Monday, June 24, 2024

హరికథకు పర్యాయపదం ఆదిభట్ల

తెలుగువారిని ఊరించి ఊగించి ఉప్పొంగించిన కళాస్వరూపాలలో అపురూపమైనది ‘హరికథ’. ఈ కళాకేళికి అపూర్వమైన కీర్తిని కట్టబెట్టినవాడు ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల అంటే హరికథ – హరికథ అంటే ఆదిభట్ల. వీరికి పూర్వం కూడా హరికథ ఉంది, హరికథకులు ఉన్నారు. ఈ ప్రక్రియకు కొత్తరూపును, సరికొత్త ప్రాపును తెచ్చినవాడు కేవలం నారాయణదాసు. సంగీత సాహిత్య సార్వభౌముడుగా, లయబ్రహ్మగా ప్రసిద్ధుడు. ‘హరికథా పితామహుడు’ గా సుప్రసిద్ధుడు. ‘ఆటపాటల మేటి’గా అనంత వైభవశ్రీమంతుడు.

Also read: పంజాబ్ కాంగ్రెస్ లో ఆగని కుమ్ములాట

బహుముఖ ప్రజ్ఞాశాలి

ఆధునిక కాలంలో, తెలుగునేలపై ఇంతటి బహుముఖ ప్రతిభామూర్తి మరొకరు లేరనడం అతిశయోక్తికాదు. సామాన్యులను, అసామాన్యులను అనుపమానంగా మెప్పించి ‘హరికథ’కు పట్టం కట్టిన ప్రతిభాశాలి. కేవలం తెలుగువారే కాదు,యావత్తు భారతీయులు,ఆంగ్లేయులు సైతం ఆయన ప్రజ్ఞకు మోకరిల్లారు. బహుకళా ప్రావీణ్యం, బహుభాషా ఆధిక్యం ఆదిభట్ల సొమ్ము. “ఆధునిక కాలంలో నా దృష్టిలో దైవాంశ సంభూతులు ముగ్గురే ముగ్గురు. ఒకరు అసమాన దేహబల సంపన్నుడైన కోడి రామ్మూర్తి, ఇంకొకరు మారుత వేగ కవితా స్వరూపులైన కొప్పరపు కవులు, మరొకరు పంచముఖీ పరమేశ్వరుడైన ఆదిభట్ల నారాయణదాసు”.. అని ‘కవి సమ్రాట్ ‘ విశ్వనాథ సత్యనారాయణ ఒక ప్రసంగ సందర్భంలో నారాయణదాసు శక్తి స్వరూపానికి అక్షరార్చన చేశారు. కథాగానం చేస్తూ..ఏకకాలంలో శరీరంలోని ఐదు భాగాలతో ఐదు తాళలను మేళవించడం అతిమానుష శక్తిగా (సూపర్ హ్యూమన్ ) నాటి మహాకవి పండిత,కళామూర్తులు నిలువెల్లా భజించారు. రెండు చేతులు, రెండు కాళ్ళు, తలతో అయుదు తాళాలకు దరువు వేసి చూపించే ఆ ప్రజ్ఞ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదు. అది అనితర సాధ్యం. ఇంతటి శక్తి కేవలం నారాయణదాసుకే వశమైంది. ఇది ‘నభూతో  న భవిష్యతి’ గా పెద్దలందరూ నిర్ణయించారు.మహారాష్ట్రలో ‘అభంగులు’, తమిళనాడులో ‘కాలక్షేపం’, కర్ణాటకలో ‘హరికథా కాలక్షేపం’, మనకంటే కాస్త ముందుగా ఏర్పడ్డాయి. మనకు ‘యక్షగానం  ఉంది. ఉన్నప్పటికీ, హరికథకు -యక్షగానానికి కొన్ని పోలికలతో పాటు, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి.

Also read: నిలిచి వెలిగేది తెలుగే!

పంచముఖీ పరమేశ్వరుడు

నారాయణదాసు చేతిలో  ‘తెలుగు హరికథ’  సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. తీరు మార్చుకుంది. వన్నెలు, వయ్యారాలు పోయింది. మరాఠా, తమిళ, కన్నడుల ప్రభావంతో  మన తెలుగుదేశంలో నారాయణదాసు కంటే ముందు కొందరు హరికథా ప్రదర్శనలు చేశారు. ‘కథాగానం’ మూలంగా రూపుదిద్దుకున్న ఈ కళ అత్యంత ప్రాచీనమైంది. మిగిలిన రాష్ట్రాలలో సంగీతం, సాహిత్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ కథాగానాలు సాగేవి. అందులో నృత్యం, అభినయం అనేవి ఉండేవి కావు. సంగీతం, కవిత్వం, నృత్యం, అభినయం, నాటకం పెనవేసుకున్న అపూర్వ సర్వ కళా స్వరూపం మన ఆదిభట్ల చేతుల్లో అవతారమెత్తిన ‘ హరికథా రూపం.’ హాస్య ప్రసంగాలు, పిట్టకథలు, విసుర్లు, చెణుకులు, చమత్కార భరితమైన చాటుపద్య మణిమంజరులతో నారాయణదాసు హరికథా ప్రదర్శన చేస్తూంటే… కొన్ని వేలమంది ఒళ్ళు మరచి, ఆ రససముద్రంలో మునిగితేలేవారు. తెల్లవార్లూ సాగే ఆ ఆటపాటలతో  అలిసిసొలసి పోయేవారు. ఆదిభట్ల వారి ‘బేహాగ్’ రాగ ప్రస్థానానికి ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ ఠాగూర్ మంత్రముగ్ధుడైపోయారు. సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజనీదేవి వంటి విజ్ఞులు,ప్రాజ్ఞులు ఎందరో ఆదిభట్లవారి ప్రజ్ఞకు నీరాజనాలు పట్టారు. విజయనగరంలో ఐదుతాళాలతో కథాగానం చేసి, దక్షిణాది పండితులను ఓడించి ‘పంచముఖీ పరమేశ్వర’ బిరుదును గెలుచున్న ఘనుడు ఆదిభట్ల. హరికథలే కాక, అష్టావధానాలు చేశారు. తెలుగు,సంస్కృతం, తమిళం,హిందీ,బెంగాలీ, ఉర్దూ,ఇంగ్లిష్,అరబ్బీ,పార్శీ మొదలైన అనేక భాషల్లో ప్రావీణ్యం ఆయన ఐశ్వర్యం.  శతాధిక గ్రంథాలు రాశారు. సంగీతాన్ని – సాహిత్యాన్ని సమ ప్రతిభతో ప్రదర్శన చేశారు. అనేక అంశాలపై అపురూపమైన పరిశోధనలు చేశారు. సంగీతంపై లాక్షణిక గ్రంథాలు రాశారు. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలను అనువాదం చేసిన తీరు అనన్య సామాన్యం. పారశీలో మూలలను చదివి,ఇంగ్లిష్ అనువాదాన్నీ పరికించి, తెలుగులో, సంస్కృతంలో భిన్న ఛందస్సుల్లో అనుసృజన చేసిన తీరు ఆదిభట్లకే చెల్లింది.

Also read: జనహృదయాధినేతకు జోహార్లు

ఇటు కాళిదాసు, అటు షేక్స్ పియర్

‘నవరస తరంగిణి’ అద్భుతమైన రచన. కాళిదాసు సంస్కృత కవిత్వం,షేక్స్ పియర్ ఇంగ్లిష్ సాహిత్యంలోని నవరసాలను తెలుగులో అనువదించిన వైనం అనితర సాధ్యం. ‘దశవిధ రాగ సవతి కుసుమ మంజరి’ మరో మాణిక్యం.మంజరీ వృత్తంలో 90 రాగాలతో ఈ రచన సాగింది. ఋగ్వేదంలోని ఋక్కులను స్వరపరచి వీణపై వినిపించడమే కాక, ఎందరికో నేర్పించారు. ఆ ఋక్కులను తెలుగుగీతాలుగానూ సృష్టించాడు. ఆయన ‘ఓంకారం’ సాధన చేస్తూంటే.. విజయనగరం మొత్తం వినపడేది.

Also read: ప్రక్షాళన జరిగితేనే అధికారప్రాప్తి

కేవలం,ఆయన గురించి విజయనగరంలో సంగీత విద్యాలయాన్ని స్థాపించారు. ఆయనే మొట్టమొదటి ప్రిన్సిపాల్. నోబెల్ ప్రైజ్ కు నామినేట్ చేయడానికి బ్రిటిష్ వారు ఉత్సాహం చూపించినా, ఆయన సున్నితంగా తిరస్కరించారు.ఎన్నో రచనలు చేశారు. ఎన్నో వేషాలు వేశారు.’అచ్చతెలుగు’పై మక్కువ ఎక్కువ పెంచుకొని విశిష్టమైన కృషి చేశారు, రచనలు అందించారు.

Also read: విశాఖ ఉక్కు దక్కాలంటే పోరాటమే శరణ్యం

ఆయన తుదముట్టని కళ లేదు. ఆయనకు దక్కని బిరుదు సత్కారాలు లేవు. తెలుగునాట గజ్జెకట్టి కథ చెప్పే ప్రతి హరిదాసు మొట్టమొదటగా తలుచుకొనేది నారాయణదాసునే. సర్వ విద్యా పారంగతుడు,సర్వ కళాస్వరూపుడైన ఆయనకు గురువంటూ ఎవ్వరూ లేరు. ఆన్నీ స్వయంగా సిద్ధించినవే. రససిద్ధిని చేకూర్చినవే. ఆ రూపం, ఆ గానం, ఆ గాత్రం, ఆ ప్రదర్శనం, ఆ వ్యక్తిత్వం, ఆ వైభవం ముగ్ధమనోహరం. ఆయన ఆత్మకథ ‘ నా ఎరుక’ పెను సంచలనం. ఆయన జీవితమే ఒక ప్రభంజనం. ఆగష్టు 31 ఆదిభట్లవారి జయంతి. ఎనిమిది పదుల సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన పరిపూర్ణుడు (1864-1945). ఈ హరికథా పితామహుడు మనవాడు. సర్వ కళలకు రేడు.

(ఆగస్టు 31 ఆదిభట్ల నారాయణదాసు జయంతి)

Also read: తాజా అఫ్ఘాన్ రణక్షేత్రం పాంజ్ షీర్!

Previous article
Next article
Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles