను కిడ్నాప్ చేసిన గంట సేపటికి సునీల్ రావు భార్య సరిత అంతవరకూ పక్క ఇంట్లో ఉన్నారు. ఆమె ఇంటికి వచ్చి ఇంటిలోని కుటుంబసభ్యులందరినీ ఒక గదిలో బంధించినట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత సీసీటీవ్ ఫుటేజ్ ను పరిశీలించిన కుటుంబ సభ్యుల జరిగింది ఐటీ దాడి కాదనీ, వచ్చినవారు కిడ్నాపర్లనీ, ముగ్గురు సోదరులనూ కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళారనీ, వారితోపాటు వారి లాప్ టాప్ లనూ, మొబైల్ ఫోన్లనూ తీసుకొని వెళ్ళారనీ గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారని అంజనీకుమార్ చెప్పారు. పోలీసులు రాచకొండ కమిషనరేట్ లోని పోలీసులనూ, సైబరాబాద్ పోలీసులనూ హెచ్చరించారు. ఈ కిడ్నాపింగ్ గురించి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా సమాచారం అందించారు.  

ఈ ఘటన కాలక్రమం ఇలా ఉంది:

మంగళవారం సాయంత్రం గం.7.20 : బోవెన్ పల్లిలోని మనోవికాస్ నగర్ లోని ప్రవీణ్ రావు ఇంటిలోకి పదిమంది ఆగంతుకులు ఐటీ అధికారులమని చెప్పుకుంటూ, దబాయించుతూ ప్రవేశించారు.

గం. 7.25లకు ప్రవీణ్ రావునీ, సునీల్ రావునీ, నవీన్ రావునీ ఇతర కుటుంబ సభ్యుల నుంచి వేరు చేశారు. ఇతర కుటుంబసభ్యులను ఒక గదిలో బంధించారు.

గం. 7.27 లకు నవీన్ ని ఒక కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు.

గం. 7.27 లకు సునీల్ ని వేరే కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళారు.

గం.7.32లకు నవీన్ ను మరో కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు.

గం. 8.20లకు పక్క ఇంటి నుంచి సునీల్ రావు భార్య సరిత ఇంటికి తిరిగి వచ్చారు. బెడ్ రూంలో కుటుంబసభ్యులను బంధించారని తెలుసుకొని తలుపులు తెరిచారు.

గం. 8.30కి పోలీసులకు ఎమర్జెన్సీ కాల్ 100 నంబర్ కు వచ్చింది.

గం. 8.35కి పోలీసు బృందం ప్రవీణ్ రావు నివాసానికి చేరుకొని వివరాలు సేకరించడం ప్రారంభించారు.

రాత్రి గం.  9.00 కు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులకు హెచ్చరిక వెళ్ళింది. ఈ లోగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీనీ, మొబైల్ నంబర్ల ద్వారా అవి ఎక్కడ ఉన్నాయో అన్న విషయాన్నీ పరిశీలించారు.

గం. 9.30లకు ముగ్గురు సోదరులనూ మొయినాబాద్ మీదుగా ఒక ఫామ్ హౌజ్ కి తీసుకొని వెళ్లారు. ఆ లోగా వారిచేత కొన్ని పత్రాలపైన బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు.  

తెల్లవారుజామున గం. 3.20కి కిడ్నాప్ చేసిన ముగ్గురు సోదరులనూ కోకాపేట-నార్సింగ్ ప్రాంతంలో విడిచిపెట్టారు.

బుధవారం ఉదయం గం. 11.20 అఖిలప్రియను కుకట్ పల్లిలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బేగంపేట మహిళా పోలీసు స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు.

మధ్నాహ్నం గం. 12.40 కి అఖిలప్రియకు అరెస్టు మెమో ఇచ్చారు. వైద్యపరీక్షకోసం ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

బుధవారం రాత్రి గం. 7.00లకు మాధాపూర్ లో ఒక రెస్టారెంట్ లో సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

అఖిలప్రియదే ప్రధాన పాత్ర

‘‘ భూమిలో వాటా కోసం అఖిలప్రియ (32 ఏళ్ళు), ఆమె భర్త కుట్ర పన్నారు. దుండగుల సాయంతో సోదరులు ముగ్గురినీ కిడ్నాప్ చేశారు,’’ అని అంజనీ కుమార్ వివరించారు.

పోలీసుల అదుపులో ఉన్న అక్క అఖిలప్రియ కోసం భోజనం కేరీర్ తీసుకొని భూమా మౌనికారెడ్డి బేగంపేట పోలీసు స్టేషన్  కు వెళ్ళారు. పోలీసులు ఆమెను అనుమతించలేదు. భోజనం ఇచ్చే అవకాశం కల్పించలేదు. అఖిలను విచారించే ప్రాంతానికి మౌనికను అనుమతించలేదు. కేరీర్ అక్కడే వదిలి అక్కకు ఇవ్వాలని చెప్పి మౌనిక వెనుదిరిగారు.

ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ నూ, శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీనునూ, సాయి, చంటి, ప్రకాశ్ లను నిందితులుగా చేర్చారు. నిందితులపైన 419, 341, 342, 452, 506, 365 ఐపీసీ సెక్షన్ల కింద బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

రాయలసీమ గూండాల ఆట సాగదు : శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా ఉందనీ, రాయలసీమ గూండాయిజం ఇక్కడ నడవదనీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లో బుధవారంనాడు వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి పాలమూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేయడానికి రాయలసీమ గుండాలు ప్రయత్నించారనీ, తాను స్వయంగా రంగంలో దిగిమడుగంటలలోగా మిస్టరీని ఛేదించి కిడ్నాపైన సోదరులను రక్షించామని మంత్రి వ్యాఖ్యానించారు.

తనను చంపడానికి రూ. 50 లక్కల సుపారీ ఇచ్చిన అఖిలప్రియతో కలసి తాను ఎందుకు పని చేస్తానని సుబ్బారెడ్డి అన్నారు. సుబ్బారెడ్డికి భూమానాగిరెడ్డి ఆస్తుల సంబంధించిన సమస్త సమాచారం తెలుసు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles