Tuesday, April 23, 2024

గోరా, గాంధీ అడుగుజాడలలో అర్జున్ రావు ప్రస్థానం

గోరా నిబద్ధత ఎంత గొప్పదో, ఆయన పెద్దల్లుడు రావూరి అర్జునరావు అంకితభావం కూడా అంతే గొప్పదని గాంధీ కింగ్ ఫౌండేషన్ ఆదివారం (2023 జనవరి ఒకటో తేదీ) ఏర్పాటు చేసిన అర్జునరావు సంస్మరణ సభలో వక్తలు ఉద్ఘాటించారు. గోరా కుటుంబం వంటి కుటుంబం ప్రపంచంలో మరొకటి లేదనీ, అది యునీక్ అనీ, ఈ వాస్తవాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చాలనీ ఒక మహిళ అన్నారు.

గోరా విజయవాడలో నెలకొల్పిన నాస్తిక కేంద్రంలో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం రోజున ఒక సమావేశం జరిగింది. గోరా భార్య సరస్వతి జీవితంపైన పరిశోధన చేసిన విప్లవకుమారిని సత్కరించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో గోరా నాస్తిక మిత్రమండలి కన్వీనర్, మాజీ ప్రిన్సిపల్ బి సుందర్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు. గోరా టైమంటే టైమేననీ, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చేవారు కాదనీ, ఆయన ఏమి చెప్పారో అదే ఆచరించారనీ ఆయన చెప్పారు. గోరా 114వ జయంతి సందర్భంగా ఈ సమావేశం జరిగింది.

అర్జునరావు కాలధర్మం తర్వాత కొద్ది రోజులకే నాస్తిక కేంద్రంలో సంస్మరణ సభ జరిగింది. జూమ్ లో మాట్లాడటానికి నాకు పవర్ చొరవతో అవకాశం ఇచ్చారు. దానికి డాక్టర్ సమరం అధ్యక్షత వహించారు.

గాంధీ కింగ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ గొల్లనపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వి. బాలమోహనదాస్, జీవీ సుబ్బారావు, ఆర్ చునావ్, వికాస్, నేనూ, తదితరులు మాట్లాడారు.

An atheist Gandhian turns 100
అర్జున్ రావు, మనోరమ

అర్జునరావు కృష్ణాజిల్లా వానపాముల గ్రామంలో హరిజన దంపతులకు 104 ఏళ్ళ కిందట జన్మించారు. ఆయన ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నారు. కొలంబోలో అధ్యాపకుడిగా గోరా పని చేస్తున్న సమయంలో ఆయన పెద్ద కుమార్తె మనోరమ జన్మించారు. తర్వాత అధ్యాపక వృత్తిని విరమించి పూర్తికాలం నాస్తికవాద ప్రచారానికీ, స్వాతంత్ర్య సమరానికీ అంకితమైనారు గోరా. ముదునూరులో నాస్తిక కేంద్రం, వయోజన విద్యాకేంద్రాన్నినెలకొల్పారు. అక్కడికి అయిదు  కిలోమీటర్ల దూరంలో వానపాముల ఉంది. ఆ గ్రామం నుంచి ముదునూరు వచ్చిన అర్జునరావుకు గోరాతో పరిచయం అయింది. తన కుమార్తె మనోరమను అర్జునరావుకు ఇచ్చి కులాంతర వివాహం చేయాలని గోరా నిశ్చయించారు. ఇందుకు అర్జునరావు అభ్యంరం చెప్పారు. తను పెద్దగా చదువుకోలేదనీ, తాను అంత పెద్దమనిషికి అల్లుడిగా తగనని అన్నారు. అర్జునరావు అభ్యంతరాలను గోరా తోసిపుచ్చారు. గాంధీ మద్రాసు సందర్శించినపప్పుడు అర్జునరావునీ, మనోరమనీ ఆయన దగ్గరికి పంపించారు. అప్పుడే పెళ్ళి వద్దనీ, కొన్ని రోజుల తర్వాత పెళ్ళి సంగతి చూద్దామనీ, అంతవరకూ తనతో సేవాగ్రాంలో ఉండమని అర్జునరావును తన వెంట గాంధీ తీసుకొని వెళ్ళారు.

సేవాగ్రాంలో సేవలు అందించడంలో అర్జునరావు చాలా ప్రతిభావంతంగా పని చేసి గాంధీనీ, ఇతరులనూ మెప్పించారు. గాంధీతో కలసి ఒకే ఆశ్రమంలో జీవించడం, గాంధీని నిత్యం చూడడం, ఆయనతో అరుదుగానైనా వచ్చేరాని హిందీలో మాట్లాడటం, ఆయన చెప్పిన పనులు చేయడం తన అదృష్టంగా అర్జునరావు భావించారు. గాంధీమార్గానికి తన జీవితాన్ని అంకితం చేశారు. 1948 ఏప్రిల్ లో అర్జునరావు, మనోరమల వివాహం తన సమక్షంలో జరగాలని గాంధీ నిర్ణయించారు. కానీ 30 జనవరి 1947న నాథూరాం గాడ్సే అనే వ్యక్తి గాంధీపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ తర్వాత గాంధీ పెట్టిన ముహూర్తానికి కొద్దిగా ముందుగానే 13 మార్చి 1948న వారి పెళ్ళికి భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ్, ఆచార్య వినోబా భావే, ప్రభాకర్ జీలు, తదితరులూ హాజరైనారు. ఇది సంచలనం సృష్టించిన చారిత్రక వివాహం. ఈ వివరాలలో చాలామటుకు బుద్ధప్రసాద్ తెలియజేశారు.

Goparaju Ramachandra Rao, the atheist who worked to spread Gandhian  ideology across Andhra region | Vijayawada News - Times of India
గాంధీ, గోరా సమాలోచన

అర్జునరావు హేతువాది అనీ, నాస్తికవాది అనీ తెలిసే గాంధీ ఆశ్రమంలో ఉంచుకున్నారు. ఒక సారి గోరా, సరస్వతీగోరా, ఇతర కుటుంబసభ్యులంతా కలసి సేవాగ్రాం వెడితే ‘‘అర్జునరావు ఆశ్రమవాసి. ఇక్కడే ఉంటారు’’ అని గాంధీ చెప్పినట్టు నేను కొన్ని మాసాల కిందట హైదరాబాద్ లోని  శ్రీనగర్ కాలనీలో ఆయన కుమారుడు పవార్ ఇంటిదగ్గర ‘సకలం’ చానల్ కోసం చేసిన ఇంటర్వ్యూలో అర్జున్ రావు చెప్పారు. అమెరికా వాషింగ్టన్ లో ఉంటున్న ప్రముఖ హేతువాది నరిసెట్టి ఇన్నయ్య ప్రోత్సాహంతో ఈ ఇంటర్వ్యూ జరిగింది. సేవాగ్రాంలో ప్రార్థన సమయానికి బెల్ కొట్టడం అర్జునరావు బాధ్యత. ‘‘నువ్వు ఈశ్వర్ అల్లా తేరో నామ్ అని ప్రార్థన చేయనక్కరలేదు హేతువాదివి కనుక. మౌనంగా ప్రార్థన సమావేశంలో కూర్చోవచ్చు’’ అని గాంధీ అర్జునరావుతో  చెప్పారు. అర్జునరావు ఆరు మాసాలపాటు సేవాగ్రాంలో ఉన్నారు. ఆయనతో పాటు ప్రభాకర్ జీ, మరి అయిదారుగురు తెలుగువారు ఆశ్రమంలో ఉండేవారట. అక్కడ ఉన్నప్పుడే హిందీ మాట్లాడటం నేర్చుకున్నారు. ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత కూడా రెండు సార్లు గాంధీని కలుసుకున్నారు. గుర్తుపట్టి పేరుపెట్టి పిలిచేవారని అన్నారు. గాందీ నిర్యాణం అనంతరం తర్వాత కూడా అర్జునరావు సేవాగ్రాంలోనే కొన్ని మాసాలు ఉన్నారు. అక్కడే మనోరమతో వివాహం అయింది.

రాజీలేని నాస్తికవాది గోరా

గోరా త్రికరణశుద్ధిగా నాస్తికవాదాన్నీ, హేతువాదాన్నీ, గాంధీ మార్గాన్నీ నమ్మిన వ్యక్తి. తన సంతానం పేర్లు కూడా రాముడు, కృష్ణుడు, సీత, లక్ష్మి వంటిపేర్లు కాకుండా స్వాతంత్ర్య సమరంలోని ఘట్టాలతో ప్రేరణ పొంది పెట్టారు.  లవణం అంటే ఉప్పు సత్యాగ్రహం అప్పుడు పుట్టిన వ్యక్తి. సమరం అంటే స్వాతంత్ర్య సమరంలో పుట్టిన వ్యక్తి. విజయం అంటే సమరంలో విజయం సాధించిన సందర్భంగా పుట్టిన కుమారుడు. అదే బాటలో అర్జునరావు, మనోరమ కుమారులకూ, కుమార్తెకు కూడా మిలావ్ అనీ, చునావ్ అనీ, సాదిక్ అనీ, సుజయ్ అనీ, పవర్ అనీ గోరానే నామకరణం చేశారు. నాస్తికవాదాన్నీ, గాంధీ మార్గాన్నీ వ్యక్తిగతంగా తాను నమ్మడమే కాదు ఉద్యమంగా విస్తరించే ప్రయత్నం శక్తివంచన లేకుండా చేసిన ఉద్యమశీలి. నాస్తిక కేంద్రాన్ని నెలకొల్పడం, తన పిల్లలందరికీ ఆదర్శ వివాహాలు చేయడం, అన్న మాటకు కట్టుబడి ఉండటం, మూఢనమ్మకాలను వ్యతిరేకించడం, అశాస్త్రీయ ధోరణులను నిర్ద్వంద్వంగా ఖండించడం, లౌకికవాదాన్ని మనస్ఫూర్తిగా ఆచరించడం, ప్రోత్సహించడం వంటి పనులే నిత్యకృత్యంగా గోరా జీవించారు.

Gora (1902-1975) | Humanist Heritage - Exploring the rich history and  influence of humanism in the UK
సరస్వతి, గోరా

గోరా గాంధీని చాలాసార్లు కలిశారు. తెలుగు ప్రాంతాలలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో పర్యటించే సమయంలో సైతం గాందీ వెంట గోరా ఉండేవారు. గోరాను తన కుటుంబసభ్యుడిగా గాంధీ పరిగణించేవారని అర్జునరావు తెలిపారు. ముదునూరు ఆశ్రమంలో కలుసుకున్న అర్జునరావును విజయవాడ పిలుపించుకొని అన్ని వివరాలూ అడిగి తెలుసుకున్న తర్వాత తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని గోరా నిర్ణయించుకున్నారు. ఆ సంగతి గాంధీకి చెప్పారు. గాంధీ వెంటనే అంగీకరించలేదు. ‘‘ఆదర్శ వివాహం మంచిదే కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాతనే చేయాలి. అర్జున్ రావును నేను సేవాగ్రాం తీసుకొని వెడతాను. మనోరమను సీతానగరంలో కస్తూర్బా కళాశాలలో ఉంచండి. ఆరు మాసాల తర్వాత నేనే వారిద్దరికీ పెళ్ళి చేస్తాను’’ అని గోరాతో గాంధీ చెప్పారు. ఆ విధంగా అర్జున్ రావు సేవాగ్రాం ఆశ్రమానికి వెళ్ళారు.

అర్జునరావు దంపతుల అంకితభావం

అర్జునరావు దంపతులు అంటరానితనం నిర్మూలన కోసం జీవితపర్యంతం పాటుపడ్డారు. అర్జనరావు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బళ్ళారిజైలులో ఉన్నారు. నాస్తిక కేంద్రంలో చాలా సంవత్సరాలు పని చేశారు. కులం అడ్డుగోడలను పగులకొడుతూ, సత్యాగ్రహాలు చేస్తూ, కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ గడిపారు. కృష్ణాజిల్లా ముదునూరులో గోరా నెలకొల్పిన నాస్తిక కేంద్రాన్నీ, వయోజన విద్యాలయాన్నీ ఆయన, మనోరమ కలిసి నిర్వహించారు. గోరా పర్యటించిన సమయాలలో అర్జునరావు, మనోరమ ఆయనతోనే ఉండేవారు.

అర్జున్ రావు ఇంటర్వ్యూ సందర్భంలోనే ఆయన చిన్న కుమారుడు పవర్ కూడా మాట్లాడారు. గోరా ఒడిశాలో జన్మించారనీ, ఎంఎస్ సీ ఫిజిక్స్ చదివారనీ, సనాతన హిందూ కుటుంబంలో జన్మించినప్పటికీ సైన్సు చదువుతూ ప్రశ్నించడం, ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకున్నారనీ, దేవుడున్నాడా అని తనను తాను ప్రశ్నించుకొని, తర్కించుకొని, లేడని తీర్మానించుకున్నారనీ చెప్పారు. తీర్మానించుకునే ముందు రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ వంటి గ్రంథాలను క్షుణ్ణంగా చదివారు. చివరికి ‘నాకు దేవుడు లేదు’ అని ప్రకటించారు. దేవుడు ఆడో మగో తెలియదు కనుక ‘లేదు’ అన్నారు. దైవభక్తి కలిగిన కుటుంబ సభ్యులు ఎవ్వరూ గోరా సిద్ధాంతంతో ఏకీభవించలేదు. ఆయనను బహిష్కరించారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన గోరా సమాజసేవలో పూర్తిగా మునిగిపోయారు. ఆ తర్వాత గాంధీ మద్రాసు పర్యటనకు వచ్చినప్పుడు కృష్ణాజిల్లా ముదునూరు  సందర్శించారు. ఆ సమయంలో గోరా గాంధీని కలిశారు. గాంధీ గోరాను సమాలోచన కోసం సేవాగ్రాం ఆహ్వానించారు. గాంధీ, గోరా చర్చించుకున్నారు. ఆ చరిత్రాత్మకమైన గోష్ఠి అనంతరం గాంధీ గోరాతో ‘గోరా, మీరు నాస్తికవాది. నేను ఆస్తికవాదిని, మన దారులు కలవవు. కానీ మనం చేసే సేవ పట్ల ఏకీభావం మనిద్దరికీ ఉన్నది. మనం దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజల సౌభాగ్యంకోసం, ప్రజల స్వేచ్ఛకోసం, సౌహార్దం కోసం కృషి చేద్దాం’’ అని ప్రతిపాదించారు. దానికి గోరా మనస్పూర్తిగా అంగీకరించారు. గాంధీని సబర్మతి ఆశ్రమంలో కాకుండా వార్థా దగ్గరున్న సేవాగ్రాం ఆశ్రమంలో గోరా ఎక్కువసార్లు కలుసుకున్నారు. ఆయన, సరస్వతి, పిల్లలు కూడా ప్రార్థనాసమావేశంలో ప్రార్థన చేయకుండా కూర్చుండేవారు. ఆ వెసులుబాటు గాంధీ కల్పించిందే.  ‘ఎన్ ఎథీస్ట్ విత్ గాంధీ’ అనేది గోరా రాసిన అనేక పుస్తకాలలో ఒకటి.

గోరా తొలి నాస్తిక కేంద్రం ముదునూరులో

గోరా తొలి నాస్తిక కేంద్రాన్నినెలకొల్పింది విజయవాడలో కాదు. ముదునూరులో.  వానపాముల నుంచి నడుచుకుంటూ వెళ్ళి ముదునూరు నాస్తిక కేంద్రంలో అర్జున్ రావు చేరారు. అప్పటికి ఆయన వయస్సు 14 సంవత్పరాలు. నాస్తిక కేంద్రంలో వయోజన విద్య, వ్యక్తిత్వ వికాసం, సహపంక్తి భోజనాలు ఉండేవి. సమాజంలో అట్టడుగున ఉన్నవారు చైతన్యవంతులు అయితేనే సమాజం అభివృద్ది చెందుతుందనే అభిప్రాయం గోరాకూ, సరస్వతికీ, వారి చుట్టుపక్కల ఉన్నవారికీ ఉండేది. అర్జున్ రావు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పని చేసి సాయంత్రం ఆరుగంటల నుంచి ఎనిమిది గంటల వరకూ  రెండు గంటల పాటు వయోజన విద్య నేర్చుకునేవారు. అర్జున్ రావు సేవాభావాన్నీ, క్రమశిక్షణనూ, హేతువాదాన్నీ, నిరీశ్వరవాదాన్నీ చూసి ముగ్ధుడైన గోరా తన కూతురుని అతనికి ఇచ్చి ఆదర్శ వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు.

సేవాగ్రాంలో గాందీని ఆకట్టుకున్న అర్జున్ రావు సేవలు

‘మా నాన్నగారు గాంధీ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమ నియమాలను తు.చ. తప్పకుండా పాటించారు. ఉదయమే లేవడం, ప్రాంగణం ఊడ్చడం, సఫాయి కార్యక్రమాలు చేయడం, పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళి కూరగాయలు తేవడం, వంట చేయడం తప్పని సరి. అర్జున్ రావుకు అదనపు బాధ్యత ఏమంటే ఉదయం, సాయంత్రం ప్రార్థన సమావేశ సమయానికి అందరినీ అప్రమత్తం చేయడం, గంట కొట్టడం. మా నాన్నగారు ఎప్పుడూ నాయకుడు కావాలని అనుకోలా. ఇప్పటికీ వలంటీర్ గానే, కార్యకర్తగానే ఉండాలని కోరుకుంటారు’’ అని పవర్ అన్నారు.

అర్జున్ రావు సేవాగ్రాం వెళ్ళిన తర్వాత మూడు రోజుల వరకూ గాంధీని కలవలేదు. హిందీ రాదు. తెలుగు ఒక్కటే వచ్చు. ఆ భాష గాంధీకి రాదు. మూడో రోజున ఒక కాగితంపైన ‘అర్జునరావు నా దగ్గరికి రావాలి’ అని హిందీలో రాసి పంపించారు. అప్పుడు అక్కడే ఉన్న ప్రభాకర్ జీ అనే తెలుగు వ్యక్తిని వెంటబెట్టుకొని అర్జున్ రావు గాంధీ సమక్షంలోకి వెళ్ళారు. ‘మై అర్జున్ రావు హూ’ అంటూ భయంభయంగానే హిందీలో పరిచయం చేసుకున్నారట. అప్పుడు గాంధీ అర్జున్ రావు భుజం చుట్టూ ఆప్యాయంగా చేయివేసి ‘చోర్ లడకా’ అని అన్నారట. వచ్చి మూడురోజులైనా కలవలేదు కనుక చోర్ అని ప్రేమతో అన్నారు. హిందీ నేర్చుకొమ్మని గాంధీ అర్జున్ రావును ప్రోత్సహించారు. అర్జున్ రావు ఏమి చేస్తున్నారు, ఎలా ఉన్నారు అంటూ గాంధీ ఆరా తీశారు. ఆయన నడవడికను గమనించాలనే సేవాగ్రాంకు పిలిపించారు కనుక ఆయన యోగక్షేమాలు కనుక్కునేవారు.   

పార్టీ రహిత ప్రజాస్వామ్యం

గోరా పార్టీ రహిత ప్రజాస్వామ్యం (పార్టీలెస్ డెమాక్రసీ) అనే నినాదం చేశారు (లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కూడా అదే సూత్రం ప్రవచించారు) ఆ ప్రాతిపదిక పైనే విజయవాడ లోక్ సభ స్థానానికీ, అసెంబ్లీ స్థానానికీ పోటీ చేశారు. అర్జున్ రావు కూడా పార్టీరహిత ప్రజాస్వామ్యం ప్రాతిపదికపైనే గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. అది ఊహించిందే. కానీ పోటీ చేయడమే ఒక నైతిక విజయంగా భావించారు. తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించడమే విజయం అన్నది వారి భావన.

గోరా చాలా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకునేవారు. ముస్లిం-హిందూ విభేదాలను దృష్టిలో ఉంచుకొని ‘పందిమాంసం, ఆవుమాంసం బహిరంగ భక్షణ’ అనే కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. గోరాను హత్య చేయాలంటూ కొందరు నినాదాలు చేశారు. పొలీసు కేసు పెట్టారు. పోలీసులు గోరాను ప్రశ్నించారు. తాను చేస్తున్నది రాజ్యాంగం ఆమోదించిన పనేనంటూ గోరా వాదించారు. అటువంటి కార్యక్రమాన్నే గుడివాడలో అర్జున్ రావు నిర్వహించారు.

‘‘మా నాన్నగారు గాంధీనీ, గోరానూ నూటికి నూరు పాళ్ళు అనుసరించారు. గాంధీ అనుచరుడు కనుకనే ఆయన ఖద్దరు తప్ప ఇంకొక రకం దుస్తులు వాడరు. బనీనూ, అండర్ వేర్, కర్చీఫ్, చొక్కా, లాగూ లేదా పంచ – అన్నీఖద్దరే. వాస్తవం చెప్పాలంటే గోరాకున్న నాస్తికత్వ అభిప్రాయాలకూ, ఆయన తర్వాత ఇప్పుడున్ననాలుగోతరంవారి నాస్తికత్వ అభిప్రాయాలకూ తేడా ఉంది. గోరా పెళ్ళిళ్ళలో పూలదండలు నిషేధించారు. మంగళసూత్రం, బొట్టు వంటి సంప్రదాయాలపైనా నిషేధం విధించారు. చర్ఖా నుంచి వడికిన నూలు  దండలూ, కూరగాయదండలూ పెళ్ళిలో వినియోగించేవారు.  ఇప్పుడు నాలుగో తరంలో, మా నాన్నగారి మనుమలూ, మనుమరాళ్ళూ కొందరు నాస్తిక సంప్రదాయాలు పాటించకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అటువంటి వివాహాలకు నాన్నగారు హాజరయ్యేవారు కాదు. వ్యతిరేకించేవారు కాదు. కానీ ఆమోదించేవారూ కాదు. మా అమ్మ గోరా కూతురు. నాన్న అల్లుడు. గోరా సిద్ధాంతాలు ఆచరించడంలో మా అమ్మ కంటే నాన్నగారే గట్టిగా నిలబడతారు’’ అని పవర్ వివరించారు.

‘‘మా అమ్మా, నాన్న పెళ్లి చేసుకున్నది 1948లో – దాదాపు 73 ఏళ్ళు దాటింది. మేము అయిదుగురం వారి సంతానం. మేమూ, మా పిల్లలూ, వారి భార్యలూ, భర్తలూ కొట్టుకుంటాం. తిట్టుకుంటాం. కానీ వారు ఒకరిని ఒకరు పరుషంగా మాట్లాడుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. వారిది కులాంతర వివాహం అని నేను పిలవను. ఆదర్శం కోసం చేసుకున్నారు కనుక ఆదర్శ వివాహం అంటాను’’ అని అన్నారు.

సామాజిక సేవా దృక్పథం

‘‘మా నాన్నగారి ముందు నేనెంత? ఆయనకున్న సూత్రబద్ధమైన వైఖరి, సామాజిక సేవా దృక్పథం నాకు లేవు (అంటున్నప్పుడు గొంతు గద్గదమైంది. ఆవేశానికి లోనైనారు). ఎవరైనా వస్తే ముందుగా ‘భోజనం చేశారా?’ అని అడుగుతారు. మా ఇంట్లో ములగచెట్టు ఉంది. ములగ కాయలు కోసిన రోజున వీధిలో అందరికీ రెండు రెండు చొప్పున ఇచ్చేవారు. ఉన్నది అందరితో పంచుకోవాలనే తాపత్రయం. నేనైతే ఫ్రిజ్ లో పెట్టుకొని పదిరోజులు తింటాను. ఆయన ఉన్న ఇరవై కాడలనీ పదిమందికి ఇచ్చేవారు. అదీ తేడా’’ అని పవర్ చెప్పారు.

‘‘నాన్నగారు సొసైటీ, సొసైటీ అని ఆలోచించేవారు. నాకు సమాజం ఏమిచ్చిందని కాదు సమాజానికి నేను ఏమి చేశానని ఆలోచించేవారు. చదువుకు అగ్రతర ప్రాధాన్యం ఇచ్చేవారు. చదువు, చదువు అనే వారు. వేసవి సెలవల్లో రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం తెచ్చి ఇచ్చి చదవమనేవారు. మా బంధువులలో చాలామంది చదువులకు సహాయం చేసేవారు’’ అని వివరించారు.

‘‘గుడివాడలో కూడా నాన్నగారికి మంచి పేరు ఉంది. చాలామాంది యువతీయువకులకు ఆదర్శ వివాహాలు చేశారు. చదువుకున్నవాళ్ళు కూడా నాన్నగారిని గౌరవించేవారు. వాళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి పేరు పెట్టించుకునేవారు. అమ్మానాన్నా సంతోషంగా ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉన్నారనుకుంటా. మా నాన్నగారికి 102 ఏళ్ళు, అమ్మగారికి 93 ఏళ్ళు. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేవు. అందుకు వారి జీవన శైలి, కష్టపడే మనస్తత్వం, ఉన్నదాంతో సంతృప్తి పడటం వంటి మంచి లక్షణాలు కారణం కావచ్చు. వారు చేసినంత సామాజిక సేవ మేము చేయలేకపోయాం. అందుకే అయిదేళ్ళ కిందట నాన్నగారు పుట్టిన గ్రామం వానపాములలోనే ‘మార్పు’ ట్రస్టే ప్రారంభించాం. మనోరమ, అర్జున్ రావు రావూరి పబ్లిక్ ట్రస్ట్- మార్పు ట్రస్ట్ అన్నమాట’’ అంటూ డాక్టర్ రావూరి పవర్ వివరించారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles