Monday, June 24, 2024

ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ

  • యూపీ గురించి ఇప్పుడే ఏమీ చెప్పడం  కష్టం
  • కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి చిన్న  పార్టీల ఎత్తులు

ఉత్తరప్రదేశ్ లో రెండో విడత, గోవా, ఉత్తరాఖండ్ లో పూర్తిగా సోమవారం నాడు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ బిజెపి గెలుపుగుర్రం ఎక్కే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నా,అన్ని విడతల ఓటింగ్ పూర్తయ్యేంత వరకూ వేచిచూడాలని పరిశీలకులు చెబుతున్నారు. పంజాబ్ లో బిజెపి అధికారంలోకి రావడం ఆషామాషీ కాదని ఇప్పటి వరకూ వచ్చిన నివేదికలు, క్షేత్రవాస్తవాలను బట్టి అర్థం చేసుకోవాలి. ఎన్నికలు ముగిసిన ఉత్తరాఖండ్, గోవాలో బిజెపికే మళ్ళీ అవకాశాలు ఉన్నాయనే మాటలు గట్టిగా వినపడుతున్నాయి. 70 సీట్లున్న ఉత్తరాఖండ్ లో ఇప్పటి వరకూ (సోమవారం సాయంత్రం) అందిన సమాచారం ప్రకారం 59.51 శాతం పోలింగ్ జరిగింది. హరిద్వార్ లో రికార్డు స్థాయిలో 68.37శాతం నమోదైంది. 2017లో మొత్తంగా 65.66 శాతం నమోదైంది.

Also read: సంజీవయ్య – ఒక సజీవ స్మృతి!

ఉత్తరాఖండ్ లో బీజేపీకి సానుకూలత

ఆ లెక్కన చూస్తే ఓటింగ్ సరళి తగ్గుముఖం పట్టింది. ఈ ఎన్నికలకు సంబంధించిన  సమాచారం పూర్తిగా తెలిస్తే కానీ పోలింగ్ తీరుపై కచ్చితమైన విశ్లేషణ చెయ్యలేం. ఈ రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్, ఆప్, వామపక్షాలు, బీ ఎస్ పీ, సమాజ్ వాదీ మరికొన్ని పార్టీలు బరిలో ఉన్నాయి. ఇన్ని పార్టీలు పోరుదారిలో ఉన్నా, ప్రధానమైన పోటీ బిజెపి -కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో బిజెపి 57 సీట్లు దక్కించుకొని అమేయమైన విజయాన్ని సొంతం చేసుకుంది, 46.5% ఓటింగ్ ను సంపాయించింది. కాంగ్రెస్ పార్టీ 33.5శాతం ఓట్లతో 11 స్థానాల్లో గెలిచింది. 7% ఓట్లను పొందిన బహుజన సమాజ్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ కు సీట్లు తక్కువే ఉన్నా,33.5శాతం ఓటర్లు ఉన్నారు. అత్యధిక మెజారిటీతో 2017లో అధికారాన్ని సొంతం చేసుకున్న బిజెపి ప్రయాణం సాఫీగా సాగలేదు. అవినీతి ఆరోపణలు,అంతర్గత విభేదాలతో వరుసగా ముఖ్యమంత్రులను మార్చుకుంటూ వచ్చింది. ఈ తీరు రాష్ట్రపార్టీలో అనిశ్చితిని నెలకొల్పింది. ఓటర్లపై కూడా ఎంతోకొంత ప్రభావాన్ని చూపిస్తుంది. రాబోయే కాలంలోనూ ముఖ్యమంత్రులను మారుస్తారని అపనమ్మకంలోకి ఆ రాష్ట్ర అగ్రనేతలంతా వెళ్లిపోయారు. ఆ విధంగా పార్టీ భవిష్యత్తుపై విశ్వాసం కలిగించడంలో బిజెపి అధిష్టానం విఫలమైందనే చెప్పాలి. ఈ వైఫల్యాలను సొమ్ముచేసుకొని వుంటే కాంగ్రెస్ పరిస్థితి మరింత మెరుగై ఉండేది. ప్రస్తుత ఎన్నికల సరళిని చూస్తుంటే సీట్లు తగ్గినా బిజెపి మళ్ళీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని వినపడుతోంది. ‘దైవభూమి’గా ఉత్తరాఖండ్ కు ఎంతో ప్రసిద్ధి ఉంది. సంప్రదాయ హిందుత్వ వాదులు, బ్రాహ్మణులు ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. దేశంలోనే అత్యున్నతంగా 25%-28% జనాభా బ్రాహ్మణ సామాజిక వర్గమే ఉంది. 82.97 శాతం మంది హిందువులే ఉన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని బిజెపి హిందుత్వ ఎజెండా ఎక్కువ ప్రభావం చూపే రాష్ట్రాలలో ఉత్తరాఖండ్ ఉంటుందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో చెప్పుకోతగ్గ ప్రగతి లేకపోవడం, కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ బిజెపి అధికారంలో ఉండడం, హిందుత్వ ప్రభావం మొదలైనవి బిజెపికి కలిసొచ్చే అంశాలని విశ్లేషకుల అభిప్రాయం. పోలింగ్ సర్వేలు కూడా బిజెపి వైపే మొగ్గుచూపిస్తున్నాయి. వీటన్నిటిని బేరీజు వేసుకుంటే  ఉత్తరాఖండ్ లో మళ్ళీ బిజెపి అధికారం చేపడుతుందని భావించాలి.

Also read: ‘హూ’ నుంచి చల్లని కబురు

గోవాలోనూ బీజేపీకే అనుకూల వాతావరణం

గోవాలో ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు 78.94 శాతం పోలింగ్ జరిగింది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో 82.56 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల సమాచారం సమగ్రంగా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉన్న గోవాలో కాంగ్రెస్, జి ఎఫ్ పి, తృణమూల్ కాంగ్రెస్, ఎంజిపి, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికల రణక్షేత్రంలో ఉన్నాయి. ఇప్పటి వరకూ అందిన నివేదికలు, క్షేత్ర పరిస్థితులు, సర్వేలను బట్టి బిజెపి మళ్ళీ అధికారాన్ని చేపడుతుందని చెప్పాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో ప్రధానమైన పోటీ కాంగ్రెస్ -బిజెపి మధ్యనే సాగింది. 28.4శాతం ఓట్లతో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకున్నా,13 స్థానాలలో విజయం సాధించిన బిజెపి సామదానభేదదండోపాయాలు ఉపయోగించి, అధికారాన్ని లాక్కుంది. కాకపోతే, కాంగ్రెస్ కంటే 4శాతం ఓటర్లను ఎక్కువ సంపాయించింది. కాంగ్రెస్ నాయకత్వం సమర్ధంగా ఉండిఉంటే పోయినసారి అధికార పీఠాన్ని పోగొట్టుకునేది కాదు. ఈ ఐదేళ్ళల్లోనూ పెద్దగా పరిణితి,ప్రగతి సాధించిన దాఖలాలు కనిపించడం లేదు. అందులో అధిష్టాన వైఫల్యం పూర్తిగా ఉంది.  మాజీ కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యంతో అకాల మరణం చెందడం బిజెపికి చాలా పెద్ద నష్టం. కాంగ్రెస్ పార్టీ బలహీనతను పసిగట్టిన మిగిలిన విపక్షాలు ఈసారి గోవాపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టాయి. వాటిల్లో ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ ప్రధానమైనవి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరిచే అవకాశముందనే మాటలు వినపడుతున్నాయి. కేజ్రీవాల్ – మమతా బెనర్జీ ఇద్దరూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశ్యంతో మిగిలిన రాష్ట్రాల్లోనూ విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడ బహుముఖమైన పోటీ కనిపిస్తోంది. మెజారిటీ అభిప్రాయాల ప్రకారం బిజెపికే మళ్ళీ పీఠం దక్కుతుందని అంచనా వెయ్యవచ్చు. అసలు ఫలితాలు ఎలా ఉంటాయి, అధికారం ఎవరిని వరిస్తుందో  అనే ఉత్కంఠకు మార్చి 10వ తేదీనే తెరపడుతుంది.

Also read: తెలుగు సినిమాకు మంచి మలుపు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles