Thursday, March 28, 2024

బహుముఖ ప్రజ్ఞకు ప్రతిరూపం భానుమతి

భానుమతీ రామకృష్ణ … తెలుగు సినిమా ప్రేక్షకులకు, ప్రజలకు పరిచయం అవసరం లేని మహాకళాకారిణి. భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. భానుమతి కేవలం ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి మాత్రమే కాదు, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. చిత్ర సీమలో ఆమె చేరుకున్న శిఖరాగ్రాలు అనితర సాధ్యం. ఏడు దశాబ్దాలు ఆమె సినీ కళామతల్లికి చేసిన సేవలు అజరామరం.

భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 – డిసెంబరు 24, 2005) ఒంగోలులో జన్మించారు. శాస్త్రీయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య వద్ద   సంగీతం అభ్యసించారు. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా 13 ఏళ్ళ  చిరు ప్రాయంనాడే 1939 లో విడుదలైన “వరవిక్రయం” అనే సినిమాలో నటించారు. అయితే సినిమా నిర్మాణ సమయంలో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించగా,  హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారట.

విభిన్న రంగాలలో ప్రతిభ

నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా భానుమతి ఎదిగారు. ఆమె 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏకైక సంతానం భరణి.  భరణి పేరు మీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు  నిర్మించారు.

భానుమతి శ్రీ విద్యోపాసకురాలనీ, ఆమెకు జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో మంచి అనుభవం ఉందన్న సంగతి కొద్ది మందికే తెలుసు. 1950 ప్రాంతాల్లోనే ఆమె నాడీ గ్రంధాల మీద పరిశోధన సాగించారనీ,  హస్తసాముద్రికవేత్త అనీ చెపుతారు. అలాగే శృంగేరీ పీఠాధిపతి అభినవ విద్యాతీర్థ స్వామివారి నుండి ఉపదేశం పొంది నిత్యమూ లలితా సహస్ర నామాలతో శ్రీ చక్రాన్ని అర్చించేవారనీ , సప్తశతీ పారాయణం చేసేవారనీ ప్రతీతి.

అర్ధశతాబ్దంలో వందలోపు చిత్రాలు

భానుమతి  అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, నటించిన సినిమాలు వంద వరకే. విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే  ఎంపిక చేసు కున్నారు. అయితే కారణాంతరాల వల్ల ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ,  “నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది”, అని సంతోషించారు.

1956లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము, మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు, పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు), అన్నాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు పొందింది. 1966లో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగా వెలువరించారు. పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వం సత్కరించింది. ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.

అనేక సత్కారాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం 1975లో గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడు లోని ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది. బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984 లోనే లయన్స్ క్లబ్ సత్కరించింది. 1984లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో గౌరవించింది. 1986లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది. 1986లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకున్నారు. గాయనిగా భానుమతి ఎంతో పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. సినిమా పాటలే కాక రేడియోలోనూ, రికార్డుల్లోనూ ఆమె పాడిన పాటలు ప్రజాదరణ పొందాయి. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైనప్పుడు వినిపించిన ప్రారంభగీతం “పసిడి మెరుంగుల తళతళలు” బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి ఆమె పాడినదే.

విభిన్న పాత్రలలో రాణింపు

పెళ్ళికానుక (1998),  బామ్మమాట బంగారుబాట (1990), ముద్దుల మనవరాలు,  (1986), మంగమ్మ గారి మనవడు (1984), గడసరి అత్త సొగసరి కోడలు (1981),  మట్టిలో మాణిక్యం (1971),  పల్నాటి యుధ్ధం,  (1966),  అంతస్తులు (1965),  తోడు నీడ (1965),  బొబ్బిలి యుధ్ధం, వివాహ బంధం (1964),  బాటసారి (1961), నలదమయంతి, వరుడు కావాలి (1957), తెనాలి రామకృష్ణ, చింతామణి (1956),  విప్రనారాయణ, అగ్గిరాముడు, చక్రపాణి (1954), చండీరాణి (1953),  ప్రేమ (1952),  మల్లీశ్వరి, మంగళ (1951),  అపూర్వ సహోదరులు (1950),  లైలామజ్ఞు, రాజశేఖర (1949),  రత్నమాల (1947),  స్వర్గసీమ (1945), తాసీల్దార్ (1944), గరుడ గర్వభంగం, కృష్ణ ప్రేమ (1943),  ధర్మపత్ని (1941), వరవిక్రయం,  (1939) ,చిత్రాలలో విభిన్న పాత్రలకు జీవం పోసిన ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ.

అత్తగారి కథలకు పాఠకాదరణ

అసాధ్యురాలు (1993), పెరియమ్మ (తమిళం) (1992), భక్త ధృవ మార్కండేయ (1982/I), భక్త ధృవ మార్కండేయ, (1982/II) ఒకనాటి రాత్రి (1980),  రచయిత్రి (1980),  మనవడి కోసం (1977),  వాంగ సంభందీ వాంగ (తమిళం) (1976),  ఇప్పడియుమ్ ఒరు పెన్ (తమిళం) (1975),  అమ్మాయి పెళ్ళి (1974),  విచిత్ర వివాహం (1973), అంతా మన మంచికే (1972),  గృహలక్ష్మి (1967), చండీరాణి (1953/I) తదితర చిత్రాలకు దర్శక బాధ్యతలు నిర్వహించింది. బాటసారి (1961), వరుడు కావాలి (1957),  చింతామణి (1956),  విప్రనారాయణ (1954),  చక్రపాణి (1954),  చండీరాణి (1953/I),  చండీరాణి (1953/II), ప్రేమ (1952),  లైలామజ్ఞు (1949/I),  రత్నమాల (1947) తదితర  చిత్రాలకు నిర్మాతగా పని చేశారు. ప్రేమ (1952) (కథ), అత్తగారి కథలు ఆమె రచనలు.చింతామణి (1956) చక్రపాణి (1954) చిత్రాలకు   సంగీత దర్శకురాలిగా వ్యవహరించారు.

చెన్నై లోని తన స్వగృహంలో 2005 డిసెంబర్ 24 న భానుమతీ రామకృష్ణ పరమ పదించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles