Tuesday, April 23, 2024

అంతటివాడు చెప్పినా పరిష్కారానికి నోచుకోసి సమస్య

  • కొత్త వీధి కొందు ఆదివాసీలకు దిక్కెవరు?
  • మోసం చేసిన తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది
  • గిరిజనేతరులకు భూములు అప్పగించిన అధికారులు

ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడే మద్రాస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవహారాలు చక్కబెట్టడానికి రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేసింది. దీనినే మద్రాస్ రెవిన్యూ బోర్డు అని అంటారు. ఇది తన పరిధిలోని భూములకు సంబంధించిన అన్ని విషయాల పైన పూర్తిస్థాయి అధికారాన్ని కలిగి ఉండేది. ఆ రోజుల్లో కలెక్టర్లు ఏదైనా ఒక విషయంపై తాము ఏమి చెయ్యాలి ? అనే ప్రశ్న ఎదురైనప్పుడు బోర్డును సంప్రదించేవారు. రెవిన్యూ వ్యవహారాలకు సంబంధించి కొత్తగా వస్తున్న చట్టాలు, వాటికి అనుబంధంగా నియమాలు, వాటిని కార్యవర్తనాలుగా మార్చి జిల్లా కలెక్టర్లకు పంపేది. వాటినే స్టెoడింగ్ ఆర్డర్స్ అనేవారు. అది మద్రాస్ రెవిన్యూ బోర్డు ప్రకటించిన ఆదేశాలు గనుక ‘బోర్డు స్టెoడింగ్ ఆర్డర్స్’  అని వాటికి పేరు. రెవిన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి BSO ఈ మూడు అక్షరాలు బాగా తెలుస్తాయి. ఎందుకంటే వాటిని విడగొడితే బోర్డు స్టెండింగ్ ఆర్డర్స్ అని అర్థం. ఉదాహరణకి ఒక గ్రామంలో స్మశానాన్ని ఒకరు ఆక్రమించారని అనుకుందాం. అప్పుడు రెవిన్యూ అధికారులు ఏం చేయాలి? ప్రభుత్వం అధీనంలో ఉండే రహదారికి అటు ఇటు చెట్లు ఉంటాయి. తుఫానులొస్తే అందులో కొన్ని పడిపోతాయి. అలా పడిపోయిన చెట్లను ఏం చేయాలి? ఇలా ఎన్నో సమస్యలు, అలాంటి సందర్భంలో రెవెన్యూ అధికారులు ఈ BSOని తిరగేస్తూ ఉంటారు. రెవిన్యూ వ్యవహారాలకు ఇది ఒక కోడ్ లాంటిది. అందులో ఉన్న ఏదైనా ఒక అంశానికి శాసన సభ చట్టం చేసినప్పుడు మాత్రమే ఆ BSO నిబంధనకు కాలం చెల్లిపోతుంది. ఉదాహరణకు ఒక రైతు నుంచి మరొక రైతుకు, ఒక యజమాని నుంచి మరొక యజమానికి భూమి ఆస్తిగా చేతులు మారినప్పుడు రికార్డులో కూడా ఆ మార్పు జరగాలి. 1971 లో పట్టాదారు పాస్ పుస్తకాల (ROR) చట్టం రానంతవరకు BSOలో చెప్పిన పద్ధతినే పాటించారు.

గిరిజనేతరులు కాజీసిన భూములు

రెవిన్యూ వ్యవస్థ అంతటికీ తలమానికం లాంటిది రెవెన్యూ బోర్డు అని చెప్పాను కదా. బ్రిటిష్ వారు వెళ్ళిపోయాక, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మద్రాస్ రెవిన్యూ బోర్డు కాస్త ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ బోర్డు అయింది. తర్వాత తర్వాత అనేక మార్పులు జరిగి రెవిన్యూ బోర్డు స్థానంలో ‘భూమిశిస్తూ కమిషనర్’ వచ్చారు. పేరు మారింది గాని ఆనాటి బోర్డు చేసే పనులు, దాని అధికారాలు భూమిశిస్తు కమిషనర్ చేతిలో ఉంటాయి. వీరినే పొడి అక్షరాలలో CCLA అంటారు. అంటే, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని అర్థం. నియమాలను తయారు చేయడం, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మార్పులు చేయడమే కాదు, భూమిశిస్తూ కమిషనర్ అత్యున్నత రెవిన్యూ అప్పిలేట్ అధికారి. వారి ఆదేశాలపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్ళగలరు. పూర్వం రోజుల్లో రెవెన్యూ బోర్డు సభ్యుడు జిల్లాకి వస్తున్నాడన్నా, రెవెన్యూ బోర్డు ఒక కలెక్టర్ కి నోటీసు చేసిందన్నా సదరు కలెక్టర్లు లంకనాలు పెట్టుకునే వారట. ఇప్పటి పరిస్థితి ఏంటో చూద్దాం.

అసలు కథ

ప్రస్తుతం మనకు భూమిశిస్తూ కమిషనర్ గా ఉన్నవారు చాలా అనుభవం ఉన్న అధికారి. వ్యక్తిగతంగా నిజాయితీకి ఎలాంటి లోటు లేదు. ఒక యువ ఐఏఎస్ అధికారిగా ఆయన సబ్ కలెక్టర్ హోదాలో ఆదివాసీల మధ్య పని చేశారు. అది కూడా చాలా కమిట్మెంట్తో పని చేశారు. ఆయన సర్వీసు వల్ల ఆయనకు అదనపు చీఫ్ సెక్రటరీ హోదా కూడా  లభించింది. అంటే భూమిశిస్తు కమిషనరే కాదు ఆయనకు,  రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి తర్వాత స్థానమైన చీఫ్ సెక్రటరీ హోదా కూడా ఉంది. ఇప్పుడు అసలు కథలోకీ వస్తాను.

అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కోనం రెవెన్యూ గ్రామంలో సర్వేనెంబర్ 289 నెంబరుతో కొంత మెట్టు భూమి ఉంది. ఈ భూమి మూడు కొండలకు మధ్యలో ఉంటుంది. అసలు బయట నుండి చూస్తే మనకి అక్కడ సమతల ప్రదేశం ఉన్నట్టుగా కూడా అనిపించదు.

మెట్టుభూమిలో కొత్తవీధి

ఈ మెట్టు భూమిలో 11 కోందు ఆదివాసి తెగలకు చెందిన రైతులు ‘కొత్త వీధి’ పేరుతో ఒక ఊరు కట్టుకున్నారు. కొన్ని ఇల్లు రేకులతోనూ, మరికొన్ని ఇల్లు బెంగళూరు పెంకులతోను ఉన్నాయి. పదిమంది కూర్చోవడానికి వీలుగా చింత చెట్లను, మామిడి, కొబ్బరి చెట్లను వారు పెంచారు. సింగిల్ ఫేస్ విద్యుత్ కనెక్షన్ కూడా ఉంది. కొందరి ఇళ్ళకు కరెంటు మీటర్లు ఉన్నాయి. కొందరికి ఓటర్లు గుర్తింపు కార్డులు, అందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. వారి మంచినీటి అవసరాలను ప్రభుత్వం గుర్తించలేదు గాని సత్యసాయి సేవా సమితి వారు గుర్తించి ఒక మినీ వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు. దానికి భూమిలో విద్యుత్ మోటార్ను కూడా ఏర్పరిచారు. తొమ్మిది ఆదివాసి కుటుంబాలు తమ గ్రామం చుట్టూ ఉన్న మెట్టు భూమిని చమట, శ్రమ, జీవితాలు ధారపోసి సాగులోకి తెచ్చారు. కొత్త వీధి గ్రామంకి పోరుగున ‘గుంటి’ అనే ఒక గ్రామం ఉంది. అది కొండ దొరలు నివసిస్తున్న గ్రామం. ఆ గ్రామానికి చెందిన ఏడు కుటుంబాలు కూడా ఈ భూమిలో సాగులో ఉన్నాయి. కొత్త వీధి 9 కుటుంబాలు, గుంటి 7 కుటుంబాలు ఈ భూమిని సాగులోకి తీసుకువచ్చాయి. కొంత భూమిలో ఆహార అవసరాల కోసం మెట్టు వ్యవసాయం చేస్తున్నారు. మిగిలిన భూమిలో ప్రధానంగా జీడి మామిడి, టేకు, మామిడి వంటి తోటలను  పెంచుతున్నారు.

అక్కడ గ్రామం ఉంది, అందులో మనుషులు ఉన్నారు, అక్కడ భూమి ఉంది, ఆ భూమిలో ఎలాంటి రసాయనాలతో సంబంధంలేని ప్రకృతి బిడ్డలైన ఆదివాసీలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం ఉంది. ఇటువంటి మాటలు మనకి గొప్ప ఆదర్శంగా వినిపిస్తాయి గాని అది వారి రోజువారి జీవితం. కొత్త వీధి గ్రామానికి వెళ్లాలంటే 21వ శతాబ్దంలో ఈనాటికి కాలిబాటే తప్ప రహదారి సదుపాయం లేదు. గుంటి నుండి గంటసేపు నడిస్తే కొత్త వీధి చేరగలం.

ఆందోళనలో ఆదివాసీీలు

గిరిజనేత భూదళారీల వల్ల భయాందోళనలు

గత ఏడాది, ఇంకా చెప్పాలంటే అంతకుముందటి, అంటే 2021 సెప్టెంబర్ -అక్టోబర్ నుండి వారికి భయాందోళనలు మొదలయ్యాయి. చీడికాడ మండల రెవెన్యూ కార్యాలయం నుంచి రెవెన్యూ సిబ్బంది చెప్పా పెట్టకుండా వారి భూములలోకి రావడం, గిరిజనేతర భూ దళారీలతో కలిసి రావడాన్ని  ఆదివాసీలు గుర్తించారు. 2021 నవంబర్ మొదటి వారంలో అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కు ఆదివాసీల సాగు అనుభవాన్ని గూర్చి వివరిస్తూ, విచారణ జరపాలని, తనిఖీ చేయాలని, ఆదివాసీల సాగు అనుభవాన్ని రికార్డులో నమోదు చేయాలని కోరడం మొదలుపెట్టాం. 2021 నవంబర్ 29వ తారీఖున చీడికాడ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద భారీ ప్రదర్శన నిర్వహించి వినతి పత్రం ఇచ్చాం. రసీదులు కూడా తీసుకున్నాం.

2022 జూన్ 13వ తారీకు నాడు అనకాపల్లి జిల్లా, జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారితో కొత్త వీధి కొందు ఆదివాసీలను తీసుకుని వెళ్లి వారి సమస్యలను వివరిస్తున్నాం. సరిగ్గా అదే సమయానికి చీడికాడ మండల రెవెన్యూ కార్యాలయంలో అప్పటి తాసిల్దార్, అప్పటి డిప్యూటీ తాసిల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ ఈ భూములను అయిదుగురు గిరిజనేతరుల  పేరున మార్చేస్తున్నారని మేము తెలుసుకోలేకపోయాము.

సాగులో ఉన్న ఆదివాసీలకు ఎలాంటి నోటీసు గానీ, సమాచారం గానీ ఇవ్వకుండా ఏక పక్షంగా గౌరవ తాశిల్దారు గారు 37.8 ఎకరాల భూమికీ రికార్డు మార్చేశారు. గత 30 ఏళ్లుగా కొత్త వీధి ఆదివాసీలు, 70 ఏళ్లుగా గుంటి కొండ దొర ఆదివాసీలు సాగుచేస్తూ, తోటలు, దొడ్లు పెంచిన భూమి కంప్యూటర్ మౌస్ క్లిక్ తో గిరిజనేతరుల చేతులలోకి పోయింది. 2021 నుండి, మా గ్రామానికి రండి, మా భూములను తనిఖీ చేయండoటూ ఆదివాసీలు పెట్టుకుంటున్న దరఖాస్తులన్నీ చీడికాడ మండల రెవెన్యూ కార్యాలయంలో పోగుపడి ఉన్నాయి.

పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం, దానిని మరింత పకడ్బందీగా అమలుపరచడానికి ప్రస్తుత భూమిశిస్తూ కమిషనర్ గారు ఇస్తున్న ఉత్తర్వులు, మెమోలు, GO లు అలా ఉంటుండగానే ఆదివాసీల సాగుభూమి రెక్కలు కట్టుకొని ఎగిరిపోయింది.

చీడికాడ మండల రెవెన్యూ సిబ్బంది నిర్వాకం

సాఫ్ట్వేర్ తెలిసినా కొందరు యువకులు ఈ ఆదివాసీలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆదివాసీల సాగులను GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) వే పాయింట్స్ సహాయంతో శాటిలైట్ ద్వారా గుర్తించి శాటిలైట్ ఇమేజెస్ తయారు చేశారు(దానిని ఇస్తున్నాను). మొత్తం భూమి యొక్క సరిహద్దును గుర్తించడంతోపాటు అందులో ఉన్న గ్రామాన్ని, విడివిడిగా ఆదివాసీల సాగులను కూడా వారు గుర్తించగలిగారు. ఆ భూమిలో గ్రామం ఉందని, ఆ  ఆదివాసీలు పెంచుతున్న వనాలు ఉన్నాయని కొన్ని వందల అడుగులు ఎత్తున ఉన్న శాటిలైట్ మనకి చూపిస్తుంది. కానీ చీడికాడ మండల రెవెన్యూ సిబ్బందికి మాత్రం అవి కనిపించటం లేదు. వారు ఆ గ్రామం వచ్చారు, ఆదివాసీలు పెంచిన చింత చెట్లు కింద కూర్చొని సేద తీరారు. వారిచ్చిన కొబ్బరి బొండం నీళ్లను సేవించారు. అందులో లేత కొబ్బరి గుంజును ఆస్వాదించారు. తమ కార్యాలయానికి వెళ్లి వారి జిల్లా కలెక్టర్కు రాసిన రిపోర్టులో మాత్రం అక్కడ గ్రామం ఉన్న సంగతి, ఆదివాసీల సాగు సంగతులను రాయడం మాత్రం మర్చిపోయారు. కావాలనే మర్చిపోయారు.

గత ఏడాది, 2022 ఆగస్టు మూడో వారంలో, విజయవాడ వెళ్లి భూమిశిస్తూ కమిషనర్ గారికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. పాపం! ఆయన వెంటనే స్పందించారు. ఆగస్టు 23వ తారీకున అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని ఆదేశిస్తూ సర్వే నంబర్ 289లో సమగ్రమైన విచారణ జరపమని కోరారు…. కాదు కాదు ఆదేశించారు. కొందు ఆదివాసీలను ‘ఆదిమ తెగలకు’ చెందిన ఆదివాసీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. వారిని PVTGలు అంటారు. తన కెరియర్ ప్రారంభంలో సబ్ కలెక్టర్ గా  ఆదివాసి ప్రాంతాలలో తిరిగిన అనుభవం ఉన్న కారణంగా కొందు ఆదివాసీలు అంటే ఎవరు,  వారి పరిస్థితిలేమిటో ప్రస్తుత భూమిశిష్ట కమిషనర్ గారికి బాగా తెలుసు. కొన్ని కొందు ఆదివాసి గ్రామాలు సెన్సస్ రికార్డులలో లేకపోతే ఆయన స్వయంగా ఇంటింటికి తిరిగి జనాభా లెక్కలు సేకరించిన వాడు. అలా పాడేరు డివిజన్లో 20 గ్రామాలకు మొదటిసారి ఒక చిరునామా, మొదటిసారి ఒక రేషన్ కార్డు, మొదటిసారి ఒక ఓటర్ ఐడి కార్డు ఇచ్చినవాడు. ఆయనకు కొందు ఆదివాసీలు అంటే ఎవరో తెలుసు. అందుకే ఆయన స్పందించాడు. ఎంజాయ్మెంట్ సర్వే చేయమని ఆదేశించాడు. ఇది గత ఏడాది ఆగస్టు 23న ఇచ్చిన ఆర్డర్. నేటికీ అది అమలు కాలేదు. ఎందుకని?.

ఆదివాసీలకు దిక్కెవరు? ఎవరికి చెప్పుకోవాలి?

ఎంజాయ్ మెంట్ సర్వే జరిగితే ఏమవుతుంది?. బండారం బయటపడుతుంది. అక్కడ ఆదివాసీల స్థిర నివాసాలు ఉన్నాయని, వారి స్థిరమైన సాగు అనుభవం ఉందని ఎంజాయ్మెంట్ సర్వేలో నిర్ధారణ అవుతుంది. అది భూములను కొనుగోలు చేసిన వారికి ఇబ్బంది. అక్కడ ఎలాంటి సాగు లేదని నమ్మబలికి, రికార్డు మార్చేసిన తాసిల్దార్ భూమి బాగోతం బయటపడుతుంది. ఇంతకాలంపాటు తాము సాగు చేస్తున్నా, తాము భూములో ఉన్నామని చెప్పే ఒక్క కాగితం ముక్క కూడా లేని ఆ ఆదివాసీల చేతిలో సాగు హక్కు రికార్డు వచ్చి చేరుతుంది. అది వారి హక్కులకు ఆలంబనగా నిలుస్తుంది. అందుకే ‘ఎంజాయ్మెంట్ సర్వే చెయ్యం గెట్ అవుట్’ అంటున్నారు. రెవెన్యూ అధికారులు. భూమి శిస్తూ కమిషనర్ ఆదేశాలు అoటే అవి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. అయినా “మేము అమలు చేయo. మీ దిక్కున చోటకు పోయి చెప్పుకోండి” అంటున్నారు. మరి ఈ నోరులేని, కష్టం తప్ప సుఖం ఎరుగని ఆదివాసీలకు అండగా నిలబడేది ఎవరు. ఏ క్షణంలోనైనా వారి గ్రామాన్ని నేలమట్టం చేయవచ్చు. ఏ క్షణంలోనైనా వారు పసిపిలల్ల పెంచుకున్న తోటలను ధ్వంసం చేయవచ్చు. భూమి శిస్తూ కమిషనర్ ఆదేశాలకే దిక్కు దివానా లేకపోతే ఈ ఆదివాసీలకు దిక్కెవరు…? ఎవరితో చెప్పుకోవాలి…? ఎక్కడికి పరిగెత్తాలి?

బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటుచేసిన మద్రాస్ రెవిన్యూ బోర్డు ఒక సుప్రీం అథారిటీ….. దాని అవతారంగా నేడు వెలసిన భూమిశిస్తు కమిషనర్ కార్యాలయం దాని ఆదేశాలకు దమ్మిడి విలువ లేని కాలం  వచ్చింది. ఆఖరి ఇల్లును తీసేసే వరకూ, ఆఖరి చెట్టును కూల్చేంతవరకూ వాటిని కాపాడుకోవడానికి, ఆదివాసీల జీవితాలను నిలబెట్టడానికి పోరాటం సాగుతూనే ఉంటుంది.

Also read: ఉపాధి పధకంలో మార్పుల లక్ష్యం ఏమిటి?

జై ఆదివాసి… జై జై ఆదివాసి

పీఎస్ అజయ్ కుమార్,

జాతీయ కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం.

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles