Saturday, April 20, 2024

గడ్డు ఏడాది గడిచిపోయింది

ప్రపంచ మానవాళి చరిత్రలో మన ఎరుక మేరకు, 2020వంటి ఘోరమైన సంవత్సరం ఇంకొకటి లేనేలేదని చెప్పాలి. ఎంతమంది ఆత్మీయులను కోల్పోయాం, ఎందరు గొప్పవారిని పోగొట్టుకున్నాం, ఎంత సమయం చేష్టలుడిగి కూర్చున్నాం, ఎంతటి నిర్వేదాన్ని అనుభవించాం? డబ్బుమదం, అధికార అహంకారం, కీర్తి కమ్మిన అంధత్వం, వయసు పొగరు, అందమనే లెక్కలేనితనంతో తెలివి తనదేననే గర్వితమతిగా   కొట్టుకుపోతున్న  మనిషికి,  కరోనా వైరస్ అనే సూక్ష్మజీవి గర్వం సర్వాన్ని అణచివేసింది. ఓ! మనిషీ! తిరిగి చూడు… అంటూ…మనిషి స్థాయి ఏంటో గుర్తు చేసింది.

ఆత్మావలోకనంలో మనిషి

మనిషిని ఆత్మావలోకనంలో పడేసింది. భవిష్యత్తులో రాబోయే ఉపద్రవాలకు ఇది ఒక మచ్చుతునక మాత్రమేనని చెప్పకనే చెప్పింది. ప్రకృతిని, మానవ ప్రకృతిని విస్మరిస్తే ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందో మళ్ళీ మరొకమారు గుర్తుచేసింది. అదే సమయంలో మానవత్వాన్ని తట్టిలేపింది. సోనుసూద్ వంటి సెలబ్రిటీ మొదలు సామాన్యుడు వరకూ కష్టాల్లో తోటి మనిషివైపు నిలబడేట్టు చేసింది. వలస కార్మికుల కష్టాలలో వారికి అందించిన చేయూత దీనికి అద్దం పడుతుంది. ఈ సందర్భంలో, భౌతిక దూరం పాటించినా, మానసికంగా దగ్గరకు చేర్చి, ఐకమత్యాన్ని చాటిచెప్పేలా కరోనా కాలం కలుగ చేసింది. ఈ పాఠాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని తీరాలి. లేకపోతే, భావికాలంలో మనిషికి మనుగడ కూడా ప్రశ్నార్ధకమవుతుంది.

స్పానిష్ ఫ్లూ

సరిగ్గా వందేళ్ల క్రితం,మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక, స్పానిష్ ఫ్లూ అనే ఓ మహమ్మారి వచ్చింది. దాదాపు 5నుంచి 10కోట్లమందిని ఈ మహమ్మారి కబళించింది. సుమారు 50కోట్లమందికి ఈ వ్యాధి సోకింది. వీటన్నిటి నుంచి బయటపడటానికి ప్రపంచానికి చాలా ఏళ్ళ సమయం పట్టింది. దీనితో పోల్చుకుంటే కరోనా వల్ల పోగొట్టుకున్న ప్రాణాలు తక్కువే. పెరిగిన వైద్యశాస్త్రం, సాంకేతికత, ఆరోగ్య స్పృహ మనిషిని కాపాడాయి. త్వరలో కరోనాకు వ్యాక్సిన్లు రాబోతున్నాయి. కొత్త రకం స్ట్రెయిన్లు వస్తున్నా, వాటిని నిలువరించే శక్తి, సామర్ధ్యాలు రాబోతున్న  టీకాలకు ఉన్నాయనే మాటలు బోలెడు ధైర్యాన్ని కలిగిస్తున్నాయి.

కోల్పోయింది ఎక్కువ, సాధించింది తక్కువ

ప్రపంచాన్ని, మనదేశాన్ని తరచి చూస్తే 2020లో కోల్పోయింది ఎక్కువ, సాధించింది తక్కువ. లెక్కల జోలికి వెళ్లకుండా, భిన్న రంగాలను స్పృశిద్దాం. ప్రపంచ దేశాల గమనం మారింది. చైనా ప్రోద్బలంతో కమ్యూనిస్ట్ దేశాలు, అమెరికా వ్యతిరేక దేశాలు ఒక వైపు నిలుస్తున్నాయి. చైనా ఆగడాల వల్ల, అమెరికా అవసరాల వల్ల, భారత్ సహా మిగిలిన దేశాలు ఒక్కచోటకు చేరుతున్నాయి. గల్వాన్ కొండల ఘటనలో సుమారు 20మంది భారతీయ సైనికులను చైనా బలికొంది. సరిహద్దు వివాదాలు, సామ్రాజ్య కాంక్ష పెరుగుతున్న నేపథ్యంలో, చైనా -భారత్ బంధాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. రష్యా, చైనా దగ్గరవుతున్న నేపథ్యంలో, రష్యా కూడా మనకు కొంత దూరమైందనే చెప్పాలి. అదే సమయంలో, అమెరికాకు మనం బాగా దగ్గరయ్యాం.

అమెరికాలో అధికార మార్పిడి

ఆమెరికాలో ట్రంప్ దిగిపోయి, జో బైడెన్ ఎక్కడానికి రంగం సిద్ధమైపోయింది. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షపీఠాన్ని అధిరోహించడం చారిత్రక విజయం. కరోనా కాలంలో, మిగిలిన వివాదాలు ఎట్లా ఉన్నా, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు చాలా రాష్ట్రాల్లో  ఆరోగ్యవంతంగానే సాగాయి. దేశంలో రాజకీయ చిత్రపటం మారింది. బిజెపికి ఈ సంవత్సరం బాగా కలిసివచ్చిన కాలం. అడ్డంకులు తొలిగి అయోధ్య నిర్మాణం ప్రారంభమైంది. బిజెపి ప్రభుత్వం తను ప్రవేశ పెట్టాలనుకున్న బిల్లులన్నింటినీ యధేచ్చగా ప్రవేశపెట్టింది.

ఉవ్వెత్తున ఎగసిన రైతు ఉద్యమం

వీటన్నింటిలో, ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగిసి రైతు ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. భారతదేశ చరిత్రలో  ఈ స్థాయిలో రైతు ఉద్యమం జరగడం ఇదే మొదటిసారి. నెలరోజుల పైనుండి, కరోనాకు, కరకు చలికి లెక్కచెయ్యకుండా, ప్రాణాలను పణంపెట్టి రైతులు ఉద్యమబాట పట్టారు. లక్షలాది వలసకార్మికులు పడిన కష్టాలు వర్ణనాతీతం. ప్రత్యామ్నాయ మార్గాలు, వెసులుబాట్లు ఇవ్వకుండా, ఉన్నపళంగా లాక్ డౌన్ విధించిన మూర్ఖత్వానికి ఆకలి పేగులు ఆక్రోశించాయి. ఈ పాపం ఏలినవారిదే. వీరి ఆకలి తీర్చి కొందరు పుణ్యం మూటకట్టుకున్నారు.

ఐటీ, కమ్యూనికేషన్స్ రంగాలలో భారతీయుల బావుటా

ప్రపంచ దేశాల్లో భారతీయులను ప్రత్యేకంగా నిలిపింది మానవవనరుల అభివృద్ధి. అందునా,  ఐటీ, కమ్యూనికేషన్ రంగాలు. ఇక్కడ అమెరికా వంటి అగ్రరాజ్యలకు కూడా  భారతీయులే కీలకంగా నిలిచారు. హెచ్ -1బి వీసాల అంశం అట్లుంచగా, ఐటీ రంగం మన యువతను కాపాడింది. మన ఉపాధిని నిలబెట్టింది. 4జి సేవలు, బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి కలిసివచ్చింది. దాదాపు 98శాతం మంది ఇంటి నుండే సేవలు అందించి, తమ ఉపాధిని కాపాడుకోవడమే కాక, సేవలకు దోహదపడ్డారు.

అండగా వ్యవసాయరంగం

మరీ ముఖ్యంగా, కరోనా వల్ల కుదేలైన భారతీయ ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కొండంత అండగా నిలిచింది. వ్యవసాయ ఆదాయం లేకపోతే, ఈ కష్టాల్లో భారత్ కొట్టుకుపోయేది. అత్యవసర సిబ్బంది అందించిన సేవల వల్ల వారి విలువ ఎంత గొప్పదో తెలిసివచ్చింది. అన్ని రంగాల వలె మీడియా కూడా చాలా నష్టపోయింది. కొత్తదారులు వెతుక్కుంది. డిజిటల్ వ్యవస్థను మరింతగా అక్కున చేర్చుకొని, ప్రత్యామ్నాయ శక్తిని చేత పట్టుకుంది.

సోషల్ మీడియా విశ్వరూపం

ఈ కాలంలో, సోషల్ మీడియా విస్తృత రూపం ఎత్తింది. ప్రింట్ మీడియా సర్క్యూలేషన్ ఘోరంగా పడిపోయింది. ఆదాయం పోగొట్టుకుంది. ఎలక్ట్రానిక్ మీడియా ఆదాయ మార్గాలకూ గండి పడింది. కరోనా సమయంలో , ఎందరో జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. అన్నింటి కంటే విషాదం ఏంటంటే, ఎందరో మీడియా ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ పాపం మీడియా యజమానులదేనని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. బడుగుజర్నలిస్టులు బతుకుపోరు సాగించడం బాధాకరం. ఈ ఘోరానికి కూడా 2020 సంవత్సరమే ముఖ్య కారణం.

కరోనాను సాకుగా ఉపయోగించుకున్న మీడియా యజమానులు

ఎప్పటి నుంచో  ఉద్యోగులను తగ్గించుకుందామనుకున్న యాజమాన్యాలకు కరోనా మంచి సాకుగా అక్కరకొచ్చింది. మీడియాతో పాటు సినిమా, వినోద రంగాలు కూడా కుదేలైపోయాయి. వేతనజీవులు వెతలపాలయ్యారు.2020 సంవత్సరం కష్టాలు తెచ్చినా, కొన్ని జీవిత పాఠాలు నేర్పింది. శారీరక, మానసిక, ఆర్ధిక, సామాజిక క్రమశిక్షణ కొందరిలోనైనా కలుగజేసింది.కొందరికి గుర్తు చేసింది. మిగిలిన ఇబ్బందులు ఎట్లా ఉన్నా, సొంత కుటుంబంతో గడిపే సమయాన్ని ఇచ్చింది. రేపటి గురించి ఆలోచించే వివేకం కల్పించింది.

కరోనా నామ సంవత్సరం

కరోనా వైరస్ సరిగ్గా, పోయిన జనవరిలో పుట్టింది.ఏడాదంతా అల్లాడించింది. 2020ని “కరోనా నామ సంవత్సరం” గానే,ఎందరో  అభివర్ణిస్తున్నారు.కరోనా వైరస్ అనేది మహమ్మారి కాదు, మనిషిని మార్చడానికి, మంచివైపు ఆలోచింపజేయడానికి, రేపటి గురించి జాగ్రత్తగా ఉంచటానికి వచ్చిన “అమ్మవారిగా” కొందరు తాత్వికులు  భావిస్తున్నారు. మొత్తంమీద,2020ముగిసింది. హమ్మయ్యా!అంటూ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.2021పట్ల చాలా విశ్వాసంగా, ఆశావహంగా ఉంటున్నారు. రాజనీతిజ్నుడైన ప్రణబ్ ముఖర్జీ, ఆరాధ్య గాయకుడు  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కరోనా వల్లనే కోల్పోయాం.

మనిషి ఆశాజీవి, ఎప్పుడూ నవోదయమే

దేశ వ్యాప్తంగా కొందరు మంత్రులు, లోక్ సభ, శాసనసభ సభ్యులను పోగొట్టుకున్నాం. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాదరావు, మాజీ మంత్రి మాణిక్యరావు మొదలు ఎందరో నేతలను ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడు, ఉత్తరాంధ్ర భూమిపుత్రుడు ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా కరోనా కాటుకు బలయ్యారు. 2020 సంక్షోభాలను నింపినా, కష్టాలను ఎదుర్కోటానికి ధైర్యాన్నీ నేర్పింది. అనంత    కాలచక్రంలో సంవత్సర కాలమనేది చాలా చాలా చిన్నది. జీవ పరిణామక్రమం, మానవ మేధ మనిషిని పురోగతి వైపే నడిపించింది,నడిపిస్తుంది కూడా. 2020 మానవ జీవిత మహాగ్రంథంలో చిన్న పుట మాత్రమే. కాకపోతే, చాలా పాఠాలు నేర్పింది. ఆశాజీవియైన మనిషికి రేపు ఎప్పుడూ ఉషోదయమే,నవ నవోదయమే. 

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles