Friday, September 20, 2024

గానగంధర్వుడు, కారణజన్ముడు

శరత్ చంద్ర వేముగంటి

అది ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసం. మొట్టమొదటిగా అప్పుడే పుట్టి యావత్తు మానవ జాతిని అతలాకుతలంచేయబోయే ఒక జీవికానటువంటి సూక్ష్మజీవి పేరు కరోనా అని విన్నాం. అప్పటినుంచి మొన్నటి రోజు దాకా ఆ మహమ్మారి మానవ జాతిని చిదిమి చిత్తు చేస్తున్న వైనాన్ని కళ్లారా చూస్తూన్నాం. ఈ కరోనా  కలిగించిన కన్నీటి గాధలు కోకొల్లలు . అందరిలాగే నేను కూడా, తోటి  మనుషులకు కలిగిన కష్టాన్ని, నష్టాన్ని చూసి బాధ పడ్డాను. కానీ నిన్నటి రోజు, కరోనా జబ్బు కలిగించే నష్ట తీవ్రతను అనుభవించాను. కొన్ని కోట్ల మంది భారతీయుల మీద ,ముఖ్యంగా తెలుగు మాట్లాడే తెలుగు రాష్ట్రాల ప్రజల మీద, తమిళ ప్రజలమీద, మాతృభూమికి, మాతృమూర్తికి, మాతృ భాషకు దూరంగా విదేశాలలో ఉంటున్న నాలాంటి లక్షలాది మంది మీద , ప్రత్యక్షంగా కరోనా అనే పిడుగు పడింది. గాన గంధర్వుడు, అద్భుత గాయకుడు, గానం అనే కళకే వన్నె తెచ్చిన మహామనీషి  శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అదే మహమ్మారి చేతికి చిక్కి ప్రాణాలు వదిలాడనే వినకూడని వార్తను బాధాతప్తహృదయాలతో  వినవలిసి వచ్చింది.

మహానుభావులకు మరణం లేదు

ఒక రకంగా ఇది దారుణం, అమానుషం. మనిషికి మరణం సహజం. కానీ మహానుభావులకు సహాజత్వంతొ సరిపెట్టుకోలేము. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం కారణజన్ములు. అటువంటివారి  పుట్టుకకు ఒక  కారణం  ఉంటుంది . అలాంటి  మహా మనుషుల  జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి  మనుషుల  మరణం సహజత్వం ఎలా అవుతుంది? 

పాట అంటే బాలసుబ్రహ్మణ్యం గారు పాడేదే  పాట అని క్లుప్తంగా సూత్రీకరించే కొన్ని తరాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. నా చిన్నతనం లో మొట్టమొదలు పాట మాధుర్యం, వింటుంటే పాట కలిగించే ఆనందం, అనుభూతి బాలసుబ్రహ్మణ్యం పాటల ద్వారానే కలిగాయి. గాత్రమంటే సామాన్యం కాదు, అది ఒక గొప్ప వరం అని బాలు గారి పాట వింటేనే మొదటిసారిగా నాకు  అర్ధమయింది. ఎన్నెన్ని సినీగీతాలు, ఎన్నెన్ని సందర్భాలు, ఎన్నెన్ని సంవత్సరాలు, వారు ఆలపించిన మధుర గీతాలు జ్ఞప్తికి తెచ్చుకోవటమే అసంభవమేమో.

అలాంటిది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ కలుపుకొని మొత్తంగా 16 భాషలలో, సుమారు 40 వేయిల పాటలు, 50 సంవత్సరాలుగా పాడటం అసామాన్యం, అద్భుతం. అందుకే పద్మశ్రీ, పద్మభూషణ్, 25 నంది బహుమతులు, గిన్నిస్ బుక్ లో చోటు తో పాటు ఎన్నెన్నో  గౌరవాలు ఆయన సొంతమయ్యాయి.

పాటతోనే గతంలోకి ప్రయాణం

కొన్ని సంవత్సరాల క్రితం విన్న ఒక పాటను ఇప్పుడు మళ్లీ వింటే, మనం మనకు తెలియకుండానే గతంలోకి వెళ్లిపోతాం. అప్పటి ఆ గతానుభూతిని పొందుతాం. ఆ పాట మొదటిసారి విన్నప్పటి పరిసరాలనూ, మనుషులనూ ఆ వాతావరణాన్ని మరొక్కసారి ఈ జీవితంలోనే ఊహ ద్వారా చూడగలుగుతాం. అది పాటకు మాత్రమే వుండే మహోతకృష్ట మైన గుణం. అందుకే విదేశాలలో ఉంటున్న మాలాంటి వారం ఎన్నో సందర్భాలలో బాలు గారి పాటలు విని అప్పటి మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుని ఆనందపడతాం. అమెరికాకు భారత దేశానికి ఆ పాట దూరం తగ్గిస్తుంది, ఆ రెండు ప్రాంతాలకు వారధి అవుతుంది. 

పాడిన ప్రతి భాషలో స్పష్టమైన ఉచ్చరణ,  నటుని గొంతుకు  సరిపోయేలా, ఆ   సినీ నటులే పాడుతున్నారేమో అన్నట్టుగా అనుకరిస్తూ గానం చేయటం బహుశా ఒక్క బాలు గారికే సాధ్యం కావచ్చు. అందుకే నా దృష్టి లో లతామంగేష్కర్ కన్నా, ఎం.ఎస్ సుబ్బలక్ష్మీ గారి కన్నా, మహమ్మద్ రఫీ గారి కన్నా, ఆఖరుకు ఘంటసాల కన్నా కూడా బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం విలక్షణమైనది. ఎం.ఎస్ సుబ్బలక్ష్మీ అద్భుతమైన గాత్రం ఆధ్యాత్మిక, భక్తి భావానికే    పరిమితం.  పైన చెప్పిన గాయకులకు బాలుకి ఉన్నన్నీ వైవిద్యాలు, విశిష్ఠతలు కనపడవు.

ముఖ్యంగా ప్రతి గాయాకునికి వయసు తో పాటు వారి గాత్రపటిమ తగ్గిపోతుంది. కానీ బాలసుబ్రమణ్యం గారు 1966 లో  శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న  అనే చిత్రంలో  పాటను మొదలు పెట్టి, నిన్నటి వరకూ ఒక్క తీరుగా గొంతులో  ఏమాత్రం మార్పు లేకుండా సాగటం దైవసంకల్పం.

ఒక జబ్బు ప్రాణం పోస్తే, ఒక జబ్బు ప్రాణం తీసింది

ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే కాలంలో బాలసుబ్రమణ్యం గారికి టైఫాయిడ్ జబ్బు సోకటంతో అతను ఆ చదువు  వదిలేసి సంగీత సాధన మొదలుపెట్టాడట. ఒక జబ్బు అతనికి సంగీత ప్రస్థానానికి ప్రాణం పోస్తే ఇంకొక జబ్బు వారి ప్రాణం తీసింది. అదీ దైవ సంకల్పమే కావొచ్చు.

బాలసుబ్రమణ్యం నాలాంటి సామాన్యులకు వారు పాడిన పాట ద్వారానే తెలుసు. ప్రత్యక్షంగా ఆ మహా మనిషి తెలియదు కదా? అందుకే అతడు ఆలపించిన మధురగీతాలను వింటూ, మైమరచిపోయి, అతను ఏ హైదరాబాద్ లోనో లేదా ముంబై, చెన్నై లాంటి పట్టణాలలో ఎక్కడో ఉన్నాడనుకొందాం . ప్రశాంతంగా ఒక్కడే గాన తపస్సు చేస్తున్నాడని నమ్మకనే నమ్ముదాం. ఎందుకంటే సాంగీతం, గానం అనే కళలకు దిక్కులు లేవు. కాలం తో పని లేదు, అవి అమరమైనవి శాశ్వతమైనవి. అలాంటి సంగీతానికి, గానానికే కళ తెచ్చిన ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం మాత్రం ఎలా మరణించగలరు? మన నిత్యజీవితాలలో, మన నోటి పాటగా బ్రతికేవుంటారు. సజీవంగా పాడలేకున్నా అమరజీవిగా నిత్యం పాటయై జీవిస్తూనేఉంటాడు.

(రచయిత ఫార్మసిస్టు, న్యూయార్క్ నివాసి)

Related Articles

1 COMMENT

  1. Hare Krishna Sharat,yendari bhavaalano,chakkaga heartni touch ayyelaaga sunnitamga vyaktikarana chesaavu.Thank you.
    As you told Our S..P is not with us physically but he built a nice house in our heart where he is going to stay forever.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles