- నాగాలాండ్ లో హతులందరూ పేదవారు
- ఈశాన్య రాష్ట్రాలలో సైన్యానికి కట్టడి లేదు
- కాలం చెల్లిన ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్
డిసెంబర్ నాలుగో తేదీన నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లాలో ఉగ్రవాదుల సమాచారం అందుకున్న మిలటరీ సైన్యం ఒక ట్రావెలర్ బస్సును ఆపమని కోరింది. బస్సు వేగం తగ్గించకపోయేసరికి బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ కాల్పులలో ఆరుగురు భారత పౌరులు హతమయ్యారు. చనిపోయినవారంతా ఆ సమీపాన ఉన్న బొగ్గుగనిలో కార్మికులు, పేదవారు. రెక్కాడితే కాని డొక్కాడని కూలీలు. మరునాడు అంటే అయిదో తేదీన మిలటరీ పోలీసులపై కోపోద్రిక్తులైన ఆ గ్రామ ప్రజలు ఎదురుదాడి చేసారు. అది ఎలాంటి ఎదురుదాడి అంటే అత్యంత అధునాతన ఆయుధాలు చేపట్టిన మిలటరీపై కర్రలతో ప్రజలు ఎదురుదాడి చేశారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. అక్కడ జరిగిన కాల్పులలో మరో ఏడుగురు సాధారణ పౌరులు చంపబడ్డారు. రెండు ఆర్మీ వాహనాలను తగులబెట్టారు. ఒక సైనికుడు చనిపోయాడు. ఈ దుర్ఘటన జరిగిన ముప్పై గంటల వరకు దేశ ప్రజలకు సమాచారం అందలేదు. మన ముదనష్టపు మీడియా చనిపోయిన వారి సమాచారం రాయలేదు. వారి ఫోటోలు ప్రచురించలేదు. హత్యగావించబడ్డ కుటుంబాల బతుకువెతలను రాసే ప్రయత్నం చేయలేదు. సరికదా, తగలబడ్డ మిలటరీ వాహనాల ఫోటోలు ప్రచురించింది. సంఘ్ పరివారం విడుదల చేయబోయే అబద్దపు వార్తలను ప్రజలు నమ్మేటట్టు చేయడానికి ముందస్తుగా మనసులను సిద్ధం చేయడానికి పన్నిన హిందుత్వ కార్పొరేట్ మీడియా కుట్రలో తమకు తెలియకుండానే అన్ని పత్రికలు భాగస్వాములయ్యాయి. మరుసటి రోజు సంపాదకీయాలు ఎలా రాసినా తాజాగా మెదడులో అంటించిన చిచ్చు రగులుతూనే ఉంటుంది.
బందీలుగా పట్టుకోకుండా కాల్చివేయడం ఏమిటి?
నిజంగా ఆ బస్సులో ఉగ్రవాదులే ఉన్నప్పటికీ, వారిని బందీలుగా పట్టుకుని కోర్టుకు అప్పగించకుండా.. మాటువేసి చంపడం సరైన పద్ధతి కానేకాదు. ప్రజల ప్రాణాలకు కనీస విలువ ఇవ్వని సైన్యం, ప్రజాస్వామిక విలువల పట్ల కనీస గౌరవం లేని ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి అకృత్యాలు జరుగుతాయి. జరిగిన నేరాలకు శిక్షలు లేకుండా పోతాయి. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చురుకుగా పనిచేస్తున్న హక్కుల సంఘాల వల్ల మన పరువు పోతుందన్న భయంతో దేశ హోమ్ మంత్రి అమిత్ షా గౌరవసభలో తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. కథ అక్కడితోనే కంచికి చేరుతుంది. సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం మన దేశంలో 1958లో ప్రారంభం అయింది. అప్పటినుండి ప్రత్యేక దేశం కోసం తహతహలాడే ప్రతిచోటా తన ఉక్కుపాదం మోపి ప్రజల ఆకాంక్షలను అణిచివేయడమే తన పరమావధిగా ఈ చట్టానికి లోబడి ప్రత్యేక బలగాలు పనిచేస్తున్నాయి. ఒక ఈశాన్య రాష్ట్రంలో అమాయకమైన అమ్మాయిలపట్ల వీరు చేస్తున్న అకృత్యాలకు తాళలేక వృద్ధులైన తల్లులంతా పూర్ని నగ్నంగా ‘మమ్మల్ని రేప్ చేయండి’ అని వీధుల్లోకి రావడం 80లలో సంచలనం సృష్టించింది. 1995లో కోహిమాలో జరిగిన కాల్పుల కథ ఇప్పటికీ కంచికి చేరలేదు. 2000లో మాలోమ్ లో జరిగిన నరమేధంపై జరిగిన విచారణకు ఎప్పటికీ అతీగతీ ఉండబోదు. 2004లో అస్సాం రైఫిల్స్ చేతిలో ఇంఫాల్ లో హతమైన తంగ్యం మనోరమ కేసు విచారణ ఎక్కడివరకు వచ్చిందో మనకెప్పటికీ తెలియదు. తన శరీరంలో దొరికిన ఆరు బుల్లెట్ల లెక్క ఎప్పటికి తేలుతుందో ఎవ్వరికీ తెలియదు.
నాగాలాండ్ అత్యంత కీలకం
దేశంలో నాగాలాండ్ చాలా సున్నితమైన ప్రదేశం. మయన్మార్, చైనాలను సరిహద్దు దేశాలుగా మనకు నాగాలాండ్ కలుపుతోంది. బోడోలాండ్ కోసం అస్సాంలో జరుగుతోన్న స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంత పెద్ద ఎత్తున స్వతంత్ర నాగాలాండ్ కోసం నాగాలు ప్రత్యేక పోరాటం జరుపుతున్నారు. ఆ విధంగా ఈశాన్య రాష్ట్రాలు నిరంతర రావణ కాష్టంలా తయారయ్యాయి. స్వాతంత్య్రం కోసం పోరాటం జరిపేవారిని తీవ్రవాదులుగా మన ప్రభుత్వాలు గుర్తించడం, దాంతో బయట ఉగ్రవాద సంస్థలు పోరాటకారులకు ఊతం అందివ్వడంతో ఎగతెడని, ముగింపు లేని పోరాటాలుగా తయారవుతున్నాయి. వారిని అదుపులో పెట్టడానికి మనం రూపొందించుకున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం (ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్-ఏఎఫ్ఎస్ పీఏ) మనకే గుదిబండగా మారింది. ప్రస్తుతం మన దేశంలో అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల ప్రదేశ్, మిజోరాం, పంజాబ్, చండీగఢ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో అమలవుతోంది. ఈ చట్టం ద్వారా సైన్యానికి అపరిమితమైన అధికారం కట్టబెట్టడం చాలా వివాదాస్పదం అవుతోంది. సైన్యం ఉన్న అన్ని ప్రాంతాలలో నిత్యం ఎక్కడో ఒకచోట మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. అక్రమ నిర్బంధాలు, అత్యాచారాలు, మనుషులు మాయమవడాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు నిత్యకృత్యాలవుతున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు బేఖాతర్
హత్యలు జరిగిన ప్రతిసారి మిలటరీ పోలీసులపై హత్య కేసులు నమోదు చేయమని ఈ దేశ ప్రజానీకం గగ్గోలు పెట్టడం రివాజయింది. దీనికి విరుగుడుగా పహారా కాయవలసిన వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుందని సైనికదళాలు విచిత్రవాదన వినిపించడం మన దేశంలోనే చూస్తాం. ఈ దేశ ప్రజల నైతిక స్థైర్యం సంగతి పట్టించుకోని సైన్యాలు, ప్రభుత్వాలు మనకు ఇస్తున్న సందేశం సులువుగానే బోధపడుతుంది. ఇటువంటి కేసుల విషయంలో సైనికులకు హత్యనేరంలో ఎటువంటి రక్షణ ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ పట్టించుకుంటున్న నాధుడు లేడు. బ్రిటిష్ కాలంనాటి కాలంచెల్లిన ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయమని ఎంతోమంది న్యాయకోవిదులు విన్నవించుకుంటున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. అణచివేతలు, బూకరింపుల ద్వారా ప్రజల ఆకాంక్షలను దారి మళ్లించగలమనుకోవడం మన దేశాధినేతల అమాయకత్వమే అవుతుంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరు ప్రభుత్వ అధినేతలకూ ఇది వర్తిస్తుంది. ఈ సందర్భంగానైనా చట్టం రద్దు చేయాలన్న డిమాండ్ ప్రజాశ్రేణులు నెత్తికెత్తుకుంటే బాగుండు.