Tuesday, November 5, 2024

మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం

  • నూటికి నూరు పాళ్ళూ పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం
  • నోరు మెదపని ఆంధ్రనాయకులు
  • రగులుతున్న జనాగ్రహం

విశాఖ ఉక్కు ఆందోళన శుక్రవారంనాడు ఆరంభమైంది. అయిదు దశాబ్దాల కిందట విశాఖపట్టణంలో విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మించాలనే డిమాండ్ లో ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. తెన్నేటి విశ్వనాధం, గౌతులచ్చన్న వంటి అగ్రనాయకులు ఆ ఉద్యమానికి సారధ్యం వహించారు. విజయం సాధించారు. ఆ క్రమంలో 32 మంది ఉద్యమకారులు ప్రాణాలు బలిదానం చేశారు. ఇప్పుడు లక్షణంగా నడుస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం పురుడు పోసుకుంటున్నది. పోరాట పటిమ కలిగిన కళింగాంధ్రులూ, ఉక్కు ఫ్యాక్టరీతో జీవితాలు ముడివడినవారూ, విశాఖ ఉక్కు కారణంగా సముద్రతీరంలో విశాఖ కాస్మోపొలిటన్ నగరంగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మీనియేచర్ ఇండియాగా వర్ధిల్లుతున్నందుకు మురిసిపోతున్నవారూ, గర్విస్తున్నవారూ ఉద్యమంలో పాల్గొంటారు. పాలక పక్షం, ప్రతిపక్షం మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఉద్యమం ఆగదు. ఈ రెండు ప్రధాన పార్టీలకు చెందిన స్థానిక నాయకులు ఉద్యమాన్ని సమర్థించడం అనివార్యం.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్న నిర్ణయాన్ని కేంద్రం ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు కానీ శనివారం మధ్యాహ్నం వరకూ నోరు విప్పలేదు. రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమో, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఈ రెండు ప్రధాన పార్టీలూ ఎంత త్వరగా తమ విధానాన్ని ప్రకటిస్తే వాటికి అంత మంచిది. నష్టాలలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు నష్టాలు ఎంతమేరకు వచ్చాయో, ఎందుకు వచ్చాయో, నష్టాలు రాకుండా నివారించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో వివరించవలసిన బాధ్యతను నిర్వర్తించడం లేదు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, బలవంతంగా అమలు జరపడం, రాజకీయ నాయకులు నోరు మెదపకుండా వారి ముందు కాళ్ళకి బంధం వేయడం ఒక వ్యూహంగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాలను అమలు చేస్తోంది. అందుకు ఇనుప ఖనిజం చైనాకు ఎగుమతి చేస్తున్నారు కానీ విశాఖ ఉక్కు ప్యాక్టరీకి అందడం లేదు.

ఒక పెద్ద కర్మాగారం నడిపేందుకు అవసరమైన విద్యుత్తును ఆ సంస్థలోనే 380 మెగావాట్ల మేరకు ఉత్పత్తి చేస్తూ, ఫర్నేసులు మండించేందుకు అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్ ను సైతం ఏర్పాటు చేసుకొని, అన్ని హంగులనూ క్రమేణా సంతరించుకుంటూ, స్వయంసమృద్ధి సాధించిన సంస్థను ఇనుప గనులు కేటాయించకుండా ఎండగట్టి, బయటి నుంచి ఎక్కువ ధర పెట్టి, వేలకోట్లు ఖర్చు చేసి, ఖనిజం కొనుగోలు చేయవలసి రావడం కారణంగా నష్టాలు వస్తుంటే, నష్టాల సాకు చూపించి దక్షిణాఫ్రికాకో, మరో దేశానికో చెందిన ప్రైవేటు సంస్థలకు కారు చౌకగా అప్పగించడం దివాళాకోరుతనం కాక మరొకటి కాదు.

Also Read: విశాఖ ఉక్కు ప్రజల హక్కు కాదా?

ప్రైవేటు సంస్థకు విక్రయించిన తర్వాత ఇదే ప్రభుత్వం ప్రైవేటురంగంలోకి మారిన విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి ఇనుము గనులను కేటాయిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ కర్మాగారానికి ముడి ఖనిజం గనులు లేవు కానీ ప్రైవేటు రంగంలో ఉన్న టాటాస్టీల్, జిందాల్ స్టీల్ వంటి ప్రైవేటు సంస్థలకి ముడి ఇనుము గనులు ప్రభుత్వ సహకారం కారణంగా ఉన్నాయి. ఎప్పటికైనా ప్రైవేటుపరం చేయాలనుకుంటున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి బుద్ధిపూర్వకంగానే గనులు కేటాయించకుండా 1980 నుంచి ఇప్పటివరకూ, గత నాలుగు దశాబ్దాలుగా, అన్ని పార్టీలు అధికారంలో ఉండిన కాలంలో కేంద్ర ప్రభుత్వాలు ఎండగట్టాయని భావించవలసి ఉంటుంది. ప్రభుత్వరంగంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఒక దీపాన్ని ప్రైవేటు సంస్ధలకు అప్పగించడం బాధాకరం.

ఏడాదికి 63 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్న విశాఖ కర్మాగారం ప్రైవేటురంగంలో ఉన్న కంపెనీలతో పోల్చితే టన్నుకు రూ.5 వేలు ఎక్కువ చెల్లించి ముడి ఖనిజం కొనుగోలు చేస్తున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ వార్షిక ఆదాయం రూ. 20 వేల కోట్లు అయితే అందులో రూ. 5 వేల కోట్లు, అంటే పాతిక శాతం, ఇనుప ఖనిజం కొనుగోలుకే ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ కర్మాగారానికి ఉక్కు ఖనిజం గనులు కేటాయించినట్లయితే ప్యాక్టరీ లాభాలబాటలో కొనసాగేది. ప్రైవేటు రంగానికి విక్రయించవలసిన అవసరం లేదు. మూడేళ్ళ క్రితం రాజస్థాన్ లోని బిల్వారాలో మాగ్నటైట్ గని కేటాయించారు. ఇది కేవలం నామమాత్రపు కేటాయింపు మాత్రమేనని విశాఖ ప్లాంట్ లోని ఉన్నతాధికారులు అంటున్నారు.

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ నినదిస్తూ సుదీర్ఘంగా సాగిన ఉద్యమం ఫలితంగా విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ సమ్మతించారు. కొన్ని వేలమందికి ఉపాధి కల్పిస్తూ, క్రమంగా విస్తరించిన విశాఖ ఉక్కు కర్మాగారం జాతి గర్వించదగిన పరిశ్రమలలో ఒకటి. తెలుగు జాతి పోరాట పటిమకు అది నిలువెత్తు నిదర్శనం. ఏ రంగంలోనైనా ప్రైవేటీకరణకు సిద్ధం అవుతున్న దశలో ఆ రంగంలోని సంస్థలకు నష్టాలు వాటిల్లటం, ఆ సాకు చూపించి అంతకు ముందు వరకూ బాగా నడుస్తున్న సంస్థలను ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా విక్రయించడం వాజపేయి నేతృత్వంలోని తొలి ఎన్ డీ ఏ ప్రభుత్వంలో చూశాం. మళ్ళీ నరేంద్రమోదీ నాయకత్వంలోని మలి ఎన్ డీ ఏ సర్కార్ హయాం ద్వితీయ ఘట్టంలో చూస్తున్నాం. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పివి నరసింహారావు ప్రభుత్వం సంస్థలకు పోటీగా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేందుకు లైసెన్స్ – పర్మిట్ వ్యవస్థను రద్దు చేశారే కానీ నవరత్నాలను ఒకటి తర్వాత ఒకటి ప్రైవేటు సంస్థలకు అప్పగించలేదు.

Also Read: మిత్రుల గుండెల్లోనే ఉంటాడు దేవిప్రియ

విశాఖ ఉక్కు చరిత్ర ప్రధాని నరేంద్రమోదీకి కానీ ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్ కు కానీ తెలియదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తెలుసు. ఆయన ఉద్యమంలో భాగంగా జైలుకు వెళ్ళారు. పోలీసులతో ఘర్షణ పడ్డారు. నిజానికి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకొని ఈ విపత్తును నివారించాలని ఆంధ్రులు కోరుకుంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు కర్మాగారం అధికారుల సంఘం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వాపసు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ ఉద్యమం ప్రబలమై కార్చిచ్చుగా పరిణమించకముందే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఆ దిశగా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడూ స్పర్థలు విస్మరించి సమిష్టిగా కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాలి. లేకపోతే చరిత్ర క్షమించదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles