Friday, October 4, 2024

అజాత శత్రువు “అటల్ జీ”

రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని, ప్రజా సేవ కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయి… తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేసి, రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన గొప్ప వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజపేయి కే సొంతం. అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25, 1924 న గ్వాలియర్ లోని ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళాడు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు, కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశాడు. గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్ట భద్రుడైనాడు. కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను పొందాడు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనాడు.

వాజపేయి గ్వాలియర్లో ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్య కుమార్ సభతో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించి, 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆయన 1939 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో కూడా చేరాడు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940-44 లలో అధికార్ల శిక్షణా కేంద్రానికి హాజరైనాడు. ఆయన 1947 లో “పూర్తి స్థాయి సేవకుడు” అనగా ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ అయ్యాడు. ఆయన దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్ల వల్ల న్యాయ శాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశాడు. రాష్ట్రీయ స్వయంసేయక్ సంఘ్ విస్తారక్ గా ఉత్తరప్రదేశ్ వెళ్ళిన వాజపేయి, అక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న “రాష్ట్రధర్మ” (హిందీ మాసపత్రిక), “పాంచజన్య” (హిందీ వారపత్రిక) పత్రికలలోను, స్వదేశ్”, “వీర్ అర్జున్” వంటి దిన పత్రికలలోనూ పనిచేయటం ప్రారంభించాడు.

వాజపేయి జీవితాంతం బ్రహ్మచారిగా జీవించాడు. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, ఆయన తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టయిన సందర్భంలో వాజపేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయ మేర్పడింది. 1951 లో క్రొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ అనే హిందూ దక్షిణ పక్ష రాజకీయ పార్టీలో పనిచేయడానికి, దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజపేయిని ఆర్.ఎస్.ఎస్ నియమించింది. ఇది ఆర్.ఎస్.ఎస్ తో కలిసి పనిచేస్తున్న రాజకీయ పార్టీ. ఆయన ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాడు. అనతి కాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుయాయిగా, సహాయకునిగా మారాడు. 1957లో వాజపేయి బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన వాగ్ధాటి మూలంగా, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏదో ఒకరోజు వాజపేయి దేశ ప్రధాని అవుతాడని ఊహించాడు. ఆయనకు గల వాగ్ధాటి, సంస్థాగతమైన నైపుణ్యాల కారణంగా జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగాడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ మొత్తం బాధ్యత, యువ వాజపేయిపై పడింది. 1968 లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఎదిగాడు. నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్, లాల్ కృష్ణ అద్వానీ లతో కలిసి జనసంఘ్‌ను జాతీయస్థాయి ప్రాముఖ్యతను సంతరించుకునే దిశగా నడిపించాడు.

1975, 1977 ల మధ్య, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన ప్రధాని, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జన్సీ కాలంలో అనేకమంది విపక్ష నాయకులతో పాటు అరెస్టు అయ్యాడు. 1977 లో సంఘ సంస్కర్త జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడటానికి, అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు, వాజపేయి జనసంఘ్‌ను క్రొత్తగా ఏర్పడిన సంకీర్ణ కూటమి, జనతాపార్టీలో విలీనం చేశాడు. 1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తరువాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశాడు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్య సమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయే నాటికి వాజపేయి, స్వతంత్రంగా గౌరవప్రథమైన రాజకీయవేత్తగా, అనుభవజ్ఞుడైన నాయకునిగా ఎదిగాడు. వాజపేయి, జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ల నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980 లో భారతీయ జనతా పార్టీని ఏర్పరచి, మొట్టమొదటి అధ్యక్షునిగా పనిచేసాడు. జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రెసు ప్రభుత్వానికి బలమైన విమర్శకునిగా అవతరించాడు.

1995 నవంబరులో ముంబాయిలో జరిగిన బి.జె.పి సమావేశంలో బి.జె.పి అధ్యక్షుడైన లాల్ కృష్ణ అద్వానీ వాజపేయిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు. 1996 మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బి.జె.పి విజయం సాధించింది. వాజపేయి 1996 నుండి 2004 ల మధ్య మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

వాజపేయి ప్రభుత్వం ఏర్పడిన నెలరోజులలోనే ప్రోక్రాన్ అణు పరీక్షలు జగిపారు. ఢిల్లీ-లాహోర్ బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభించారు. కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే – జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలోను, మరికొన్ని సరిహద్దుల వద్దనూ జరిగింది. మూడవ దఫా పరిపాలనా కాలంలో అనేక దేశీయ ఆర్థిక, మౌలిక సంస్కరణలను చేపట్టాడు. వాటిలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాడు. నేషనల్ హైవే డెవలప్‌మెంటు ప్రాజెక్టు”, “ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన” వాజపేయి అభిమాన ప్రాజెక్టులు చేపట్టాడు.2001 లో వాజపేయి ప్రభుత్వం, ప్రాథమిక, మాధ్యమిక విద్యాభివృద్ధి లక్ష్యంగా సర్వశిక్షా అభియాన్ అనే ప్రసిద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

2005 డిసెంబర్ నెలలోవాజపేయి క్రియాశీల రాజకీయాలనుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించి,  “ఇకనుండి లాల్ కృష్ణ అద్వానీ, ప్రమోద్ మహాజన్‌లు భారతీయ జనతా పార్టీకి రామలక్ష్మణుల వంటివారు” అని ప్రకటించాడు.

 రాజ్యసభలో అప్పటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో వాజపేయిని రాజకీయ భీష్మునిగా అభివర్ణించాడు. అటల్ బిహారీ వాజ్‌పేయిని ఆయన శత్రువులు కూడా విమర్శించరు. ‘అజాత శత్రువు, సర్వప్రియుడు, సర్వమాన్య’ లాంటి ఉపమానాలను ఆయన పేరుతో జోడిస్తారు.  అనారోగ్య కారణాలతో అటల్ జీ 2018 ఆగష్టు 16న మృతి చెందారు. ఆటల్ జీ జన్మదినమైన డిసెంబర్ 25 ను భారత ప్రభుత్వం సుపరి పాలనా దినంగా ప్రకటించింది.

 డిసెంబర్ 25… వాజ్ పేయి జయంతి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles