శ్రీ వీణెం వీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకు లభించకుండా ఉండి ఉంటే నేను అనుకున్నట్లుగా ఇంత వేగంగా గోదావరి ఆనకట్టను అపూర్వ ఘనకీర్తితో ఇలా పూర్తిచేయలేకపోయేవాడిని. వారికి నేను జీవితమంతా రుణపడి ఉంటాను. అని అపర భగీరథుడుగా మన్ననలు అందుకుంటున్న సర్ ఆర్థర్ కాటన్ దొర ఒక తెలుగు వ్యక్తికి ఇచ్చిన అపూర్వ గౌరవం.ఆయన శ్రమశక్తికి ప్రతిఫలంగా ఆయనకు మరేదైనా మేలు చేయాలని కూడా విక్టోరియా మహారాణి, ఈస్ట్ ఇండియా కంపెనీకి సిఫారసు కూడా చేశారు. అలా ఆంగ్లేయు అభిమానం చూరగొని, పేరు కోసం కాకుండా ప్రజాసంక్షేమానికే పాటుపడినఆవ్యక్తి తెలుగువారి తొలి ఇంజనీర్. తెలుగువారి పట్టుదల, శ్రమశక్తి, నిస్వార్థ త్యాగగుణాలను 175 ఏళ్ల క్రితమే తెల్లదొరలకు చాటిచెప్పిన ఘనుడు. మహాభారత ఆంధ్రీకరణలో నన్నయకు నారాయణభట్టులా గోదావరి ఆనకట్ట నిర్మాణంలో కాటన్ దొరకు వీరన్న (రెండు రాజమహేంద్రి సంబంధితాలే)చేదోడుగా నిలిచారు.మరుగునపడిన ఈ మాణిక్యం గురించి రచయిత, పరిశోధకుడు బుడ్డిగ సాయిగణేష్ కృషి ఫలితంగానైనా కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. వీరన్న వంశీయులు నీటిపారుదల శాఖలో సేవలు అందించినప్పటికీ తమ పూర్వీకుని గురించి ఎక్కడా గొప్పగా చెప్పుకున్నట్లు కనిపించదు.
కాటన్ కుమార్తె లేడీహోప్ కాటన్ జీవిత చరిత్ర రాస్తూ అందులో వీరన్న ప్రస్తావన తెచ్చారు. వీరన్న గౌడ బ్రాహ్మణ శాఖలో శిష్టకరణాలు అనే శైవమతానికి (ఇప్పుడు ఒడిశాలో పట్నాయక్ మహంతులు) చెందినవారని ఆమె రాశారు. వారి గోత్రం పరాశర. తల్లి వీరరాఘవమ్మ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం నివాసి. తండ్రి వేణెం కొల్లయ్య మచిలీపట్నంలో ఉద్యోగం చేసేవారు.
Also Read: సర్వరంగ `సర్వో`న్నతుడు గాడిచర్ల
రాజమండ్రిలో జననం
వీణెం కొల్లయ్య, వీరరాఘవమ్మ దంపతులకు ఐదుగురి సంతానంలో మొదటి వాడుగా 1794 మార్చి 3వ తేదీన రాజమహేంద్రవరంలో జన్మించిన వీరయ్య అక్కడే ప్రాథమిక విద్యను, మచిలీపట్నంలో ఉన్నత పాఠశాల విద్య, కలకత్తాలో ఓవర్సీస్ విద్య (వ్యవసాయం, నీటిపారుదల, ఇంజనీరింగ్, రహదారులు, భవనాలు, కళలు, సైన్స్…ఏడు అంశాలతో కూడిన కోర్సు)అభ్యసించారు. మద్రాసులో ఇంజనీరింగ్ లో శిక్షణ పొందారు. 1820లో ధవళేశ్వరానికి చెందిన వేంకటేశ్వరితో వివాహం కాగా నలుగురు కుమారులు, కుమార్తె కలిగారు.
అపూర్వ సోదరతుల్యులు
తన కంటే వయసులో ఏడెనిమిదేళ్లు పెద్దయిన వీరన్నను కాటన్ దొర సహోద్యోగిగా కంటే అన్నగారిగా ఆదరించారట. ఆనాటి ఆంగ్ల ప్రభుత్వ నీటిపారుదల శాఖలో చిన్న ఉద్యోగిగా ఉన్న వీరన్న గోదావరి పరివాహక ప్రాంత పరిశీలనకు తొలిసారిగా (1840) వచ్చిన కాటన్ దొరకు స్వాగతం పలికినప్పటి నుంచి కడవరకు కలిసే ప్రయాణించారు. ఆయనకు సహాయకుడిగానే కాకుండా కుడిభుజంగా, ఆత్మీయుడిగా మెలిగారు. రాజమహేంద్రవరం నుంచి గోదావరి పుట్టుక ప్రాంతం త్ర్యంబకం వరకు, రాజమహేంద్రి నుంచి గోదావరి సంగమం వరకు ఎగువదిగువ ప్రాంతాలను కాలినడకన, గుర్రాలపై ప్రయాణించారు. ఆ సమయంలో ఆయనను కంటికి రెప్పలా కాచుకున్నారు. కాటన్ దొర అనారోగ్య కారణాలతో లండన్, ఆస్ట్రేలియాలకు వెళ్లినప్పుడు ఆనకట్ట పనులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా సమర్థంగా నిభాయించుకువచ్చారు.
స్థానిక శ్రామికులకు స్ఫూర్తి
గోదావరి ఆనకట్ల నిర్మాణపనులకు రావడానికి స్థానికులు ముందుకు రాకపోవడంతో ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలను రప్పించారు. ఎద్దుల బండ్లు, గుర్రాలు తప్ప ఎలాంటి రవాణా సౌకర్యాలు లేనికాలంలో అంతమందిని సమీకరించడం అపూర్వ సన్నవేశం. వీరన్న గారు శ్రామికుల పట్ల చూపుతున్న వాత్సల్యం, పనిగురించి ఇస్తున్న తర్ఫీదు, వేతనాల చెల్లింపు తీరు గురించి విని గోదావరి పరివాహక ప్రాంతవాసులతో పాటు కృష్ణా, గుంటూరు మండలాలకు చెందిన వారు ఆనకట్ట నిర్మాణ పనులకు వచ్చారు. వీరన్న గారి పూర్వీకులకు, సోదరులకు మన్యం ప్రాంతంవాసులతో గల పరిచయాలతో వారినీ కూడగట్టారు. ఇలా ఈ జలక్రతువుకు దాదాపు పదివేల మందిని సమకూర్చుకున్నారు. ఆనకట్ట ఐదేళ్ల నిర్మాణ కాలంలో అవినీతికి ఆస్కారం కానీ, ఒక ప్రాణనష్టం కానీ లేకుండా అప్రమత్తతను పాటించారు.
Also Read: అవసరార్థుల ‘దేవర’ అయ్యదేవర
కార్మిక పక్షపాతి
ఆనకట్ట నిర్మాణ శ్రామికుల సంక్షేమానికి కాటన్ దొర సూచనతో వీరన్న గారు సకల చర్యలు తీసుకున్నారు. వారి కోసం గోదావరి తీరంలో ప్రత్యేక నివాసాలు ఏర్పాటు చేశారు. నిర్మాణపు పనులలో ప్రవేశం లేని వారికి ప్రత్యేక తర్ఫీదునిస్తూ ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. పనిచేసిన రోజులకే వేతనం అనే విధానాన్నిపక్కనపెట్టి పని చేయని రోజు (ఆదివారం)కు కూడా కూలిసొమ్మును చెల్లించే ఏర్పాటు చేశారు. అదీ ముందురోజు శనివారం సాయంత్రమే. జాతికి అన్నంపెట్టే ఆనకట్ట నిర్మాతలను పస్తులపాలు చేయకూడదని, కష్టానికి ప్రతిఫలం చెల్లించాలన్న వారి పద్ధతి కార్మికులలో అంకితభావాన్ని మరింత పెంచింది. కారణాంతరాల వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి రెండుసార్లు (1848, 1851) సకాలంలో నిధులు రాకపోయినా పనులు నిలిచిపోకుండా అధికారులు, కార్మికులు పరస్పరం సహకరించుకునే వాతావరణం కల్పించారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఆనకట్టపనుల నిలిచిపోతున్నాయని కొందరు ప్రగతి నిరోధకులు వదంతులు పుట్టించి, చాడీలు చెప్పడం వల్ల పనులు నిలిచిపోయే పరిస్థితులలో కాటన్, వీరన్నల పట్ల గల గౌరవ విశ్వాసాలతో కార్మికులు మరింత కష్టించారట. కొద్దికాలానికే, కాటన్-వీరన్నల చిత్తశుద్ధిని గుర్తించిన ప్రభుత్వం వారిపై తమకు అందిన ఫిర్యాదులను పక్కనపెట్టి అవసరమైన ముడిసరుకును, నిధులను సరఫరా చేసింది.
వీరన్న సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం రాయ్ బహదూర్ బిరుదు ప్రదానం చేసింది. ఆనకట్టకు 20 కిలోమీటర్ల దూరంలోని మెర్నిపాడు గ్రామ ఆదాయాన్నీ( ఆ కాలంలో రూ. 500 పైగా) ఆయనకు దఖలు పరుస్తున్నట్లు విక్టోరియా మహారాణి ప్రకటించారు. మైసూర్ మహారాజా నుంచి సన్మానం, సువర్ణ భుజకీర్తులు అందుకున్నారు.
ఆనకట్టతో అనుబంధం
గోదావరి ఆనకట్ట నిర్మాణం 1852 మార్చి 31వ తేదీ నాటికి పూర్తయినా మరో దశాబ్దన్నర కాలంలో అంటే తుదిశ్వాస విడిచేంతవరకు ఆ ప్రాంతంలోనే నివసించారు. ధవళేశ్వరం హెడ్ లాక్ క్వార్టర్స్ వద్దే ఎక్కువ సమయం గడిపారు. అధిక శ్రమ, విపరీతమైన ఎండతాకిడితో పచ్చకామెర్ల వ్యాధిబారినపడి 73వ ఏట 1867 అక్టోబర్ 12వ తేదీన కన్నుమూశారు. ఆయన అంతిమ కోరిక మేరకు హెడ్ లాక్ ప్రాంతంలోనే పార్థివదేహానికి అంతిమ సంస్కారం నిర్వహించి, చితాభస్మాన్ని గోదావరిలో నిమజ్జనం చేశారు. ఆనకట్ట ఉద్యోగులు ఆయన సమాధి వద్ద శిలాఫలకం ఏర్పాటు చేశారు. అవిభక్త మద్రాసు రాష్ట్ర తొలి తెలుగు సభాపతి బులుసు సాంబమూర్తి 1940లో కాటన్ విగ్రహం వద్ద వీరన్న వివరాలు తెలిపే శిలాఫలకం చెక్కించగా, 1986 వరదలకు దెబ్బతిన్నది. రచయిత, చరిత్రకారుడు బీఎస్ సాయిగణేష్ వెలికితీయించి, మెరుగులుదిద్దించిన శిలాఫలాకాన్ని వీరన్న వర్ధంతి నాడు (2014 అక్టోబర్ 12) అప్పటి రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ఆవిష్కరించారు. వీరన్న నాలుగవ తరం వారసుడు వీణెం వేంకట నారాయణరావును నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు సత్కరించి రూ. 10 లక్షలు బహుమానం ప్రకటించారు. కాగా, 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కాటన్ మ్యూజియంలో వీరన్న గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
Also Read: అవిశ్రాంత ‘నోబెల్ రామన్’
(తెలుగు వారి తొలి ఇంజనీర్ వీణం వీరన్న 227వ జయంతి మార్చి 3న)