Saturday, April 20, 2024

రాముణ్ణి వనవాసం మాన్పించి అయోధ్యకు తీసుకురావాలని భరతుడి నిర్ణయం

రామాయణమ్47 

తీవ్రమైన వేదన దుఃఖాన్ని రగిలించగా విపరీతంగా విలపిస్తూ శపధములు చేస్తూ  ఒట్లుపెట్టకుంటున్న భరతుని చూసి కౌసల్యామాత దుఃఖము మరింత హెచ్చింది .

రాముడంటే ప్రాణమైన భరతుని దగ్గరకు తీసుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని చాలాసేపు దుఃఖిస్తూ అలాగే ఉండిపోయింది.

 రాత్రి గడిచిపోయింది.

Also read: భరతుడి వ్యథ, కౌశల్య సమక్షంలో ప్రమాణాలు

తెల్లవారుతుండగనే వశిష్ఠ మహర్షి భరతుడికి చేయవలసిన కార్యములను గురించి తెలిపి అందుకు కావలసిన ఏర్పాట్లు చేసినాడు.

నూనెలో జాగ్రత్తగా ఉంచిన దశరథుడి కళేబరాన్ని బయటకు తీసి నేలపై ఉంచారు. మహారాజు ఇంకా నిదురిస్తున్నట్లుగనే ఉన్నాడు.

ఆయన పార్ధివ శరీరం వద్దకు వెళ్ళి భరతుడు ‘‘ఎందుకు చేశావయ్యా నీవీ పని? ధర్మమూర్తి రాముడిని అడవులకు పంపే నిర్ణయమెందుకు చేశావు? నా దగ్గర రాముడూలేడు, నీవూలేవు. ఇక ఈ అయోధ్య భర్తలేని విధవరాలుగా ప్రకాశహీనంగా ఉన్నదయ్యా!’’ అని పరిపరివిధాలుగా రోదించాడు.

Also read: తండ్రి, సోదరుల గురించి తల్లిని ప్రశ్నించిన భరతుడు

దుఃఖభారంతో కుమిలిపోతున్న భరతుడిని వశిష్ఠుల వారు ఓదార్చి చేయవలసిన కార్యముల గురించి తొందరపెట్టాడు.

మహారాజుదేహాన్ని పల్లకిలో కూర్చుండ బెట్టి  శ్మశానమునకు తీసుకువెళ్ళి చితిమధ్యలో పరుండబెట్టి అనేక విధాలైన సుగంధద్రవ్యాలు చేర్చగా, భరతుడు ఆయన చితికి నిప్పుపెట్టాడు.

ఆయనకు జరిపించవలసిన కర్మలు శాస్త్రోక్తంగా పూర్తిచేసి రాముడి వద్దకు వెళ్ళిపోవాలనే తలంపుతో శత్రుఘ్నునితో కలిసి కూర్చున్నాడు భరతుడు. ఇద్దరూ మాట్లాడు కుంటున్నారు. సకల లోక రక్షకుడు, మహాబలశాలి, మనకు కష్టాలు వస్తే ఆదుకునే రాముడిని  ఒక ఆడుది అడవికి పంపి వేసింది. ఆ సమయంలో లక్ష్మణుడు ఏం చేస్తున్నట్లు? స్త్రీ వశుడైన తండ్రిని ఎందుకు నిగ్రహించలేకపోయినాడు? ఇలా మాట్లాడుకుంటుంటే వారికి అటుగా వెళ్తూ మంధర కనపడింది.

Also read: భరతుడి పీడకల

అది వంటి నిండా గంధము పూసుకొని రాణులు అలంకరించుకొనే విధముగా విలువైన వస్త్రాలు ధరించి రకరకాల అలంకారాలతో, నడుముకు వడ్డాణముతో త్రాళ్ళతో కట్టబడ్డ ఆడుకోతిలాగ ఉన్నది.

దానిని ద్వారపాలకులు పట్టుకొని ఇదిగో ఎవతెమూలంగా రాముడు అడవులపాలయ్యాడో ఆ దరిద్రపుగొట్టు మంధర ఇది ఏం చేస్తావో చెయ్యి అని శత్రుఘ్నునికి అప్పగించారు.

‘చేసిన వెధవపనికి ఇది ఫలితము అనుభవించాల్సిందే’ అంటూ ఆ గూనిదానిని జుట్టుపట్టుకొని ఒక ఈడ్పుఈడ్చాడు శత్రుఘ్నుడు. అప్పుడు అది వేసుకొన్న ఆభరణాలు చెల్లాచెదురుగా పడి ఆ నేల అంతా నక్షత్రాలు పరుచుకొన్న ఆకాశంలాగ కనపడ్డది.

అది కుయ్యోమొర్రో అంటూ ఏడుస్తుంటే దాని వెంట వస్తున్న తక్కిన దాసీజనమంతా శరణువేడటానికి కౌసల్యాదేవి మందిరం వైపు పరుగెత్తారు.

శత్రుఘ్నుడు తీవ్రమైన క్రోధావేశంతో కైకేయినికూడా దూషిస్తూ ఉంటే ఆవిడ విపరీతమైన భయంతో భరతుడిని శరణువేడింది.

Also read: దశరథ మహారాజు అస్తమయం

అప్పుడు శత్రుఘ్నుని చూసి భరతుడు ‘తమ్ముడూ స్త్రీలను చంపడం మహాపాపం. వీరిని వదిలి వేయి. అదీగాక వీరికి ఏవిధమైన హానికలిగినా జీవితాంతము రాముడు మనతో మాట్లాడడు

.

“రాముడు నిందిస్తాడు” అనే భావనే నాకు లేకపోతే ఈ ధూర్తురాండ్రను నేనే ఎప్పుడో సంహరించి ఉండేవాడిని.

భరతుడి ఆ మాటలు విని వారిరువురినీ విడిచిపెట్టేశాడు శత్రుఘ్నుడు.

భరతుడు తండ్రికి చేయవలసిన పితృకార్యాన్ని పూర్తిచేశాడు. అది పదునాల్గవరోజు దశరధుడి చితికి నిప్పంటించి!

రాజ్యాభిషేకమహోత్సవము జరిపించే అధికారముగల మంత్రులంతా భరతుని సందర్శించారు.

ఆయన సముఖంలో నిలిచి ‘‘నీ తండ్రి, మరియు నీ అన్నగారు ఇరువురూ రాజ్యము నీకు ఇచ్చివేశారు. ఇక నీవు రాజ్యలక్ష్మిని చేపట్టవలసి ఉన్నది అందుకు ఏ మాత్రము ఆలస్యమైనా రాజ్యములో అరాచకము ప్రబలవచ్చును. ఇప్పటివరకూ ప్రజలు శాంతితో సహజీవనం చేస్తున్నారు. ఎవరూ ఎవరినీ పీడించడంలేదు. ఇప్పటివరకు ఏ ఉపద్రవమూలేదు. నీ పట్టాభిషేకమునకు సర్వము సిద్ధం చేసినాము’’ అని పలికి నిలిచారు వారంతా!

Also read: దశరథుడిపై కౌసల్య హృదయవేదనాభరిత వాగ్బాణాలు

భరతుడు సగౌరవముగా వారందరికి నమస్కరించి వారు అప్పటికే తెచ్చి అక్కడ ఉంచిన అభిషేక సామగ్రికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అమాత్యులతో ఇలా అన్నాడు:

‘‘మా వంశములో ఎల్లప్పుడూ పెద్దకుమారుడే రాజు! అది ఉచితము. అదే మా వంశాచారము..మీరీవిధముగా మాట్లాడవద్దు. మా రాముడే రాజు. ఆయన బదులుగా పదునాల్గు సంవత్సరాలు నేను అరణ్యవాసం చేస్తాను.

‘‘చతురంగబలాలు సిద్ధం చేయండి. మహాసైన్యాన్ని సమకూర్చండి. నేను నా జ్యేష్ఠసోదరుడైన రాముని అరణ్యం నుండి తీసుకు వచ్చెదను. మనము ఆయననే రాజుగా అభిషేకించవలె.

‘‘మనము రామునివద్దకు వెంటనే ప్రయాణము కావలె. మార్గములు నిష్కంటకములు గావించండి. చక్కని రహదారులు గంగాతీరము వరకు ఏర్పాటు చేయించండి. దిగుడుబావులు తవ్వించండి’’ అని ఆజ్ఞాపించాడు భరతుడు.

అమాత్యులంతా క్షణంలో ఆ పనులన్నీ పూర్తిచేసి ఆయనకు తెలిపారు.

ఆయాప్రాంతములు, ప్రదేశముల స్వరూప,స్వభావములు తెలిసినవారు (topographers), సూత్రములుపట్టికొలతలు వేయువారు (surveyors),

నేలను తవ్వేవారు( earthmovers) యంత్రాలుపయోగించేవారు,

శిల్పులు (Architects), వడ్రంగులు(Carpenters), కూలివారు  చెట్లు నరికి మార్గము ఏర్పరచేవారు, బాటవేయువారు, వేసినబాట మీద సున్నముపరచి పటిష్ఠము చేయువారు(Road builders), వెదురు పనివారు, సమర్ధులైన పర్యవేక్షకులు (Supervisors) అందరూ ముందుగా బయలు దేరి వెళ్ళారు.

వారితోపాటు అపారజనసమూహము బయలుదేరింది.

 బాటలన్నీ పౌర్ణమినాడు ఉప్పొంగిన సముద్రాలలా ఉన్నాయి.

భరతుడి ఉదాత్తమైన ఈ పలుకులకు జనులందరి కనులనుండి ఆనందబాష్పములు జలజలరాలినవి.

మనమంతా రాముని వెనక్కి తీసుకునే రావాలి! అదే  మన ధ్యేయం, అదే మన కర్తవ్యం అన్నట్లుగా అందరూ దీక్షపూని సాగుతున్నారు.

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యం, మార్గదర్శనం

ఆ రాత్రిగడచి తెల్లవారుతుండగా మంగళ వాయిద్యములతో కూడిన స్తోత్రములతో భరతుని స్తుతించసాగారు వందిమాగధులు, బంగారు దండములతో కొట్టి యామదుందుభి మ్రోగించసాగారు.

భరతుడు నిదురలేచాడు. ఆ స్తోత్రపాఠాలు, ఆ దుందుభిస్వనాలు ఆయన హృదయంలో తీవ్రమైన వేదనరగిలించాయి. వెంటనే అందరినీ వాటిని ఆపమన్నాడు. “నేను రాజును కాను” అని  వారికి చెప్పి అన్నింటినీ ఆపివేసినాడు.

ప్రక్కనే వున్న శత్రుఘ్ననితో ‘‘చూడు కైకవలన ఎంత అపకారం జరిగిందో. ఆ మహారాజు దుఃఖాలన్నీ నాకు వదిలి వెళ్ళిపోయాడు’’ అన్నాడు.

‘‘మన అందరికీ రక్షకుడైన రాముడిని ధర్మహీనురాలైన నా తల్లి స్వయముగా అడవికి పంపినది. రాజ్యము చుక్కానిలేని నావ అయినది….’’

…….

NB.

ప్రాచీన భారతావనిలో ఎన్ని వృత్తులు పరిఢవిల్లినవో గమనించగలరు. వాల్మీకి మహర్షి ఎన్ని వృత్తులవారి గురించి చెప్పారో చూడండి. అదీ భారతదేశం అంటే!

Also read: కల్లోల సాగరమై, తేరుకొని, దృఢమైన రాముడి మనస్సు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles