Wednesday, September 22, 2021

ఆత్మహత్యల నివారణకోసం ఓ ప్రయత్నం

  • నవసాహితి, శుభోదయం, రోష్నీఆధ్వర్యంలో సదస్సు
  • ఓటమిని తిరస్కరించాలనీ, మనోధైర్యం వీడకూడదని ప్రవీణుల హితవు

తెలుగు రాష్ట్రాలలో ఆత్మహత్యలు ఎక్కువైన నేపథ్యంలో ఆత్మహత్యల నివారణకూ, ఆత్మహత్య ఆలోచన చేసినవారికి వెన్నుదన్నుగా నిలబడేందుకు పౌరసమాజం ఏమి చేయాలనే అంశంపైన ‘చీకటి ముసిరిన ఏకాంతంలో…’ అనే శీర్షిక కింద ఆదివారం ఇక్కడి తెలంగాణ టూరిజం హోటల్ ద ప్లాజాలో సదస్సు జరిగింది. ‘హృదయవిదారక ఆత్మహత్యల నివారణ దిశగా….మేము సైతం…కవులుూ, పాలకులూ, మేధావుల సంవేదనా స్వరసంగమం’ లక్ష్యశుద్ధితో సాగింది. నవసాహితీ ఇంటర్నేషనల్, శుభోదయం చానెల్, రోష్నీ అనే స్వచ్ఛంద సంస్థ కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపొందించాయి. అయా రంగాలలో నిష్ణాతులను ఆహ్వానించి వారి చేత పలుకు కలిగిన ఉపన్యాసాలు ఇప్పించారు. సమాజంలో ఏయే వర్గాలలో ఆత్మహత్య గురించి ఆలోచించే అవకాశం ఉన్నవారు ఉన్నారో, వారిని అటువంటి ఆలోచనల నుంచి దూరం చేయడానికి సమాజం ఏమి చేయాలో సమాలోచన జరిగింది. రైతులూ, అనాథలూ, స్వలింగ ఆకర్షణ కలిగినవారూ, సినిమారంగంలో పని చేస్తున్నవారు ఆత్మహత్య మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారో, ఆత్మహత్య వైపు ఎందుకు తరమబడుతూ ఉన్నారో వక్తలు వివరంగా చెప్పారు. ముఖ్య అతిథిగా జెడి లక్ష్మీనారయణ, విశిష్ఠ అతిథులుగా జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి, వ్యక్తిత్వ నిర్మాణ నిపుణుడూ, వక్త ఆకెళ్ళ రాఘవేంద్ర, మహిళా ఉద్యమ నేత సంధ్య, ఇతర ప్రముఖులు చాలామంది హాజరైనారు. ఈ కార్యక్రమ నిర్వాహకులలో ప్రధాన పాత్రధారి సీనియర్ జర్నలిస్టు, నవసాహితీ వ్యవస్థాపకులూ ఎస్ వి సూర్యప్రకాశ్, శుభోదయం చాలెల్ యజమాని డాక్టర్ లక్ష్మీప్రసాద్, రోష్నీ తరఫున జ్యోతి, నవసాహితీ తరఫున శ్రీలక్ష్మీ అవధానం సభను నడిపించారు,

ప్రథమ వక్త కొండల్ రెడ్డి. ఆయన రైతు స్వరాజ్య వేదిక బాధ్యుడు. కిరణ్, రామాంజనేయులు, సజయ వంటి స్వచ్ఛంధసంస్థల నిర్వాహకులతో కలిసి రైతులకోసం  కొన్ని దశాబ్దాలుగా పని చేసిన క్షేత్రస్థాయి అనుభవం, పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. 2015లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక నుంచి పరిశోధనకోసం జర్నలిస్టుల బృందం తెలంగాణలో పర్యటించిందనీ, వారితో కలసి తాను కూడా ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబసభ్యులకు కలుసుకున్నాననీ కొండల్ రెడ్డి చెప్పారు. ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబసభ్యుల మాటలు ఆలకించిన తర్వాత ఆ బృందంలోని సభ్యులు ఆత్మహత్యా ప్రయత్నం చేసి విఫలమైనవారి దగ్గరికి వెడతామని సూచించారనీ, ఆ సూచన మేరకు అటువంటి వ్యక్తులను కూడా కలుసుకున్నామనీ కొండల్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం ‘హెల్ప్ లైన్స్’ వ్యవస్థను ప్రవేశపెట్టిందనీ, ఇప్పుడు ఆ వ్యవస్థ లేదనీ, ఆరు మాసాలలోగానే దానిని మూసివేశారనీ ఆయన తెలియజేశారు.

ఆత్మహత్య చేసుకునే రైతు వయస్సు 36

ఆత్మహత్య చేసుకున్న రైతుల సగటు వయస్సు 36 సంవత్సరాలనీ, అటువంటి రైతుకు సుమారు 30 సంవత్సరాల భార్య ఉంటుందనీ, వారికి కనీసం ఇద్దరు పిల్లలుంటారనీ, ఆ రైతు ఈ లోకం విడిచి వెళ్ళిపోతే ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని పోషించే బాధ్యత భార్యపైన పడుతుందనీ అన్నారు. రైతుబంధు పథకం హైదరాబాద్ లోనో, అమెరికాలోనో ఉద్యోగాలూ,వ్యాపారాలూ చేసుకుంటున్న భూమియజమానులకు వర్తింపజేస్తున్నారనీ, కౌలు రైతులను తెలంగాణ ప్రభుత్వం రైతులుగా గుర్తించడం లేదనీ చెప్పారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కొద్దిగా మెరుగనీ, ఒడిశా రాష్ట్రంలో కౌలు రైతులకే కాదు రైతు కూలీలకు సైతం ప్రయోజనం కలిగించే పథకం అమలు చేస్తున్నారనీ కొండల్ రెడ్డి చెప్పారు. వంటగ్యాస్ సబ్సిడీని సంపన్నులూ, ఎగువ మధ్యతరగతి ప్రజలూ ఐచ్ఛికంగా వదులుకున్నట్టే సంపన్న రైతులూ, జీవితం గడవటానికి ఇబ్బందిలేనివారూ ఐచ్ఛికంగా రైతుబంధు పథకం కింద వచ్చే సహాయాన్ని వదులు కోవాలనీ, కౌలు రైతులకు ఈ పథకం వర్తింపజేయాలనీ కొండల్ రెడ్డి గట్టిగా చెప్పారు.

అనాథలది అరణ్యరోదన

అనాథల ఆత్మహత్యల గురించి స్వయంగా అనాథ బాలికగా పెరిగి ఇప్పుడు విద్యాధికురాలై స్వచ్ఛంధ సంస్థలను నిర్వహిస్తున్న నీరజ మాట్లాడారు. తాను రెండేళ్ళ పసిబిడ్డగా ఉన్నప్పుడు తన తండ్రి ఒక సినిమాహాలు గేటు దగ్గర వదిలిపెట్టి వెళ్ళారనీ, ఎవరో దయకలిగిన మహిళ తనను తీసుకొని వెళ్ళి కొంతకాలం పెంచిందని తన కన్నీటి గాథ ఉద్వేగభరితంగా చెప్పారు. పదేళ్ళ వయస్సులో మళ్ళీ తాను అనాథగా మారానినీ, తాను బస్ స్టాండ్ లోనే నివసించేదానిననీ, అక్కడివారి సహకారంలో కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి చిన్నచిన్న ఉద్యోగాలు చేసే దానిననీ నీరజ చెప్పారు. ఆ సమయంలో కనీసం ఒక సంవత్సరంపాటు ఆత్మహత్య గురించి ఆలోచించాననీ, ఎట్లా ఆత్మహత్య చేసుకోవాలో తెలుసుకునేందుకు చిన్నపాటి పరిశోధన చేశాననీ చెప్పారు. ఇప్పుడు ‘మా ఇల్లు’ పేరు మీద తాను, తన భర్త గాదె ఇన్నయ్య నడుపుతున్న అనాథాశ్రమం – పాఠశాలలో ‘నేను ఎవరు?’ అనే ప్రశ్న ఎవ్వరూ ఎదుర్కోకుండా చూసుకుంటున్నామని అన్నారు. అనాథ బాలల దుస్థితి గురించీ, వారి ఆత్మహత్యల గురించీ ప్రభుత్వాలు కానీ సమాజం కానీ పట్టించుకోకపోవడంపైన ఆమె పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో సవివరంగా చెప్పారు. ప్రతి సంవత్సరం పది లక్షలమంది ఆత్మహత్య చేసుకుంటారనీ, వారిలో 12.9 శాతం పురుషులనీ, 11.6శాతం స్త్రీలనీ, 14.2 శాతం బాలలనీ ఎన్ సీఆర్ బీ గణాంకాలు చెబుతున్నాయనీ, అనాథలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో లెక్కించే వ్యవస్థ లేదనీ చెప్పారు. ‘లాన్సెంట్’ అనే రష్యన్ సంస్థ ఒకటి చేసిన సర్వే ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 10.2 శాతం మంది అనాథలు ఉంటారని అన్నారు. అనాథల పట్ల దారుణంగా ప్రవర్తించడం, వారిపైన లైంగికదాడులు చేయడం, భౌతికంగా హింసించడం అనేది సర్వసాధారణమని అన్నారు. 13 ఏళ్ళ అనాథ బాలిక గర్భవతిగా బస్ స్టాండ్ లో సంచరిస్తుంటే ఈ సమాజంలో ఎవ్వరూ పట్టించుకోరనీ, ఆ బాలికకు గర్భం ఎట్లా వచ్చిందనీ, ఎవరి వల్ల వచ్చిందనీ ఆరా చేసే ప్రయత్నం కూడా చేయరనీ ఆమె తీవ్రమైన ఆవేదనతో చెప్పారు. అనాథలకి కష్టాలు చెప్పుకోవడానికి తల్లికానీ, తండ్రికానీ, తోబుట్టువులు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ ఉండరని అన్నారు.

కొండల్ రెడ్డి, నీరజ, శ్రీనివాస్

నేను ఎవరిని?

‘నేను ఎవరిని?’ అనే ప్రశ్న అనాథలను వేధిస్తుందనీ, స్కూలులో చేర్పించాలన్నా వారి పేరూ, ఊరూ, తల్లిదండ్రలు పేర్లూ, ఆధార్ కార్డు వివరాలూ వగైరా అడుగుతారనీ, వారికి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయనీ నీరజ ప్రశ్నించారు. ప్రపంచంలో కెల్లా సంపన్న దేశమైన అమెరికాలో రాజ్యమే అనాథలకు తల్లీ,తండ్రీ అనీ, అక్కడ ‘పేరెంట్స్’ అనే కాలంలో ‘స్టేట్’ అని రాస్తే సరిపోతుందనీ, మనం ఆగర్భశత్రువుగా పరిగణించే పాకిస్తాన్ లో సైతం పేరెంట్ కాలంలో స్టేట్ అని రాస్తే అంగీకరిస్తారనీ చెబుతూ, ఇండియాలో కూడా ఆ పద్దతిని అనుసరించాలనీ, రాజ్యమే అనాథల బాధ్యత స్వీకరించాలనీ, ఇది కనీస ధర్మమనీ నీరజ వివరించారు. ఎస్సీ, ఎస్టీలకూ, ఓబీసీలకూ రిజర్వేషన్లు ఉన్నాయి కానీ అనాథలకు మాత్రం రిజర్వేషన్లు లేవనీ, ఈ సదుపాయం కూడా కల్పించాలని అన్నారు. తమని అనాథలని పిలవవద్దనీ, సోషియల్లీ చాలెంజ్డ్ పర్సెన్స్ అని పిలవాలనీ కోరారు. ట్రాన్స్ జండర్ యాక్ట్, డిసేబుల్ట్ యాక్ట్ వచ్చినట్టే సోషియల్లీ చాలెంజ్డ్ పర్సెన్స్ యాక్ట్ తీసుకురావాలని చెప్పారు.

స్వలింగ ఆకర్షకులను ఆదరించండి

రాజమండ్రి నుంచి నాలుగేళ్ళ కిందట హైదరాబాద్ వచ్చి స్థిరపడిన శ్రీనివాస్ ఎల్ జీబీటీ (లెస్బియన్, బైసెక్సువల్, గే, ట్రాన్స్ జండర్) సమాజం సమస్యలను ఏకరువుపెట్టారు. లెస్బియన్ అంటే స్వలింగ సంపర్కాన్ని కోరుకునే మహిళలు. బైసెక్సువల్ అంటే ఉభయచరజీవులు. ఆడ,మగతో సంపర్కాన్ని కోరుకునేవారు.గే అంటే పురుషులతో సంపర్కం కోరుకునే పురుషులు. ట్రాన్స్ జండర్ అంటే స్త్రీ, పురుష లక్షణాలు రెండూ పూర్తిగా లేక, పాక్షికంగా ఉన్నవారు. నవాబ్  ల జనానాలలో, మహారాజుల అంతఃపురాలలో వీరిని నియమించేవారు ప్రమాదం లేదనే ఉద్దేశంతో. తమ సమాజానికి విస్తృత సమాజంలో ఆమోదం లేదనీ, వారిని ప్రత్యేక వ్యక్తులుగా గుర్తించి, ఆమోదించి, గౌవరించే రోజు రావాలనీ శ్రీనివాస్ కోరారు. తాను స్వయంగా గే అని చెబుతూ, తన పెళ్ళికోసం ఇంట్లోవారూ, ఆఫీసులో బాసూ, ఇతరులు ఒత్తిడి చేసినప్పుడు ఆత్మహత్య గురించి ఆలోచించానని చెప్పారు. మత్తుమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నిం చేశాననీ, ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో తిరిగి వచ్చాననీ చెప్పారు. తన తల్లిని పోషించే బాధ్యత తనమీద ఉన్నందును ఆత్మహత్యాప్రయత్నం చేయడం మానుకున్నానని అన్నారు. చిన్న పట్టణమైన రాజమండ్రి వదిలి హైదరాబాద్ రావడంతో ఒత్తిడి కొంత తగ్గిందని చెప్పారు. బంధువులూ, స్నేహితులూ తన పరిస్థితిని విన్నతర్వాత రకరకాల వైద్యాలు చేయించారని చెప్పారు. పూజలు చేయడంతో పాటు విజయవాడలో డాక్టర్ సమరం దగ్గరికి వైద్యానికి కూడా వారానికి ఒకసారి వెళ్ళివచ్చేవాడినని అన్నారు. తన సమస్యను ఎవరితోనైనా చెప్పుకోవాలంటే భయసందేహాలు ముసురుతాయనీ, పాతతరం వారికి సమస్య అర్థం చేసుకోవడం కూడా కష్టమేననీ అన్నారు. కొత్తతరం యువతీయువకులకు అర్థం చేసుకునే శక్తి ఉన్నదని అన్నారు. గే కానీ లెస్బియన్ కానీ ఏదైనా తమ చేతుల్లో లేదనీ, సహజసిద్ధంగా వచ్చిన లక్షణాలనీ, ఆ సంగతిని ఆమోదించి తమను గౌరవించడం, కనీసం అగౌరవపరచకుండా చూడడం నేర్చుకోవాలనీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తమను ఎందుకు ఆమోదించడం లేదంటూ ప్రశ్నించే ధోరణి ఎల్ జీబీటీ సమాజం సభ్యులలో ఇప్పుడిప్పుడే పెరుగుతోందని చెప్పారు. ఇతరులను జడ్జి చేయడం మానుకుంటే  మంచిదని సమాజానికి సలహా ఇచ్చారు. ఈ లక్షణాలు ఉన్నవారికి డాక్టర్ల చేత షాక్ థిరపీ ఇప్పించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు చెప్పారు.

పోల్చకండి, పోటీ పెట్టకండి

స్వచ్ఛంద సంస్థలకోసం పని చేస్తూ, జెడి లక్మీనారాయణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ వస్తున్న అధ్యాపకుడు వికాస్ వినోబా భావేను ఉటంకిస్తూ అద్భుతంగా మాట్లాడారు. ఒకరితో ఒకరిని పోల్చకుండా, వారి మధ్య పోటీ పెట్టకుండా, ఇద్దరికీ దయాగుణం నేర్పి ఒకరికొకరు సహకరించుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు (not comparison and competition but compassion and cooperation). ప్రభుత్వ పాఠశాలలో బాధ్యతంతా ఉపాధ్యాయులపై ఉంటుందనీ (teacher-centric), ప్రైవేటు పాఠశాలలో భారం అంతా తల్లిదండ్రులపైన ఉంటుందనీ (parent-centric) అన్నారు. అన్ని విషయాలకూ వెంటనే సకారాత్మకంగా స్పందించే గుణం కలిగిన పౌరసమాజాన్ని నిర్మించుకోవలసిన అవసరాన్ని వికాస్ నొక్కి చెప్పారు. పసలేని పౌరులను (shallow citizens) తయారు చేయడం వ్యర్థమని స్పష్టం చేశారు. పందొమ్మిదో శతాబ్దం ఇంగ్లండ్ ది అయితే, ఇరవయ్యో శతాబ్దం అమెరికాది అయిందనీ, ఇరవై ఒకటో శతాబ్దం ఇండియాది కావాలనిీ ఆయన ఆకాంక్షించారు.

ఉదయకిరణ్ ఆత్మహత్యా ఉదంతం

ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు విఎన్ ఆదిత్య ఆత్మహత్యలపైన సాధికారికంగా మాట్లాడారు. సంపాదన ప్రతిభకు కొలమానం కావడం సర్వనాశానానికీ కారణభూతమైనదని ఉద్ఘాటించారు. మనం రాజ్యాంగం నిర్మించుకున్నది దాన్ని ఉల్లంఘించేందుకేనని వ్యాఖ్యానించారు. చైతన్యరహితమైన ఉదాశీన సమాజంలో ఉన్నామని చెప్పారు. ఇరవై ఏడేళ్ళ కిందట సినీ పరిశ్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఇది తన నిర్ణయమనీ, ఇందులో విఫలమైనప్పటికీ ఆత్మహత్య గురించి ఆలోచించబోననీ తనకు తాను ప్రతిజ్ఞ చేసుకున్నానని అన్నారు. ఆత్మహత్యల నివారణకోసం చేస్తున్న ప్రయత్నం కనుక ఈ సమావేశానికి వచ్చాను కానీ మా సినిమా పరిశ్రమను తట్టించడానికి రాలేదని అన్నారు. ఎంతో శ్రమకోర్చి సరదాగా కాలక్షేపం చేయడానికి దోహదం చేసే సినిమాలను అందిస్తున్న సినీపరిశ్రమను నిందించడం, చులకనగా చూడటం, సినీప్రముఖులపైన అపవాదులు వేయడం సమంజసం కాదని ఆదిత్య అన్నారు.

ఆత్మహత్య చేసుకోవడం పిరికిపందల లక్షణమని అంటుంటారనీ, దానితో తాను ఏకీభవించడం లేదనీ, ఆత్మహత్య చేసుకునేవాడికి విపరీతమైన తెగింపు అవసరమనీ, ఎవరి కర్మకు వారిని వదిలి వెళ్ళిపోవడం, భవబంధాలనూ, బాధ్యతలనూ తెంపుకొని తమ మానాన తాము వెళ్ళిపోవడం పరికిపందల లక్షణం కాదని చెప్పారు. అది విపరీతమైన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. తనకు ఆత్మహత్య అంటే భయమని, అందుకే ఆత్మహత్య గురించి ఆలోచనకూడా తన దరికి రాదనీ చెప్పారు. సినిమావారిని సమాజమే డెమీగాడ్స్ గా అభివర్ణించి ఆరాధిస్తుందనీ, వారికి కలసిరాని రోజుల్లో వారినే నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తుందనీ అన్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి వివరంగా మాట్లాడారు. ఉదయ్ కిరణ్ తనకు వ్యక్తిగతంగా సన్నిహిత మిత్రుడు కావడం, ఆత్మహత్య చేసుకునే పోకడలు అతనితో తరచూ తనకు కనిపించడం, అటువంటి ఆలోచనను పారదోలడానికి తాను శక్తివంచన లేకుండా ప్రయత్నించడం గురించి వివరించారు. తాను అనుకున్న యువతితో వివాహం కాకపోయినా, సినిమాలలో అవకాశాలు సన్నగిల్లినా, చివరికి పెళ్ళి చేసుకొని స్థిరపడ్డాడని అనుకున్నాననీ, ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల మందే తనకు అర్ధరాత్రి ఫోన్ చేసి తెల్లవారేవరకూ మాట్లాడుతూనే ఉన్నాడనీ, హైదరాబాద్ లో అయితే సందడి ఉంటుందనీ, తాను, భార్యా బెంగళూరు వెళ్ళామనీ, అక్కడ పబ్ నుంచి మట్లాడుతున్నాననీ ఉదయ్ కిరణ్ చెప్పినట్టు ఆదిత్య తెలియజేశారు. తనకు ఫోన్ చేసి పాత సినిమాకి సీక్వెల్ తీయాలంటూ కబుర్లు చెప్పిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వారం రోజులలోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రంగనాథ్ కూడా మంచి మనిషి, మంచి నటుడూ, టీవీ సీరియళ్ళతో, సినిమా వేషాలతో బిజీగా ఉండేవాడనీ, ఆయనకు ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం లేదనీ, భార్యపోయి చాలాకాలం అయినా తను వివిధ కార్యక్రమాలలో మునిగితేలుతూ నిర్విరామంగా ఉండేవారనీ, ఆయన ఆత్మహత్యచేసుకోవడానికి ఫలానా కారణం అంటూ ఏదీ కనిపించదనిీ ఆదిత్య చెప్పారు.

దేన్నీ ఖాతరు చేయకండి, మీకు నచ్చినట్టు మీరు జీవించండి

వ్యక్తిత్వనిర్మాణ ప్రవీణుడూ, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సారథి, ప్రజలను కార్యశూరులుగా తీర్చిదిద్దే వాగ్దాటిని సొంతం చేసుకున్న ఆకెళ్ళ రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించేవాళ్ళు అవమానాలనీ, తిరస్కారాలనీ తట్టుకొని నిబ్బరంగా నిలబడి తమదైన జీవితం, తమకు నచ్చిన పద్ధతిలో జీవించడానికి సంసిద్ధం కావాలని ఉద్బోధించారు. ఓటమిని అంగీకరించకూడదనీ, వైఫల్యాలకు బెదరకూడదనీ, ఆత్మవిశ్వాసంతో, సంయమనంతో, సాహసోపేతంగా జీవించాలనీ, ఎవ్వరికీ తలొగ్గే ప్రసక్తి లేదనీ, ఎవరిని చూసీ భయపడవలసిన అవసరం లేదనీ, తనకు తోచిన రీతిగా ఢంకాబజాయించి దర్జాగా జీవించాలని అన్నారు. అనాథల గురించి ప్రస్తావించి, వారిని సోషియల్లీ చాలెంజ్డ్ పర్సెన్స్ అని పిలవాలని నీరజ సూచించారనీ, తానైతే వారిని సోషియల్లీ ప్రవిలేజ్డ్ పెర్సెన్స్ అని పిలవాలని బెబుతాననీ అన్నారు. జలపాతసదృశంగా సాగిన రాఘవేంద్ర ప్రసంగం సభికులను బాగా ఆకట్టుకున్నది.

మహారాష్ట్రలో అనాథలకు ఒక శాతం రిజర్వేషన్

ఆత్మహత్యల నివారణకు తాను కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ముఖ్యఅతిథి, పదవీ విరమణ చేసిన పోలీసు ఉన్నతాధికారి, మాజీ ఐపీఎస్, ప్రముఖ రాజకీయవేత్త, వ్యక్తిత్వ వికాస ప్రవీణుడు వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ (జేడీ లక్ష్మీనారాయణగా ప్రసిద్ధులు) చెప్పారు. అనాథలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక శాతం రిజర్వేషన్లు ఇస్తున్నదని, అక్కడి నుంచి వివరాలు తెప్పించుకొని ఇతర రాష్ట్టరాలలో కూడా అదే విధమైన రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నించవచ్చుననీ సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినవారు ఇక ముందు ఎటువంటి చొరవ తీసుకున్నా తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

శుభోదయ, వనసాహితి, రోష్నీ సంస్థలు ఆత్మహత్యల నివారణ లక్ష్యం చేపట్టే కార్యక్రమాలలో తనవంతు సహకారం అందించగలనని పాత్రికేయుడు రామచంద్రమూర్తి హామీ ఇచ్చారు. ఇది చాలా మంచి కార్యక్రమమనీ, ఇంత క్షేత్రజ్ఞానం కలిగిన వక్తల ఉపన్యాసాలను ఒకే వేదిక నుంచి వినడం ఇదే ప్రథమమనీ ఆయన ప్రశంసించారు.  

రోష్నీ సంస్థ ప్రతినిధి జ్యోతి సభాకార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి వక్త మాట్లాడటానికి ముందూ, మాట్లాడిన అనంతరం సమయోచితమైన వ్యాఖ్యలు చేస్తూ సభను వస్తునిష్ఠంగా సంకల్పశుద్ధితో నడిపించారు. గురుదత్ నుంచి రంగనాథ్ వరకూ సినీ ప్రముఖులు ఆత్మహత్య చేసుకోవడం గురించీ, అలెగ్జాండర్ నుంచి రితుపర్నోఘోష్ దాకా స్వలింగ ఆకర్షితులైనవారి గురించీ, రైతుల ఆత్మహత్యల గురించీ, అనాథల స్థితిగతుల గురించీ, విద్యావ్యవస్థ గురించీ తనదైన రీతిలో వ్యాఖ్యానించారు.

మధ్యాహ్న భోజనానంతర సభలో మహిళా ఉద్యమ నాయకురాలు సంధ్య, మరికొందరు ప్రముఖులు ప్రసంగించారు. తర్వాత కొందరు ఆత్మహత్యలు వద్దంటూ గీతాలాపన చేశారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం గం.5 వరకూ సభ జయప్రదంగా జరిగింది.

———————————————————————————————–రోష్నీని గుర్తుంచుకోండి.

ఉచితమై, గోప్యమైన, మానసిక ఆసరా కోసం

040 6620 2000 లేదా 040 6620 2001కి ఉదయం గం. 11ల నుంచి రాత్రి గం. 9 వరకూ ఫోన్ చేయండి. [email protected]  కి మెయిల్ చేయండి.

——————————————————————————————

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles