Thursday, April 25, 2024

మనసుకవికి శతవత్సర వందనం

సినిమా కవికులగురువుగా భావించే మల్లాది రామకృష్ణశాస్త్రి ‘కవికుల బాలచంద్రుడు’ అనే అందమైన బిరుదును ఆత్రేయకు ప్రదానం చేశారు.మంటల్లోనూ వెన్నెలను చూపించగల మహనీయుడు, పండువెన్నెలలోనూ మండుటెండను సృష్టించగల కవనీయుడు ఆత్రేయ. తెలుగువారికి ఆత్రేయను ప్రత్యేకంగా పరిచయం చేయడం హాస్యాస్పదమే అవుతుంది. మనసు మనసులో కొలువై వున్న మన’సు’కవి ఆత్రేయ. తేలికైన పదాలతో బరువైన అర్ధాలు, అల్పాక్షరాలతో అనల్పార్ధ రచన చేయగలిగిన తిక్కన్నవంటి పెద్దన్న మన ఆత్రేయ. 07 మే 1921 నాడు ఈ పుట్టుకవి పుట్టాడు. ఈయన పుట్టుకను లోకం మెచ్చింది. ఆయన మాటలు, పాటలు విని లోకం ఏడ్చింది.

Also read: బుధజన బాంధవుడు బూదరాజు

కవిత్వం లోతులు తెలిసిన కవి

నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని ఆయనే అన్నట్లు, ఆయన మనల్ని నవ్వించాడు, కవ్వించాడు, ఏడ్పించాడు. ఆ కవిత్వపు లోతులు ఆయనకే తెలుసు. మహాకవి ఆత్రేయ పుట్టి నేటితో వందేళ్లు పూర్తవుతోంది. ఈ శతాబ్దం నాది అని శ్రీశ్రీ అన్నాడు. శబ్దం ఉన్నంతకాలం ఆత్రేయ ఉంటాడని మనమందాం. సినిమా పాటల మాటల రచయితగానే ఎక్కువమందికి తెలిసిన ఈ నెల్లూరు బుల్లోడు పూర్వాశ్రమంలో మంచి పద్యకవి, గొప్ప నాటకకర్త, సహజనటుడు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు ఆత్రేయ పద్యాలంటే చాలా ఇష్టం. ‘జమీన్’ పత్రికలో కొన్నాళ్ళు పనిచేసి జర్నలిజంలోనూ మురిపించాడు. పద్యాలు రాయడమే కాదు మనసును హత్తుకునేలా పాడగలరు. తెలిసేట్టు చెబితే సిద్ధాంతం, తెలియకపోతే వేదాంతం అన్నాడు. తెలిసిన విషయాన్నీ మెరిసేట్టు చెబితే కవిత్వం.

Also read: ఆత్మీయునికి అశ్రునివాళి

అక్షరాలను వెలిగించిన ఆత్రేయ

సిద్ధాంతాలను, వేదాంతాలను తెలిసీతెలియనివారికి కూడా తెలిసేట్టు చెప్పినవాడు ఆత్రేయ. దానికి పాటలను, మాటలను ఎంచుకున్నాడు. ఆయన మాట పాటవుతుంది, పాట మాటవుతుంది. ఆ శిల్పం ఆత్రేయకే సొంతం. అమ్మఒడి, ప్రేమతడి, గుండెవేడి, బతుకుబడి బాగా తెలిసినవాడు కాబట్టే అక్షరాలను అంతగా బతికించాడు, వెలిగించాడు. బూచాడమ్మా బూచాడు… బుల్లిపెట్టెలో ఉన్నాడు. కళ్ళకెపుడు కనపడడు.. కబురులెన్నో చెబుతాడు… అంటూ టెలిఫోన్ పై కూడా పాట రాశాడు. కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ ఏ నక్షత్రంలో అన్నాడో కానీ, దాన్ని అక్షరాల చూపించిన ఆధునిక కవులలో ఆత్రేయ అగ్రేసరుడు. ఆత్రేయ అనగానే మనసు, వయసు, ప్రేమ, విరహం, కన్నీళ్లు ఎలాగూ గుర్తుకురాక మానవు. ఈ చట్రంలోనే ఆయన ఉండిపోలేదు. సందర్భాన్ని బట్టి, ప్రాధాన్యాన్ని బట్టి, అవసరమైనప్పుడు, హృదయం పొంగినప్పుడు  అన్ని రకాల పాటలు రాశాడు.

Also read: పత్రికాలోకాని వేగుచుక్క కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు

శ్రమైకజీవన సౌదర్యం

నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే, వారి బుగ్గల నిగ్గునీకు వచ్చిచేరెను తెలుసుకో అన్నాడు. చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో అంటాడు. శ్రమలోకపు సౌందర్యాన్ని, సామ్యవాద సిద్ధాంతాన్ని అంతకంటే ఏ కవి గొప్పగా చెప్పగలడు.అమ్మను దేనితో సరిపోల్చగలం ,’అమ్మవంటిది అమ్మ’ అన్నాడు అందుకే. దేవుళ్ళ లోపాలను ఎత్తిచూపిస్తూ మంచిమనుషులను వర్ణించిన  తీరు అనన్య సామాన్యం. రాముడు కాడమ్మా నిందనలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు, నువు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు, నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు, అంటూ మనిషిలోని దేవుడ్ని చూపించాడు. “ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ, ఏ బంధములేని తొలి సంబంధమే ప్రేమ” అని అనిర్వచనీయంగా భావించే ప్రేమకు నిర్వచనం చెప్పాడు. ఎట్టాగా ఉన్నావే ఓలమ్మి, అనే పల్లెపలుకులతో పదాలను అల్లడం ఆయనకే చెల్లింది. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలుమంగకు అలుకరానీయకు అంటూ శేషశైలవాసుడైన శ్రీనివాసుడికి కూడా సూచనలు చేశాడు.

Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి కాళ్ళకూరి

దేవుడైనా జీవుడైనా ఒక్కటే

ఒకసారి పాటెత్తుకుంటే,ఆత్రేయకు దేవుడైనా జీవుడైనా ఒక్కటే. లోకోక్తులు, తత్త్వాలు, నుడులు, పలుకుబడులు ఆయన మాటలు , పాటల్లోకి సెలయేర్లు లాగా సహజంగా నడిచివస్తాయి. చూడటానికి సులువుగా కనిపించినా, ఆ సరళిని అనుసరించడం అసాధ్యం. ఉదాహరించి, వివరించాలంటే వేలపేజీలు సరిపోవు. క్లుప్తంగా, అప్తంగా చెప్పడమే తప్ప, కాసిన్ని అక్షరాల్లో కుదురుగా కూర్చోపెట్టలేని కొండంత కవి ఆత్రేయ. చిటపట చినుకులు పడుతూ వుంటే పాటతో వానపాటలకు తొలివరస ఆయనే కట్టాడు. మానా పెట్టాడు. చంచలమైన మనసును చెప్పగలడు, అచంచలమైన భక్తిని చూపించగలడు, అభ్యుదయాన్ని ఆణువణువునా నింపగలడు. ‘ఇంద్రధనస్సు’ సినిమాలోని  నేనొక ప్రేమ పిపాసిని పాటంటే ఆత్రేయకు ఎంతో ఇష్టం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను అడిగిమరీ ఆ పాటను పదేపదే పాడించుకొనేవాడు.

Also read: పాలకపక్షాలకే మళ్ళీ పల్లకీ

జీవితాన్ని చదివిన మేధావి

ఆత్రేయస గోత్రాన్ని కలంపేరుగా పెట్టుకున్న కిళాంబి వెంకటనరసింహాచార్యులు నెల్లూరు జిల్లా మంగళంపాడు (ఆత్రేయపురం) లో పుట్టారు. సీతమ్మ, కృష్ణమాచార్యులు తల్లిదండ్రులు. అకడెమిక్ గా పెద్ద చదువులు చదవకపోయినా, ప్రపంచాన్ని, జీవితాన్ని, మనుషులను, మనసులను బాగా చదివాడు. డిగ్రీలు లేకపోయినా, తన పాండిత్యంతో వన్నెకు వచ్చాడు. ఆయన రాసిన ఎన్ జీ ఓ, కప్పలు గొప్పనాటకాలుగా పేరుతెచ్చుకున్నాయి. సమ్రాట్ అశోక, విశ్వశాంతి మొదలైనవి అనేక బహుమతులను గడించి పెట్టాయి. రాయలసీమ కరువుకాటకాలను ‘మాయ’ నాటకంలోనూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చెలరేగిన హిందూ-ముస్లిం హింసాకాండను ‘ఈనాడు’ నాటకంలోనూ మలచిన తీరుకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.సారస్వత జీవితంలో బహుపాత్రలు పోషించి పండించిన ఆత్రేయ సెప్టెంబర్ 13,1989లో ఈ లోకాన్ని వీడివెళ్లిపోయారు. కానీ, మనకు పాటతోడుగా, మాటనీడగా నిలిచే ఉన్నాడు. మనమందరం ఆయన కవితాప్రేమ పిపాసులమే. ఆ పద దాసులమే. భారతమాతకు జేజేలు బంగరుభూమికి జేజేలు అంటూ దేశభక్తిని రంగరించి రాసిన మహాకవి ఆత్రేయ. సేతు, సీతాచలాలు ఉన్నంతకాలం మనహృదయపు శిల్పాలలో చిరంజీవిగా ఉంటాడు.ఈ మనస్వి, కవితారూప తపస్వి పుట్టి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వందన సహస్రాలు సమర్పిద్దాం.

Also read: భారత్ – రష్యా సంబంధాలలో మలుపు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles