Thursday, March 28, 2024

వలస పాలకుల గుండెల్లో నిద్రించిన అల్లూరి సీతారామరాజు

ఈ రోజు, జులై 4, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి. ఇరవై ఏడేళ్ల వయస్సులోనే దేశం కోసం, తనను నమ్ముకున్న మన్యం ప్రజల హక్కుల కోసం, వారు బలికాకుండా కాపాడటం కోసం ప్రాణత్యాగం చేసిన మహాయోధుడు, ధీశాలి, సాహసానికి మారు పేరు అయిన సీతారామరాజు మన్యంవీరుడుగా, బ్రిటిష్ వలస పాలకుల గుండెల్లో నిద్రించినవాడుగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.

4 జులై 1897లో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మలకు జన్మించిన సీతారామరాజు అసలు పేరు శ్రీరామరాజు. నరసాపురంలోని టేలర్ స్కూలులో ప్రాథమిక విద్య, కాకినాడలోని పి.ఆర్. కళాశాల, 1912లో విశాఖపట్టణంలోని ఎవిఎన్ కళాశాలలో చదువుకున్నారు. విశాఖలో చదువుకుంటున్న రోజుల్లోనే గదర్ సోదరులు బ్రిటిష్ సైనికులపైన తిరుగుబాటు చేయడం శ్రీరామరాజు దృష్టిని ఆకర్షించింది. దేశభక్తిని గుండెల నిండా నింపుకున్నారు. చదువుకు స్వస్తి చెప్పి దేశం అంతటా తిరిగి విప్లవకారులనూ, స్వాతంత్ర్య సమర యోధులనూ కలుసుకున్నారు.

అల్లూరి సీతారామరాజుగా హీరో కృష్ణ

కొంతకాలం గాంధీ అహింసామార్గం రాజును ఆకట్టుకుంది. ఖద్దరు దుస్తులు కొని మన్యంలో ప్రజలకు పంచిపెట్టారు. కానీ అహింసామార్గంలో బ్రిటిష్ వారు లొంగివస్తారన్న విశ్వాసం రాజుకు లేదు. తుపాకిబలంతో పరిపాలించే ప్రభుత్వాన్ని తుపాకితోనే పడగొట్టాలని నిర్ణయించుకున్నారు. రష్యా విప్లవం కూడా రాజులో ఉత్సాహం పెంపొందించింది. నెత్తురు రుచి మరిగిన పులి ఎదుట శాంతిమంత్రాలు వల్లిస్తే ప్రయోజనం ఏమిటంటూ కాంగ్రెస్ నాయకులకు ప్రశ్నించారు.

మన్యంలో అమాయక ప్రజలను బ్రిటిష్ పాలకులు పీడించడం చూసి సీతారామరాజు ఆగ్రహించారు. 1921లో కృష్ణదేవిపేటలో రెండేర్లామొగ గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తండ్రి సీతారామరాజు బాల్యంలోనే కాలం చేశారు. తల్లి సూర్యనారాయణమ్మను తన దగ్గరే పెట్టుకున్నారు. 1922లో విప్లవ కార్యాచరణ ఆరంభించి అడవుల్లో అదృశ్యమైనారు. 1882 మద్రాసు ఫారెస్టు యాక్ట్ కింద విధించిన కఠినమైన నియమాలనూ, పరిమితులనూ ధైర్యంగా ఎదిరించి పోరాటం సాగించిన వీరుడు. 1922లోనే రంప విప్లవానికి నాయకత్వం వహించిన ధీరుడు. మద్రాసు రెసిడెన్సీలో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ప్రాణాలకు తెగించి ఆదివాసీల హక్కుల కోసం పరాక్రమించారు.

మన్యం కొండల్లో అడివంతా ఒక్కటై విప్లవం నినదించింది. అడవిలో రగిలిన అగ్నిజ్వాల సీతారామరాజు. రంపచోడవరంలో విప్లవ వారసత్వం ఉండనే ఉంది. 1803-13 మధ్య కాలంలో రాయభూపతి దేవుని తిరుగుబాటు జరిగింది. 1862లొ ఉప్పెన ముఠాదారులకు వ్యతిరేకంగా ఉద్యమం రగిలింది. 1879లో ద్వారం బందాల చంద్రయ్య, సాంబయ్య, తుమ్మల దొర, అంబులరెడ్డి కలసి నిర్వహించిన రంప పితూరీ బ్రిటిష్ వలస పాలకులకు నిద్రలేకుండా చేసింది. అల్లూరి సీతారామరాజు మన్యంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సమయంలోనే 1920-22లో పల్నాటిసీమలో మాంచాలపాడుకు చెందిన కన్నెగంటి హనుమంతు వలస పాలకులకు వ్యతిరేకంగా సాయుధ విప్లవం నడిపించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలలో కొమరం భీం నిజాంపైన తిరుగుబాటు బావుటా ఎగురవేసింది ఆ కాలానికి సుమారు రెండు దశాబ్దాల తర్వాతే. సీతారామరాజు నుంచి ప్రేరణ పొందాడు కొమరం భీం. ప్రత్యేక గోండ్వానా రాష్ట్రం కావాలని పోరాడాడు. 27 అక్టోబర్ 1940లో నిజాం పోలీసులతో పోరాడుతూ నేలకొరిగాడు. పాపికొండల మధ్య స్మాట్ కవర్డ్, హైటర్ వంటి బ్రిటిష్ సేనానులను విప్లవసింహం అల్లూరి సీతారామరాజు మట్టుబెట్టారు.   

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్

సీతారామరాజుకు బట్టిపానకుల గ్రామానికి చెందిన సాహసవంతులు మునసబు గంటందొర, మల్లుదొర అండ దొరికింది.  చింతపల్లి తాలూకా తహసిల్దార్ బాస్టియన్ గంటందొర మునసబు పదవిని ఊడబెరికాడు. బ్రిటిష్ వారి అక్రమాలను ప్రతిఘటిస్తామనీ, వారిపైన పోరాటం చేస్తామని గంటం సోదరులు ప్రతిజ్ఞ చేశారు. పోడు వ్యవసాయం పన్ను కట్టమని మన్యం ప్రజలను వేధించిన అధికారి పాడేని తన్ని పంపించారు. 22 ఆగస్టు 1922న రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషన్ మీద తెల్లవారక మునుపే మెరుపుదాడి జరిగింది. సీతారామరాజు విల్లంబులు ధరించి మూడువందల మంది సాయుధ మన్యం  వీరులతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ఆ తర్వాత రోజున కె.డి. పేట పోలీసు స్టేషన్ ను ముట్టడించి మందుగుండు సామగ్రిని దోచుకున్నారు. ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ పైన దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే జైలులో ఉన్న గూడెం నాయకుడు మట్టడం వీరయ్యదొరను విడిపించుకొని తీసుకువెళ్ళారు.

బ్రిటిష్ అధికారుల అప్రమత్తమైనారు. ఆదివాసీల తిరుగుబాటును అణచివేయాలని నిర్ణయించుకున్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు నర్సీపట్నంలో మకాం పెట్టారు.స్టాట్ కవార్డ, హైటర్, టైమన్ హార్, జాడ్ విక్, హ్యూమ్, షర్బీస్, డాసన్, సాండర్స్ వంటి బ్రిటిష్ సైనికాధికారులు చెలరేగిపోయారు. వారి ఆగడాలకు అంతం లేకుండా పోయింది. సీతారామరాజు జాడ, ఆయన అనుచరుల ఆచూకీ తెలుసుకోవడం కోసం అడవిని తగులబెట్టారు. గిరిజన గూడేలన్నిటినీ అగ్నికి ఆహుతి చేశారు. మన్యం తిరుగుబాటు వార్తలు గాంధీకి తెలిశాయి. ఆయన సాయుధ తిరుగుబాటుకు వ్యతిరేకం. కానీ సీతారామరాజు త్యాగనిరతిని శంకించలేదు.

సీతారామరాజుకు తోడుగా వేగరాజు సత్యనారాయణరాజు (అగ్గిరాజు) మెరుపుదాడులు సాగించారు. సీతారామరాజు నాయకత్వంలో విప్లవానికి అంకితమైనారు. ఆయనకు గెరిల్లా పోరాటం తెలుసు.  భీమవరం తాలూకా కొడవిల్లి గ్రామానికి చెందిన అగ్గిరాజు ఆదివాసీ సాయుధ సేనకు అధిపతిగా ఉండేవారు. జనరల్ ఆర్మిటేజ్ మన్యంలో యుద్ధం ప్రకటించారు. అక్టోబర్ 16న మిరపకాయలటపా ముందుగా పంపించి ఆ తర్వాత అడ్డతీగల పోలీసు స్టేషన్ పైన విప్లవకారులు దాడి చేశారు. విల్లంబులు ధరించిన వీరులు బ్రిటిష్ సైన్యాన్ని పరుగులు పెట్టించడాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అవమానంగా భావించింది. ఎంతమంది మరణించినా సరే మన్యంలో తిరుగుబాటును ఉక్కుపాదంతో అణచివేయాలని బ్రిటిష్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. అందినవారిని అందినట్టు చంపడం ప్రారంభించారు బ్రిటిష్ సైనికులు. తన  కారణంగా అంతమంది అమాయకులు చనిపోవడం సీతారామరాజుకు కష్టం కలిగించింది. మంప గ్రామం మునసబుకు ఆత్మత్యాగం చేయాలన్నతన నిర్ణయాన్ని తెలిపారు. మన్యంలో మకాం ఉన్న రూథర్ ఫర్డ్, మేజర్ గుడాల్ కు సీతారామరాజు తన ఆచూకీని ఒక బాలుగి ద్వారా కబురుపెట్టారు. 7 మే 1924 ఉదయం 11 గంటల సమయంలో బ్రిటిష్ సైనికులు అల్లూరి సీతారామరాజుపైన తూటాల వర్షం కురిపించారు. ‘వందేమాతరం’ అని నినదిస్తూ సీతారామరాజు ఆత్మబలిదానం చేశారు.

‘‘స్వాతంత్ర్య వీరుడా, స్వారాజ్య భానుడా!

అల్లూరి సీతారామరాజా

అందుకో మా పూలదండ అందుకో రాజా

తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా’’

అంటూ శ్రీశ్రీ అల్లూరి సీతారామరాజు సినిమాలో రాసిన పాటకు స్పందించని తెలుగు హృదయం ఉండదు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ వంటి స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో సీతారామరాజు త్యాగాన్ని ప్రశంసించారు. భవిష్యత్తరాలకు అల్లూరి సీతారామరాజు ప్రేరణగా, స్ఫూర్తిదాయకంగా ఉంటారు.

(జులై 3 అల్లూరి సీతారామరాజు 124వ జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles