Monday, November 11, 2024

జ్యోతిష్యవాస్తు విజ్ఞాన శీఖరం కొంపెల్ల కృష్ణమూర్తి

రచన: కుటుంబ సభ్యులు

బ్రహ్మశ్రీ కొంపెల్ల కృష్ణమూర్తిగారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో మునగాల గ్రామంలో 22 జూన్ 1930న శ్రీ వేంకట లక్ష్మీనరసింహశాస్త్రి, కొండమ్మ దంపతులకు జన్మించారు. కృష్ణమూర్తిగా తల్లివైపూ, తండ్రివైపూ పండితులే. వేదవేదాంగాలూ, జ్యోతిషశాస్త్రం, యజ్ఞయాగాది క్రతువులు వారికి కరతలామలకం. రెండున్నర శతాబ్దాలుగా కొంపెల్ల వంశము పాండిత్యంలో, జ్యోతిషశాస్త్రంలో వెలుగొందింది. మాతృమూర్తిది పిడపర్తి వంశం.

కృష్ణమూర్తిగారి ప్రాథమిక విద్యాభ్యాసం అమలాపురం తాలూకాలోని రామచంద్రాపురం హైస్కూలులో జరిగింది. అక్కడే ఆయన జ్యోతిష విద్యను కూడా అభ్యసించారు. ఆయన తెలుగు ఉపాధ్యాయుడిగా తొలుత వైరాలో పని చేశారు. తర్వాత తల్లాడలో చాలా కాలం పని చేశారు. సూర్యాపేట దగ్గర సర్వేల్ లో పివి నరసింహారావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా  ఉండగా ఒక రెసిడెన్సియల్ స్కూలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమమైన ఉపాధ్యాయులను ఏరికోరి సర్వేల్ లో నియమించారు. ఇందులో భాగంగా కృష్ణమూర్తిగారు కూడా సర్వేల్ వెళ్ళారు. ‘అంబరాన చూడరా సంబరాన ఎగిరే గురుకుల విద్యాపీఠిక సర్వేల్ యశోపతాక’’ అనే గీతాన్ని రచించి, దానికి బాణి సమకూర్చి, పాడించింది కృష్ణమూర్తిగారే. సర్వేలు లో కొన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత వైరాకు తిరిగి వెళ్ళి అక్కడ కొన్నేళ్ళు పని చేసి ఉద్యోగవిరమణ చేశారు.

కృష్ణమూర్తిగారు అత్యంత ప్రతిభాశాలి. అద్భుతమైన అధ్యాపకుడు. ఛందస్సును అతి సులభంగా మనసుకు హత్తుకునే విధంగా బోధించడంలో ఆయనకు ఆయనే సాటి. పద్యం అర్థవంతంగా, కర్ణపేయంగా చదవడం, పద్య రచన, రచనాబోధనలో ఆయన అందెవేసిన చేయి. చిన్న తరగతులలోనే  తెలుగులో ఛదోబద్ధంగా వృత్తాలు రాయించేవారు. విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ మనస్తత్వం పెంచి పద్యాలు రాయించి, వాటి గుణగణాలను తరగతి గదిలోనే విశ్లేషించేవారు. పదహరణాల తెలుగుదనం ఉట్టిపడే ఆహార్యంతో, వినయం, స్పష్టత, సాధికారతతో కూడిన మాటతీరుతో, జాజ్జ్వల్యమానమైన ముఖవర్ఛస్సుతో ఆయనది ప్రత్యేకంగా నిలబెట్టే వ్యక్తిత్వం.

తెలుగు భాషాసంస్కృతుల ప్రచారానికై స్థాపించిన ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యకర్తగా కృష్ణమూర్తిగారు పని చేశారు. ఆయన శిష్యులు ఎంతో మంది ఓరియంటల్ లాంగ్వేజిలో డీవోఎల్, బీవోఎల్, ఎంవోఎల్ ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడినారు. ఒకే బ్యాచ్ కి చెందిన 32 మంది యువతీయువకులను ఈ పరీక్షలు రాయించి, ఉత్తీర్ణలైన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమింపజేసిన ఘనత ఆయనది.

ఉపాధ్యాయ వృత్తికి సమాంతరముగా ఆయన వాస్తు జ్యోతిష్య శాస్త్రములందు ఎనలేని కృషి సల్పినారు. జాతకం రాయడం, గ్రహశాంతులు చేయడం పనిగా పెట్టుకున్న ఆయన దాదాపు మూడు లక్షల పైచిలుకు జాతకాలను గణించారు. పరాశర జైమిని  జాతక పద్ధతునే కాక బృహత్ పరాశర హోర శాస్త్ర పద్ధతి కూడా అనుసరించి జాతక ఫలితములను నిర్ణయించేవారు. జ్యోతిష్య శాస్త్రంలో వచ్చే నూతన పద్ధతులను విధిగా పరిశీలించేవారు. గ్రహబాధలు, గ్రహస్థితి దోషములను నివారించుటకై కొత్త శాంతి వ్రతములను లెక్కకు మించి సంపుటీకరించారు. పరాంబికావ్రతం, నవదుర్గావ్రతం, ద్వాదశ ఆదిత్య వ్రతం, షోడశచంద్ర కళావ్రతాలను నిర్వహించడంలో ఆయన శైలి ప్రత్యేకంగా ఉండేది.

అధికారులూ, అనధికారులూ, రాజకీయవేత్తలూ, పండితులూ, పామరులూ – ఎవరో ఒకరు నిత్యం ఆయనను సంప్రతించి సత్ఫలితాలను పొందేవారు. ఎటువంటి వివక్షా లేకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు. కొండంత చరిత్ర కలిగి గురుపదమున పూజలు అందుకుంటూ ఈ మహనీయుడు నిగర్వి,మితభాషి, మహాజ్ఞాని, కర్మిష్ఠి, ఆదర్శజీవి.  

కృష్ణమూర్తిగారు కర్మయోగి. నిష్టాగరిష్ఠుడు. ‘‘జ్యోతిష, వాస్తు విజ్ఞాన శేఖర,’’ ‘‘జ్యోతిష్యమార్తాండ,’’ ‘‘జ్యోతిష్యబ్రహ్మ,’’ ‘‘అతీంద్రియ మంత్ర మహార్ణవ’’ తదితర బిరుదులు వారిని అలంకరించాయి.

ఆయన శ్రీమతి సీతామహాలక్ష్మిగారు కూడా ఆయన లాగానే ఆంధ్రోపధ్యాయినిగా పని చేసి 2003లో స్వర్గస్తులైనారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు, ఒక మనుమడు, ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శరవసంతం అన్నట్టు తొంబది యొక్క సంవత్సరముల సంపూర్ణ జీవితం గడిపి మా కందరకూ మార్గదర్శిగా నిలిచి 1 నవంబర్ 2021 శివసాయుజ్యం పొందినారు. వారి ఆత్మశాంతికి అశ్రునయనాలతో అంజటి ఘటిస్తున్నాము.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles