Thursday, March 28, 2024

భ గ్న మా లి క

అబ్బుూరి రామకృష్ణారావు, మాత్యూ అర్నాల్డ్

పూవులు పూయరాక తమ పొత్తుల లోనె కృశించి కమ్మనౌ

తావులు వీడి రాలిపడె

తామరతంపర యయ్యె దుఃఖమీ

జీవన సాగరంబు దరి జేర్పగ జాలెడు నావికు డెవ్వడో యెఱుగునా

యతడీ హతభాగి వేదనన్

ఈ యతిలోక మోహన మహీ తలమందున తోడులేక పా

థేయము లేక సిగ్గిలి మదీయ మనోహర భావపల్లవ చ్ఛాయలలోన వ్యర్థపు విచారముతో ననవాప్త కామ్యముల్

రోయుచు భగ్న మాలికలు

ప్రోవులు సేయుచు సంచరించితిన్

నేనే కాదు సమస్త భూతతతియున్ నిర్వేద భారమ్ముచే

నానా భంగుల లాలనీయ గతులన్ నా గీతమే పాడు లో

కానీకమ్ముల లోన లోన నొక హాహాకార ముద్భూతమై

శ్రీనారాయణ పాద నీరజ రజాశ్లేషమ్ము కాంక్షించెడిన్

అబ్బూరి రామకృష్ఢరావు

1933

ఈ కవియే కాదు, లోకంలోని మానవులందరూ తామరతంపరయైన దుఃఖంతో కృశించే వారే.  హతభాగ్యులైన తమను గుర్తించి,  జీవన సాగరాన్ని దాటించే నావికుని కోసం ఎదురు తెన్నులు చూస్తున్న వారే.

Also read: నా గు ల చ వి తి

అతిలోక మోహనంగా కనపడే మహీతలమిది.  కానీ, ఇదే మహీతలంపైనే తోడు లేక, మనోహర భావ తరుచ్ఛాయల్లో విహరించే అభాగ్యులు కొందరు. వ్యర్థపు విచారంతో, అనవాప్త కామ్యములు రోసే వారు ఇంకొందరు,  భగ్నమాలికలు ప్రోగు చేస్తూ జీవించే నిరాశోపహతులు మరికొందరు.

ఏ నితాంత నిర్వేద భారంతో ఈ కవి తన హృదయ వేదనా రవాన్ని వినిపిస్తున్నాడో, అదే  నితాంత వేదనా రవాన్నే, భిన్న భిన్న భంగులతో, నానా లాలనీయ గతులతో, గీతమాలికలుగా కూర్చి, సమస్త మానవకోటి కూడా ఆలపిస్తున్నది.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – పరీక్షిత్తు దుర్మరణం చెందడానికి నేపధ్యం

ఈ గీతాలన్నీ ఏకమై  దశదిశలా మారుమ్రోగుతున్న వేళ, ఏదో హాహాకారం, అభాగ్య మానవుల హృదయకుహరాల్లో జనించి, విశ్వమంతా వ్యాపించి, శ్రీనారాయణ పాద నీరజ రజాశ్లేషాన్ని సదా కోరుకుంటుంది.

“అతిలోక మోహనంగా, సుందర స్వప్నతీరంగా, నిత్యనూతనంగా భ్రమింపజేసే ప్రపంచమిది.  కానీ ఈ ప్రపంచంలో ఆనందం లేదు,  ప్రేమ లేదు, కాంతికిరణ సమూహం లేదు, నిశ్చింతలేదు, శాంతి లేదు, ఒకరికొకరు కష్టంలో తోడు రావడం లేదు,   కష్టసమయంలో,  మహాధ్వాంత మధ్యంలో, అన్నెం పున్నెం ఎరుగని సైన్యాల యుద్ధఘోషతో, నిరాశామయమైన  లోకమిది”, అంటాడు మాత్యూ ఆర్నాల్డ్, తన కవితా ఖండిక “డోవర్ బీచ్” లో:

“Ah love! let it  be true to one another

For the world which seems to lie before us

Like a land of dreams, so various, so beautiful, so new,

Hath really neither joy, nor love, nor light, nor certitude, nor peace, nor help for pain,

And we are here as on a darkling plain,

Swept with confused alarms of struggle and flight,

Where ignorant armies clash by night”

సంప్రదాయ నేపథ్యం నుండి వచ్చిన అబ్బూరి వారి  విద్యాభ్యాసం చాలభాగం మైసూరు సంస్కృత కళాశాలలో సాగింది. కానీ ప్రగతిశీల మార్క్సిస్ట్ సిద్ధాంతాలే రానురాను  అబ్బూరి వారిని ఆకట్టుకొన్నవి. తర్వాతి కాలంలో ఎమ్ ఎన్ రాయ్ “రాడికల్ హ్యూమనిజం” ఆయనను ఉత్తేజితం చేసింది.

Also read: మహాభారతం – ఆదిపర్వం: ద్వితీయాశ్వాసం – వాసుకి తల్లి శాపానికి వెరచుట

అబ్బూరి వారి నేటి కవిత నిరాశోపహతులైన మానవుల తరుఫున నిలబడి “శ్రీనారాయణ పాదనీరజ రజాశ్లేషాన్ని” వాంఛింపడం విశేషం.  మాత్యూ ఆర్నాల్డ్ సైతం “డోవర్ బీచ్” కవితలో దగా పడిన ప్రపంచాన్నే ప్రస్తావిస్తున్నాడు. కానీ ఆర్నాల్డ్ దృష్టిలో నేటి ప్రపంచానికి విముక్తి లేదు, సాంత్వన అసలే లేదు. విజ్ఞానశాస్త్రం రానురాను యావత్ లోకాన్నీ ప్రభావితం చేస్తున్న నవీనయుగంలో మానవవిలువలు అడుగంటుతున్నాయని ఆయన “డోవర్ బీచ్” కవితలో వాపోతున్నాడు.

Glimpses of World History by Jawaharlal Nehru
నెహ్రూ రాసిన గిప్లెస్ ఆఫ్ వరల్డ్ హస్టరీ

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రసిద్ధరచనల్లో గ్లింప్సెస్ ఆఫ్ వర్ల్డ్ హిస్టరీ ఒకటి. 1930-30 కాలంలో జైలుగోడల మధ్య జీవిస్తూ తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి చరిత్ర పాఠాలు చెప్పే 176 లేఖల సముదాయమే వేయిపేజీల ఈ బృహత్ గ్రంధం. జైల్లో ఎటువంటి రెఫరెన్స్ పుస్తకాలూ లేకుండా రచించిన ఈ లేఖాసంచయం ప్రముఖ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయిన్ బీ “ప్రపంచ చరిత్ర” తో తులతూగుతుంది. ఒక ప్రసిద్ధ పాశ్చాత్య రచయిత ఈ గ్రంధాన్ని “a liberal university education” అని పేర్కొన్నాడు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం

ఈ లేఖలకు అనుబంధంగా నెహ్రూజీ తన కూతురుకి చిట్టచివర వ్రాసిన లేఖ ఒకటి వున్నది. ఆణిముత్యం వంటి ఈ లేఖను హింద్ కితాబ్ వారు ప్రచురించిన “India Wins Freedom”  అనే సంకలనంలో చదివినాను.

ఇందిరకు వ్రాసిన ఆ చివరిలేఖలో నెహ్రూజీ మాత్యూ ఆర్నాల్డ్ రచించిన పై కవితను కోట్ చేస్తాడు. డోవర్ బీచ్ కవిత లోని నిరాశావాదం ప్రగతిశీల ప్రపంచానికి తగదని, “మంచి గతమున కొంచమే”నని ఆయన తన తనయకు బోధిస్తాడు. ఈ లేఖ విశ్వకవి రచించిన “Where the mind is without fear” కవితతో సమాప్తి చెందుతుంది.

మంది కృతమహాయుగం

ముందున్నది ముందున్నది

ముందున్నది మనదే

మనదే మనదే

మంది కృతమహాయుగం”

హేమలసత్ ధూమలసత్

చేతనులం నూతనులం

మనకేమిక మనదేయిక

మంది కృతమహాయుగం”

అన్నది కృష్ణశాస్త్రి గారి ఆశావాదం. “If winter comes, can spring be far behind” అని ఎలుగెత్తుతాడు షెల్లీ.

“తమామ్ షుద్”

Also read: నీ పదములు

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles