Thursday, March 28, 2024

రాజకీయ పార్టీలకు సరికొత్త రూపం, సారం?

ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు దేశంలో కొత్త అధ్యాయాలను సృష్టిస్తాయా? ఫలితాల తర్వాత రాజకీయ పార్టీలు సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెడతాయా ? అనే ప్రశ్నలు మెదళ్లను తొలుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, అసోం,తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో కొత్త సమీకరణాలు ఏర్పడి, కొంగ్రొత్త సిద్ధాంతాలు పురుడు పోసుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. దేశం దాదాపు ఏడేళ్ల నుంచి బిజెపి పాలనలో ఉంది. ఆ పార్టీ హిందూత్వ ఎజెండా ఎలా ఉన్నా, మిగిలిన పార్టీలు కూడా అధిక సంఖ్యాకులైన హిందువుల మనసు దోచుకోవాలనే సరికొత్త ఆలోచనలు చేస్తున్నాయి.

సిద్ధాంతాలపై కాంగ్రెస్ పునరాలోచన

సెక్యూలర్ పార్టీగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా తన సిద్ధాంతాలను పునఃలిఖించుకోవాలనే చూస్తోంది. ఆ మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జందెం వేసుకొని, నేను బ్రాహ్మణుడను, హిందువును అని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన దానను, ప్రతి రోజూ చండీని ఉపాసిస్తాను అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. కొన్నాళ్ల క్రితం దిల్లీ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదివి వినిపించారు. తమిళనాడు ఎన్నికల బరిలో ఉన్న కమల్ హాసన్ మొదటి నుంచీ నాస్తికుడనని చెప్పుకుంటున్నాడు.  ప్రస్తుతం తన ప్రచారంలో హిందూ మనోభావాలు దెబ్బ తినకుండా ఆచి తూచి మాట్లాడుతున్నారు.

అన్ని పార్టీల ఆలోచనలలో మార్పు

తమిళనాడులో ద్రావిడ సిద్ధాంతాలు, కేరళలో వామపక్ష భావాలు, పశ్చిమ బెంగాల్ లో మిశ్రమ పోకడలు, పుదుచ్చేరిలో తమిళనాడు ప్రభావాలు నిన్నటి దాకా ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ అధికారాన్ని చేపట్టాలనే ఆలోచనలో ఉన్న బిజెపి వేగాన్ని అందిపుచ్చుకోవాలంటే, మనం కూడా మారాలని మిగిలిన పార్టీలు కూడా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఈ ఒరవడిని తొందరగా సొంతం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో ప్రధానంగా ద్రావిడ సిద్ధాంతం ప్రభావం చూపిస్తున్నా, హిందుత్వ విధానం కూడా అంతర్వాహినిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో దాని ప్రభావం పెద్దగా లేకపోయినా, భవిష్యత్తులో అది పెరిగే అవకాశం ఉంది.

ద్రావిడ సిద్ధాంతానికి బీటలా?

అలాగే, ద్రావిడ సిద్ధాంతానికి కూడా మెల్లగా బీటలు వారుతాయనే అనిపిస్తోంది. కమల్ హాసన్ ఆధ్వర్యంలో మూడవ ఫ్రంట్ మిశ్రమ సిద్ధాంతాలతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఏఐఏడిఎంకె, డిఎంకెకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కమల్ కూటమి భావిస్తోంది. ఇంకోపక్క, బిజెపి కూడా విస్తరించాలని చూస్తోంది. ఏఐఏడిఎంకె ప్రభావం తగ్గితే, ఆ స్థానాన్ని బిజెపి కూడా కొంత ఆక్రమిస్తుంది. కొన్ని జిల్లాల్లో ముస్లింల ప్రభావం కూడా ఉంది. ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ కే పరిమితం కాకుండా, దేశమంతా విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే బీహార్ తదితర రాష్ట్రాల్లో ఆట మొదలు పెట్టారు. తమిళనాడు ఎన్నికల్లోనూ ఆయన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది.

కేరళలో వామపక్ష కూటమివైపు మొగ్గు

కేరళలో ప్రధానంగా వామపక్షాల కూటమి ఎల్ డి ఎఫ్ – కాంగ్రెస్ కూటమి యూ డి ఎఫ్  ఇప్పటి దాకా రాజ్య మేలాయి. ఈసారి కూడా తిరిగి ఎల్ డి ఎఫ్ అధికారంలోకి వచ్చే శకునాలు కనిపిస్తున్నాయి.కేరళలో  విస్తరణకు బిజెపి యత్నాలు ప్రారంభించింది. ఆ రాష్ట్రంలో మిగిలిన మతాలతో పోల్చుకుంటే మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు.శబరిమలై అంశం తమకు సహకరిస్తుందనే విశ్వాసంలో బిజెపి  ఉంది. మెట్రోమాన్ గా వాసికెక్కిన శ్రీధరన్ పై కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో 3 – 6 సీట్లు గెలుచుకుంటే, మంచి ఫలితాలు సాధించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి బి జె పి పాత్ర స్వల్పంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించ వచ్చు.  మళ్ళీ ఎల్ డి ఎఫ్ అధికారంలోకి వస్తే, వరుస విజయాలతో, కేరళలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే.

పశ్చిమబెంగాల్ పైనే దేశప్రజల దృష్టి

దేశమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అక్కడ మళ్ళీ మమతా బెనర్జీకీ ప్రజలు పట్టం కడతారని  వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే, దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. రాష్ట్రాన్ని మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అప్పజెప్పి, మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై  దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష బలంగా ఉన్న ప్రధాన నేతల్లో ఆమె ఒకరు. వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి, నరేంద్రమోదీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నం చేస్తారని భావించవచ్చు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇదే పనిచేశారు కానీ ఘోరంగా విఫలమయ్యారు. మమతా ఏ మేరకు సాధిస్తారో చూడాలి.

సర్వేల ప్రకారం మమతే విజేత

వివిధ సర్వేలు మళ్ళీ మమతాదే అధికారం అని చెబుతున్నా, ఆమె గెలుపు అంత ఆషామాషీ కాదు. బిజెపికి సీట్లు బాగా పెరిగే అవకాశం ఉంది. అనూహ్యంగా బిజెపి ఎక్కువ స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వస్తే, అటు పశ్చిమ బెంగాల్ లోనూ – ఇటు దేశంలోనూ బిజెపి ఆట వేరే విధంగా ఉంటుంది. ప్రస్తుతం బిజెపి దృష్టి ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అసోంపైన మాత్రమే కేంద్రీకృతమై ఉంది . పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం. అసోంలో బిజెపి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని తెలుస్తోంది. కానీ, పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ బిజెపిని మళ్ళీ విజయం వరిస్తే, కాంగ్రెస్ నైతికంగా చాలా దెబ్బతింటుంది. ఆ రాష్ట్రంలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి.

తమిళనాడు, కేరళలో సరికొత్త సిద్ధాంతాలు

ప్రస్తుత ఎన్నికలతో తమిళనాడు, కేరళలో కొత్త సిద్ధాంతాలు పురుడు పోసుకుంటున్నాయి.ఫలితాల తర్వాత అవసరమైతే, డిఎంకె  కూటమికి కమల్ కూటమి మద్దతును తెలిపే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము.ఎన్నికల్లో ఎవరు గెలిచినా,ఓడినా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశంలో రాజకీయాలకు గేమ్ ఛేంజర్ అవుతాయి. మొత్తంమీద ఈ ఎన్నికలు కొత్త అధ్యాయాలు, కొత్త సమీకరణాలు, సరికొత్త సిద్ధాంతాలతో దేశ రాజకీయల భావి ముఖచిత్రాన్ని మారుస్తాయని భావించాలి. కరోనా కష్టాలు కూడా ఎన్నికలపై కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి, ప్రతి పార్టీ కొత్త రూపుతో ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles