Thursday, April 18, 2024

ప్రభుత్వ పరిపాలన – పరిశోధన సంస్థ

ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి

పరిశోధన జ్ఞానము, తెలివికి సంబంధించినది. మన ప్రభుత్వం జ్ఞానమును ఒక సంపదగా గుర్తించవలసి ఉన్నది. ఈ జ్ఞానసంపద అన్నిటికంటే నికరమైనది. జ్ఞానము ఆధారంగా తెలివితేటలు పెరిగే అవకాశం ఉన్నది. మన నవీన సమాజం నిరంతర పరిశోధన ప్రక్రియ వలన జ్ఞానాభివృద్ధి, తెలివితేటల ప్రేరణ పెరిగి అన్ని రంగాల అభివృద్ధికి పునాదిగా నిలుస్తుంది. అందుచేత పరిశోధన వలన నూతన పద్ధతులు, వాటి వలన మన రాష్ట్రానికి గాని లేక మన దేశానికిగాని త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త షంపేటర్ గుర్తించారు. జ్ఞానము, విద్య ద్వారా ఏర్పడే వికాసవంతమైన సమాజం పరిశోధనా ప్రక్రియతో ముడిపడి ఉంటుంది. అందుచేత మన రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞాన వికాసానికి విద్యాభివృద్ధికి పథకాలను ప్రవేశపెట్టి దీర్ఘకాలిక సమాజిక శ్రేయస్స, అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వికాసవంతమైన, విజ్ఞానవంతమైన, ఆనందదాయకమైన సమసమాజ నిర్మాణంలో ప్రస్తుత ప్రభుత్వం చేయుచున్న ప్రయత్నంలో పరిశోధన ఆధారంగా తొందరగా, తక్కువ ఖర్చుతో సాధించే అవకాశం ఉంది.

మార్గాంతరాలను సూచించే సంస్థ అవసరం

ప్రస్తుతం మన ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన కరోనా నియంత్రణ, నివారణ అంశాన్ని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికల వలన సానుకూల ఫలితాలను సాధించడానికి వీలుకలుగుతుంది. అదేవిధంగా తాగునీటి సమస్య, రైతుల ఆత్మహత్యలు, మహిళల సమస్యలకు మూలకారణ అన్వేషణ నియంత్రణ, నిబంధనలు రచించే ఏర్పాటు పరిశోధన వ్యవస్థకు అప్పజెప్పి దానివలన సలహాలను స్వీకరించి, త్వరితగతిన ప్రజలకు మెరుగైన సేవలను అందించవచ్చును. కరోనా వలన ఏర్పడిన విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పారిశ్రామిక విధివిధానాలు, జనజీవన శైలిని అధ్యయనం చేసి, తగిన మార్గాంతరాలను సూచించే పరిశోధన వ్యవస్థ అవసరమని చెప్పక తప్పదు. మారుతున్న పర్యావరణం, దానివల్ల పొంచి ఉండే ప్రమాదం గుర్తించి ఎటువంటి ప్రణాళికలను అవలంబించాలనే నిర్ణయాలను అందించే పరిశోధన సంస్థ క్రొత్తగా ఏర్పాటు చేసి, మన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడవలసి ఉన్నది.

మన ప్రభుత్వం ఆనందంతో కూడిన అభివృద్ధిపై, జీవన ప్రమాణాలను పెంచే అభివృద్ధిపైన కేంద్రీకరించాలి. మన రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులను సమగ్ర పరిశోధన జరిపి, ఏ విధమైన పరిపాలన విధివిధానాలను ఆచరించి ముందుకు వెళ్ళాలనే అంశంపై ఒక పరిశోధన సంస్థ సూచనలు స్వీకరించితే మంచిది.

ఆర్థిక, సామాజికాంశాల పరిశోధన కేంద్రాలు

పరిశోధన ప్రక్రియ ప్రాంతీయాభివృద్ధికి, దేశ పురోగతికి విధానపరమైన ప్రధాన అంశం. ప్రస్తుతం సాంకేతిక పరిశోధనపై ఎక్కువ ప్రాధాన్యమున్నది. సాంకేతిక పరిశోధన అవసరం కూడా ఎక్కువగానే ఉన్నది. మన రాష్ట్ర మరియు దేశ ఆర్థికాభివృద్ధికి సాంకేతిక విజ్ఞానం మరియు పరిశోధన చాలా అవసరం. ఏదేశ ప్రగతికైనా విజ్ఞానశాస్త్ర పరిశోధన సాంకేతిక శాస్త్ర పరిశోధన, ఆర్థిక, సామాజిక శాస్త్ర పరిశోధన విధివిధానాలు ముఖ్యమైన అంశాలు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సాంకేతిక శాస్త్ర పరిశోధనపైన , విజ్ఞాన శాస్త్ర పరిశోధన పైన ప్రణాళికా పరమైన కృషి జరుగుతున్నది. దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక, విజ్ఞానశాస్త్ర పరిశోధనా కేంద్రాల స్థాపనకు అడుగులు వేస్తున్నది. ఇది మంచి అభివృద్ధికి శుభసూచకమని చెప్పవచ్చును. అదే విధంగా విధానపరమైన ఆర్థిక, సామాజిక శాస్త్ర పరిశోధనా కేంద్రాల ఏర్పాటు చేయుట చాలా అవసరం. ఆర్థిక, సామాజిక శాస్త్ర పరిశోధన సంస్థ ఏర్పాటు చేసినందువలన ఒకవైపు ప్రభుత్వానికి, మరొకవైపు ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వం యొక్క విధివిధాన నిర్ణయ ప్రక్రియకు ఆర్థిక, మరియు సామాజిక పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుంది.

మేధావుల సహకారంతో ప్రణాళిక రచించాలి

ఏ ప్రభుత్వమైనా ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అందుకు మేధావులతో ప్రణాళికలను తయారు చేయవలసి వుంది. దీనికి ఆర్థికశాస్త్ర మేధావులు, సామాజిక శాస్త్ర నిపుణులు, రాజనీతిశాస్త్ర నిపుణుల సహకారంతో వివిధ ప్రభుత్వ ప్రణాళికలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రభుత్వ విధివిధానాలను రచించి, అమలు పరచాలంటే వివిధ మేధావులు మరియు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు ఎంతైనా అవసరం. శాస్త్రీయ పద్ధతిలో ప్రణాళికలు రచించాలంటే, శాస్త్రీయ దృక్పథం గల వివిధ శాస్త్రాల విద్యా సంపన్నుల సహకారం అవసరం.

ముఖ్యంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆర్థిక శాస్త్రవేత్తల ప్రణాళిక రచనలు ఎంతైనా అవసరం. అదేవిధంగా సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ శాస్త్రవేత్తలు పరిశోధనాపరమైన సూచనలు అవసరం. రాష్ట్రం ఆర్థికాభివృద్ధి పనులు సజావుగా అమలు చేయాలంటే శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వం ఆయా ప్రణాళికలను నిపుణుల సహకారంతో ముందుకు తీసుకొని వెళ్ళవలసి ఉంది. ఈ ఆర్థిక శాస్త్రవేత్తల సలహాలను ఎలా సమీకరించాలి? దీనికి ఒక పటిష్టమైన ప్రణాళిక అవసరం. అందుచేత ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటుచేసి పరిశోధనలో నిపుణులైన ఆర్థిక శాస్త్రవేత్తలను ప్రభుత్వం నియమించాలి. దీనివలన ప్రణాళిక, అభివృద్ధి సమస్యల పరిష్కారం జరిగి ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి సాధించేందుకు వీలుకలుగుతుంది.

ప్రగతి నిరంతర ప్రక్రియ

రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కొనసాగే ప్రక్రియ. కానీ త్వరితగతిన అభివృద్ధికి ఎటువంటి ప్రణాళిక అవసరమన్నది శాస్త్రవేత్తల సూచనలు, సహకారం అవసరం. మన రాష్ట్ర అభివృద్ధికి అనేక మార్గాలున్నాయి. ఏ మార్గాన్ని అనుసరిస్తే త్వరగా, ఎక్కువగా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చునో ఆర్థిక శాస్త్ర పరిశోధన సహాయపడుతుంది. ఉదాహరణకు మనరాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అయితే వ్యవసాయం ఎంతవరకు ప్రాముఖ్యత అవసరమన్నది మనముందున్న ప్రశ్న. దీనికి సమాధానం ఆర్థిక శాస్త్రజ్ఞుల పరిశోధనా సహకారం ఎంతో అవసరమని గుర్తించాలి. అదేవిధంగా వివిధ శాఖల అభివృద్ధిపరమైన అంశాలను గుర్తించి వాటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా కృషి చేయాలన్న అంశాలను ఆర్థిక నిపుణుల పర్యవేక్షణలో జరిగితే తొందరగా పటిష్టమైన అభివృద్ధి ఫలాలను పొందవచ్చును.

మన రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, అభివృద్ధి వనరులు (ఇన్ఫాస్టక్చర్) ముఖ్యమైన మూడు అంశాలను ఏవిధంగా అభివృద్ధి పథంలో నడిపించాలన్నది ప్రధానమైన అంశం. ఈ మూడు అంశాలకు సంబంధించి దిశ, దశ ఏర్పాటు చేయవలసి ఉన్నది. ఎవరు దిశ, దశను రాష్ట్రప్రభుత్వానికి సూచిస్తున్నారన్నది ముఖ్యమైన అంశం. అనేక ఆర్థిక, అభివృద్ధి చెందిన దేశాలలో ప్రణాళికాబద్ధమైన పరిపాలన వలన సాధ్యమైందని అందరికీ విదితమైన అంశమే. వాటి అనుభవాలను కొంతవరకైనా మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరించవలసిన అవసరమున్నది. దీనికి నిపుణుల శాస్త్రీయ ప్రణాళికలు ఎంతెనా అవసరం.

శాస్త్రవేత్తలు, నిపుణులు అధ్యయనం చేయాలి

ఉదాహరణకు వ్యవసాయం, పరిశ్రమలు, ఇన్ఫాస్ట్రక్చర్ ఏ మోతాదులో ప్రభుత్వ సహకారం అవసరమో శాస్త్రవేత్తలు నిర్ణయించాలి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలను అంచనా వేయవలసి ఉంది. సంక్షేమ పథకాలు దృక్పథం, వాటి వలన అభివృద్ధి ఏమాత్రం ఒనగూరుతున్నది అనే విషయం శాస్త్రీయ దృక్పథంతో పరిశీలన చేయవలసి ఉన్నది. దీనికి నిపుణుల అధ్యయనం అవసరం. అధికారం ఎంత వరకు సాగించాలి, ఎంతవరకు హద్దులు పాటించాలి అనే విషయ పరిశీలన పరిశోధన ద్వారా నిర్ణయించవలసి ఉంది. ఈ బాధ్యత మేధావులకు అప్పగించి ప్రభుత్వం మెరుగైన ఫలితాలను అందుకునే ప్రయత్నంలో ముఖ్య భాగం కావలసి ఉంది. ఆర్థిక, సామాజిక శాస్త్ర పరిశోధనా సంస్థల యొక్క ప్రాముఖ్యత ప్రపంచ వివిధ దేశాల అనుభవం, మనదేశ అనుభవం, మన ప్రాంతీయ అనుభవం విశ్లేషణ చేస్తూ, మనకొత్త రాష్ట్రానికి కావాల్సిన ప్రణాళికల ఏర్పాటకు కావాల్సిన విషయసేకరణ మరియు పరిశోధన, పరిశీలన చేయవలసి ఉన్నది.

ప్రభుత్వ నిర్ణయాలకు దోహదం చేసే సంస్థ

ఈ సంస్థ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కావాల్సిన విషయ సేకరణ, విశ్లేషణ సమకూర్చి ప్రధాన నిర్ణయాలలో సహకారాన్ని అందించే సంస్థగా ఏర్పాటు చేయవలసి ఉన్నది. ప్రణాళికల రూపకల్పన పరిశోధన ఆధారంగా జరుగవలసి ఉంది. ప్రణాళికలు ముఖ్యంగా సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించినవిగా ఉంటాయి. ప్రస్తుత ప్రభుత్వాలకు రెండు రకాల ప్రణాళికలు ముఖ్యమైన అంశాలే. రాజకీయ ప్రాముఖ్యం ఉన్న సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి ప్రణాళికలు ప్రాంతీయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి పై కేంద్రీకృతంగా రూపొందించవలసి ఉన్నది. వీటికి కావాల్సిన ఆర్థిక వనరుల సమీకరణ ప్రస్తుత ప్రభుత్వాలకు ప్రధానాంశం. ఆర్థిక సమీకరణ ప్రక్రియ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రత్యేకంగా సంక్షేమపథకాలకు ఆర్థిక వనరుల సమీకరణ, వనరుల పంపకాల ప్రక్రియల్లో ప్రభుత్వం శాస్త్రీయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.

సంక్షేమ పథకాల వలన ఎటువంటి అభివృద్ధి జరగుతోంది అనే విషయ పరిశీలన ఆర్థిక శాస్త్రవేత్తల విశ్లేషణ, పరిశోధనపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సామాన్య శాస్త్రవేత్తలు సంక్షేమ ప్రణాళికలకు సంబంధించిన, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల ప్రభావ పరిశీలన పరిశోధన చేయవలసి ఉన్నది. దీనికి సామాజిక శాస్త్రవేత్తల విజ్ఞానం, పరిశోధన ప్రక్రియ ప్రస్తుత ప్రభుత్వానికి చాలా అవసరం. ఆర్థిక ప్రణాళికల వలన జరిగే అభివృద్ధిని మన ప్రభుత్వాలు కొలబద్దను ఏర్పాటు చేయడం అవసరము. అదేవిధంగా కొన్ని సందర్భాలలో సామాజికపరమైన అభివృద్ధి పథకాలు, ప్రణాళికల యొక్క ప్రభావం ఎంతగా ఉంటుందనే విషయం సామాజిక శాస్త్రవేత్తల పరిశోధన ఫలితంగా తెలుసుకోవచ్చును. అందువలన దీనికి ఒక పరిశోధన అనుబంధ సంస్థ అవసరం.

ప్రభుత్వ పథకాల ప్రయోజనం ఎంతో తెలుసుకోవాలి

కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం చేపట్టిన సాంఘిక సంక్షేమ, ఆర్థిక అభివృద్ధి పథకాలను ప్రణాళికాబద్ధంగా నియంత్రణ చేయవలసి ఉన్నది. దీనివలన ప్రభుత్వ పథకాలు ఏవిధంగా ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో విషయ పరిశీలన నిరంతరం జరుగవలసి ఉన్నది. ప్రస్తుతం ప్రభుత్వం అనేక సంక్షేమపథకాల పైన ఆర్థికాభివృద్ధి ప్రణాళికల పైన అనేక వేలకోట్లు ఖర్చు చేస్తున్నది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనము, లాభదాయకమైన పథకాలను మరియు ఆర్థికాభివృద్ధి పథకాలను గుర్తించే ప్రక్రియలో సామాజిక మరియు ఆర్థిక పరమైన పరిశోధనల సూచనలను అనుసరించవలసి ఉన్నది. అంతేకాకుండా ప్రభుత్వ కేటాయింపులలో అనుసరించవలసిన పద్దతులను సంక్షేమాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి విధివిధానాలను నిర్ణయించడానికి నిపుణుల సూచనలు తోడ్పడతాయి.

శాస్త్రీయ విధానం పాటించకుండా ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించినట్లయితే, ఆ ఆర్థికాభివృద్ధి కుంటుపడే అవకాశమున్నది. అందుచేత సమతుల్యమైన అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో నిధుల సేకరణ, నిధుల కేటాయింపులు జరుపవలసి ఉన్నది. అందుకే మన రాష్ట్రానికి సోషియల్ అండ్ ఎకనామిక్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (Social and Economic Research Institute) స్థాపన అవసరమన్నది చెప్పక తప్పదు. ఏదోఒక రాజధానిలో ఈ సంస్థను నెలకొల్పి మేధావుల సహకారంతో విధివిధానాలను ఏర్పరచి, కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధికి పునాది వేయాలని చెప్పక తప్పదు. ప్రస్తుతం మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బడ్జెట్ ప్రపోజల్ అండ్ ఫైనాన్సియల్ ఇష్యూస్ ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన విషయాలను ఆర్థిక శాస్త్ర నిపుణుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళవలసి ఉన్నది.

సమగ్రమైన పరిశోధనే పరమావధి

అభివృద్ధి ప్రణాళికలు ఆర్థిక ప్రణాళికలు సామాజిక ప్రణాళికలు శాస్త్రీయ పద్దతిలో ఏర్పాటు చేయాలంటే సమగ్రమైన పరిశోధన చాలా అవసరం. అదేవిధంగా సామాజికపరమైన సాంఘిక సంక్షేమ పథకాల రూవకల్పన ప్రక్రియ వాటిని అమలుపరచాలంటే సాంఘిక శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు అవసరం. మన ప్రభుత్వం అన్ని కోణాల దృక్పథాన్ని సేకరించి విశ్లేషించి ఒక నిర్ణయానికి వచ్చి వాటిని అమలు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. దీనికి ఆర్థిక శాస్త్రవేలు, సామాజిక శాస్త్రవేత్తలు, న్యాయనిపుణులు, చరిత్రకారులతో సమావేశాలను ఏర్పాటుచేసి వారి సూచనలను సేకరించవలసి ఉన్నది. వీరందరూ ఒక సంస్థ ద్వారా పరిశోధన ప్రక్రియలను ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వవలసి ఉన్నది. అంతేకాకుండా మన ప్రభుత్వం తలపెట్టిన ప్రాంతీయ అభివృద్ధి బోర్డులకు సరైన సలహా సూచనలు సూచించి అనుసంధానం చేస్తే, మన ముఖ్యమంత్రి తలపెట్టిన ప్రాంతీయ అభివృద్ధి బోర్డులు వేగవంతమైన అభివృద్ధి సాధించవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఒకే రాజధాని లేక మూడు రాజధానుల సమస్య కొద్దికాలంలో పరిష్కార మార్గం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయడం వలన మధ్యలో ఉన్న అమరావతి నగరం, దూరంగా ఉన్న విశాఖపట్నం వలన ఏర్పడే భిన్నాభిప్రాయాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు. అంతేకాకుండా డిజిటల్ ఇండియా దేశ ప్రణాళిక వలన రాష్ట్ర రాజధాని దూరం దగ్గర అనే సమస్య రాబోయే కాలంలో  ఉండదు. కొంతమంది ప్రజలకు, రాజకీయ నాయకులకు ఈ డిజిటల్ టెక్నాలజీలోని ఉపయోగాలు తెలుసు. కానీ రాజకీయ సమస్యను సృష్టించి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం మాత్రమే అవుతుంది.

ప్రణాళికాబద్ధమైన విధివిధానాలు

ప్రస్తుతం మన రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు సంబంధించిన ప్రణాళికాబద్ధమైన విధివిధానాలను ఏర్పాటు చేయవలసి ఉన్నది. దీని వలన ప్రత్యేక పరిశోధనా సంస్థ విశ్వవిద్యాలయాల్లో సమన్వయం చేసే ప్రయత్నం జరుగవలసి ఉన్నది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో పరిశోధనను పటిష్ఠపరచాలంటే మేథావంతులైన అధ్యాపక బృందం అవసరం. గత రెండు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సంబంధమైన అంశాలను పరిశీలించినట్లయితే దురదృష్టవశాత్తు చాలామంది పరిశోధనపైన ఆసక్తి ఉన్నా ఆచార్యుల సంఖ్య పదవీ విరమణ వలన గణనీయంగా తగ్గిపోతూ వస్తున్నది. అదే సమయంలో పరిశోధన ప్రక్రియలో పరిశోధనాసక్తితో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. ఒకపక్క పరిశోధన అధ్యాపకుల కొరత, మరోపక్క పరిశోధనవైపు ముందుకొస్తున్న విద్యార్థులు అధికసంఖ్యలో ఉన్నారు. ఈ సందిగ్దావస్థను త్వరితగతిన అధిగమించాలంటే మేథోవంతులైన ఆచార్యుల సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేథోవంతులైన ఆచార్యులను పరిశోధన సంస్థ ద్వారా ఆహ్వానించి, పరిశోధన ప్రక్రియను పటిష్టం చేయవలసి ఉంది. యూజీసీ, డిఎటి సంస్థల మార్గదర్శకాలతో మేథోవంతులైన విశ్రాంత ఆచార్యులను మన రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో నియమించి, పరిశోధనా ప్రక్రియను పటిష్టం చేయవలసిన అవసరం ఉంది. పై సూచించిన అంశాలలో పూర్తి తాత్కాలిక పద్ధతిలో క్లిష్ట పరిస్థితి పరిష్కార మార్గానికి తోడ్పడతాయని భావించవచ్చును.

మన ప్రభుత్వం నాడు-నేడు ప్రణాళిక తరహాలో విశ్వవిద్యాలయాల్లో పరిశోధన అభివృద్ధికి ఒక ధృఢమైన మరియు ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను పరిష్కరించే మార్గాన్ని మేథావుల సలహాను స్వీకరించవలసి ఉన్నది.

(రచయిత పూర్వ ఉపకులపతి, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం,

అనంతపురము – 515 002

సెల్ : 94408 88066)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles