Sunday, December 3, 2023

మరో వైరస్ ప్రమాదం: బిల్ గేట్స్

  • సాంకేతికత సహకారంతో బయటపడతాం
  • ఆహార నియమాలు పాటిస్తే అనారోగ్య భయంలేదు

కరోనా ముగిసిన తర్వాత మరో వైరస్ ప్రపంచాన్ని చుట్టుముడుతుందంటూ మైక్రోసాఫ్ట్ నిర్మాత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే కొత్తగా రాబోయేది కరోనా కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యాధికారక వైరస్ ల నుంచి సంక్రమిస్తుందంటూ భయపెడుతున్నారు. వృద్ధులు, అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులపై కొత్తగా రాబోయే వైరస్ దుష్ప్రభావం ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. వ్యాక్సిన్లతో పాటు కరోనా వైరస్ వల్ల అభివృద్ధి చెందిన యాంటీబాడీస్ కారణంగా రాబోయే వైరస్ నుంచి బయటపడగలమని గేట్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత కూడా ఆ వైరస్ పోరాటంలో గెలుపును సాధించడానికి సహాయకారిగా నిలుస్తుందని అంటున్నారు.

Also read: ముంబయ్ లో మరో ప్రత్యామ్నాయ ప్రయత్నం

నిరంతర వ్యాఖ్యలు

ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ పంచుకున్నారు. కరోనా వైరస్ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ బిల్ గేట్స్ దానిపై మాట్లాడుతూనే ఉన్నారు.డబ్ల్యూ హెచ్ ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) మొదలు అనేక సంస్థలు, నిపుణుల వ్యాఖ్యలకు సమాంతరంగా ఆయన ఏవో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆయనేమీ శాస్త్రవేత్త కాదు. వైద్యుడు కాదు.  వైద్యరంగ నిపుణుడు కాదు. కాకపోతే వితరణశీలిగా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపు ఉంది. పేద,అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ‘బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్’ ద్వారా కరోనా వ్యాక్సిన్స్ అందించే మహాయజ్ఞానికి ‘నేను సైతం’ అంటూ పెద్ద సమిధగా నిలిచారు. కోట్లాదిరూపాయల నిధులను వితరణ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. డబ్ల్యూ హెచ్ ఓ కు కూడా ప్రతి ఏడాది విరాళాలు ఇస్తున్నారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ (సీ ఎస్ ఆర్ ) లో భాగంగా ప్రపంచానికి ఆయన అండగా నిలుస్తున్నందుకు ఎందరికో గేట్స్ పట్ల గౌరవం, కృతజ్ఞతలు ఉన్నాయి. కాకపోతే, ఆయన చేస్తున్న వ్యాఖ్యల పట్ల, చర్యలపై విమర్శలు కూడా ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. బహిరంగంగా దానం చేస్తూ, చాటుగా ఫార్మా రంగాలలో పెట్టుబడులు పెడుతూ డబ్బులు గడిస్తుంటాడని కొందరు తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. అమెరికా వంటి దేశాలు చేసే మెడికల్ మాఫియాలో ఆయన పాత్ర కూడా ప్రధానంగా ఉంటుందనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త వైరస్ గురించి మాట్లాడుతూ మరోమారు తాజాగా వార్తల్లోకి ఎక్కారు.’ కరోనా వైరస్’ సృష్టి, సంక్రమణపైనా చాలా అనుమానాలు నెలకొని ఉన్నాయి. దీనిని ‘మెడికల్ మాఫియా’గా కొందరు భావిస్తున్నారు. వివిధ వేరియంట్ల రూపంలో ఇది వెంటాడుతూనే ఉంటుందనీ, తగ్గుముఖం పట్టినా ఇప్పుడప్పుడే మానవాళిని వదిలిపోదనే విమర్శలు ఉన్నాయి. మొత్తంగా ప్రపంచ ఆరోగ్య రంగాన్ని మెడికల్ మాఫియా శాసిస్తోందనే మాటలు ఈ మధ్య బాగా వినపడుతున్నాయి.

Also read: దక్షిణాది నదుల అనుసంధానంపై చర్చ

ఆయుర్వేదమే రక్ష

వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆరోగ్యాన్ని పెంచుకొనే విధంగా క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం తొలి కర్తవ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయమైన వైద్య విధానాలను వీడడం, అద్భుతమైన ఆయుర్వేదానికి దూరం కావడం, భారతీయమైన జీవనశైలిని పాటించకపోవడం వల్లనే మనం కూడా మిగిలిన దేశ ప్రజల వలె ఎక్కువగా రోగాలకు గురవుతున్నామని భారతీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘ఆయుర్వేదం’ ప్రచారంపై దృష్టి సారిస్తున్నా, సరిపడా నిధులు కేటాయించకపోవడం వల్ల ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సంప్రదాయ వైద్య విధానాలు, ఆయుర్వేదం మొదలైన భారతీయ వైద్య శాస్త్రాలపై అధ్యయనం, శిక్షణ, పరిశోధనలు విరివిగా జరిపితే కానీ, విదేశాల మెడికల్ మాఫియా నుంచి మనం బయటపడలేమని సామాజిక ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ‘ఆత్మనిర్భర్’లో భారతీయమైన ఆరోగ్య విధానం కూడా భాగమవ్వాలి. విరివిగా నిధులు కేటాయించాలి. దీనికి తోడు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. రసాయనల మిశ్రమంగా మారిన విషతుల్యమైన ఆహారానికి దూరమవ్వాలి. గాలి, నీరు, ఆహారం అంతటా కల్తీగా మారడం వల్లనే ప్రమాదకరమైన రోగాలు పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులు సంపూర్ణగా ప్రవేశించి, విషపూరితమైన రసాయనాలను పాతర వెయ్యాలని ఆహారశాస్త్ర నిపుణులు, పర్యావరణ ఉద్యమకారులు హితవు పలుకుతున్నారు. ఇవ్వన్నీ సంపూర్ణంగా జరిగిననాడు ఏ మహమ్మరీ భారతీయులను ఏమీ చేయలేదు.

Also read: ఉక్రెయిన్ పై రష్యా దూకుడు

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles