Saturday, July 13, 2024

అఫ్ఘానిస్తాన్ పై అప్పుడే దాడి ప్రారంభించడం అవసరమా?

తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి – 6

అఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. అన్ని తెగలనూ, అన్ని వాదాలు వినిపించేవారినీ కలిపి సమగ్రమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాలిబాన్ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయత్నంలో ఎంతవరకూ సఫలీకృతులవుతారో, ఎంతకాలం సహనం ప్రదర్శిస్తారో, ఎప్పుడు తమకు సహజమైన మొండితనం, బేపర్వా తిరిగి వారి నడతను నిర్దేశిస్తాయో తెలియదు. ఈ లోగా అక్కడ కొన్ని ఘటనలను భూతద్దంలో చూపించి తాలిబాన్ ను పూర్తిగా వ్యతిరేకించడం భారత దేశ ప్రయోజనాలకు సరైనది కాదు. కొంతకాలం పరీక్షించాలి. ఎటువంటి ప్రభుత్వం ఏర్పడుతుందో, ఆ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుందో, దాని విదేశాంగ విధానం ఏ విధంగా ఉంటుందో, పొరుగుదేశాలలో చిచ్చుపెట్టడానికి సిద్ధపడుతుందో, ఇస్లామిక్ మతరాజ్య స్థాపన బాధ్యతను కొనసాగిస్తుందో లేక అఫ్ఘానిస్తాన్ లో ప్రజల సంక్షేమం కోసం, ప్రగతికోసం పని చేస్తుందో చూడాలి. ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం అనవసరం. తొందరపాటు అవుతంది. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే అఫ్ఘానిస్తాన్ విషయంలో అమెరికాను అనుసరించడం మానివేయాలి. ఇండియాకు ఏది ప్రయోజనకరమో అది చేయాలి. అఫ్ఘానిస్తాన్ నూ, తాలిబాన్ నూ నిందిస్తే భారత్ లో రాజకీయ లబ్ధిపొందవచ్చుననే సంకుచిత ధోరణి కూడా నష్టదాయకమే.

Also read:తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి?

నడివయస్సులో తాలిబాన్

తాలిబాన్ ఇరవై ఏళ్ళ కిందట ఆయుధాలు పట్టిన విద్యార్థులే. ఇరవై ఏళ్ల కిందట అవతరించిన తాలిబాన్ ఇప్పుడు నలభయ్యో పడిలో పడిన యోధులు. అప్పుడు ముక్కుపచ్చలారని విద్యార్థులు. ఇప్పుడు తలలూ, గడ్డాలూ నెరుస్తున్న నడివయస్కులు. ఈ రెండు దశాబ్దాలలో ఇస్లాం పట్ల వ్యామోహం తగ్గింది. మదర్సాలలో తాలిబ్ లను తయారు చేయలేదు.  తాలిబాన్ కంటే ముందు రాజ్యాం చేసినవారిలో అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని నార్దర్న్ అలయెన్స్ పేరుతో ముజాహిదీన్ కు అమెరికా ఆయుధ సహాయం చేసింది. వారి పని సోవియెట్ యూనియన్ సైనికులను వేధించడం, అఫ్ఘానిస్తాన్ నుంచి పంపించడం. ఇస్లాంమతం జోరుమీద ఉన్న ఆరోజుల్లో పాకిస్తాన్ లోనూ, పాకిస్తాన్ ని అనుకున్న అఫ్ఘాన్ ప్రాంతాలలోనూ వెలసిన మదర్సాలలో తయారైనా తాలిబాన్ ఖురాన్  ను తమకు ఇష్టం వచ్చినట్టు అన్వయించేవారు. కానీ క్రమశిక్షణకీ, కట్టుబాటుకీ మారుపేరుగా ఉండేవారు. నాయకత్వం పట్ల పూర్తి విధేయత ఉండేది. పష్తూన్ తెగకు చెందిన ప్రజలు అఫ్ఘానిస్తాన్ జనాభా లో  40 శాతానికి పైగా ఉన్నారు. కాందహార్ వారికి పెట్టని కోట. 1996లో అఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న అరాచక పరిస్థితులను తాలిబాన్ అధిగమిస్తారనీ, మంచి పరిపాలన అందిస్తారనీ అఫ్ఘాన్ ప్రజలు ఆశించారు. అందుకే వారు తాలిబాన్ ని ఆహ్వానించారు. తాలిబాన్ అధికారంలోకి వచ్చారు. కానీ అభివృద్ధివైపు కాకుండా మతమౌఢ్యంవైపు అడుగులు వేశారు. మహిళలను వంటింటి బానిసలుగా, బుర్ఖాతోనే ఘోషాలో జీవించే అబలలుగా, చదువులకూ, ఉద్యోగాలకూ దూరంగా ఉంటూ అజ్ఞానంలో మగ్గే మనుషులుగా ఉంచేందుకు ప్రయత్నించారు. వారిని చిత్రహింసలకూ, అంతులేని అవమానాలకూ, నానావిధ క్లేశాలకూ గురిచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలకు నరకం చూపించారు. వారిని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగా పరిగణించారు. వారికీ మనసు ఉంటుందనీ, వ్యక్తిత్వం ఉంటుందనీ, స్వేచ్ఛకోరుకునే హృదయం ఉంటుందనీ, వారికీ ఆశలూ, ఆకాంక్షలూ ఉంటాయనీ విస్మరించారు. పశువుల్లాగా ప్రవర్తించారు. అది ఇస్లాం మతాచారం కాదనీ, మహిళలని కట్టుబానిసలుగా చూడమని ఇస్లాం ఎక్కడా చెప్పలేదనీ లోకజ్ఞానం కలిగిన ఇస్లాం పండితులు మొత్తుకున్నారు. తాలిబాన్ చెవికెక్కలేదు.

Also read: అఫ్ఘానిస్తాన్ పట్ల ఆసక్తి కోల్పోయిన అమెరికా

తాలిబాన్ కీ, ముజాహిదీన్ కీ మహిళల విషయంలో దృక్ఫధాలు భిన్నంగా ఉన్నాయి. ఇద్దరూ  మతయోధులే. ఇద్దరూ ఇస్లాం మతం కోసం తుపాకులు ధరించినవారే. ఖురాన్ ను అన్వయించడంలోనే తేడా  ఉంది. ముజాహిదీన్ నాయకుడైన అహ్మద్ షా మసూద్ మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కుల ఉండాలనీ, వారూ చదువుకోవాలనీ, ఉద్యోగాలు చేయాలనీ కోరుకున్నాడు. తాలిబాన్ ఆగస్టు 15న అధికారాన్ని తిరిగి చేపట్టిన సమయంలో మహిళలు చదువులూ, ఉద్యోగాలూ కొనసాగించవచ్చుననీ, కొత్త ప్రభుత్వం అభ్యంతరం చెప్పదనీ ప్రకటించారు. తనను పని ఆపుచేసి ఇంటికి వెళ్ళమని బెదిరించారని ఒక టీవీ చానల్ యాంకర్ ఫిర్యాదు చేసింది. పరిస్థితులు మారాయి.  తాలిబాన్ కాబూల్ లో ప్రవేశిస్తున్న సమయంలోనే కొంతమంది మహిళలు ప్లకార్డులు పట్టుకొని తమకు స్వేచ్ఛను కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.  మొత్తంమీద మహిళలలో చైతన్యం పెరిగింది. మహిళలతో కలిసి పని చేసే సంస్కృతి అఫ్ఘాన్ పురుషులకు కూడా అలవాటైంది. అనుభవం నేర్పిన పాఠాల ప్రభావంతో మహిళల  పట్ల, సమాజం పట్ల తాలిబాన్ వైఖరి మారితే వారి ప్రభుత్వాన్ని గుర్తించి, వారితో వ్యవహారం చేయడానికి భారత ప్రభుత్వానికి అభ్యంతరం ఉండకూడదు. ఇది వేచిచూడవలసిన సమయం. ఈ సమయంలోనే మన నాయకులు మనసులో ఉన్న భయాలనూ, పక్షపాతాలనూ బహిర్గతం చేయకుండా మౌనంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఇస్లాం మతాన్నీ, ముస్లింలనూ వ్యతిరేకించేవారి మాటలకు విలువ ఇవ్వనక్కరలేదు.

తాలిబాన్ కాల్పులలో్ ఏడుగురు పౌరులు మరణించారు

Also read: మహాసామ్రాజ్యాలను నేలకరిపించిన అఫ్ఘానిస్తాన్

తాలిబాన్ వెయ్యేళ్ళ నుంచీ పోరాడుతున్నారంటూ ట్రంప్ వ్యాఖ్య

అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకొని తిరిగి తాలిబాన్ కు పరోక్షంగా అధికారం అప్పగించినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై విమర్శల వర్షంకురుస్తోంది. అసలు బైడెన్ ఉపాధ్యక్షుడుగా ఉండగానే అమెరికా సేనలు అఫ్ఘానిస్తాన్ లో బలిదానం చేయడం అనవసరమని వాదించేవాడు. ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉండగా పాకిస్తాన్ లో ఒసామా బిన్ లాదెన్ ను సంహరించిన తర్వాత అమెరికాకు అఫ్ఘాన్ లో ఏమి పని అని వాదించాడు. కానీ ఒబామా మాత్రం సైన్యాన్ని ఉపసంహరించకపోగా పెంచాడు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అఫ్ఘాన్ లో అమెరికా పాత్రపైన చర్చ జరిగింది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమాక్రాటిక్ అభ్యర్థి బైడెన్ అఫ్ఘానిస్తాన్ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అక్కడి నుంచి సైనికులను ఉపసంహరించుకోవాలన్నదే ఇద్దరి అభిమతం. కానీ అమెరికా సైన్యం ఉపసంహరణ మొదలుపెట్టిన వెంటనే తాలిబాన్ దేశం మొత్తాన్ని రెండు వారాలలోగా ఆక్రమించుకోవడాన్ని ట్రంప్ విమర్శించాడు. అమెరికా సవ్యంగా ఉపసంహరణ కార్యక్రమాన్ని అమలు చేయలందంటూ ట్రంప్ ధ్వజమెత్తారు. ‘‘ఫాక్స్’’ న్యూస్ చానల్ కు అఫ్ఘాన్ పరిస్థితిపైన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇది అమెరికాకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎదురుదెబ్బ అనీ, తలదించుకోవలసిన పరిస్థితి దాపురించిందనీ చెప్పారు. తాను అధికారంలో ఉండగా అఫ్ఘానిస్తాన్ తో ఎట్లా వ్యవహరించిందీ చెప్పుకొచ్చారు. ట్రంప్ కి చరిత్ర తెలిస్తే అయిదు దశాబ్దాల కిందట సైగాన్ నుంచి అమెరికా సేనలు ఎట్లా ఉపసంహరించుకున్నాయో తెలుసుకునేవారు.

Also read: మహాసామ్రాజ్యాలను నేలకరిపించిన అఫ్ఘానిస్తాన్

‘‘మనం అఫ్ఘానిస్తాన్ నుంచి నిష్క్రమించడం తప్పు కాదు. కానీ అత్యంత బలహీనమైన పద్దతిలో నిష్క్రమించడం వివాదాంశం. అఫ్ఘానిస్తాన్ అమెరికా సైనిక చరిత్రలో అత్యంత అవమానకరమైన ఘట్టాన్ని నమోదు చేసింది. ఇది ఈ విధంగ జరగవలసింది కాదు,’’ అని ట్రంప్ అన్నారు. ‘‘వారు (తాలిబాన్) చాలా నిరంకుశంగా, నిర్దయగా, అమానవీయంగా వ్యవహరిస్తారని చరిత్ర స్పష్టం చేస్తూనే ఉంది. వారు మంచి పోరాటయోధులు. వారు వేల సంవత్సరాలుగా పోరాడుతున్నారు,’’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యానం వైరల్ అయింది. తప్పులో కాలేసిన ట్రంప్ అపహాస్యం పాలైనారు. తాలిబాన్ జననం 1994లో జరిగింది. అంటే పాతికేళ్ళ కంటే కాస్త ఎక్కువ. అఫ్ఘానిస్తాన్ లో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు కాందహార్ లో తాలిబ్ లు అధికారం హస్తగతం చేసుకున్నారు మొట్టమొదటిసారిగా. రెండేళ్ళలో అఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని (పాంజ్ షీర్, ఉత్తర అఫ్ఘానిస్తాన్ లో కొన్ని ప్రాంతాలు మినహా) ఆక్రమించుకొని అఫ్ఘాన్ ఎమిరేట్ రాజ్యాన్ని నెలకొల్పారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే తాలిబాన్ వెయ్యేళ్ళుగా పోరాటం చేస్తున్నారంటూ అయిదేళ్ళు అమెరికా అధ్యక్షుడుగా ఉండటమే కాదు తాలిబాన్ తో నేరుగా చర్చలకు అధికారులను పంపిన ట్రంప్ వ్యాఖ్యానించడం నవ్వులపాలయింది.

Also read: పాంజ్ షీర్ వైపు కదులుతున్న తాలిబాన్

తాలిబాన్ పాలన ఎట్లా ఉంటుంది?

లోగడ తాలిబాన్ అధికారంలోకి రాగానే అఫ్ఘానిస్తాన్ రిపబ్లిక్ ని ఇస్లామిక్ ఎమిరేట్స్ గా మార్చారు. ఖురాన్ ను తమకు నచ్చిన పద్ధతిలో అన్వయించుకొని బహిరంగంగా శిక్షలు అమలు చేయడం ప్రారంభించారు. వరుసగా ‘దోషులను’ నిలబెట్టి తుపాకులతో కాల్చివేయడం, ఉరికంబం ఎక్కించడం, అంగవిచ్ఛేదనం చేయడం వంటి అమానుషమైన రాక్షస పద్ధతులను అమలు చేసి అపకీర్తి మూటకట్టుకున్నారు. ఇతర మత సంప్రదాయాలను అనుమతించేది లేదనీ, సహించేది లేదనీ స్పష్టం చేశారు. బామియాన్ బుద్ధవిగ్రహాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. 2001లో ఆ విగ్రహాలను పనిగట్టుకొని విధ్వంసం చేశారు. ఆ విగ్రహాలు అఫ్ఘానిస్తాన్ లో ఉండటం అపచారమంటూ వారు ఖురాన్ ను తప్పుగా అన్వయించారు.

కాబూల్ విమానాశ్రయంలో తాలిబాన్ దాడులు చేస్తారని ఊహిస్తూ కవాతు చేస్తున్న అమెరికా సైనికులు

Also read: కాబూల్ విమానాశ్రయంలో గెండెలు పిండే దృశ్యాలు అనివార్యం : జోబైడెన్

ఆధునిక పద్ధతులలో పరిపాలన  సాగించాలని అగ్రనాయకత్వం తలబోసేది. కానీ వీధులలో మాత్రం అమానుషమైన రీతిలో ఇస్లామిక న్యాయసూత్రాలు (షరియా) అమలు చేసేవారు. ఉత్తర అఫ్ఘానిస్తాన్ మాత్రం తాలిబాన్ పాలనలో లేదు. అది ముజాహిదీన్ పాలనలో ఉంది. సమాజంలో మహిళలు పరిమితమైన పాత్ర మాత్రమే పోషించాలనే భావజాలం తాలిబాన్ కు మదర్సాలలో నూరిపోశారు. మహిళలు బుర్ఖా లేకుండా తమ ఇంటి బయట కనిపిస్తే తీవ్రమైన శిక్ష పడేది. అవివాహితులైన పురుషులు, స్త్రీలు కలిసి కనిపిస్తే కూడా తీవ్రమైన శిక్ష అనుభవించాల్సి వచ్చేది.

Also read: తాలిబాన్ పై గెరిల్లాపోరాటానికి రంగం సిద్ధం చేస్తున్న అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు

కాంధహార్ లో 9 మంది మహిళలకు ఉద్యోగాల నుంచి ఉద్వాసన

తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చి కార్జాయ్ నాయకత్వంలో తొలి తాలిబానేతర ప్రభుత్వాన్ని అమెరికా సహకారంతో నెలకొల్పిన తర్వాత మహిళల జీవితాలు మారిపోయాయి. తాలిబాన్ తిరిగి రాకతో తమకు పాడుకాలం దాపురించిందని మహిళలు భయపడుతున్నారు. తాలిబాన్ జులైలో కాంధహార్ లో ప్రవేశించగానే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న తొమ్మిదిమంది మహిళలను ఇళ్ళకు వెళ్ళిపొమ్మని చెప్పి వారి బంధువులను ఆ ఉద్యోగాలలో ప్రవేశ పెట్టారు. ఇటువంటి ఘటనలే పునరావృత్తం అవుతాయా లేక తాలిబాన్ వైఖరి మారుతుందా అన్నది వేచి చూడాలి. కానీ ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనలో తాలిబాన్ ను పరోక్షంగా ఉద్దేశించి విమర్శించారు. ‘‘ఉగ్రవాద ప్రభుత్వాలు ఎంతో కాలం నిలువలేవు,’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది తొందరపాటు వ్యాఖ్య. ఇంకా కొంతకాలం అఫ్ఘానిస్తాన్ విషయంలో వేచి చూస్తూ, ఈ లోగా ఆచితూచి మాట్లాడితే భారత్ ప్రయెజనాలకు అనుకూలంగా ఉంటుంది.

Also read: తాలిబన్లు కాదు, తాలిబాన్!

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles