Wednesday, September 18, 2024

బీహార్ బాహాబాహీ: బీజేపీ తిరుగుబాటుదారుల బహిష్కరణ

  • నితీశ్ ను సంతృప్తి పరిచేందుకూ, గందరగోళం తొలగించేందుకూ బీజేపీ చర్య
  • ఏడాదిగా నితీశ్ పైన దుమ్మెత్తిపోస్తున్న యువనాయకుడు
  • బీజేపీ మౌనంపట్ల అసహనం ప్రదర్శించిన నితీశ్
  • ఎల్ జేపీతో బీజేపీ సంబంధాలు లేవంటూ విస్పష్ట ప్రకటన

కె. రామచంద్రమూర్తి

పోలింగ్ మూడు వారాల కంటే తక్కువ వ్యవధిలో ఉండటంతో బీజేపీ నాయకులు ఎల్ జేపీ కి దూరంగా జరిగారు. జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను అదే పనిగా విమర్శిస్తున్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జేపీ) నేత చిరాగ్ పాసవాన్ ద్వంద్వ వైఖరి కారణంగా అధికార కూటమి ప్రయోజనాలు దెబ్బతింటాయని గ్రహించిన బీజేపీ నాయకత్వం ఎట్టకేలకు చర్య తీసుకుంది. ఎల్ జేపీ టిక్కెట్టుపైన పోటీ చేయడానికి రంగంలో దిగిన ఎనిమిదిమంది బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులను పార్టీ నుంచి బహిష్కరించింది. ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు సన్నిహితుడు. బీజేపీ తిరుగుబాటుదారులకు ఆయన వారం రోజుల కిందట హెచ్చరిక జారీ చేశారు. తిరిగి బీజేపీలోకి రావాలనీ లేదా క్రమశిక్షణ చర్యకు సిద్ధపడాలనీ చెప్పారు. తిరుగుబాటుదారులు తన మాటను పెడచెవిన పెట్టిన కారణంగా చర్య తీసుకున్నారు. ఈ చర్యతో ముఖ్యమంత్రి కొంత శాంతించారు. ఏడాది పొడుగునా తనపైన రాళ్ళు విసురుతున్న చిరాగ్ పైన చర్యలు తీసుకోకపోవడం పట్ల నితీశ్ అసహనం ప్రదర్శించారు. చివరికి ఎల్ జేపీ ఎన్ డీఏ కూటమిలో భాగం కాదనీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ  ఆ పార్టీతో బీజేపీకి ఎటువంటి సంబంధాలు లేవనీ సుశీల్ మోదీ సోమవారంనాడు నిర్ద్వంద్వంగా  ప్రకటించారు. జేడీయూ, బీజేపీ కాకుండా జితన్ రాం మాంఝీ నాయకత్వంలోని హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం), ముఖేష్ సాహ్నీ నేతృత్వంలోని ఎన్సాన్ పార్టీ (వీఐపీ) మాత్రమే నేషనల్ డెమాక్రాటిక్ పార్టీలో భాగమనీ, తక్కిన పార్టీలతో కూటమికి సంబంధం లేదనీ సుశీల్ మోదీ స్పష్టం చేశారు.

‘మాకు మెజారిటీ వస్తే నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ విషయంలో ఎటువంటి గందరగోళానికి అవకాశం లేదు,’ అని మోదీ ప్రకటించారు. యువదళిత నేత చిరాగ్ పాసవాన్ కు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష బలంగా ఉంది. కానీ తన తండ్రి రాంవిలాస్ పాసవాన్ స్థాపించిన ఎల్ జేపీకి ఏ ఎన్నికలోనూ ఆరు శాతానికి మించి ఓట్లు రాలేదు. ఎప్పుడూ కూటమిలో భాగస్వామిగా పోటీ చేయడం వల్ల పోటీ చేసే స్థానాలు 30 లోపు ఉండటంతో పోలయ్యే ఓట్ల సంఖ్య కూడా పరిమితంగా ఉంటోంది. అందుకు సీట్ల సంగతి ఎట్లా ఉన్నా ఓట్ల శాతం పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ సారి జేడీయూతో సమానంగా 120పైగా స్థానాలకు అభ్యర్థులను నిలబెడుతున్నారు. ఈ దశలో నిశ్వబ్దంగా ఉంటే అధికార కూటమికి తీరని నష్టం జరుగుతుందని బీజేపీ నాయకులు గ్రహించారు. తిరుగుబాటుదారులపైన చర్య తీసుకోవడానికంటే ముందుగానే ఎన్నికల ప్రవీణుడు ప్రశాంత్ కిషోర్ పైన నిందమోపడానికి ప్రయత్నించారు. ఆయన గట్టిగా సమాధానం చెప్పారు.  

 చిరాగ్ వెనుక ప్రశాంత్ కిషోర్ : బీజేపీ

బీహార్ ఎన్నికలలో చిరాగ్ పాసవాన్ పెట్టిన చిచ్చు రగులుతూనే ఉంది. పాసవాన్ వెనుక ఎన్నికల ప్రవీణుడు ప్రశాంత్ కిశోర్ ఉన్నారని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనుచరులు భావిస్తున్నారు. అదే విషయం బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాంవిలాస్ పాసవాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు చెబుతూ ఒక ట్వీట్ పెట్టారు. అందులో ముఖ్యమంత్రి, బీహార్ లో ఎన్ డీ ఏ కూటమి నాయకుడూ అయిన నితీశ్ కుమార్  ప్రస్తావన లేదు. తన తండ్రి మరణం తర్వాత తనకు అండగా నిలిచినందుకు ప్రధానికి మాత్రం కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీకీ, నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూకీ నడుమ చిరాగ్ విభేదాలు సృష్టించారు. ఒక సంవత్సరం పొడుగునా చిరాగ్ బీహార్ అంతటా పర్యటించి నితీశ్ కుమార్ ని అదే పనిగా విమర్శిస్తూ వచ్చారు. మూడు టరమ్ లుగా, పదిహేనేళ్ళ పాటు పదవిలో కొనసాగుతున్న నితీశ్ కుమార్ పట్ల ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఉన్నదని చిరాగ్ భావన. బీజేపీ నాయకులు చేసిన సర్వేలలో కూడా నితీశ్ పట్ల ప్రజలలో సానుకూలత లేదని తేలింది. కానీ నితీశ్ నాయకత్వంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో నేషనల్ డెమాక్రాటిక్ అలయెన్స్ (ఎన్ డీఏ) పోటీ చేయాలని నిర్ణయించుకున్న  కారణంగా జేడీయూతో బీజేపీ సీట్ల సర్దుబాట్లు చేసుకున్నది.

ఎల్ జేపీ ఒంటరి పోరాటం

మొత్తం 243 స్థానాలలో 122 స్థానాలకు జేడీయూ, 121 స్థానాలకు బీజేపీ పోటీ చేయాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. చిన్న పార్టీలకు జేడీయూ, బీజేపీలు తమ కోటా నుంచి సీట్లు ఇస్తాయి. రాంవిలాస్ పాసవాన్ స్థాపించిన ఎల్ జేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నది. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాలలో ఈ పార్టీ అభ్యర్థులను నిలబెట్టదు. జేడీయూ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలోనే ఎల్ జేపీ అభ్యర్థులు రంగంలో ఉంటారు.

నితీశ్ కుమార్ ని వ్యతిరేకిస్తూ నరేంద్రమోదీని సమర్థిస్తూ రాజకీయం చేయాలని చిరాగ్ పథకం. ఇటువంటి పథక రచన సామర్థ్యం చిరాగ్ కు లేదనీ, ఇది ప్రశాంత్ కిషోర్ పనేననీ బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. 2014లో బీజేపీ విజయానికీ, 2015లో ఆర్ జేడీ-జేడీయూ-కాంగ్రెస్ విజయానికి కారకుడు ప్రశాంత్ కిషోర్ అని అందరూ అంటారు. 2018లో ప్రశాంత కిషోర్ జేడీయూలో చేరారు. తన తర్వాత స్థానాన్ని అప్పగించి కిషోర్ ను నితీశ్ గౌరవించారు. కానీ నితీశ్ తో అభిప్రాయాల భేదాలు వచ్చాయి. వాటిని గురించి కిశోర్ అదేపనిగా మాట్లాడి నితీశ్ ను ఇరకాటంలో పెట్టారు. అప్పుడు నితీశ్ కిషోర్ ను పార్టీ నుంచి బయటికి సాగనంపారు. ఆ తర్వాత కొన్ని వారాలపాటు కిషోర్ బీహార్ లో ప్రత్యామ్నాయ రాజకీయాల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రాష్ట్రం అంతటా పర్యటించారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ఈ లోగా చేయగలిగింది ఏమీ లేదని తీర్మానించుకొని దిల్లీలో ఉంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ వివరణ

తాను బీహార్ కి ఫబ్రవరి తర్వాత వెళ్ళలేదనీ, చిరాగ్ ను ఒకే ఒక సారి నితీశ్ కుమార్ నివాసంలో ముఖ్యమంత్రి సమక్షంలోనే కలుసుకున్నాననీ, అతని రాజకీయాలకు తనపైన ఫిర్యాదు చేయడం తగదనీ ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో తనకు ప్రమేయం లేదనీ, ఎన్నికలకు దూరంగా ఉంటున్నాననీ ఆయన చెప్పారు. తనను నిందించే బదులు బీజేపీ నాయకులు చిరాగ్ పైన కించిత్తు విమర్శ కూడా చేయలేదనీ, సంవత్సరం పొడవునా చిరాగ్ ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తి పోస్తుంటే బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ, జాతీయ నాయకులు కానీ ఆ యువకుడిని పల్లెత్తు మాట అనలేదనీ కిషోర్ గుర్తు చేశారు. ఇప్పటికీ, జేడీయూతో సీట్ల సర్దుబాట్లు చేసుకున్న తర్వాత కూడా ఎల్ జేపీని కానీ దాని నాయకుడు చిరాగ్ పాసవాన్ ని కానీ బీజేపీ నాయకులు విమర్శించకపోవడం, తనను ఆడిపోసుకోవడం వింతగా ఉన్నదని కిషోర్ వ్యాఖ్యానించారు. పైగా చిరాగ్ పాసవాన్ ను దిల్లీలో కలుసుకొని ఆయనను దీవించింది ప్రధాని నరేంద్రమోదీ, దేశీయాంగమంత్రి అమిత్ షా కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. చిరాగ్ తండ్రి రాంవిలాస్ పాసవాన్ ఇటీవల దిల్లీలో గుండె ఆపరేషన్ అనంతరం తనువు చాలించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles