Thursday, December 8, 2022

ఎవరు చరిత్ర హీనులు – 5

  • చిన్నారి హత్యాచారోదంతంలో ఎవరు దోషులు?
  • నిందితుడు రాజుని ఎక్ కౌంటర్ చేయాలనన్నమల్లారెడ్డి, రేవంత్ రెడ్డి బాధ్యత ఏమిటి?
  • అరెస్టు చేశారని ఒక సారీ, చేయలేదని మరో సారీ ప్రకటనలు ఎందుకు?
  • ఈ నేరం వెనుక మాదకద్రవ్యాలూ, తాగుడు వ్యసనం ఉన్నాయా?
  • సింగరేణి కాలరీ ఘటనలపైన పౌరహక్కుల ప్రజాసంఘం దర్యాప్తు
  • ఎప్పుడు, ఎందుకు, ఎట్లా జరిగింది?  

హైదరాబాద్ : పేదల కాలనీల ( అందరికీ అర్ధమయ్యేది మురికివాడలు)  ప్రజల ఓట్లపై ఉన్న ప్రేమ వారి బ్రతుకుల పట్ల  ప్రతిపక్షాలకూ, అధికార పార్టీలకూ ఎందుకు ఉండదు ? ఒక ‘ఘటన – సంఘటన’  మురికివాడలలో  జరిగినప్పుడు అధికార పార్టీలతో (ఏదో ఒక రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా అధికారంలో ఉంటారు / ఉన్నాయి) సహా హల్చల్ చేస్తాయి. వాళ్లకు సమస్యతో సంబంధం లేనట్లు బాధితులతో పాటు వారు కూడా ఆందోళనలకు దిగుతున్నారు / దిగుతారు. చాలామటుకు ముగింపు మాత్రం “కర్మకు – కాలానికి” వదిలివేస్తారు / వదిలేస్తున్నారు. సింగరేణి కాలనీ వాసుల పరిస్థితి దీనికి మంచి ఉదాహరణ. ఒక నేరానికి మరొక నేరంతో బాధితులకు న్యాయం చేయటం సాధ్యమా? ఆ విధంగా చేయడం న్యాయమా?

Also read: చరిత్ర హీనులు ఎవరు?

తల్లి కూలీ, తండ్రి ఆటో డ్రైవర్

అది 09సెప్టెంబర్ 2021 రోజు సాయంత్రం.  5 గంటల నుండి 6 సంవత్సరాల చిన్నారి చైత్ర  కనిపించకుండా పోయినది. నల్గొండ జిల్లా, దేవరకొండలోని నక్కలగండి తండాకు చెందిన గిరిజన – లంబాడి  కుటుంబం  రాజు నాయక్,  జ్యోతి లు తన ముగ్గురు పిల్లల తో బ్రతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చినారు. సింగరేణి కాలనీలో రూ. 1500 కిరాయికి రేకులతో నిర్మాణం చేసిన ఇంటిలో ఉంటున్నారు. తల్లి కూలి పనికి పోతది. తండ్రి ఆటో నడిపిస్తాడు. వీరికి మొదటి పాప చైత్ర 6 సంవత్సరాల కూతురు, మిగతా ఇద్దరు అబ్బాయిలు 4, 2 సంవత్సరాల వయసు వారు వున్నారు. వీరు హైదరాబాద్ వలస ఎందుకు వచ్చారు అని విచారించగా వీరి తండా ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు కింద వెళ్ళిపోయింది. భూములు పోయాయి. అందుకు పొట్టచేత పట్టుకొని వచ్చాము అన్నారు. పునరావాసం కలిపించారా? కలిపించలేదని సమాధానం.

వీరి ఇంటి వెనకాల  పాలకొండ రాజు అనే వ్వక్తి  23 – 25 సంవత్సరాల వయసుగల యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు కు చెందిన కుటుంబం వుంది. పాలకొండ రాజుకు  ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మౌనిక. వారికి ఒక  కూతురు. వీరు ఎరుకల కులస్థులు. పాలకొండ రాజు తాగుడుకు బానిస అయ్యాడు. మద్యం, గంజాయికి అలవాటు పడ్డాడు. దొంగతనాలూ చేస్తున్నాడు. భార్యతో రోజూ  తాగి గొడవ పడుతుంటే రాజునూ భార్య  వదిలేసి పుట్టింటికి వెళ్లి పోయింది. రాజు తల్లికూడా రాజు ప్రవర్తనకు విసుగొచ్చి వెళ్ళిపోయింది. ఒంటరిగానే రేకులతో కప్పబడిన సొంత ఇంటిలోనే రాజు ఉంటున్నాడు. ఆటోకూడ నడుపుతాడు. నమ్మకస్తులైన స్నేహితులు ఉన్నారు.

Also read: ఎవరు చరిత్ర హీనులు-4?

అత్త దగ్గరికి వెళ్తానని చెప్పిన చైత్ర

తొమ్మిదివ తేదీ సాయంత్రం జ్యోతి చైత్రకు స్నానం చేయించి బట్టలు వేసి రెడీ చేసింది. పాప అత్త దగ్గెరకు వెళ్తున్నాను అని చెప్పు తుర్రున వెళ్ళింది. మిగతా ఇద్దరు పిల్లలను జ్యోతి రెడీ చేసింది. ఇద్దరు పిల్లలు ఇంటిలోనే ఆడుకుంటున్నారు. చైత్ర తండ్రి ఆటోకు వెళ్ళాడు.రాత్రి భోజనానికి జ్యోతి రొట్టెలు తయారు చేసినతరువాత, ఇంట్లో పని ముగించుకొని పాప చైత్ర గురించి వాకబు చేసింది. పాప గురించి వెతుకుతున్న సమయంలో ‘గణేశు మండపా’లకు సెక్యూరిటీగా ఉన్న పోలీసులతో పాప కనిపించటం లేదని పాప కుటుంబ సభ్యులు తమ ఆతృతను, ఆందోళనను చెప్పుకున్నారు. గణేశు మండపాలకు సెక్యూరిటీగా ఉన్న పోలీసులు ఏదో ఒక మండపంలో ఆడుకుంటుండొచ్చు, వెతకమని చెప్పారు. తల్లితండ్రులు పాప ఫోటోను సోషియల్ మీడియాలో పెట్టి తమ ఆందోళనను వ్యక్తపరిచారు. 100 నంబర్ కు డయల్ చేసి పాప తప్పిపోయిన విషయం ఫిర్యాదు చేసారు. కాలనీ వాసులు, పోలీసులు కలిసి వెతకటం మొదలు పెట్టారు. వీరితో పాటు పాలకొండ రాజు కూడా జతకట్టాడు. ఎంతకూ చైత్ర జాడకనిపించలేదు.

తల్లి పాపకోసం వెతుకుతున్నప్పుడు తెలిసిన సమాచారం ఏమనగా .. అత్తా వాళ్ళ ఇంటికి వెళ్లి ఆడుకుంటాను అని చెప్పిన చైత్ర అత్త ఇంటికి వెళ్లే మార్గంలో, మద్యం త్రాగిన  మత్తులో అటుగా వస్తున్న  నిందితుడు  రాజు బాలికను అపి ఎక్కడికి వెళ్లుతున్నావు అని అడిగాడు అనీ, పాప అత్తవాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి  వెళుతున్నానని చెప్పినట్లూ, రాజు చైత్రతో కుర్ కురే, చిప్స్ కొనిస్తా అని  దగ్గర లోని కిరాణా షాపుకు తీసుకెళ్లి  కొనిచ్చి తన ఇంటికి తీసుకవెళ్లినట్లు తెలిసింది. ఈ విధమైన విషయం తల్లికి తెలిసిన వెంటనే రాజు ఇంటి దగ్గెరకు వెళ్లిచూడగా ఇంటికి తాళం వేసివున్నది. సుమారు 3 గంటల సమయంలో పాలకొండ రాజు చైత్ర గురించి  చైత్ర నాయనమ్మ (చైత్ర తండ్రి తల్లి) తో వాకబు చేసాడని, అప్పుడు చైత్ర నాయనమ్మ “నా పిల్ల గురించి నీకెందుకురా ” అని గద్దించినట్లు పాప నాయనమ్మ చెప్పింది. పాపను వెతుకుటలో కొంతదూరం వచ్చిన రాజు కనిపించలేదు. ఇంట్లోనేమో లైట్ వెలుగుతున్నది.

Also read: ఎవరు చరిత్ర హీనులు?

రాజును అనుమానించిన బాధితులు

చైత్రను తీసుకొని పాలకొండ రాజు కిరాణ షాప్ కు వెళ్ళటం మరియు చైత్ర నాయనమ్మతో చైత్ర గురించి మూడు గంటల సమయంలో రాజు అడగటం, అప్పటివరకు పాపను వెతుకుటలో ఉన్న రాజు అకస్మాత్తుగా కనిపించకుండా పోవటం .. ఈ మూడు అంశాలు చైత్ర కుటుంబ సభ్యులకు  పాలకొండ రాజు  పై అనుమానం కలిగించింది ( వీరి అనుమానాన్ని పసికట్టిన రాజు చల్లగా జారుకున్నాడు) చైత్ర కుటుంబ సభ్యులకు రాజు కనిపించలేదు, మళ్లీ, మళ్లీ రాజు ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇంట్లో లైట్ వెలుగుతుంది కానీ ఇంటికి తాళం ఉంది. చివరికి 7 గంటల సమయంలో పోలీసులతో రాజు ఇంటిని సోదాచేయమని అడిగారు. పోలీసులు ససేమిరా అన్నారు. కాలనీ ప్రజలు గుమికూడటం గంట గంటకు పెరుగుతోంది. తమ అసంతృప్తిని బహిరంగపరుస్తున్నారు. అప్పుడు పోలీసులు చెప్పిన మాటలు .. రాజు ఇంటిలో ఒకవేళ బంగారం – వెండి ఉంటే, అవి ఒకవేళ పోతే సమస్య వస్తుంది. తాళం వేసిన ఇంటిలో పాప ఎందుకు ఉంటది అని పోలీసు వాళ్ళ మెదడులలో వచ్చిన అనుమానాలను / ఆలోచనలను కుటుంబ సభ్యుల ముందు, అక్కడ గుమికూడిన జనం ముందు వెలిబుచ్చారు. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు కాబట్టి రాజు ఇంటి తలుపులను పగులగొట్టి లోపలికి పోలేము / పోగూడదు అని పోలీసులు కరాఖండిగా రాత్రి 10 గంటల సమయంలో చెప్పారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేటందుకు ఒక ముగ్గురు వెళ్లారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వారు తిరిగి వస్తారా / రారా అనేది తేల్చుకునేటందుకు  “సమయం” భారంగా నడుస్తుంది. ఈ భారం మధ్యరాత్రి 12 దాటింది. ఒక్కసారి కాలనీ ప్రజలలో అలజడి మొదలయ్యింది. రేకుల సందులో నుండి రాజు ఇంటిలోకి తొంగి – తొంగి చూస్తున్నప్పుడు ఒక మూలలో బట్ట / బొంతలో  చుట్టబడిన ఒక మూట కనిపిస్తుంది. తొంగి – తొంగి చూస్తున్న కాలనీవాసులకు రక్తంతో గుడ్డ తడిసినట్లు, రక్తం కారుతున్నట్లు   కనిపించింది. పాలకొండ రాజు కోసం వెతగుతే కనిపించలేదు. వారందరితో పాటు వెతికిన రాజు అకస్మాత్తుగా కనిపించకుండా పోయిండు. అందరిలో రాజుపై అనుమానం బలపడింది. అంతే తలుపులను నెట్టుకొని ఇంటి లోపలికి కాలనీ వాసులు, పాప కుటుంబ సభ్యులు వెళ్లారు. రేకుల సందులో నుండి చూస్తే కనిపించిన మూటను పరిశీలించగా మూటలో నుండి రక్తం కారుతుంది. విప్పి చూడగా చైత్ర శవం. అస్తవ్యస్తంగా, వికృతంగా నిర్జీవంగా పాప బొంతలో ఉంది. తల్లి – తండ్రులు పాపను పొత్తిళ్ళలో పట్టుకొని ఇంటిలో నుండి బయటకు తెచ్చారు. ఆ తోపులాటలో రేకుల ఇల్లు కుప్పగా కూలింది. ముందే చిన్న రేకుల ఇల్లు. జనం తోపులకు రేకుల ఇల్లు విరిగిపోయింది.

పోలీసులు పాప శవాన్ని అప్పజెప్పమని తల్లి తండ్రులను అడిగారు. కాలనీ వాసులకు, పాప కుటుంబ సభ్యులకు కోపం కట్టలు తెంచుకుంది. సాయంత్రం 6 – 7 గంటల మధ్యనే రాజు పై అనుమానం ఉన్న విషయం చెపితే వినిపించుకోలేదు. పాప మరణానికి పోలీసులే కారణం అని లొల్లి చేసారు. రాజును బహిరంగంగా ఉరి తీయాలని ఒక్కసారి ప్రజల నుండి డిమాండ్. అప్పుడే పాప శవం కాలనీ నుండి కదులుతది అని వార్నింగ్ ఇచ్చారు. ఈ లొల్లి ఉదయం 3 గంటల (10 సెప్టెంబర్ 2021 పొద్దుగాల) వరకు నడిచింది. సుమారు 500 మంది పోలీసులు కాలనీని చుట్టుముట్టారు, జిల్లా కలెక్టర్ ఆ ఉదయపు రాత్రి వచ్చారు. బాధితులకు 10 లక్షల రూపాయలు, ఒక డబుల్ బెడ్ రూమ్, మిగిలిన ఇద్దరు పిల్లలకు ప్రభుత్వమే చదువు చెప్పిస్తుందని, పాప తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం అని ఒక ” ప్రామిస్” చేశారు. అయినా బాధితులు పిల్లను చంపిన రాజు శవం కావాలని డిమాండ్. బాధితులతో జిల్లా కలెక్టర్ మీడియేటింగ్ ఒకవైపు చేస్తున్నారు, పాప శవాన్ని పోలీసులు తీసుకొని పరుగెత్తారు. ఉస్మానియా హాస్పటల్ కు  పాపను తీసుకవెళ్లారు.   పోస్టుమార్టం, పంచనామా చేయించారు. పాపను దారుణంగా అత్యాచారం చేసి చంపినట్లు పోస్ట్ మార్టం జరుపుతున్నప్పుడు డాక్టర్స్ అభిప్రాయం చెప్పారు.

Also read: నడుస్తున్న కథ

నిరసనల వెల్లువ

పోస్టు మార్టం అయిపోయాక పాప మృత దేహాన్ని తల్లి దండ్రులకు అప్పగిస్తూ నిందితుడిని  పట్టుకుంటామనీ, కఠినంగా శిక్షస్తామనీ పోలీసులు, కలెక్టర్ బాధితులకు మరొకసారి హామీ ఇచ్చారు. 10 సెప్టెంబర్ 2021 న సాయంత్రం పాపను సొంత ఊరికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలను పాప కుటుంబ సభ్యులు, బంధువులు, సామాజిక కార్యకర్తలు ముగించారు. పాపపై జరిగిన ఈ దారుణ సంఘటన పై  టీవీలలో, సోషల్ మీడియాలో  పెద్దఎత్తున నిరసనల ప్రచారం అయ్యింది. చైత్ర అత్యాచారం హత్య విషయం తెలిసి పౌర సమాజం, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్షాలు, అన్ని వర్గాల నుండి వ్యతిరేకత ప్రభుత్వంపై వచ్చింది.

సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారు. క్రైమ్ నంబర్ 344/2021 గా నమోదు చేసారు. ఐటీ శాఖ మంత్రి గారు 12 సెప్టెంబర్ 2021 నాడు నిందితుడు దొరికినట్లు ట్విట్టర్ వేదికగా ప్రజలకు తెలిపారు. రెండు గంటలలో నిందితుడిని పట్టుకున్న నైపుణ్యం గురించి తెరాస రాష్ట్ర హోమ్ మినిస్టర్ నూ, డీజీపీ తెలంగాణ గారిని కొనియాడుతూ బాధితులకు న్యాయం జరుగుతుంది అన్నారు. లేబర్ &  ఎంప్లాయిమెంట్ శాఖా మంత్రి గారైన మల్లా రెడ్డి గారు నిందితుడు దొరుకుతే ఎన్కౌంటర్ చేస్తాం అని ప్రజలకు, బాధితులకు వివరించారు. ప్రతిపక్ష పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి గారు నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పౌర సమాజం నుండి ఒకవర్గం ప్రజలు, బాధితులు, కొందరు సామాజిక కార్యకర్తలు కూడా నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్లతో ధర్నాలు, రాస్తా రోకోలు జరిపారు. టెలివిజన్ చానల్స్, వెబ్ చానల్స్ , ఎన్కౌంటర్ చేయాలా వద్దా ? చేస్తారా ? అని చర్చలు కూడా పెట్టారు. మినిష్టర్ మల్లారెడ్డి గారు చెపుతున్న ఎన్కౌంటర్, టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి గారి ఎన్కౌంటర్ డిమాండ్ పై కూడా చర్చ పెట్టారు. మొత్తంమీద 09 సెప్టెంబర్ 2021 నుండి 16సెప్టెంబర్ 2021 వరకూ వారం రోజులలో రాష్ట్రం కుతకుత ఉడికింది. అందులో హైదరాబాద్ ప్రజల మానసిక పరిస్థితి మరింత వ్యథాభరితమైంది. ఆగ్రహంతో, ఆవేదనతో, ఆందోళనతో వారు ఊగిపోతున్నారు.

కేటీఆర్ తొందరపాటు ట్వీట్

14 సెప్టెంబర్ 2021 నాడు ట్విట్టర్ వేదికగా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు.   నిందుతుడిని పోలీసులు పట్టుకున్నట్లు 12 సెప్టెంబర్ 2021 న ఇచ్చిన సమాచారం “తప్పుడు సమాచారం” గా విన్నవించారు.  పోలీసులు ఇంకా వెతుకుతున్నట్లు మరొక ట్వీట్ చేసారు. 14 సెప్టెంబర్ 2021 నాడు హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిందితుడు రాజును పట్టించిన వారికి పదిలక్షల రూపాయల బహుమతి ప్రకటించారు. ఆ బహుమతిని దక్కించుకునేటందుకు కొందరు వారి ప్రయత్నాలు వారు చేసారు. ఆ ప్రయత్నంలో భాగంగా సుమారుగా 5000 ఫోన్ కాల్స్ పోలీసులకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 15 సెప్టెంబర్ 2021 న హోంమినిస్టర్ ఆధ్వర్యంలో డీజీపీ తదితర పోలీసులతో “చైత్ర” సంఘటనపై సమీక్షా సమావేశం జరిగింది.

16 సెప్టెంబర్ 2021 నాడు ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీజీపీ మహేదర్ రెడ్డి “అటెన్షన్ ప్లీజ్:  సింగరేణి కాలనీకి చెందిన “బాలికపై లైంగిక వేధింపు మరియు హత్య” చేసిన నిందుతుడు స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్‌  స్టేషన్ పరిధిలోని రైల్వె ట్రాక్ పై శవమై కనిపించాడు. మరణించిన వ్యక్తి ఆనవాళ్లు శరీరంపై ఉన్న పుట్టుమచ్చలతో ధృవీకరించినామని ప్రకటించారు. కేటీఆర్ కూడా  ట్విట్టర్ వేదికగా .. ” చిన్నారిపై అత్యాచారం చేసిన మృగం స్టేషన్ ఘనపూర్ రైల్వె ట్రాక్ పై చనిపోయి కనిపించారని తెలంగాణ డీజీపీ గారు ఇప్పుడే తెలియచేశారు’’ అని ప్రజలకు తెలిపారు. ఈ “చావు” గురించి పౌర సమాజంలో కొందరికి ఆనందం కలిగించి ఉండవచ్చు . మరికొందరికి భయం వేసి ఉండవచ్చు. ఇంకా కొందరికి ఆశ్చర్యం కూడా కలిగి ఉండవచ్చు. రాజు నిజంగానే చనిపోయాడా? లేక కథ అల్లుతున్నారా అని బాధితులు భావించినట్లు మీడియా ధ్వార తెలిసింది .

16 సెప్టెంబర్ 2021 నాడు హోమ్ మినిష్టర్ మహమూద్ అలీ, గిరిజన స్త్రీ – శిశు  సంక్షేమ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ చైత్ర కుటుంబీకులను కలిసి పరామర్శించారు. వారికి రూ. 20 లక్షల రూపాయల చెక్ అందించారు. డబుల్ బెడ్ రూమ్ ను ఆ కుటుంబానికి అందిస్తున్నట్లు ప్రకటించారు. బాధితులు రాజు శవాన్ని ఒక్కసారి చూపించమని ఇద్దరు మినిస్టర్లను అడిగారు. మంత్రులిద్దరూ ఏమి సమాధానం చెప్పలేకపోయారు. అయితే హోంమినిస్టర్ బాధితులకు చెప్పిన విషయం ” రాష్ట్ర ముఖ్యమంత్రి” గారు మీకు జరిగిన దారుణం పట్ల చాల  సీరియస్ గా ఉన్నారని చెప్పినట్లు తెలిసింది.

పౌరహక్కుల ప్రజాసంఘం దర్యాప్తు

పాలకొండ రాజు ఆత్మహత్య వల్ల చైత్రకు, చైత్ర కుటుంబానికి న్యాయం జరిగినట్లా? చట్టం అమలు అయినట్లా? న్యాయస్థానం పాలకొండ రాజును  నిందితుడుగా గుర్తించినట్లా?

14 సెప్టెంబర్ 2021, 16 సెప్టెంబర్ 2021 మధ్య కాలంలో పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు జయ వింధ్యాల, ఇక్బాల్ ఖాన్, యాఖుబ్, ఉమర్, ఉస్మాన్ లు,  లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు బాలాజీ నాయక్, సిటిజన్స్ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు రామ్ చల్ల  కలిసి సింగరేణి కాలనీలో జరిగిన సంఘటనపై క్షేత్రవాస్తవికతను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా  చైత్ర కుటుంబీకులను, నిందితుడు పాలకొండ రాజు ఇంటి కి వెళ్లి అక్కడున్నవారిని కలుసుకొని మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.

సింగరేణి కాలనీ 52 ఎకరాల 20 గుంటల  విస్తీర్ణంలో ఉంది. అక్కడ  కనీసం మూడు  లక్షల ఓటర్లు ఉన్నారు. పాషా ఖాద్రి  ఎంఎల్ ఏగా  ఎంఐఎం పార్టీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ పార్టీ కి చెందిన మధుకర్ రెడ్డి భార్య సైదాబాద్ కార్పొరేటర్ గా సింగరేణి కాలనీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కాలనీలో అన్నిరకాల మత్తు పదార్థాలు దొరుకుతాయి. స్త్రీలు తమ శరీరాలకు వెలకట్టి అమ్ముకుంటారు. ఇక్కడ నివసించే ప్రజల మెజారిటీ బ్రతుకుతెరువు ఇదే. హైదరాబాద్ సౌత్ జోన్ పూర్తిగా, వెస్ట్ జోన్ లలోని కొన్ని భాగాలలో “వైట్నెర్” పీల్చే పిల్లలు కోకొల్లలు. ఈ పిల్లలతో కొంతమంది లాభసాటి వ్యాపారాలు కూడా చేపిస్తున్నట్లు చాలా సందర్భాలలో పట్టుబడిన బాలకార్మికుల ద్వారా బయటపడింది. ఇదే పరిస్థితి ఈ కాలనీ టీనేజీ పిల్లలు “వైట్నెర్” తో పాటు గంజాయికి బానిసలైనారు. సింగరేణి కాలనీ మొత్తం “వలస కార్మికుల”తో, వారి కుటుంబాలతో నిండివున్నది.

Also read: ఆ ఆరుగురు …..

మురికి కూపం సింగరేణి కాలరీస్

సింగరేణి కాలనీ అంటే ప్రభుత్వం కట్టించిన రాజీవ్ గృహకల్పలో జీవిస్తున్న ప్రజలు ఒక్కరే లేరు అక్కడ. రాజీవ్ గృహకల్పతో పాటు ఆనుకొని రేకులతో చిన్న చిన్న ఇళ్ల నిర్మాణం, వీటిని ఆనుకొని బహుళ అంతస్థుల ఇళ్ళు ఉన్నాయి. రాజీవ్ గృహకల్ప ఇళ్లల్లో చుట్టూరా, రేకుల ఇళ్ల చుట్టూరా భయంకరమైన చెత్త, డ్రైనేజి లీకై ఓపెన్ గా ప్రవహిస్తూ పోతున్న కంపు నీళ్లతో ఒక కుళ్లిపోయిన వ్యవస్థ అక్కడ ఉంది. ఈ సమాజం మనుషుల రక్తమాంసాలతో వ్యాపారం చేసుకునే ఒక “వేదిక”గా కనిపిస్తూ ఉంది. 24 గంటలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అందుబాటులో ఉన్నట్లు ఉంది ఇక్కడి ప్రజల జీవనపరిస్థితి. అస్తవ్యస్తమైన జీవన విధానం. ఈ పరిస్థితులకు “ప్రభుత్వాన్ని లేదా పరిస్థితులను” తప్పుపట్టలేము. పేద – నిరుపేద – బీదల జీవితాలు మోస్తున్న ‘కర్మ సిద్ధాంతం – సాంప్రదాయాలు – కట్టుబాట్లు’ మూలం అయితే, వీటిని సరిచేసేటందుకు ఏర్పరచిన “భారత రాజ్యాంగం – చట్టాలు” అమలు జరగక పోవటం ప్రధాన సమస్య. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిని గాని, కార్పొరేటర్ గాని కనీసం వారి వారి మత ధర్మ శాస్త్రాల ప్రకారం అయినా వారు “విధులను” నిర్వర్తించక పోవటం వారు చేస్తున్న పెద్ద నేరం. ఈ విషయం వారికి గుర్తు చేయలేము, ప్రశ్నించలేము. గుర్తు చేసినా, ప్రశ్నించినా “పొలిటికల్ ఇగో”లు ఆధిపత్యం చేస్తాయి.

పాలకొండ రాజు కిరాణ షాప్ కు చైత్రను తీసుకొని వెళ్ళాడు. మూడు గంటల సమయంలో రాజు  చైత్ర గురించి చైత్ర నాయనమ్మతో  వాకబు చేసాడు. అందరితో కలిసి పాప గురించి వెతికిన రాజు అకస్మాత్తుగా కనిపించకుండా పోవటం పాలకొండ రాజు  పై చైత్ర కుటుంబ సభ్యులకు  అనుమానం కలిగింది…. పాలకొండ రాజు లైంగిక ఆనందం కోసం 6 ఏళ్ళ చిన్నారి పై అంత దారుణానికి పాలుపడుతాడా? అని ఒక సరికొత్త “అభిప్రాయం – ఆలోచన” కొందరిలో వచ్చింది … లైంగిక ఆనందం అంటే బలవంతంగా భార్యలను కొట్టి భర్తలు “లైంగిక ఆనందం” అనుభవిస్తున్నట్లు. గృహ హింస చట్టం ఇందులో భాగంగా వచ్చిందే. లైంగిక ఆనందం అనేది ఇద్దరి వ్యక్తుల పరస్పర సహకారం జరగాలి అంటారు. లైంగిక దాడులలోనే లైంగిక ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. అత్యాచారాలకు, హత్యలకు పాలుపడుతున్నారు. పరిస్థితుల ప్రభావం అని సర్దుక పోయే “మైండ్ సెట్” ను మార్చక పోతే ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు “ట్విట్టర్ వేదికల”తోనే అభివృద్ధి జరిగిపోయింది అని ప్రచారం చేసుకుంటారు.

ఇది మానసిక రోగమా?

కొందరు కుటుంబ సభ్యులు, కొందరు బంధువులు, కొందరు తెలిసిన వాళ్ళు, నేరప్రవృత్తి ని కలిగివున్నవాళ్ళు .. చివరికి “పీడోఫిలియా” తో బాధపడుతున్న వారు చిన్న పిల్లలపై, ఆడవాళ్ళపై లైంగిక దాడులు చేస్తున్నారు అని  ప్రభుత్వ విశ్లేషణల నివేదికలు చెపుతున్నాయి. కాబట్టి  చైత్ర కు పాలకొండ రాజు తెలుసు.  చైత్ర కుటుంబ సభ్యులకు పాలకొండ రాజు తెలుసు. కాబట్టి పాలకొండ రాజు సులభంగా చైత్రను మచ్చిక చేసుకొని ఉంటాడు. అదే చనువుతో రాజు వెంట చైత్ర వెళుతున్నప్పటికిని ఆ సమయంలో ఎవరూ రాజును అనుమానించలేదు. చైత్ర కూడా నిర్భయంగా రాజు వెంట వెళ్లి ఉంటది. అస్తవ్యస్తంగా ఉన్న సింగరేణి కాలనీలో చిన్న పిల్లలు వారికీ తెలియకుండానే “లైంగిక దాడుల” కు గురౌతున్నట్లు ఉంది. తల్లి తండ్రులు, బంధువులు జీవనోపాధి పరుగులో అలసిపోతున్నారు. చాలా కుటుంబాలకు చట్ట వ్యతిరేక వ్యాపారాలే జీవనాధారం. ఈ ‘వ్యాపారాలు’  పోలీసుల కనుసైగలలోనే  సాగుతాయి అని బహిరంగ రహస్యం. పాలకొండ రాజు ఆటో డ్రైవర్, దొంగతనాలు కూడా చేస్తాడని ప్రసిద్ధి. గంజాయి సరఫరా చేస్తాడు. మాదక ద్రవ్యాలను సేవించటం నిత్యకృత్యం. డబ్బులు ఉన్నా, లేకున్నా సింగరేణి కాలనీ వాసులకు (కొందరికి)  మత్తు పదార్థాలు అందుతాయి. పరిస్థితుల ప్రభావం అక్కడి యువతీయువకులపై, చిన్న పిల్లల పై బాగా ఉంది అని సరిపెడుదామా? పరిస్థితుల ప్రభావంపై ఓ సినిమా తీసేద్దామా? అందుకేనా సినిమా హీరోలు సింగరేణి కాలనీకి వచ్చి వెళ్ళింది? సమాజంలో ఉన్న కుళ్ళును చూపించేటందుకు సినిమాలు అవసరం లేదు. దాని మూలాలకు కారకులు ఎవరు, ఎలా నివారించాలి అనే దానిపై సినిమా వాళ్ళు యుద్ధం ప్రకటించాలి. ఇంకా చేతనైతే హీరో వేషాలు వేసే వారు ఒక్కొక్కరు  100 కుటుంబాలను దత్తత తీసుకొని వారి బ్రతుకులు ఆగం కాకుండా చూసే బాధ్యత తీసుకోవాలి.

ఎన్ కౌంటర్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్

ప్రతిపక్ష పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరే, నిందితుడు దొరుకుతే ఎన్కౌంటర్ చేస్తాం అని లేబర్ &  ఎంప్లాయిమెంట్ శాఖా మంత్రి గారైన మల్లా రెడ్డి గారు వివరించారు. ఎన్కౌంటర్ ఎప్పుడు ఎందుకు చేస్తారనే కనీసపు జ్ఞానం లేకుండా ఈ ఇద్దరు ఎలా ” ఎన్కౌంటర్ చేయాలి – చేస్తాం ” అని ప్రకటనలు చేస్తారు? కొందరు పౌర సమాజపు ప్రజలు కూడా ఎన్కౌంటర్ చేస్తేనే ‘ పాపకు ‘ న్యాయం జరిగినట్లు అని ధర్నాలు చేశారు. కొందరు సామాజిక కార్యకర్తలు కూడా ” వి వాంట్ ఎన్కౌంటర్ – వి వాంట్ జస్టిస్ ” అని ప్లకార్డులను ప్రదర్శించారు.ఈ రకమైన బుద్ధి ప్రతిపక్ష పార్టీ అధినాయకుడికి కలగటం, దాన్ని డిమాండ్ రూపంలో పెట్టటం .. అధికారంలో ఉన్న మంత్రి తప్పక ఎన్కౌంటర్ చేస్తామని వాగ్దానం చేయటాన్ని విశ్లేషిస్తే .. ఎన్నికలలో గెలిచేటందుకు “రాజ్యాంగాన్నీ, చట్టాలనూ వినియోగం చేస్తున్న ప్రజా ప్రతినిధులు, ప్రజల సమస్యల పరిష్కారానికి వచ్చేసరికి అదే రాజ్యాంగాన్నీ, చట్టాలనూ ఎలా విస్మరిస్తున్నారు? ఎలా వాటిని ఉల్లంఘిస్తున్నారు? చైత్ర కుటుంబానికి అన్యాయం జరిగింది. ఆ బాధితులకు ఎలా న్యాయం  “రాజ్యాంగం – చట్టం” పరిధిలో చేస్తారో వివరించాలి. నిందితులను “రాజ్యాంగం – చట్టం” పరిధిలో ఎలా శిక్షిస్తారో బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా చెప్పి బాధిత కుటుంబాలను ఓదార్చాలి. ఇది మరచి పోయి సోయి తప్పిన వాళ్ళుగా, చిత్తుగా తాగిన వాళ్ళ మాదిరి ఊగిపోయి అట్లా ఎట్లా ప్రకటనలు చేస్తారు? మీ ప్రకటనలు  చైత్ర కుటుంబానికి   “రాజ్యాంగం – చట్టం” పరిధిలో న్యాయం జరగకుండా చేశాయనీ, న్యాయాన్ని మీరే అడ్డుకున్నారని ఎందుకు అనకూడదు? పాలకొండ రాజు “ఆత్మహత్య”కు ప్రేరేపించినా వారు మీరె అని ఎందుకు భావించకూడదు?

ఎన్కౌంటర్, హత్య, ఉరిశిక్ష ఇవి ఏ సమాజం జాడలను చూపిస్తాయి? “చట్టంలో ఉన్న ఉరిశిక్ష”ను రద్దు చేయాలనీ చిరకాలం నుండి ఒక డిమాండ్ మన సమాజంలో ఉన్నది. బాధితులకు న్యాయం జరగాలి అని  “మర్డర్ – ఎన్కౌంటర్” కావాలి అని ఎందుకు ప్రజా ప్రతినిధులు అడుగుతున్నారు? వీరిని పౌర సమాజం నుండి కొందరు ప్రతినిధులుగా అనుసరిస్తున్నారు. ఎందుకు? రాజ్యాంగం పై నమ్మకం లేకనా? చట్టాలపై నమ్మకం లేకనా? త్వరితగతిన బాధితులకు న్యాయం అందించలేని అశక్తత కారణంగానా? మీలో రాజకీయ పరిష్కార  సంకల్పం లేక పోవటం చేత బాధితులకు త్వరిత గతిన న్యాయం సాధించ లేక పోవటం కాదా? ప్రజలు సామాజిక రుగ్మతలకు అలవాటవుతున్నారు అంటే దానికి మీరు బాధ్యులు కారా? ప్రజాప్రతినిధులుగా మీరు ఎన్నుకోబడిన తరువాత “రాజ్యాంగాన్ని, చట్టాంలనూ” ప్రజలకు ఎందుకు అందించలేక పోతున్నారు? ప్రజలను “పరిస్థితులకు – కర్మకు – మతానికి – కులానికి ” ఎందుకు వదిలేస్తున్నారు? మీరు ప్రజలను ఇంకా ఆటవిక సమాజంలోకి ఎందుకు నెడుతున్నారు?  చైత్ర ఘటనలో, పాలకొండ రాజు ఆత్మహత్య సంఘటనలో మిమ్మల్ని ఎందుకు “విచారించకూడదు?

పరస్పరవిరుద్ధమైన ప్రకటనలు

14 సెప్టెంబర్ 2021 నాడు కేటీఆర్ నిందుతుడిని పోలీసులు పట్టుకున్నట్లు 12-09-2021 న ఇచ్చిన సమాచారం “తప్పుడు సమాచారం” గా ప్రకటించారు. ఇంకా వెతుకుతున్నట్లు మరొక ట్వీట్ చేశారు. 14 సెప్టెంబర్ 2021 నాడే నిందుతుడు రాజును పట్టించిన వారికి పదిలక్షల రూపాయల బహుమతి ఇస్తామని హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రకటించారు. తేది: 15-09-2021 న హోంమినిస్టర్ ఆధ్వర్యంలో డీజీపీ తదితర పోలీసులతో “చైత్ర” సంఘటనపై సమీక్షా సమావేశం చేసారు. తెలంగాణ డీజీపీ గారు “బాలికపై లైంగిక వేధింపు మరియు హత్య” చేసిన నిందుతుడు స్టేషన్‌ ఘన్‌పూర్  పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైల్వె ట్రాక్ పై శవమై కనిపించాడని ప్రకటించారు. కేటీఆర్ కూడా  ” చిన్నారిపై అత్యాచారం చేసిన మృగం స్టేషన్ ఘనపూర్ రైల్వె ట్రాక్ పై చనిపోయి కనిపించారని తెలంగాణ డీజీపీ గారు ఇప్పుడే తెలియజేశారని ప్రకటించారు. చైత్ర సంఘటన జరిగింది 09 సెప్టెంబర్ 2021 సాయంత్రం 5 గంటల సమయంలో. మధ్యరాత్రి 12 గంటలకు పాలకొండ రాజు ఇంటిలో పాప శవం దొరికాక పాలకొండ రాజునే నిందితుడు అని రూఢి అయ్యింది. 12 సెప్టెంబర్ 2021 నాడు నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే మూడవ రోజు రాజు అనే నిందితుడు దొరికాడు. కానీ రాజు పట్టుకోబడినాడని 12 సెప్టెంబర్ 2021 నాడు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం “తప్పుడు సమాచారం” గా 14 సెప్టెంబర్ 2021 నాడు ప్రభుత్వం ప్రకటించింది. క్షంతవ్యులం అని ఆ ప్రకటన కోరింది. పోలీసులు రాజును  పట్టుకోలేక పోవుటకు ఇచ్చిన వివరణ “రాజు సెల్ ఫోన్ వాడటం లేదని, గాంజా సేవించేవారు స్థిరంగా ఒక దగ్గర ఉండరు” కాబట్టి ప్రక్రియ ఆలస్యం అవుతుందని ప్రకటించుకున్నారు. వీరందరి ప్రకటనలలో ఎవరిదైనా “బాధ్యతతో కూడిన సమాచారం బాధితులకు అందిస్తున్నట్లు”  ఉన్నదా? వీరి బాధ్యతలేని సమాచారం …  చైత్రకు – చైత్ర కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని భరోసా కలిగిస్తుందా? పాలకొండ రాజు చేసిన “కిరాతకమైన ఘాతుకాన్ని” చట్టం పరిధిలో విచారించి న్యాయం జరిపించగలరు మన పోలీసులు అని బాధితులకు నమ్మకం కలిగిస్తుందా? మీరందరి బాధ్యతలేని సమాచారంతో, బాధ్యతలేని ప్రకటనలతో  పౌర సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? మీరు రాజ్యాంగాన్నీ, చట్టాలనూ అతిక్రమిస్తున్నట్లు కాదా? ముఖ్యమైన ఈ కేసులో మిమ్మల్ని ఎందుకు విచారించకూడదు? ఈ అసంబద్ధ సమాచారాన్ని ప్రకటించటం పై  మీలో నేరపూరిత ఆలోచనలు ఉన్నాయని ఎందుకు భావించకూడదు?

ఎన్కౌంటర్ చేయటం, చేయాలని అడగటం, అందుకు ఒత్తిడి తేవడం… ఇవన్నీ ప్రభుత్వ పనివిధానాన్ని చూపిస్తాయి. ప్రభుత్వం యొక్క ఓటమిని చూపిస్తాయి. ఎప్పుడైతే ప్రజల పట్ల బాధ్యతలేకుండా ప్రభుత్వ అధికారి ఉన్నా, ప్రజా ప్రతినిధి ఉన్నా వారి “జవాబుదారి” తనంను ఎత్తిచూపుతుంది.  రాజ్యాంగం – చట్టం “మీ విశ్వాసం”ను అనుమానిస్తుంది. కాబట్టి సింగరేణి కాలనీ అస్తవ్యస్త బ్రతుకులకు మీరు బాధ్యులు కారా? రాజ్యాంగం కలిపిస్తున్న అధికరణ 21 ను నలిపివేయటం కాదా ?  మీరు “జవాబుదారీ తనం’ (Accountability) పరిధిలోకి మీరు రారా?

చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగినట్టేనా?

ఆత్మరక్షణ కోసం చంపే హక్కు 100 ఐపిసి సెక్షన్ ప్రకారం అందరికీ వర్తిస్తుంది ఒక్క పోలీసులకే కాదు.  ఎదురు కాల్పులలో జరిగే “హత్య” ఎన్కౌంటర్ అంటారు. సెక్షన్ 100 ఐపీసీ కింద  పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు కోర్టుకు విన్నవిస్తారు. కోల్డ్ మర్డర్ చేయకూడదు. చంపే హక్కు మరొక సందర్భంలో కూడా ఉన్నది. దాన్ని “షూట్ ఎట్ సైట్” (కనిపిస్తే కాల్చివేత) అనేది. దీనికి పూర్తి బాధ్యత “ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్” విచక్షణ పై ఆధారపడి ఉంటది. ప్రత్యేకమైన చట్టం అంటూ ఏమీ లేదు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ యొక్క ఆదేశాలు కలిగివున్న అధికారి మాత్రమే దీన్ని అమలు చేయగలరు. ఎలాంటి సందర్భాల్లో అనగా  చాలా కాలంగా “ప్రమాదకరమైన వ్యక్తి తప్పించుక తిరుగుతున్నప్పుడు, ప్రమాదకరమైన వ్యక్తి పోలీసుల నుండి తప్పించుక పోయినపుడు” మాత్రమే షూట్ ఎట్ సైట్ ఆదేశాలను అమలు చేయవచ్చు. ఎవరిని పడితే వారిని చంపే అధికారం మన చట్టాలలో, మన రాజ్యాంగంలో చెప్పబడలేదు.

చైత్ర కు – చైత్ర కుటుంబానికి న్యాయం చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు – ప్రజా ప్రతినిధులు ఇద్దరు “నెక్సస్”గా (దుష్టకూటమి) ఏర్పడ్డారు. ఒక నేరానికి చెందిన బాధితులకు మరో నేరంతో సరిపుచ్చటం న్యాయం చేసినట్లా? ఆత్మహత్య చేసుకోవటం 309 ఐపీసీ కింద నేరం.  రాజు ఆత్మహత్య తో ఆరేళ్ల అమ్మాయి తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని అనవచ్చా? దీన్ని మన రాజ్యాంగం – మన చట్టాలు ఒప్పుకుంటాయా? మన నాగరిక సమాజం – మన పౌర సమాజం  ఇలాంటి హత్యలతో  పసిపిల్లలపై – మహిళలపై లైంగిక దాడులు ఇక ఉండవు అనుకోవాలా?  దీనికి ప్రభుత్వం జవాబుదారీనా? లేక పౌర సమాజమా?   ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ? జవాబుదారీ తనం ఎవరు తీసుకోవాలి?

చైత్రకు న్యాయం అంటే .. ఒక ఆత్మహత్య, 20 లక్షల రూపాయల చెక్, ఒక డబుల్ బెడ్ రూమ్. అంతేనా?

Also read: ఆనందం … ?

(జయ వింధ్యాల, అడ్వకేట్  & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ స్టేట్ # మలక్పేట్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. @ 9440430263)

Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles