Wednesday, September 18, 2024

భారత్ జోడో యాత్ర

విధి విచిత్రం అంటే ఇదేనేమో! సరిగ్గా పుష్కర కాలం కిందట ఇదే పని చేస్తానని కాంగ్రెస్ వీర విధేయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ అన్నప్పుడు వద్దనిగాక వద్దని రెండు చేతుల్తో అడ్డుకుని, ఇప్పుడు అదే పని చెయ్యడాన్ని ప్రకృతి చెప్పే సహజ న్యాయసూత్రం అంటారేమో! అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన తన తండ్రిని తలచుకుని ఆగిపోయిన వందలాది గుండెల కుటుంబాలను పరామర్శించడం మనిషిగా తన కనీస కర్తవ్యమని ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విన్నపాలను తృణీకరించిన అప్పటి గాంధీ కుటుంబం, ఇప్పుడు మోడీ ప్రభుత్వ దురాగతాలను ప్రజలకు వివరించడానికి ప్రజల నడుమ పాదయాత్ర చేస్తానంటూ బయలుదేరడాన్ని ఇంతకు మించి ఇంకేమని వర్ణించగలం! రాహుల్ గాంధీ పాదయాత్ర మొదటి రోజు సామాజిక మాధ్యమాలలో విడుదల చేసిన ఫోటోలు చూస్తుంటే జగన్ నాయకత్వ లక్షణాల గురించి మరింత విస్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది. ఇదే రాహుల్ గాంధీ ఆ రోజు జగన్తో చేతులు కలిపి నాలుగడుగులు నడిచుంటే ఈపాటికి రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. రాహుల్ ప్రధాని పదవిలో ఉండేవారు. మొత్తానికి రాహుల్ గాంధీకి ఇది అర్థం కావడానికి పన్నెండు సంవత్సరాలు పట్టిందానికి బాధలేదు గాని, ఇంతలో భారతదేశం పాతికేళ్లు వెనుకబాటుకు గురైందన్న ఆవేదన ఉంది. దానికి ముఖ్యమైన బాధ్యత తీసుకోవలసింది సోనియా కుటుంబమేనని గుర్తుంచుకోవాలి.

Also read: ఉచితాలు అనుచితమా?

ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల నిరసన

సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి దగ్గర మొదలు పెట్టి ఐదు నెలలపాటు పన్నెండు రాష్ట్రాలతోపాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ దాదాపు 3,570 కిలోమీటర్ల పొడుగునా సాగుతూ ఉత్తరాన హిమాలయ పర్వత సానువుల దగ్గర శ్రీనగర్ వద్ద ముగుస్తుంది. బహుశా స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా సాగుతున్న పాదయాత్ర ఇదే మొదటిదేమో. మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై ఇంతవరకు దేశంలో చేపట్టిన ప్రతి నిరసనకూ పెద్ద ఎత్తున ప్రజలనుంచి మద్దతు లభిస్తోంది. 2015లో మోడీ ప్రభుత్వం లోక్ సభలో నెగ్గించుకుని, రాజ్యసభలో వీగిపోయిన భూసమీకరణ సంస్కరణల చట్టం (2015) వెనక్కి తీసుకునేంతవరకు సాగిన రైతుల ఉద్యమం దాదాపు తొలి ప్రజా విజయం.

Also read: మన మిడిమేళపు మీడియా

2015లోనే యుజిసి ఫెలోషిప్ వివాదంలో చిలికి చిలికి గాలివానగా మారి దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలలోను విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసి యుజిసి నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా పోరాడారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఒక్కటైన సందర్భమది. ఈ సమయంలోనే ఒకవైపు రోహిత్ వేముల మరణం దేశవ్యాప్తంగా విద్యార్థులలో కోపం కట్టలు తెంచుకునేలా చేయగా, మరోవైపు విద్యార్థి నాయకుడిగా కన్హయ్య కుమార్ అవతరించాడు. 2016 లో చెప్పాపెట్టాకుండా, ఏ విధమైన ప్రయోజనం లేకుండా రాత్రికి రాత్రి 500, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న అత్యంత తెలివిమాలిన నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ ఉవ్వెత్తున ఉద్యమించారు. ఆ షాక్ నుంచి దేశం తేరుకోవడానికి మరికొన్ని దశాబ్దాలు పడుతుందని ప్రపంచ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 2017 లో ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టి తెచ్చినపుడు దేశ ప్రజలు భగ్గుమన్నారు. ఎంత ఆందోళన చేసినా ప్రభుత్వం చెవికెక్కలేదు గాని, పేదల నడుం విరగొట్టే జిఎస్ స్పీడును మాత్రం తగ్గించారు. 2019లో జమ్ము కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని హరించివేస్తూ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమ్ము కశ్మీతో పాటు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చేపట్టారు. దాదాపు ఏడాది కాలం పాటు ఇంటర్నెట్ రద్దు చేసి మరీ ఆ ప్రాంతాల్లో ఉద్యమం వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటు.
Also read: రికార్డుల వేటలో మోడి ప్రభుత!

మోదీ పాలన తప్పుల తడక

2019లో తీసుకున్న మరొక మతిమాలిన నిర్ణయం భారతీయ పౌరసత్వ సవరణ చట్టం. జాతీయ పౌరసత్వ రిజిస్టర్ ను వ్యతిరేకిస్తూ దేశమంతా అట్టుడుకుపోయింది. పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని గమనించిన పభుత్వం దిగివచ్చి ఆ ఆలోచనను మూలన పడేసింది. ఈ నిరసన తెలిపే సందర్భంలో షాహీన్ బాగ్ లో ముసలి అవ్వలు చూపిన తెగువ నిరసన పోరాటాల చరిత్రలో నిలిచిపోయేది. గొప్ప స్ఫూర్తిదాయక పోరాటంగా చరిత్రలో నమోదవుతుంది. 2020లో దాదాపు ఏడాదిపాటు పంజాబ్ రైతులు మొదలుపెట్టి అనంతర కాలంలో దేశవ్యాప్తంగా రైతులందరూ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చేసిన పోరాటానికి లభించిన మద్దతు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. ప్రభుత్వం ఈ నిరసన పోరాటాన్ని నీరుగార్చడానికి గూండాలను రైతులలోకి పంపించడం దగ్గరనుంచి, రిపబ్లిక్ డే పరేడ్ లో సంఘ విద్రోహక శక్తులను పురికొల్పడం వంటి మోదీ మార్కు దుశ్చర్యలకు పాల్పడ్డారు. వేటికీ ఇసుమంతయినా వెరవని రైతన్నలు చట్టాన్ని వెనక్కి తీసుకున్న తరువాతే నిరసన పోరాటాన్ని నిలిపారు. దీనినిబట్టి అర్థం అయిందేమంటే బహుళత్వ ఇండియాను హిందుత్వ భారత్ గా మార్చడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను లక్షలాది పిడికిళ్లు బిగించి అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వెయ్యికళ్లతో ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రజలందరినీ కలిపే ఒక దారంలాగా కొత్త శక్తి దేశ ప్రజలకు కావలసి ఉంది. అందుకోసం రాహుల్ గాంధీ చేస్తున్న ఒక ప్రయత్నమే ఈ భారత్ జోడో యాత్ర.

Also read: ఇదే మన ప్రస్తుత భారతం!

ముందే తగినన్ని ఏర్పాట్లు

పార్టీ జెండా లేకుండా కేవలం భారతదేశ జండాను చేత బూని ప్రారంభమైన ఈ యాత్రకు దేశవ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. ద్వేషపూరిత రాజకీయాలతో ప్రజలను చీలుస్తున్న భాజపా రాజకీయాలకు విరుగుడుగా దేశ ప్రజలందరినీ ఏకత్రాటి మీదకి తీసుకురావడానికి తాను చేస్తున్న తపస్సు లాంటి ప్రయత్నమే ఈ భారత్ జోడో యాత్ర అని రాహుల్ గాంధీ విన్నవించుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాలలో స్వచ్చంద సంస్థలు, దళిత, ఆదివాసీ సమూహాలతో పాటు మరికొన్ని థింక్ టాంక్ పెద్దలతో కూడా చాలా సుదీర్ఘమైన చర్చలు జరిపారు. అనేకమంది మహిళా ఉద్యమకారులతో, పర్యావరణ ఉద్యమకారులతో కలిసి తన ఆలోచనను పంచుకుని వారి మద్దతు కోరారు. చాలా ఆశ్చర్యకరంగా ప్రస్తుతం ఓటుహక్కులేని అనేక పాఠశాలల పిల్లలతో కూడా చర్చా వేదికలు నిర్వహించారు. భవిష్యత్తు ఓటర్లను ముందుగానే కలుసుకున్నారన్న మాట. ఈ పాదయాత్ర రోజుకు రెండు సెషన్లుగా సాగుతుంది. ఉదయం పదకొండు కిలోమీటర్లు, సాయంత్రం మరో పన్నెండు కిలోమీటర్లు నడుస్తారు. మొదటి రోజు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అందించిన భారతీయ త్రివర్ణ పతాకాన్ని అందుకుని యాత్ర ప్రారంభించారు. 118మందితో ప్రారంభమైన యాత్రలో దాదాపు మూడు వేల మంది ప్రజలు ఉత్సాహంతో పాల్గొనడం విశేషం. మధ్యాహ్నం సుచింబం గ్రామం వద్ద ఎస్ఎంఎస్ఎం ఉన్నత పాఠశాల వద్ద కాసేపు సేద తీరడానికి ఆగారు. 1937 లో ఇదే రోజున మహాత్మాగాంధీ ఈ పాఠశాలను సందర్శించడం విశేషం.

Also read: వారు చేసే తప్పు.. మనం చేస్తే ఒప్పు

ఇంత విశిష్టమైన భారత జోడో యాత్రకు మోదీ మత్తులో మునిగిన మీడియా మాత్రం కనీస మాత్రపు కవరేజి ఇవ్వడం లేదు. మన తెలుగు దినపత్రికలు, టీవీ చానెళ్లు సైతం పట్టించుకోవడం లేదు. మోడీ కి కోపం వచ్చే పనులు చేయకూడదని సాక్షి మీడియా రాహుల్ గాంధీ యాత్ర వార్తలకు ముఖం చాటేసింది. చంద్రబాబును మోదీ దరి చేర్చడానికి ఉవ్విళ్లూరుతున్న ఈనాడు మీడియా రాహుల్ ను తన పాఠకులకు దూరం చేసింది. ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం రాహుల్ ను మొద్దబ్బాయిగా ఈ మోదీ అనుకూల మీడియా చిత్రించింది. ఆ ఇమేజ్ ను పటాపంచలు చేయడానికి రాహుల్ కు ఇది మంచి అవకాశం. ప్రజాక్షేత్రంలో పర్యటన చేసినపుడే అతని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. భారత సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై సవ్యమైన అవగాహన ఉన్న రాహుల్ గాంధీ ఈ యాత్ర ద్వారా దేశ ప్రజలకు ఎలాంటి భరోసా అందించగలడో చూడవలసి ఉంది.

Also read: సభ ముగిసింది.. సందేశం చేరింది..

దుప్పల రవికుమార్

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles