Thursday, April 25, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్ ‘ కటీఫ్ఫా’

  • చిచ్చుపెట్టిన టిపీసీసీ పీఠం?
  • తమ్ముడి అసెంబ్లీ నియోజకవర్గంలో కాలుమోపని ఎంపీ
  • కార్యకర్తలలో అయోమయం

నల్లగొండ: ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన “కోమటిరెడ్డి” బ్రదర్స్ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయా..? అన్నదమ్ముల వైఖరితో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోందా..? ఎప్పుడూ ఎవరో ఒకరి మీద నోరు పారేసుకునే ఆ సోదరులు ఉన్నట్టుండి ఎందుకు సైలెంటయ్యారు. “పీసీసీ పీఠమే” వారి మధ్య కుంపటి పెట్టిందటూ ప్రచారం మొదలెట్టిందెవరు?  మరోవైపు వారిది వ్యూహాత్మక మౌనమే అంటున్న అనుచరుల మాటల్లో వాస్తవమెంత? రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కోమటిరెడ్డి బ్రదర్స్ కేరాఫ్ అడ్రస్. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడంలో వీరి స్టైలే వేరు. ప్రత్యర్థులకు  కౌంటర్ ఇవ్వడంతో పాటు స్వపక్ష నేతలను సైతం విమర్శించడం లోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ ది డిఫరెంట్ స్టైల్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాస్ లీడర్స్ గా వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పార్టీ గడ్డు కాలంలోనూ ప్రత్యర్ధులకు చెమటలు పట్టించడంలో అన్నదమ్ముళ్లు దిట్టలు. పొలిటికల్ లైఫ్ స్టైల్ లో బ్రదర్స్ పట్టు గట్టిదని అంతా ఒప్పుకోవాల్సిన విషయమే. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ మధ్య బ్రదర్స్ మధ్య బెడిసి కొట్టిందనే చర్చ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఇద్దరి నేతల్లో భారీ‌మార్పు వచ్చిందని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ నడుస్తోంది.

 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు భువనగిరి ఎంపీగా  నల్గొండ జిల్లా స్థానిక‌ సంస్థల ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎమ్మెల్యే కావాలన్న కోరికతో‌ మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబట్టి చివరకు పంతం నెగ్గించుకున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ కారును బోల్తా కొట్టించారు. ఇక రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యే గా నాలుగు సార్లు గెలిచి ఐదోసారి ఓడారు. అనంతరం భువనగిరి ఎంపీగా గెలిచారు. కాగా ఆ  పార్లమెంట్ పరిధిలో మునుగోడు నియోజకవర్గం కూడా ఒకటి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో  తమ్ముడు ఎమ్మెల్యేగా అన్న ఎంపీగా గెలిచాకా ఇప్పటివరకు ఇద్దరు కలిసి ఒక్కటంటే ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. ఎమ్మెల్యే స్థాయిలో రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నా ఎంపీ‌ హోదాలో వెంకట్ రెడ్డి ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అంతేకాదు, తమ తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో  రాజ్ గోపాల్ రెడ్డి సామాజిక కార్యక్రమాలు చేపట్టినా వెంకట్ రెడ్డి ఆ కార్యక్రమాలకు హాజరయిన దాఖలాలు లేనే లేవు. అయితే అన్న  వెంకట్ రెడ్డిని‌ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఆహ్వానించడం లేదా, లేక తమ్ముడు ఆహ్వానించిన కార్యక్రమాలకు అన్న రావడం లేదా అనే చర్చ ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో ఊపందుకుంది.

 వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో  కాంగ్రెస్ పార్టీ ఎకైక ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి. ఉన్న ఒక్క ఎమ్మెల్యే పరిధిలో ఎంపీగా వెంకట్ రెడ్డి ‌  పర్యటించకపోవడం అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం ఎమైనా ఉందా అనే కోణంలో కూడా చర్చకు దారి తీసింది. ఇక రాజగోపాల్ రెడ్డి ఆ మధ్య బిజెపి లోకి వెళ్తారనే ప్రచారం జరిగితే అన్న వెంకట్ రెడ్డి చాలా తెలివిగా మాట్లాడారే తప్ప తమ్ముడి  తీరును విమర్శించలేదు. అది ఆయన వ్యక్తిగతమని బంధుత్వం వేరు రాజకీయం వేరని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా లౌక్యంగా వ్యవహారించారు. ఇక  వెంకట్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు కావాలని అధిష్టానంపై  గట్టిగా ఒత్తిడి తెస్తున్నా రాజగోపాల్ రెడ్డి ఎపుడు కూడా అన్నకి బహిరంగంగా మద్దతు పలికిన సందర్భం లేదు. కొన్ని సార్లు మాత్రం ఇద్దరిలో ఎవరికి పీసీసీ ఇచ్చినా ఓకే అని చెప్పిన బ్రదర్స్ ఇప్పుడు మళ్లీ నోరు మెదపడం లేదు.

 ఇదిలా ఉండగా పీసీసీ విషయంలోనే బ్రదర్స్ మధ్య యవ్వారం బెడిసికొట్టిందనీ సొంత పార్టీ నాయకులే ప్రచారం మొదలెట్టేశారు. ఈ నేపధ్యంలోనే కొందరు పార్టీలో ఇమడలేక బయటికొచ్చేశారు. కానీ దగ్గరి అనుచరులు మాత్రం బ్రదర్స్ లో అంతర్గత విభేదాలా ? అబ్బెబ్బే అలాంటిదేం లేదని ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ఎలాగూ అధికారంలో లేరు కదా ఇప్పుడు అనవసరమైన దూకుడు ఎందుకని  సైలెంట్ గా ఉన్నారని కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఎలాగూ పీసీసీ మార్పు అంశం హై కమాండ్ పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు తొందరపడొద్దనే భావనలో కోమటిరెడ్డి సోదరులు ఉన్నారని వారి అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే బీజేపీ గూటికి వెళ్తారనే ప్రచారం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి బాగా డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఆచి తూచి అడుగులు వేయాలని ఆయన చూస్తున్నట్టు టాక్. ఇక వెంకట్ రెడ్డి మాత్రం మునుగోడులో కాలుమోపేందుకు ఎందుకు సుముఖంగా లేరనే దానిపై పెదవి విప్పడం లేదు.

మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో‌ కలిసి కట్టుగా ఉండి ప్రత్యర్ధులకు పట్టపగలే చుక్కలు చూపించే ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి బ్రదర్స్ మునుగోడు నియోజకవర్గం విషయంలో ఉప్పు నిప్పు గా వ్యవహరించడం ముఖ్య అనుచరులకు మింగుడు పడని అంశంగా చెప్పొచ్చు. ఇక ఇద్దరూ కలిసి వస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందే అవకాశం ఉందని నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరీ ఆ  విషయంలో బ్రదర్స్ తీరు ఏవిదంగా ఉండబోనుందో త్వరలో తేలనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles