Friday, March 29, 2024

ఆంధ్రప్రదేశ్ లోనూ కొత్త జిల్లాలు వస్తున్నాయ్!

  • లోక్ సభ నియోజకవర్గానికి ఒక జిల్లా
  • అరకు కేంద్రంగా ఆదివాసీ జిల్లా
  • 13 కొత్త జిల్లాలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తులు ముమ్మరమయ్యాయి. ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా జరిగింది. అమలులోకి రావడం ఇక లాంఛనమేనని అర్ధం చేసుకోవాలి. ఈ ఉగాది లోపే సర్వం సిద్ధమని వినికిడి.

Also read: రెండు మాసాల్లొ కరోనా ఖతం?

హామీ అమలు ఆరోగ్యప్రదమే

వై ఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ, తదనుగుణంగా రూపకల్పన చేసిన  మేనిఫెస్టోకు తగ్గట్టుగా,ప్రభుత్వం కొత్త జిల్లాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. గత సంవత్సరంలోనే అమలులోకి రావాల్సివుంది. జనగణన -2021 వల్ల ఇంత సమయం పట్టింది. కరోనా వల్ల జనగణన ఇంకా మొదలవ్వలేదు. అది మొదలయ్యే లోపే పునర్వ్యవస్థీకరణను పూర్తి చెయ్యాలన్నది ప్రభుత్వ సంకల్పం. పరిపాలనను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లడానికి, అభివృద్ధిని వేగిరపరచడానికి, వెనుకబడిన ప్రాంతాల వికాసానికి, ప్రాంతీయ సమతుల్యతకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తప్పక ప్రయోజనకారిగా నిలుస్తుంది. పాలకుల చిత్తశుద్ధి, అధికారుల వివేచన సంపూర్ణంగా ఉంటే, ఆశించిన ఫలాలు అందరికీ  దక్కుతాయి. అందులో సందేహమే లేదు.  పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం, మానవ, సహజ వనరుల సద్వినియగం పేరుతో జిల్లాల సంఖ్య  పెంచాలనే ఆలోచనతో ఈ బృహత్ కార్యాచరణ చేపట్టామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈ దిశగా  కమిటీలు, ఉపసంఘాలు కూడా ఏర్పడ్డాయి. కమిటీలు సమగ్రంగా అధ్యయనం చేసి,   సమర్పించిన నివేదికల ఆధారంగా నేడు ఆచరణ బాటపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు అవసరాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తించారు. తెలంగాణలో ఈపాటికే కొత్త జిల్లాలు అమలులోకి వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చింది. నవ్యాంద్ర నిర్మాణానికి ఎంతో అవసరం కూడా. ఆంధ్రప్రదేశ్ లో కొత్త  జిల్లాలు వచ్చి ఇప్పటికి చాలా కాలమయ్యింది. చివరగా ఏర్పడ్డ జిల్లాలు ఉత్తరాంధ్రలోని విజయనగరం, కోస్తా ప్రాంతంలోని ప్రకాశం. ఇవి ఏర్పడి కూడా దశాబ్దాలు దాటిపోయింది. అయినప్పటికీ, ఇంకా వెనుకబడిన జిల్లాలుగానే మిగిలిపోయాయాని నివేదికలు చెబుతూనే ఉన్నాయి.

Also read: కేజ్రీవాల్ – క్రేజీవాల్?

తెలంగాణ అనుభవం నుంచి గుణపాఠాలు

కొన్ని రంగాల్లో అభివృద్ధి నోచుకున్నప్పటికీ, మిగిలిన రంగాలకు విస్తరణ జరగాల్సిన చారిత్రక అవసరం కూడా ఉంది. 1 జూన్ 1979న విజయనగరం జిల్లా ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతంలో చిట్టచివరగా ఏర్పడిన జిల్లా ఇదే. ఆ తర్వాత, కొత్తగా ఏ జిల్లా ఏర్పడలేదు. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి. లోక్ సభ స్థానాల ప్రాతిపదికతో 25 జిల్లాలు ఏర్పాటు చెయ్యాలనేది  పాలకుల ప్రధానమైన ఆలోచన. గిరిజన ప్రాంతాల  భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, 26వ జిల్లా ఏర్పాటు కూడా అనివార్యమైంది. అరకు గిరిజన ప్రాంతమన్న విషయం తెలిసిందే. ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా పునర్ వ్యవస్థీకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల నిర్మాణ ప్రక్రియపై మిశ్రమమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి, విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కొత్త జిల్లాల ఏర్పాటులో, నిర్వహణలో తెలంగాణ అనుభవాల నుంచి  మంచి చెడులను గ్రహించవచ్చు. కేవలం జిల్లాలు పెరిగినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఏమీ పెరుగవని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Also read: షరతులతో ‘చింతామణి’ని అనుమతించాలి

ప్రజల ప్రయోజనాలే అంతిమ లక్ష్యం

ఈ విషయంలో, అభివృద్ధి ద్వారా సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది. జిల్లాల సంఖ్య పెరగడం వల్ల పరిపాలనా వికేంద్రీకరణ పెరుగుతుంది. అదే సమయంలో నిర్వహణా ఖర్చు కూడా పెరుగుతుందని కొందరు మాజీ ఐ ఏ ఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాల సంఖ్యతో పాటు అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయని వారు భావిస్తున్నారు. అనుభవంతో పండిపోయిన పూర్వ అధికారుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం గణనలోకి తీసుకుంటుందని ఆశిద్దాం. పరిపాలనా వికేంద్రీకరణలో స్థానిక నాయకుల ప్రాముఖ్యత కూడా  పెరగాలి. ప్రాముఖ్యత అంటే పెత్తనం కాదు. ప్రజల ప్రయోజనాలే దాని అంతిమ లక్ష్యం. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాలకు అభివృద్ధిలో, పాలనాపరమైన సౌలభ్యంలో సమన్యాయం జరగడమే అంతిమస్ఫూర్తి అవ్వాలి. ఉత్తరాంధ్రలో అనకాపల్లి, అరకు జిల్లాలు, గోదావరి ప్రాంతంలో రాజమండ్రి అమలాపురం, నరసాపురం, కృష్ణాప్రాంతంలో మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, రాయలసీమలో నంద్యాల, హిందూపూర్, రాజంపేట, తిరుపతి కొత్త జిల్లా కేంద్రాలుగా   రూపుదిద్దుకోబోతున్నాయన్న విషయం తెలిసిందే. రాయలసీమలో హిందూపూర్ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలోకి వస్తోంది. బెంగళూరుకు దగ్గరగా ఉండడం కలిసొచ్చే అంశం. కియామోటార్స్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక ప్రగతి ఊపందుకుంటోంది. పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ ఆధునీకరణం ప్రారంభం కావడం శుభసూచకం. భూములకు గిరాకీ బాగా పెరిగిపోతోంది.

Also read: వాక్సిన్ కి ఏడాది

నరసరావుపేటను జిల్లాకేంద్రంగా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజకీయంగా, విద్యాపరంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ప్రకాశం జిల్లావాసులకు బాగా అనుబంధం ఉన్న పట్టణం కూడా. గిరిజన ప్రాంతంలో జిల్లాలు ఏర్పాటు చేయడం కూడా ఎంతో ప్రయోగత్మకమైన నిర్ణయం. వాణిజ్య కేంద్రలైన రాజమహేంద్రవరం, వ్యవసాయ కేంద్రమైన అనకాపల్లి వంటివి జిల్లాలుగా మారడం మంచి అడుగు. అమలాపురం, నరసాపురం వంటి పాత పట్టణాలకు నేడు జిల్లా హోదా లభించడం ఆమోదయోగ్యం. ఇలా కొత్త జిల్లాల రూపకల్పనలో తీసుకున్న ప్రాతిపదికలను ఎక్కువమంది స్వాగతిస్తున్నారు.

కొత్తరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు కొత్త జిల్లాల ఏర్పాటు కొత్తనెత్తురు అందిస్తుందని నమ్ముదాం. అసమానతలు పూర్తిగా తొలగిననాడే నిజమైన పర్వదినం.

Also read: యూపీలో బీజేపీకి టోపీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles