Friday, March 29, 2024

కదిలిన ఆర్టీసీ రథచక్రాలు

(సకలం ప్రత్యేక ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గత కొన్ని నెలలుగా నిలచిపోయిన ఆర్.టి.సి బస్సు సర్వీసులు ఎట్టకేలకు సోమవారం రాత్రి నుంచి తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు ఏడునెలలుగా ఉభయ రాష్ట్రాల మధ్య ఆర్చీసి బస్సుల రాకపోకలు లేకపోవడంతో ప్రయాణీకులు నానాఆగచాట్లకు గురికాగా, ప్రయివేటు బస్సుల యాజమాన్యాలకు కాసుల వర్షం కురిసింది. వారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారడంతో ప్రయాణీకుల జేబులకు చిల్లులు పడ్డాయి. రెట్టింపు ఛార్జీలు, మరీ ముఖ్యమైన పండగ రోజుల్లో అయితే మూడింతల ఛార్జీలుఅదనంగా  చెల్లించి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు తిరిగిప్రారంభం కావడంతో ప్రయాణీకులకు కొంత ఉపశమనం కదిలిగినట్లయింది.

ఏ రాష్ట్రంలో ఎవరు ఎన్నిబస్సులు, ఎన్ని కిలోమీటర్లు నడపాలన్న విషయంలో ఉభయ రాష్ట్రాలు భీష్మించుకొని కూర్చోవడంతో బస్సులు నడిపే విషయంలో ఉభయ రాష్ట్రాల అధికారులమధ్య అనేక దఫాలుగా జరిగిన చర్చలు విఫల మవుతూ వచ్చాయి. మొన్న జరిగిన చర్చలు ఫలప్రదమై దసరా పండుగకైనా ఆర్టీసీ బస్సులు తిరుగుతాయోమోనని ఎదురుచూసిన ప్రయాణీకులకు ఆశాభంగమే ఎదురయింది. అయితే,  సోమవారంనాడు జరిగిన చర్చలు సఫలమై రెండురాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఒప్పందం కుదిరిన గంటల్లోనే రెండు రాష్ట్రాల బస్సులు రోడ్లమీదికి వచ్చాయి.

ఈ ఒప్పందం ప్రకారం, తెలంగాణ ఆర్టీసి  ఆంధ్రప్రదేశ్ లో ని వివిధ మార్గాలలో 638 బస్సులను నడుపుతుంది. వీటిని  లక్షా 61వేల 258 కిలోమీటర్ల మేర తిప్పుతారు. గతంలో 746 బస్సులను మాత్రమే తెలంగాణ నడిపింది.

కాగా, గతం 1,006 బస్సులను తిప్పిన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి ఇప్పుడు బస్సుల సంఖ్యను భారీగా తగ్గించుకొని తెలంగాణలోని వివిధ మార్గాలలో 638 బస్సులను మాత్రమే తిప్పేందుకు ఒప్పందం కుదిరింది. ఈ బస్సులను లక్షా 60, 999 కిలోమీటర్లు తిప్పుతారు. మొత్తం మీద తెలంగాణ ఆర్టీసి 80 బస్సులను పెంచుకోగా, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి 368 బస్సులను తగ్గించుకుంది.

హైదరాబాద్ లోని రవాణా భవన్ లో సోమవారంనాడు ఉభయ రాష్ట్రాల అధికారులు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో ఒప్పందం పత్రాలు మార్చుకున్నారు.తెలంగాణ ఆర్టీసి ఇన్ ఛార్జ్ మేనేజింగ్ డైరక్టెర్ సుశీల్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.టి కృష్ణబాబు ఈ ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు.

దీంతో సోమవారం రాత్రినుంచే రెండు రాష్ట్రాల మధ్యఆర్టీసి బస్సుల రాకపోకలు ప్రారంభ మయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్ – విజయవాడ మార్గంలో తెలంగాణ 273 బస్సులను 52,944 కిలోమీటర్లమేర నడపనుంది. కాగా, విజయవాడ – హైదరాబాద్ మార్గంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి 192 బస్సులను 52,524 కిలోమీటర్లు నడపనుంది. అలాగే వివిధ రూట్లలో ఎవరు ఎన్నిబస్సులు నడపాలన్న విషయంలో ఒక అవగాహన కుదిరింది.

అసలే కరోనాతో ఇంతకాలం  వేల కోట్ల రూపాయల ఆదాయం  భారీగా నష్టపోయిన ఆర్టీసికి ఈ ఒప్పందం కొంత అదనపు ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఇక ప్రయాణీకులు దీపావళికైనా ఆర్టీసి బస్సులలో ప్రయాణించే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles