Friday, March 29, 2024

బడ్జెట్ తో ఎన్నికల రాజకీయాలా …?

  • దేశ సమగ్ర అభివృద్ధిని విస్మరించిన కేంద్రం
  • ఫెడరల్ స్ఫూర్తిని వంచిస్తూ బడ్జెట్ రూపకల్పన
  • పక్షపాత రాజకీయాలకు ఆద్యం పోస్తున్న పాలకులు
  • తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం

దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూసిన ఈ 2021 -22 సంవత్సరం కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు మరోసారి అన్యాయం జరిగింది. తెలుగు రాష్ట్రాలకే కాదు 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలున్న మన విశాల భారత దేశంలో కేవలం పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి వంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అగ్రతాంబూలం, ప్రత్యేక తాయిలాలు, ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టులు దక్కాయి. కేంద్ర బడ్జెట్ లో సుమారు 3 లక్షల కోట్లను నిస్సిగ్గుగా మరో రెండు-మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న ఈ ఐదు రాష్ట్రాలకే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించారు!

ఈ ఎన్నికల బడ్జెట్లో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలమ్మ తన సొంత రాష్ట్రం తమిళనాడుకైతే ఒక్క రోడ్ల ప్రాజెక్టుల కోసమే దాదాపు లక్ష కోట్లను మరీ ప్రత్యేకం గా తనకు తానే కేటాయించుకోవడం దేశం ఏమైపోతే మాకేం, మా సొంత అవసరాలు, స్వప్రయోజనాలే పరమావధి అనే రాజకీయ దిగజారుడుతనానికి, బరితెగింపు రాజకీయాలకు పరాకాష్ట! ఇది వంచన, పక్షపాతం కాదా! దీన్నే జాతీయ సమాఖ్య-సమైక్యత అంటారా ?

బడ్జెట్ రూపకల్పనలో తెలుగు రాష్ట్రాల- తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఏమాత్రం పట్టించుకోలేదు. తెలుగు ప్రజలకిచ్చిన విభజన హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా, తెలుగు ప్రాంతాలకు, ప్రాజెక్టులకు, అభివృద్ధికార్యక్రమాలకు ఒక్క ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా, పూర్తిచేయకుండా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలమ్మ తన మెట్టినింటికి, కేంద్ర పెద్దలు అంతా కలిపి తెలుగువారికీ మరోసారి తీరని అన్యాయం చేశారు.

Also Read: ఆరు స్తంభాల ఆత్మ నిర్భర బడ్జెట్

కనీసం సాటి కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు దక్కినవాటిలో కొంచెం కూడా తెలుగు రాష్ట్రాలకు కలిపికూడా దక్కకపోవడం గమనార్హం! ఇంతకన్నావంచన గానీ, పక్షపాతం గానీ ఇంకా ఏముంటుంది?… ఇదేనా మన పవిత్ర భారత రాజ్యాంగం ప్రవచించిన ఫెడరల్ – సమాఖ్య స్ఫూర్తి….?

2014 జనరల్ ఎలక్షన్స్ లో అప్పటి ప్రధాని అభ్యర్థి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ “సోనియా గాంధీ – కాంగ్రెస్ పార్టీ కలిసి చాలా అన్యాయం గా మర్డర్ చేసి తెలుగు తల్లి ని నిలువుగా కోసేశారు, కన్నతల్లిని చంపి బిడ్డను తీశారు. మేమైతే తల్లినీ, బిడ్డనూ కాపాడేవాళ్ళం, ఎంతబాగానో చూసుకొనేవాళ్ళం ఆంధ్రాకు అన్యాయం జరిగింది.. న్యాయం చేస్తాం… అధర్మం జరిగింది… ధర్మం గా చేయవలసినవన్నీచేస్తాం…” అంటూ ఎన్నో ప్రగల్భాలు పలికారు. ఉత్తుత్తి హామీలిచ్చి గత ఏడేళ్లుగా ప్రతి బడ్జెట్ లోనూ క్రమం తప్పకుండా ఇచ్చిన హామీలేమీ నెరవేర్చకుండానే చేతులు దులిపేసుకుంటున్నారు.

ఒక రకంగా తెలుగు తల్లిని మోడీ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కలిపి మర్డర్ చేస్తే తెలుగుతల్లి, బిడ్డలను బీజేపీ పార్టీ, మోడీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చంపుతున్నారు. తద్వారా, సోనియా గాంధీ – కాంగ్రెస్ పార్టీ తెలుగు వారికి చేసిన అన్యాయానికి పదిరెట్లు ఘోర అన్యాయం మోడీ – బీజేపీ పార్టీ తెలుగు వారికి, ఆంధ్రా ప్రజలకు చేశారు. చేస్తున్నారు. ఇది నిజం కాదంటారా.. ?

ఇకపోతే, ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ వస్తుసేవల పన్నురేట్లను తగ్గించలేదు. పైగా, పెట్రోల్, డీజిల్‌తో సహా పలు ఉత్పత్తులపై సెస్‌లు విధించారు. ఇప్పటికే, పెట్రోలు, డీజిలు ధర వంద రూపాయలకు చేరువగా ఉంది. ఇది పగటి దోపిడీ కాదా ? ఈ సెస్‌లు రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలకు, ధరల పెరుగుదలకు కారకాలై ప్రజలకు ఎంతో తీవ్ర మనోవేదన కలిగిస్తాయి. సెన్సెక్స్ బాగా పెరిగింది, సంపన్నులు, బిజినెస్ వర్గాలు, వ్యాపారవేత్తలు ఎంతో సంతోషం గా ఉన్నారు అంటున్నారు. చాలా సంతోషం…!!!

మరి మధ్యతరగతి ప్రజల సంగతేమిటి..? పేదలు, వలస కార్మికులు, కూలీలు, రైతులు, సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల యజమానులు, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలు చాలా వంచనకు గురయ్యారు. సంపన్నులకు, వ్యాపారవర్గాలకు మంచి ప్రయోజనం కలగడంవల్ల సెన్సెక్స్ సూచీ బాగా పెరిగింది సరే… మధ్యతరగతి, పేద ప్రజల ఆవేదన, ఆక్రోశాలకు సంబంధించి ఈ దేశంలో ఏ సూచీలూ లేవు కదా…???

ఇంత జరుగుతున్నా… దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు, ఎన్నో ప్రాంతాలకూ, ఎన్నో కోట్ల ప్రజలకూ ఎంతో అన్యాయం జరుగుతున్నా కొన్ని ప్రకటనలు, కొందరి స్టేట్మెంట్లు, ఇంకొన్ని స్వరాలూ, ఇంకొందరి ఆవేదనలు, మరికొన్ని సన్నాయి నొక్కులు, మరికొందరి తీవ్రస్వరాలు తప్పించి మొత్తమ్మీద ఒకటే మౌనం…!!!… ఎంతో మౌనం…!!!… ఎవ్వరూ గట్టిగా మాట్లాడటానికే, జరిగిన అన్యాయాన్ని ఖండించడానికే భయపడుతున్నారెందుకు…???

Also Read: బడ్జెట్ పద్మనాభాలు పారిశ్రామిక వేత్తలు

“ఈ మౌనం… ఈ బిడియం… ఇదేనా… ఇదేనా… రాజకీయం…” అనిపించేలా ఒకటే మౌనం… అసలు దేశం లో ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు ఉన్నాయా…?… తమ రాష్ట్రాలకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్రంలోని అధికార పక్షాలకు, ప్రతిపక్షాలకు, ప్రజాపక్షాలకు కూడా ఇంత మౌనం ఎందుకు వహిస్తున్నాయి…?

ఈ మౌనవ్రతాలకి కారణమేమిటి…? ఇదేమన్నా భయమా…? మరొకటా..? ప్రజాస్వామ్యం లో ప్రజలకన్నా ఎక్కువెవరు…?… దయచేసి మీ గొంతు విప్పండి… ప్రజలకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ఖండించి, ప్రజలకు న్యాయం జరిగేలా, జరిగేదాకా పోరాడండి… లేకపోతే ఇదే అన్యాయం ప్రతిసారీ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది…?

భారతదేశ సమగ్ర అభివృద్ధిని విస్మరించి కేవలం ఎన్నికల్లో లబ్దికోసం, తమ సొంత పార్టీ అభివృద్ధి కోసం పక్షపాతం చూపిస్తూ పాలకులు చేస్తున్న నీచ రాజకీయాల వల్ల మన పవిత్ర భారతదేశ ఫెడరల్, సమాఖ్య-సమైక్య స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఎంతైనా ఉంది…!

జై హింద్ … భారత మాతకు జై…

Ashoka Varma Penmetsa
Ashoka Varma Penmetsa
Mr. Ashoka Varma Penmetsa is a Senior Consultant of Advertising, Branding, Media& Public Relations. He has been in this field for more than 25 Years. He takes care of Corporate Communications Department at a Leading Healthcare Group as HOD. He is also a good writer.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles